• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు - పాలసీలు

చారిత్రక నేపథ్యం 

భారత జాతీయ కాంగ్రెస్‌ 1947కి పూర్వమే శాస్త్ర సాంకేతికత - విజ్ఞాన రంగాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి గురించి ప్రస్తావించింది. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు వెనుకబడి ఉన్నాయని అప్పటి పాలకులు గుర్తించారు. వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తూ, పంచవర్ష ప్రణాళికల్లోనూ సముచిత స్థానం కల్పించారు. 

అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వృద్ధికి విద్యా రంగాన్ని ఉపయోగించి తద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాలని అభిలషించారు. దీని కోసం కచ్చితమైన విధివిధానాలను పాటించాలని భావించారు. అందుకు అనుగుణంగానే 1958లో ‘‘శాస్త్ర సాంకేతిక పాలసీకి(Science And technology) రూపకల్పన చేశారు. 


సైన్స్‌ పాలసీ 1958

ఈ పాలసీని అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. హోమీ జహంగీర్‌ బాబా దీని ముసాయిదాను రూపొందించారు.

ఈ పాలసీని భారతదేశ మొదటి విజ్ఞానశాస్త్ర పాలసీ తీర్మానంగా (First Scientific Policy Resolution Of India) పేర్కొంటారు.

భారత ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా విజ్ఞానశాస్త్ర సామర్థ్యాన్ని పెంచి, దాని ఆధారంగా వివిధ రంగాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి రంగంలో వేగవంతమైన, సుస్థిరమైన అభివృద్ధి కోసం విజ్ఞానశాస్త్ర పరిశోధనలు జరగాలని సూచించింది.

స్త్రీ, పురుషుల్లో నైపుణ్యాలను గుర్తించి, వారిని సైన్స్‌ కార్యక్రమాలలో పూర్తిగా భాగస్వాములను చేయాలని పేర్కొంది.

సాంకేతికరంగం అభివృద్ధికి ప్రతిపాదించిన లక్ష్యాల అమలుకు కావాల్సిన మౌలిక వనరులు, వసతులు కల్పించాలని సూచించింది. శాస్త్ర పరిశోధనల్లో పనిచేసే వారికి తగిన గుర్తింపును, గౌరవాన్ని కల్పించాలని తెలిపింది.

1958 సైన్స్‌ పాలసీని సమర్థవంతంగా అమలు చేయటం వల్ల మనదేశంలో కింది సంస్థలు ఏర్పడ్డాయి.

1. రక్షణ పరిశోధనా - అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) - 1958

2. శాస్త్ర సాంకేతిక విభాగం -1971

3. అంతరిక్ష విభాగం 1972

4. పర్యావరణ విభాగం  1980

ప్రభుత్వం ఈ పాలసీలో స్వయం సమృద్ధిని, సుస్థిరమైన సమ అభివృద్ధిని ప్రతిపాదించింది. 

 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ 2003

సహస్రాబ్ది నవీన ఆవిష్కరణల కోసం ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక పాలసీ 2003ను రూపొందించింది. అందులోని ముఖ్యాంశాలు...

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోని పౌరులందరికీ అందేలా చూడటం; ప్రతి  పౌరుడిలో శాస్త్రీయ స్పృహను, స్వభావాన్ని, దృక్పధాన్ని ప్రోత్సహించడం. 

సాంకేతిక రంగాలను వ్యవసాయం, పర్యావరణం, ఇంధన భద్రత, పేదరిక నిర్మూలన పరిష్కారాలకు ఉపయోగించడం.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో  శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కావాల్సిన వనరులను కల్పించడం.

అధునాతన సాంకేతిక వినియోగం ద్వారా హై-స్పీడ్‌ యాక్సిస్, డిజిటల్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్ర సాంకేతిక అనువర్తనాలను మరింత వేగవంతం చేయడం.

ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పిస్తూ, మేధో సంపత్తి హక్కులను(Intellectual Property Rights) కాపాడుతూ, వాటి  పరిధిని పెంచడం.

పరిశోధనా అనువర్తనాల ద్వారా ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికల జారీ, వాటి నిరోధం, అవి సృష్టించే ఉత్పాతాలను నివారించడం.

శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రభుత్వ పాలనలో, ప్రజాసంక్షేమ విధానాల అమల్లో ఉపయోగించడం.

 

శాస్త్ర , సాంకేతిక, ఆవిష్కరణ విధానం 2013 

ఈ పాలసీని భారత ప్రభుత్వం కోల్‌కతాలో జరిగిన 100వ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రకటించింది. 201020 దశాబ్దాన్ని ‘‘ఆవిష్కరణల దశాబ్దంగా (Decade For Innovation)గా పేర్కొంది.

విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతికతను, వాటి ద్వారా లభించే వినూత్న ఆవిష్కరణలను తెలియజేయడం-ప్రోత్సహించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం.

నవీన ఆవిష్కరణలు, పరిశోధనా-అభివృద్ధి రంగ సంస్థల ఏర్పాటు, మహిళా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అందించడం మొదలైనవాటి గురించి ఈ పాలసీలో ప్రస్తావించారు. దీని ద్వారా 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన శాస్త్ర పరంగా అభివృద్ధి చెందిన మొదటి అయిదు దేశాల జాబితాలో భారత్‌ను ఒకటిగా చేర్చాలని నిర్ణయించారు.

ఈ పాలసీ కాలంలో ప్రముఖంగా శాస్త్రీయ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికత భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాయని ప్రస్తావించారు. దీన్నే సంక్షిప్తంగా SRISHTI (Science Research And Innovation Syatem for High Technology led path for India) అని పిలుస్తారు.

SRISHTI ద్వారా దేశంలో వేగవంతమైన సమ్మిళిత వృద్ధితో పాటు, సుస్థిర అభివృద్ధిని సాధించవచ్చని పేర్కొన్నారు.

భారతదేశంలో అప్పటి వరకు పరిశోధనా-అభివృద్ధి రంగాలకు జీడీపీలో 1% మాత్రమే పెట్టుబడిగా ఉండేది. 2013 పాలసీ ద్వారా ఆర్‌ అండ్‌ డీ విభాగంలో పెట్టుబడులను(Gross Expenditure in Research and Development - GERD) 2 శాతానికి పెంచారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎస్‌ అండ్‌ టీ రంగంలో పబ్లిక్‌ - ప్రైవేట భాగస్వామ్యాన్ని(PPP) మరింత ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

నేషనల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ను పీపీపీ ద్వారా ప్రారంభించాలని నిర్ణయించారు. పరిశోధనా-అభివృద్ధి రంగంలో పనిచేసే పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్యను రానున్న అయిదేళ్లలో 66 శాతానికి పెంచాలని భావించారు. దీని ద్వారా వివిధ వర్గాలకు చెందిన (మహిళలు, దివ్యాంగులు) వారికి అవకాశం కల్పించాలని తీర్మానించారు.

అన్ని వర్గాల ప్రజల్లో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించాలని, యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలని ఈ పాలసీలో  ప్రస్తావించారు.

ఈ పాలసీలో ప్రాముఖ్యత కలిగిన పది రంగాలను గుర్తించి, వాటిని పరిశోధించాలని సూచించారు. ఆర్‌ అండ్‌ డీ విభాగాన్ని సేవా రంగానికి అనుసంధానించాలని పేర్కొన్నారు. 

సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు కావాల్సిన అనుకూల వాతావరణాన్ని కల్పించాలని వెల్లడించారు. 

ప్రపంచ స్థాయిలో ఉన్న విజ్ఞాన సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో శాస్త్ర సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచి, వాటి ఫలాలను అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తేవాలని అభిలషించారు.

 

శాస్త్ర , సాంకేతిక, ఆవిష్కరణ విధానం 2020

ఈ పాలసీ ముసాయిదాను ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం (Office of the Principal Scientific Adviser), శాస్త్ర సాంకేతిక విభాగం సంయుక్తంగా రూపొందించాయి.

భారతదేశ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో కీలకాంశాలైన సమ్మిళిత వృద్ధి, సుస్థిర పర్యావరణం మొదలైన అంశాలను ఈ పాలసీలో పొందుపరిచారు.

ఈ నూతన సైన్స్‌ పాలసీని ప్రస్తుతం వివిధ వర్గాల వారికి అందుబాటులో ఉంచి, వారి అభిప్రాయాలను సేకరించి అనంతరం  తీసుకోవాల్సిన చర్యలతో తుది తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.

 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ (1983)

80వ దశకంలో పరిశ్రమల్లో సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశంలో అభివృద్ధి ఊపందుకుంది. ఆ సమయంలో భారతదేశం ముఖ్యంగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌కు సాంకేతిక సహకారాన్ని అందించడం కష్టతరమైంది. దీంతో భారత ప్రభుత్వం 1983 శాస్త్ర సాంకేతిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

లక్ష్యం: దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారతీయ సాంకేతికతను అభివృద్ధి పరచడం, దిగుమతి చేసుకున్న విదేశీ సాంకేతికతను భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించడం ఈ పాలసీ ముఖ్య లక్ష్యం.

సాంకేతికత అభివృద్ధి ద్వారా దేశంలోని అనేక సమస్యలను పరిష్కరించి; దేశ సమగ్రతను, ఐక్యతను, స్వతంత్రతను కాపాడాలని నిర్ణయించారు.

అంశాలు: ఈ తీర్మానం ముఖ్యంగా స్వయం సమృద్ధిని (Self Reliance)సాధించటంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. సాంకేతిక సామర్థ్యాన్ని పెంచటం ద్వారా లాభదాయక ఉద్యోగ కల్పనను సాధించవచ్చని; సంప్రదాయక నైపుణ్య విద్యలను-పరికరాలను, వస్తువులను ఆధునికీకరించి అప్పటి అవసరాలను తీర్చవచ్చని; శక్తివనరుల సంరక్షణ లేదా పొదుపు చేయొచ్చని; పర్యావరణ పరిరక్షణ పెంపొందించొచ్చని తెలిపింది.

ఈ పాలసీలో భారతీయ టెక్నాలజీలను (సంప్రదాయ దేశీయ సాంకేతికతను) వ్యాపారాలకు అనుబంధంగా ఆధునికీకరించి, అత్యధిక ఉత్పత్తిని సాధించిన వారికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది.

పరిశోధనా - అభివృద్ధి (R&D) యూనిట్లను గృహ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. 

భారీ పరిశ్రమలు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించాలని పేర్కొంది.

ఈ తీర్మానం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ సంస్థలకు, పరిశ్రమలకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించారు. వీటికి అనుగుణంగా సాంకేతిక సహకారాన్ని వినియోగించి, దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వం ఉద్ఘాటించింది.

ఈ పాలసీని పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రభుత్వం 1983 జూన్‌లో సాంకేతిక విధాన అమలు కమిటీని (Technology Policy Implementation Policy) ఏర్పాటుచేసింది. ఇది 1987లో సాంకేతిక సమాచార అంచనా మండలిగా (Technology Information Forecasting and Assessment Council-TIFAC) రూపాంతరం చెందింది. ఇది స్వయంప్రతిపత్తి సంస్థ.

రచయిత

రేమల్లి సౌజన్య

విషయ నిపుణులు 

Posted Date : 20-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌