• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు

శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ (1894-1955)

ఈయన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (CSIR)కి మొదటి డైరెక్టర్‌గా పనిచేశారు. 

భట్నాగర్‌ను పరిశోధనా శాలల పితామహుడిగా (Father of Research Laboratories)పేర్కొంటారు. 

ఈయన రసాయనశాస్త్రంలో అనేక ఆవిష్కరణలు చేశారు. అయస్కాంతత్వం, ఎమల్షన్లపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల ద్వారా మిశ్రమాలు (Alloys), కొల్లాయిడ్లు, అయోడిన్, మెర్క్యురీ, సెలీనియం మూలకాల పరమాణుతత్వాన్ని కనుక్కున్నారు. 

భారతదేశంలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు నాందిగా నిలిచిన CSIR స్థాపనలో విశేష కృషి చేశారు.

ఈయన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) మొదటి ఛైర్మన్‌గా పనిచేసి, దేశంలో ఉన్నత విద్య పురోగతికి తోడ్పడ్డారు.

జగదీష్‌ చంద్రబోస్‌ (1858-1937) 

ఈయన భౌతిక, జీవశాస్త్రవేత్త. రేడియో మైక్రోవేవ్‌ ఆప్టిక్స్‌పై పరిశోధనలు చేశారు. 

వృక్షాల పెరుగుదలను కొలిచే క్రెస్కోగ్రాఫ్‌ (Crescograph) అనే పరికరాన్ని రూపొందించారు. 

మొక్కలు బాహ్య ఉద్దీపనలకు చలిస్తాయని మొదటిసారిగా నిరూపించారు. 

‘మార్కోని’ కంటే ముందే ఈయన వైర్‌లెస్‌ ట్రాన్స్‌మిషన్‌ను కనుక్కున్నారని భౌతికశాస్త్రవేత్తల అభిప్రాయం. సూర్యుడి కాంతి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు వెలువడతాయని ప్రతిపాదించారు. దీన్ని శాస్త్త్ర్రవేత్తలు 1944లో రుజువు చేశారు.

మేఘానంద్‌ సాహా (1893-1956) 

 ఈయన భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు.

 మూలకాల ఉష్ణ అయనీకరణాన్ని (Thermal Ionisation of Elements) జరిపి, దాని ద్వారా ‘సాహా సమీకరణాన్ని’(Saha's Equation) ప్రతిపాదించారు. దీన్ని నక్షత్ర భౌతికశాస్త్రంలో ముఖ్యమైందిగా, నక్షత్రాల వర్ణపట రచనలో(Spectra of Stars)  కీలకమైందిగా భావిస్తారు.

ఆధునిక నక్షత్ర భౌతికశాస్త్రానికి ప్రామాణికంగా సాహా సమీకరణాన్ని పేర్కొంటారు. 

 మేఘానంద్‌ను భారతీయ నదుల అనుసంధానకర్తగా పేర్కొంటారు. దామోదర్‌ నదీ లోయ ప్రమాణ ప్రణాళిక రచయిత ఈయనే. 

భారతదేశమంతా శాస్త్రీయ విజ్ఞాన సంస్థల ఏర్పాటుకు ఈయన ప్రణాళికలు రచించారు. దేశ ఆర్థిక ప్రణాళికకు శాస్త్రీయ దృక్పథాన్ని జోడించి, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

హర్‌ గోబింద్‌ ఖొరానా  (1922-2011)

ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త (Molecular biologist). 

జన్యుకోడ్‌ను వివరించినందుకు ఈయనకు 1968లో నోబెల్‌ బహుమతి లభించింది. ప్రోటీన్‌ సంశ్లేషణలో జన్యుకోడ్‌ పాత్రను కూడా వివరించారు. 

నైరెన్‌బర్గ్‌ ప్రతిపాదించిన జన్యుకోడ్‌ నమూనాను ఖొరానా ధ్రువీకరించారు. మానవ కణాల్లో డీఎన్‌ఏ విశిష్టతను తన ప్రయోగాల ద్వారా వివరించారు. 

ఈయన రాబర్ట్‌-డబ్ల్యూ-హార్లీ, మార్షన్‌ - నైరెన్‌బర్గ్‌లతో కలిసి ని‘E-coli లో కృత్రిమ జన్యువును రూపొందించారు.

వెంకటరమణన్‌ రామకృష్ణన్‌  (వెంకీ రామకృష్ణన్‌)

ఈయన 1952లో జన్మించారు. భారత సంతతికి చెందిన అమెరికన్‌ శాస్త్రవేత్త. 

ఈయన జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. 30ళీ రైబోసోమ్‌ సబ్‌యూనిట్‌ పరమాణు నిర్మాణాన్ని రూపొందించారు.

రసాయనశాస్త్రంలో ఈయన చేసిన పరిశోధనలకు 2009లో నోబెల్‌ బహుమతి పొందారు.

భారత ప్రభుత్వం 2010లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. 

ఈయన 2015 నుంచి 2020 వరకు లండన్‌లోని రాయల్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.

సత్యేంద్ర నాథ్‌ బోస్‌ (1894-1974)

ఈయన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. బోస్‌ క్వాంటమ్‌ మెకానిక్స్‌ (Quantum mechanics) లో పరిశోధనలు చేశారు.

‘బోస్‌-ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం’, ‘బోసాన్లు’ (Bosons) ఈయన పేరు మీదే ప్రతిపాదించారు. 

బోస్‌ ఢాకా విశ్వవిద్యాలయంలో రేడియేషన్, అతినీలలోహిత తరంగాల ప్రభావం గురించి పరిశోధనలు చేశారు. వాటిని వ్యాఖ్యానం రూపంలో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కు పంపారు. ఐన్‌స్టీన్, బోస్‌ పరిశోధనలు-పరిశీలనల ఫలితంగా ‘బోస్‌ - ఐన్‌స్టీన్‌ గణాంకాలు’ (Bose - Einstein Statistics) రూపొందాయి. ఈ గణాంక సూత్రాలను అనుకరించే కణాలను బోసాన్లు లేదా దైవకణాలుగా పేర్కొటారు.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తాను రచించిన ‘విశ్వ-పరిచయ్‌’ అనే విజ్ఞానశాస్త్ర రచనను సత్యేంద్ర నాథ్‌ బోస్‌కు అంకితం చేశారు.

భారత ప్రభుత్వం బోస్‌ను 1954లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

సీవీ రామన్‌ (1888-1970)

రామన్‌ పూర్తిపేరు చంద్రశేఖర వెంకట రామన్‌. ఈయన భారతదేశ ప్రముఖ భౌతికశాస్త్ర పరిశోధకుల్లో ఒకరు. 

భౌతికశాస్త్రంలో ఈయన చేసిన పరిశోధనలకుగాను 1930లో నోబెల్‌ బహుమతి లభించింది. ఈయన ఆసియా ఖండం నుంచి నోబెల్‌ అందుకున్న మొదటి వ్యక్తి. ఈయన కాంతి వికిర్ణం (Scattering of Light)పై ప్రయోగాలు చేసి 1928, ఫిబ్రవరి 28న ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుక్కున్నారు. దీనికి గుర్తుగా భారత ప్రభుత్వం ఏటా ఆ తేదీన ‘జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. 

రామన్‌ను భారత ప్రభుత్వం 1954లో భారతరత్నతో సత్కరించింది.

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ (1910-95)

ఈయన 20వ శతాబ్దంలో పేరొందిన నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. 

ఈయన భౌతికశాస్త్రంలో ‘కృష్ణ బిలాల గణిత సిద్ధాంతాన్ని’ (Mathematical Theory of black holes) కనుక్కున్నారు. అందుకు 1983లో నోబెల్‌ బహుమతి పొందారు. 

ఈయన నక్షత్రాలపై చేసిన పరిశోధనలకు గుర్తుగా ‘చంద్రశేఖర్‌ లిమిట్‌ (పరిమితి)’ను రూపొందించారు. స్థిరమైన తెల్ల మరుగుజ్జు నక్షత్రం గరిష్ఠ ద్రవ్యరాశిని దీంతో కొలుస్తారు.

ఈయన నక్షత్రాల నుంచి వెలువడే రేడియేషన్‌ శక్తి, నక్షత్ర శకలాలు, తెల్లని పొట్టి నక్షత్రాలు మొదలైన వాటిపై పరిశోధనలు చేశారు.

నక్షత్రం భరించే భారస్థితిని ‘చంద్రశేఖర్‌ ద్రవ్యరాశి’గా, పరిమితిని ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’గా నిర్వచిస్తారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861 - 1962)

ఈయన దేశంలోనే గొప్ప సివిల్‌ ఇంజినీర్‌. కర్ణాటకలోని కృష్ణ రాజ సాగర డ్యాం నిర్మాణానికి ముఖ్య ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. 

1955లో భారత ప్రభుత్వం ఈయన్ను భారతరత్న పురస్కారంతో గౌరవించింది. దేశంలోని వివిధ  విశ్వవిద్యాలయాల నుంచి ఎనిమిది డాక్టరేట్లు పొందారు.

ఈయన ఆటోమేటిక్‌ స్లూయిజ్‌ గేట్లు (Automatic Sluice gates) లేదా ఆనకట్ట ద్వారం, బ్లాక్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌లను కనుక్కున్నారు. 

ఈయన పుట్టిన రోజైన సెప్టెంబరు 15ను ‘ఇంజినీర్స్‌ డే’గా ఏటా జరుపుకుంటున్నాం.

శ్రీనివాస రామానుజన్‌ (1887-1920)

ఈయన 1887 డిసెంబరు 22న జన్మించారు. ఈ రోజున మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 

రామానుజన్‌ 3,900 గణితశాస్త్ర సమీకరణాలను పరిష్కరించారు. ్ప అనంత క్రమాన్ని (Infinite Series for Pi) కనుక్కున్నారు. 1729 (103 + 93) (123+ 13) ను రామానుజన్‌ సంఖ్యగా పిలుస్తారు.

ఈయన ‘ట్రినిటీ కాలేజ్‌ లండన్‌’, ‘మద్రాస్‌ యూనివర్సిటీ’ల నుంచి ప్రత్యేక పారితోషకాలు (Scholarships) అందుకున్నారు.


బీర్బల్‌ సాహ్ని (1891-1949)

 ఈయన వృక్ష శాస్త్రవేత్త. శిలాజ మొక్కలు ్బన్నీ(Fossil Plants), వాటి పరిణామక్రమం (Evolution) పై పరిశోధనలు చేశారు. 

లఖ్‌నవూలోని బీర్బల్‌ సాహ్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోసైన్సెస్‌ను ఈయనే స్థాపించారు.ఈయన భూగర్భశాస్త్రం, పురావస్తుశాస్త్రంలోనూ పరిశోధనలు చేశారు. 

సాహ్నికి లండన్‌ రాయల్‌ సొసైటీలో సభ్యత్వం ఉంది. ఇంటర్నేషనల్‌ బొటానికల్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా, భారత సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా పని చేశారు.


ప్రఫుల్ల చంద్ర రే (1861 - 1944) 

ఈయన రసాయన శాస్త్రవేత్త. మనదేశంలో మొదటి ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అయిన బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను స్థాపించింది ఈయనే. అనేక రసాయన కర్మాగారాలను నెలకొల్పారు.

ఈయన్ను భారత రసాయన పితామహుడిగా పేర్కొంటారు. ప్రముఖ శాస్త్రవేత్తలైన మేఘానంద సాహా, శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ మొదలైన వారు ‘రే’ శిష్యులే. 

ఈయన ఆధునిక భారతదేశంలో మొదటిసారిగా రసాయన ప్రయోగశాలలతో కూడిన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేశారు.

ఎం.ఎస్‌.స్వామినాథన్‌

 ఈయన అసలు పేరు మాకుంబు సాంబశివన్‌ స్వామినాథన్‌. 1925లో జన్మించారు. హరిత విప్లవం ద్వారా భారత వ్యవసాయ అభివృద్ధికి పూనుకున్నారు. 

 ఈయన్ను మనదేశంలో హరిత విప్లవ పితామహుడిగా పేర్కొంటారు. 

 స్వామినాథన్‌ 198288 మధ్య ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌గా పని చేశారు. 

 1960వ దశకంలో భారతదేశంలో నెలకొన్న కరవు పరిస్థితులను అధిగమించేందుకు హైబ్రిడ్‌ (అధిక ఉత్పత్తినిచ్చే) వంగడాలను అభివృద్ధి చేశారు. 

 స్వామినాథన్‌కు 1987లో ప్రపంచ ఆహార అవార్డు (World Food Prize) దక్కింది. ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఈయనే.

సలీం అలీ (1896-1987)

 ఈయన భారతదేశానికి చెందిన పక్షి శాస్త్రవేత్త (Ornithologist). సలీంను ‘బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు. 

 పక్షిశాస్త్ర అభివృద్ధికి అనేక గ్రంథాలు రాశారు. ‘బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ’, ‘భరత్‌పూర్‌ బర్డ్‌ శాంక్చుయరీ’ ఏర్పాటులో విశేష కృషి చేశారు.

 ఈయనకు 1958లో  పద్మభూషణ్, 1976 లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు దక్కాయి.

ఆషిమా ఛటర్జీ (1917 - 2006)

 ఈమె రసాయన శాస్త్రవేత్త. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో అనేక పరిశోధనలు చేశారు. 

 ‘వింకా’ (నిద్ర గన్నేరు) మొక్క నుంచి సేకరించిన ఆల్కలాయిడ్‌ల ద్వారా మూర్ఛ వ్యాధికి మందును రూపొందించారు. మలేరియా నివారణ ఔషధాన్ని కనుక్కున్నారు. 

 ఆషిమా భారత విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్‌ అందుకున్న రెండో మహిళ. 

 ఈమె సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో, మొక్కల ఉత్పత్తులపై పరిశోధనలు చేశారు.

డాక్టర్‌ ఇందిరా హిందూజా

 ఈమె 1986, ఆగస్టు 6న దేశంలోనే మొదటి టెస్ట్‌ట్యూబ్‌ బేబీని అభివృద్ధి చేశారు.

 ఇందిరా Gamete intrafallopian Transfer (GIFT) అనే పద్ధతిపై అనేక పరిశోధనలు చేసి, జాతీయ- అంతర్జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు.

 భారత ప్రభుత్వం 2011లో ఈమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ఎన్‌. వలార్మతి 

 ఈమె RISAT-1 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. దేశంలోనే మొదటి స్వదేశీ రాడార్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహాలను రూపొందించారు. తమిళనాడు ప్రభుత్వం 2015లో ఈమెకు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం అవార్డ్‌ను అందించింది.

డా.అదితి పంత్‌

 ఈమె సముద్రశాస్త్రంపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. 

 1983లో అంటార్కిటికాను సందర్శించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం అక్కడే సముద్ర, భూగర్భ శాస్త్రాల గురించి అధ్యయనం చేస్తున్నారు.

ఏపీజే అబ్దుల్‌ కలాం (1931-2015)

 ఈయన అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనేక పరిశోధనలు చేశారు. ఇస్రో, రక్షణ పరిశోధనా - అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పురోగతికి శ్రమించారు. కలాంను ‘భారతదేశ మిస్సైల్‌ మ్యాన్‌’’ (Missile Man of India))గా పిలుస్తారు. 

 భారతదేశ మొదటి స్వదేశీ లాంచ్‌ వెహికల్‌ SLV-III, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ రూపకల్పన ఈయన కృషి ఫలితమే.  1998లో పోఖ్రాన్‌లో నిర్వహించిన అణుపరీక్ష విజయవంతం కావడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. భారతరత్న పురస్కార గ్రహీత కలాం, మనదేశ 11వ రాష్ట్రపతిగా పని చేశారు.

విక్రం సారాభాయ్‌ (1919-1971)

 ఈయన్ను భారత అంతరిక్షశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. భారత అంతరిక్ష విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో అనేక ప్రయోగాలు చేశారు. 

 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఏర్పాటులో ఈయన ముఖ్య పాత్ర పోషించారు.

 సారాభాయ్‌  అంతరిక్షరంగంలో కాస్మిక్‌ కిరణాల గురించి పరిశోధనలు చేశారు.

 భారత ప్రభుత్వం ఈయన్ను 1966లో పద్మభూషణ్‌తో, 1972లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 

 అంతర్జాతీయ నక్షత్ర సమాఖ్య (International Astronomical Union) చంద్రుడిపై ఉన్న ఒక బిలానికి (Crater on the moon) ఈయన పేరు పెట్టింది.

టెస్సీ థామస్‌

 ఈమె 1963లో కేరళలో జన్మించారు. ఈమెను భారత మిస్సైల్‌ మహిళగా పేర్కొంటారు. 

 అగ్ని- IV, V, VII క్షిపణుల రూపకల్పనలో కృషి చేశారు. 

 ప్రస్తుతం ఈమె రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తూ, అనేక కీలక క్షిపణులను పర్యవేక్షిస్తున్నారు.

 టెస్సీ థామస్‌ లాల్‌బహుదూర్‌ శాస్త్రి జాతీయ అవార్డు అందుకున్నారు.

మరికొందరు ముఖ్య శాస్త్రవేత్తలు

 లీలావతి: గణిత, నక్షత్రశాస్త్రాల్లో అనేక పరిశోధనలు చేశారు. ఈమె ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య కుమార్తె.

 కాదంబిని గంగూలీ: బ్రిటిష్‌వారు భారతదేశాన్ని పాలించే సమయంలో పట్టభద్రురాలైన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ఈమె దక్షిణాసియాలోనే పాశ్చాత్య వైద్య విద్యను అభ్యసించిన తొలి మహిళ.

 ఆనందిబాయి జోషి: భారతదేశంలో మొదటి మహిళా వైద్యురాలు. పెన్సిల్వేనియాలో వైద్య విద్యను అభ్యసించారు. 21 ఏళ్ల వయసు నుంచే వైద్యసేవలు అందించారు.

 అన్నామణి: ఈమె వాతావరణ శాస్త్రవేత్త. భారత వాతావరణ విభాగంలో పని చేశారు. అనేక పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ 1987లో కేఆర్‌ రామనాథన్‌ మెడల్‌తో  ఈమెను సత్కరించింది.

 కల్పనా చావ్లా: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి. ఈమె 2003, ఫిబ్రవరి 1న కొలంబియా దుర్ఘటనలో మరణించారు.

 ఉషా బర్వాలే జహర్‌:  భారతదేశంలో మొదటి జన్యు ఆధారిత ఆహారమైన బీటీ వంకాయ రూపకల్పనలో విశేష కృషి చేశారు.


 

Posted Date : 15-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌