• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమైన రసాయన పదార్థాలు - ఔషధాలు

ఆదర్శ ఔషధం - ముఖ్య ధర్మాలు

* ఔషధం నిర్దిష్ట వ్యవస్థపై మాత్రమే పని చేయాలి.

* ఔషధానికి అతి తక్కువ దుష్ఫలితాలు ఉండాలి.

* సమర్థవంతంగా, అపాయం లేకుండా, దీర్ఘకాలం పని చేయాలి.

* శరీర ధర్మ క్రియలకు ఆటంకం కలిగించకూడదు, జీవకణాలకు హానిచేయకూడదు.

* ఔషధ నిరోధానికి గురికాకూడదు. చాలా ఔషధాలు పై ధర్మాలను కలిగి ఉండవు.

ఔషధాల వర్గీకరణ

చికిత్స క్రియాశీలత ఆధారంగా ఔషధాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. రసాయన చికిత్స ఔషధాలు (Chemotherapeutic drugs)/ సూక్ష్మజీవి వినాశకాలు (Antimicrobials)

2. మనోచికిత్స ఔషధాలు (Psychotherapeutic drugs)

3. శరీర ధర్మశీలతా ఔషధాలు (Pharmacodynamic drugs)

4. జీవ ఉత్పన్న ప్రేరక లేదా నిరోధక ఔషధాలు (Metabolic stimulant or inhibitor drugs)

రసాయన చికిత్స ఔషధాలు/ సూక్ష్మజీవి వినాశకాలు

శరీరానికి హానిచేయకుండా, లోపలికి ప్రవేశించిన సూక్ష్మజీవులను నశింపజేసే ఔషధాలను ‘సూక్ష్మజీవి వినాశకాలు’ అంటారు.

 

a) యాంటీబయాటిక్స్‌: ఇవి రసాయన పదార్థాలు. దీన్ని పూర్తిగా లేదా పాక్షికంగా కృత్రిమ రసాయన చర్యల ద్వారా తయారు చేస్తారు. అతి తక్కువ గాఢతలో సూక్షజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి లేదా పూర్తిగా నశింపజేస్తాయి.

ఉదా: పెన్సిలిన్‌లు: అమాక్సిసిలిన్, ఆంఫిసిలిన్, క్లొక్సాసిలిన్, ఆక్సాసిలిన్‌ మొదలైనవి.

సెఫాలో స్పోరిన్‌లు: సెఫలెక్సిన్, సెఫాడ్రాక్సిల్, సెఫలోగ్లైసిన్, సెఫలోనియం మొదలైనవి.

టెట్రాసైక్లిన్‌లు: టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్‌ మొదలైనవి.

మాక్రోలైడ్‌లు: ఎరిత్రోమైసిన్, అజిత్రోమైసిన్, క్లారిత్రోమైసిన్‌ మొదలైనవి. 

ఎమినోగ్లైకోసైడ్‌లు: స్ట్రెప్టోమైసిన్, నియోమైసిన్, జెంటామైసిన్‌ మొదలైనవి.

ఫ్లోరోక్వినోలోన్‌లు: సిప్రోఫ్లోక్సాసిన్, ఓఫ్లోక్సాసిన్, నార్‌ఫ్లోక్సాసిన్‌ మొదలైనవి

 

b) వైరస్‌వినాశకాలు (Antivirals):

వైరస్‌ కారక వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాలను ‘వైరస్‌ వినాశకాలు’ అంటారు. 

ఉదా: అసిక్లోవిర్, అబాకవిర్, రెమ్‌డెసివిర్, వెలాసిక్లోవిర్‌ మొదలైనవి. 

 

c) మలేరియానిరోధకాలు (Antimalarial):

మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధాలను ‘మలేరియా నిరోధకాలు’ అంటారు. 

ఉదా: క్లోరోక్విన్, క్వినైన్, క్వినిడిన్, మెఫ్లోక్విన్‌ మొదలైనవి. 

 

d) యాంటీసెప్టిక్‌లు (Antiseptics):

ఇవి సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధిస్తాయి లేదా వాటిని నాశనం చేస్తాయి. 

గాయాలు, కోతలు, పుండ్లు, రోగానికి గురైన చర్మం ఉపరితలంపై యాంటీసెప్టిక్‌లను పూతగా పూస్తారు. 

ఉదాహరణ: 

‘డెట్టాల్‌’ అనే యాంటీసెప్టిక్‌ క్లోరోక్సైలినోల్, టెర్పినియోల్‌ల మిశ్రమం.

కొన్ని సబ్బుల్లో బిటియనోల్‌ అనే యాంటీసెప్టిక్‌ను కలుపుతారు. 

ఆల్కహాల్‌-నీరు మిశ్రమంలో 2-7% మూలక అయోడిన్, పొటాషియం అయోడైడ్‌ ద్రావణాన్ని కరిగిస్తే దాన్ని ‘అయోడిన్‌ టింక్చర్‌’ అంటారు. దీన్ని చీము నిరోధకంగా గాయాలపై పూస్తారు. 

బోరిక్‌ ఆమ్ల విలీన జల ద్రావణం కంటిలో వేసే బలహీన యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. 

 

e) క్రిమిసంహారకాలు (Disinfectants):

ఉపరితలాలపై క్రిములను నాశనం చేసేందుకు ఉపయోగించే రసాయన పదార్థాలను క్రిమిసంహారకాలు అంటారు.

ఉదా: 70% ఇథైల్‌ ఆల్కహాల్‌ జలద్రావణం, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, ఫినాల్, క్లోరోక్సైలినోల్, పొటాషియం పర్మాంగనేట్, క్లోరిన్‌ ద్రావణం, ఫార్మాల్డిహైడ్‌ జలద్రావణం మొదలైనవి. 

 3740% ఫార్మాల్డిహైడ్‌ జలద్రావణాన్ని ‘ఫార్మలిన్‌’ అంటారు. దీన్ని జీవ  సంబంధ నమూనాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. 

 

f) శిలీంధ్రనాశకాలు (Antifungals):

శిలీంధ్రకారక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలను శిలీంధ్రనాశకాలు అంటారు. 

ఉదా: కెటకొనజోల్, క్లోట్రైమజోల్, ఫూకొనజోల్‌ మొదలైనవి.

 

g) పురుగువ్యాధి నిరోధకాలు (Anthelmintics):

కొన్ని పురుగులు శరీరంలోకి చేరి వ్యాధులను కలిగిస్తాయి. వీటి చికిత్సలో వాడే ఔషధాలను ‘పురుగువ్యాధి నిరోధకాలు’ అంటారు. 

ఉదా: ఆల్‌బెండజోల్, మెబెండజోల్, ఐవర్‌మెక్టిన్‌ మొదలైనవి.

 

h) క్షయవ్యాధినిరోధకాలు  (Antituberculars) :

మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే సూక్ష్మజీవుల వల్ల క్షయవ్యాధి సంక్రమిస్తుంది. క్షయవ్యాధి నిరోధకాలు ఈ సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. ఉదా: రిఫాంపిసిన్, ఇసోనియాజిడ్, ఇధాంబ్యూటాల్, పెరాజినమైడ్‌.  

మనోచికిత్స ఔషధాలు

కేంద్రనాడీ వ్యవస్థపై పనిచేసే ఔషధాలను ‘మనోచికిత్స కారకాలు’ అంటారు. ఇవి మనో వైఖరిని ప్రభావితం చేస్తాయి.

 

a) బాధనిరోధకాలు (Analgesics):

అనేక రకాల వ్యాధుల వల్ల, ఆకస్మిక ప్రమాదాల కారణంగా నొప్పి కలుగుతుంది. తలనొప్పి, చెవినొప్పి, పంటినొప్పి, కీళ్లనొప్పి, కడుపునొప్పి మొదలైనవి సాధారణ నొప్పులు.

నొప్పి/ బాధను తగ్గించడం లేదా పూర్తిగా నయం చేసే ఔషధాలను ‘నొప్పి నిరోధకాలు’ లేదా ‘బాధ నిరోధకాలు’ అంటారు.

ఉదా: ఆస్పిరిన్, డైక్లోఫినాక్, ఐబుప్రొఫెన్‌

ఆస్పిరిన్‌ రసాయన నామం- అసిటైల్‌ శాలిసిలిక్‌ ఆమ్లం.

 

b) జ్వరనిరోధకాలు (Antipyretics): 

జ్వరాన్ని తగ్గించే ఔషధాలను ‘జ్వరనిరోధకాలు’ అంటారు.

ఉదా: పారాసిటమాల్, ఆస్పిరిన్‌ మొదలైనవి.

పారాసిటమాల్‌ రసాయన నామం వి-ఎసిటైల్‌ ్ప అమినోఫినాల్‌.

కేంద్ర నాడీ వ్యవస్థలోని హైపోథాలమస్‌ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జ్వరనిరోధకాలు (పారాసిటమాల్‌) ఇచ్చినప్పుడు, అది హైపోథాలమస్‌పై పనిచేసి చర్మానికి ఎక్కువ రక్తాన్ని సరఫరా అయ్యేట్లు చేస్తుంది. దీంతో చెమట పట్టి, ఆవిరై జ్వరం తగ్గుతుంది. 

జ్వరనిరోధకమైన పారాసిటమాల్‌ను ఎక్కువ రోజులు వాడితే, కాలేయం దెబ్బతింటుంది.

 

c) ప్రశాంతకారులు (Tranquilizers):

అనవసర ఆందోళన, ప్రకోపం, అత్యుత్సాహాన్ని తగ్గించి, ప్రశాంతతను కలిగించే ఔషధాలను ప్రశాంతకారులు అంటారు. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, మనోవ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

ఉదా: డయజీపామ్, ఆల్ఫ్రోజోలమ్, క్లోరోడయజీపాక్సైడ్, సెరటోనిన్‌ మొదలైనవి.

 

d) సమ్మోహనకారులు (Hypnotics):

దీర్ఘనిద్రను కలిగించే ఔషధాలను ‘సమ్మోహనకారులు’ అంటారు. ప్రమాదాలు, శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు పారాసిటమాల్‌ లాంటివి ఆ నొప్పిని తగ్గించలేవు. కాబట్టి సంబంధింత వ్యక్తికి దీర్ఘనిద్ర కలిగించేందుకు సమ్మోహనకారులను ఉపయోగిస్తారు.

ఉదా: బార్బిటురేట్‌లు, బెంజోడయజీపైన్‌లు మొదలైనవి.

 

e) మనోవ్యాకులతనిరోధకాలు (Antidepressants):

మనోవ్యాకులతను తగ్గించే ఔషధాలను ‘మనోవ్యాకులతనిరోధకాలు’ అంటారు.

ఉదా: ఇమిప్రమైన్, ఐప్రోనియజిడ్, ఫెనాల్‌జైన్‌ మొదలైనవి.

 

f) వమననిరోధకాలు (Antiemetics):

వాంతులు, వికారం మొదలైనవాటిని తగ్గించే ఔషధాలను ‘వమననిరోధకాలు’ అంటారు.

ఉదా: డొంపిరడోన్, గ్రానిసెట్రాన్, ఓండాన్‌ సెట్రాన్‌ మొదలైనవి.

 

g) వణుకునిరోధకాలు (Antiparkinsons):

పార్కిన్సన్‌ వ్యాధిలో బాధపడేవారి చేతులు, తల వాటంతట అవే వణుకుతూ ఉంటాయి. దీని  చికిత్సలో ఉపయోగించే ఔషధాలను ‘వణుకునిరోధకాలు’ అంటారు.

ఉదా: లీవోడోపా ్బలిద్న్ప్చ్శీ, ట్రైహెక్సీఫినిడైల్, అమాన్టడిన్‌ మొదలైనవి.

 లీవోడోపా మెదడులోని డోపమైన్‌ గ్రాహకాన్ని ఉత్తేజపరచి డోపమైన్‌ను అధిక పరిమాణంలో ఉత్పత్తిచేసి, పార్కిన్‌సన్‌ వ్యాధిని నివారిస్తుంది.

 

h)మూర్చవ్యాధినిరోధకాలు (Anticonvulsants):

మూర్చ వ్యాధిగ్రస్తుల్లో కాళ్లు, చేతులు విపరీతంగా కదులుతూ ఉంటాయి. వీటిని నివారించేందుకు వాడే  ఔషధాలను ‘మూర్చవ్యాధినిరోధకాలు’ అటారు.

ఉదా: బార్బిటురేట్‌లు, బెంజోడయజీపైన్‌లు, వాల్‌ప్రోయేట్‌ మొదలైనవి.

మందులు (Drugs): మన శరీరంలోని బృహత్‌ అణువులతో చర్య జరిపి, జీవన ప్రక్రియలో మార్పు తెచ్చేందుకు ఉపయోగించే అల్ప అణుభార రసాయన పదార్థాలను ‘మందులు’ అంటారు.

ఔషధాలు (Medicines): వ్యాధులను నిర్ధారించడానికి, నివారించడానికి, నియంత్రించడానికి, చికిత్స కోసం ఉపయోగించే మందులను ‘ఔషధాలు’ అంటారు.

ఉదా: ఆస్పిరిన్, పారాసిటమాల్, అజిత్రోమైసిన్, అమాక్సిసిలిన్, డాక్సిసైక్లిన్, రానిటిడిన్‌  మొదలైనవి.

జీవ వ్యవస్థల్లో జీవ ప్రభావాన్ని కలిగించే రసాయన పదార్థాలను ఔషధాలు అంటారు.

ఔషధం అనేది మందు సూత్రీకరించిన (Modified) రూపం. ఇది కచ్చితమైన మోతాదు(Dose) ను కలిగి ఉంటుంది. 

ఔషధాలన్నీ మందులే కానీ మందులన్నీ ఔషధాలు కావు. 

ఉదా: హెరాయిన్, కొకైన్‌ మొదలైనవి మందులే కానీ ఔషధాలు కావు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. కిందివాటిలో యాంటీబయాటిక్‌కు ఉదాహరణ ఏది?

1) అసిక్లోవిర్‌       2) ఆస్పిరిన్‌  

3) ఆల్‌బెండజోల్‌       4) క్లోరాంఫెనికాల్‌

 

2. వ్యాధుల చికిత్సకు మందులు/ ఔషధాలను ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు?

1) కీమోథెరపీ               2) రేడియోథెరపీ 

3) హోమియోపతి       4) ఫిజియోథెరపీ

 

3. శరీరంపై ఔషధాల ప్రభావాన్ని వివరించే శాస్త్రం?

1) బయాలజీ       2) ఫార్మకాలజీ 

3) ఫార్మసీ       4) ఫార్మకోఫోర్‌

 

4. పెన్సిలిన్‌ అనే యాంటీబయాటిక్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) జి.డోమాగ్‌        2) ఎ.ఫ్లెమింగ్‌ 

3) ఎఫ్‌.వోలర్‌        4) మెక్‌.గురే

 

5. ఏ యాంటీబయాటిక్‌ రకం బీటా - లాక్టమ్‌ వలయాన్ని కలిగి ఉంది?

1) పెన్సిలిన్‌        2) స్ట్రెప్టోమైసిన్‌ 

3) నియోమైసిన్‌       4) క్లోరాంఫెనికాల్‌

 

6. కిందివాటిలో సూక్ష్మజీవి నిరోధకాలు లేదా సూక్ష్మజీవి వినాశకాలు ఏవి?

1) యాంటీసెప్టిక్‌లు 

2) యాంటీబయాటిక్‌లు 

3) యాంటీవైరల్‌లు          4) పైవన్నీ

 

7. రేడియోధార్మిక కిరణాలను ఉపయోగించి క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స చేసే పద్ధతిని  ఏమంటారు?

1) ఫిజియోథెరపీ  2) కీమోథెరపీ 

3) రేడియోథెరపీ  4) క్రయోథెరపీ

సమాధానాలు 

1 - 4   2 - 1   3 - 2   4 - 2   5 - 1   6 - 4   7 - 3

రచయిత

డాక్టర్‌ పి. భానుప్రకాష్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

Posted Date : 19-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌