• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయన శాస్త్రం - 1

 మనుగడతో ముడిపడిపోయిన రసాయనం! 

తినే తిండి నుంచి వాడే వస్తువుల వరకు అన్నింటిలోనూ రసాయనాలు ఉంటాయి. వంటలో, ఆహారం రుచిని పెంచడంలో, నిల్వ చేయడంలో కెమికల్స్‌ ఉపయోగిస్తారు. ఇంటిని తుడవడానికి, మరకలు తొలగించడానికి, దుస్తులు ఉతకడానికి రసాయనాలు ఉండాల్సిందే. ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన మందులు, ఔషధాల ఉత్పత్తిలోనూ అవి అతి కీలకంగా మారిపోయాయి. చెప్పులు, వాటర్‌ బాటిల్స్‌ సహా అన్నీ వాటితో తయారైనవే. అందరి  జీవితాలతో అడుగడుగునా ముడిపడిపోయిన ఈ రసాయనశాస్త్రం నిత్య ప్రాధాన్యాన్ని అభ్యర్థులు తెలుసుకోవాలి. సంబంధిత అనువర్తనాలపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. 

సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం సరిగాలేనప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని మందులు/ఔషధాలు సూచిస్తారు. ఆ మందుల్లో రసాయన శాస్త్రం పాత్ర అత్యంత కీలకమైంది.

కీమోథెరపీ: రసాయన పదార్థాలను ఉపయోగించి వ్యాధికి చికిత్సతోపాటు, దాన్ని నివారించడానికి చేసే ప్రక్రియను ‘కీమోథెరపీ’ అంటారు.

మందులు: తక్కువ అణు ద్రవ్యరాశుల స్థాయి 100 U నుంచి 500 U ల భారం ఉన్న రసాయన పదార్థాల బృహదణువులపై పనిచేసి, జీవ సంబంధ ప్రతి చర్యను కలగజేస్తే వాటిని మందులు అంటారు.

ఔషధాలు: జీవ సంబంధ వ్యాధులకు చికిత్స చేయడానికి లేదా నివారించడానికి లేదా గుర్తించడానికి ఉపయోగించే రసాయనాలను ఔషధాలు అంటారు. వీటిని మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే విషపూరితమవుతాయి.


ఔషధాల్లో రసాయన ఉపయోగాలు:

ఎనల్జసిక్‌లు: నాడీ వ్యవస్థకు హానిచేయకుండా నొప్పిని పాక్షికంగా లేదా పూర్తిగా తగ్గిస్తాయి. ఇవి మానసిక ఆందోళన, పక్షవాతం, స్పృహ కోల్పోవడం లాంటి ప్రభావాలను కలగజేయవు.ఇవి రెండు రకాలు.

1) నార్కొటిక్‌ ఎనల్జసిక్‌లు (మార్ఫిన్, కొడైన్‌)    

2) నాన్-నార్కొటిక్‌ ఎనల్జసిక్‌లు (ఆస్పరిన్, ఐబూప్రొఫెన్‌)

1) నార్కొటిక్‌ మందులు: మార్ఫిన్, కొడైన్‌ లాంటి ఆల్కలాయిడ్‌లను నార్కొటిక్‌ మందులు అంటారు. ఇవి వైద్యపరంగా చాలా శక్తిమంతమైనవి. కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనపరుస్తాయి.

2) నాన్‌-నార్కొటిక్‌ మందులు: ఆస్పరిన్, ఐబూప్రొఫెన్‌ లాంటి మందులను చిన్నచిన్న నొప్పులకు, తలనొప్పి, వెన్నునొప్పి లాంటి వాటికి మాత్రమే ఉపయోగిస్తారు.

యాంటీపైరటిక్స్‌: ఎనాల్జిన్, ఫినాసిటిన్, పారాసిటామల్స్‌ను శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడానికి (జ్వరం వచ్చినప్పుడు) ఉపయోగిస్తారు.

ట్రాంక్విలైజర్‌లు: ఇవి అలజడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి.

యాంటీసెప్టిక్స్‌: వీటిని సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించడానికి లేదా నాశనం చేయడానికి ఉపయోగిస్తారు.

యాంటీబయోటిక్స్‌: ఇవి సూక్ష్మజీవులను ఉత్పన్నం చేసి, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిర్మూలించడానికి లేదా నిరోధించడానికి ఉపయోగపడతాయి. ఉదా: పెన్సిలిన్‌

క్రిమిసంహారిణులు: సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి లేదా నాశనం చేయడానికి వీటిని వాడతారు. వీటిని జీవరహిత వ్యవస్థలైన మురుగు కాలువల్లో ఉపయోగిస్తారు. ఉదా: ఫినాల్‌

యాంటీమైక్రోబియల్స్‌: ఇవి కూడా సూక్ష్మజీవుల పెరుగుదలను నివారిస్తాయి లేదా వాటిని నశింపజేసే వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

యాంటీఫెర్టిలిటీ: ఇవి మామూలు స్టెరాయిడ్స్‌ మాత్రమే. వీటిని సాధారణ గర్భ నిరోధక మాత్రలు అంటారు. ఉదా: నోరెన్‌డ్రోన్, మిఫెప్రిస్టోన్‌

యాంటీహిస్టమైన్స్‌: ఉదరం గోడల్లో ఉండే అభివాహకాల వద్దకు హిస్టమిన్‌ వెళ్లకుండా నిరోధిస్తాయి. దీనివల్ల అతితక్కువ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది.


ఆహారానికి కలిపే ముఖ్య సంకలితాలు: ఆహారం పాడవకుండా నిల్వ ఉండటానికి, దాని బాహ్య రూపాన్ని ఆకర్షణీయంగా ఉంచడానికి, పౌష్టిక విలువలను పెంచడానికి, ఆహారానికి కొన్ని రసాయన పదార్థాలు కలుపుతారు 

కృత్రిమ తీపి కారకాలు: సహజ చక్కెర స్థానంలో ఉపయోగించే కృత్రిమ రసాయనాలను కృత్రిమ తీపి కారకాలు అంటారు. ఇవి కెలొరీలను తగ్గించి చక్కెర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువ తీపిని కలిగిస్తాయి.ఉదా: సాకరీన్, సుక్రలోజ్‌.

ఆహార పదార్థాల పరిరక్షకాలు: పదార్థాలు కంటికి ఇంపుగా కనిపించడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీటిని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల వృద్ధి (ఈస్ట్‌) ద్వారా  ఆహార పదార్థాలు పాడవకుండా ఇవి కాపాడతాయి. ఉదా: సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫేట్‌

ఆహార పదార్థాల యాంటీ ఆక్సీకరణులు: చాలా ముఖ్యమైన, అవసరమైన ఆహార పదార్థాల సంకలితాలు. ఇవి ఆహార పదార్థాలపై ఆక్సిజన్‌ జరిపే చర్య వేగాన్ని తగ్గించి, వాటి సంరక్షణకు తోడ్పడతాయి. తాము సంరక్షించే ఆహార పదార్థాలతో కంటే ఆక్సిజన్‌తో అధిక చర్యాశీలతను ప్రదర్శిస్తాయి. ఉదా: బ్యుటైలేటెడ్‌ హైడ్రాక్సీ టోలిన్‌ (BHT).  వెన్నకు BHAను కలిపితే అది పాడవకుండా ఉండే నిల్వ కాలం నెలల నుంచి సంవత్సరాలకు పెరుగుతుంది.

సబ్బులు: పొడవాటి కర్బన గొలుసులున్న ఫ్యాటీ ఆమ్లాలకు చెందిన సోడియం లేదా పొటాషియం లవణాలే సబ్బులు. కొవ్వు పదార్థాన్ని సోడియం హైడ్రాక్సైడ్‌ జలద్రావణంతో కలిపి, వేడిచేసి సోడియం లవణాలున్న సబ్బులను తయారు చేస్తారు. దీన్నే సబ్బు ఏర్పడే చర్య అంటారు.

సబ్బుల్లో రకాలు:

* శరీర శుద్ధికి వాడేవి 

* నీటిలో తేలే గుణం ఉన్నవి 

* పారదర్శక సబ్బులు 

* వైద్య ప్రాముఖ్యం ఉన్నవి 

* షేవింగ్‌ సబ్బులు 

* లాండ్రీ సబ్బులు

* గరకు సబ్బులు 

* సబ్బు చూర్ణాలు

సంశ్లిష్ట డిటర్జెంట్లు: సబ్బుల ధర్మాలన్నింటినీ కలిగి, సబ్బులు కాని శుభ్రపరిచే కారకాలను సంశ్లిష్ట లేదా కృత్రిమ కారకాలు అంటారు. ఇవి కఠిన, మురుగు జలాల్లో కూడా నురగనిస్తాయి.ఇవి మూడు రకాలు.

1) అయానిక డిటర్జెంట్లు   

2) కేటయాన్‌ డిటర్జెంట్లు    

3) అయానేతర డిటర్జెంట్లు.


నమూనా ప్రశ్నలు

1. రసాయన పదార్థాలను ఉపయోగించి వ్యాధి చికిత్స, నివారణకు ఉపయోగించే పద్ధతి?

ఎ) కీమో థెరపీ    బి) రేడియో థెరపీ       

సి) మాగ్నటో థెరపీ  డి) హైడ్రో థెరపీ


2. నొప్పి నివారణకు ఎక్కువగా ఉపయోగించే రసాయన ఔషధాలు?

ఎ) ఎనల్జిసిక్‌లు    బి) యాంటీపైరటిక్స్‌       

సి) ట్రాంక్విలైజర్‌లు    డి) యాంటీసెప్టిక్స్‌


3. అలజడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను కలిగించే మందులు?

ఎ) ఎనల్జిసిక్‌లు    బి) ట్రాంక్విలైజర్‌లు     

సి) యాంటీపైరటిక్స్‌    డి) యాంటీసెప్టిక్స్‌


4. సూక్ష్మజీవులను నివారించడానికి, వాటిని నాశనం చేయడానికి ఉపయోగించే మందులు?

ఎ) ట్రాంక్విలైజర్‌లు    బి) యాంటీపైరటిక్స్‌   

సి) యాంటీసెప్టిక్స్‌     డి) నార్కొటిక్‌ మందులు


5. మార్విన్, కొడైన్‌ లాంటి ఆల్కలాయిడ్‌లను ఏమని పిలుస్తారు?

ఎ) యాంటీబయోటిక్స్‌    బి) యాంటీమైక్రోబియల్స్‌     

సి) యాంటీహిస్టమైన్‌     డి) నార్కొటిక్‌ మందులు


6. ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిర్మూలించడానికి ఉపయోగించే మందులు?

ఎ) నార్కొటిక్‌ మందులు   బి) యాంటీ మైక్రోబియల్స్‌       

సి) యాంటీబయోటిక్స్‌     డి) క్రిమిసంహారిణులు


7. కిందివాటిలో జీవరహిత వ్యవస్థలైన మురుగు కాలువల్లో ఉపయోగించేవి-

ఎ) యాంటీమైక్రోబియల్స్‌     బి) క్రిమిసంహారిణులు     

సి) యాంటీహిస్టమైన్స్‌       డి) యాంటీబయోటిక్స్‌


8. కిందివాటిలో దేనికి సంబంధించి మామూలు స్టెరాయిడ్స్‌ను ఉపయోగిస్తారు?

ఎ) యాంటీఫెర్టిలిటి      బి) యాంటీమైక్రోబియల్స్‌     

సి) యాంటీహిస్టమైన్స్‌     డి) యాంటీబయోటిక్స్‌


9. సూక్ష్మజీవులను నశింపజేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మందులు?

ఎ) యాంటీహిస్టమైన్స్‌    బి) యాంటీపైరటిక్స్‌   

సి) యాంటీమైక్రోబియల్స్‌    డి) యాంటీబయోటిక్స్‌


10. సాకరిన్, సుక్రలోజ్‌ అనేవి..?

ఎ) ఆహార సంకలితాలు     బి) ఆహార పరిరక్షకాలు

సి) కృత్రిమ తీపికారకాలు    డి) ఆహార యాంటీ ఆక్సీకరణులు


జవాబులు

1-ఎ; 2-ఎ; 3-బి; 4-సి; 5-డి; 6-సి; 7-బి; 8-ఎ; 9-సి; 10-సి;


రచయిత: చంటి రాజుపాలెం


 

 

Posted Date : 01-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌