• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ క్షిపణి వ్యవస్థ

  భారతదేశంలో క్షిపణులను మొదట IGMDP - ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో  భాగంగా అభివృద్ధి చేశారు. దీన్ని 1983లో ప్రారంభించి 2008 వరకు కొనసాగించారు. దీనిలో భాగంగా అగ్ని, పృథ్వి, ఆకాష్, త్రిశూల్, నాగ్‌ అనే అయిదు క్షిపణులను తయారుచేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కాబట్టి ఆయనను భారతదేశ క్షిపణి సాంకేతిక పితామహుడు (ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మిస్సైల్‌ టెక్నాలజ్శీ లేదా క్షిపణి శాస్త్రవేత్తగా పిలుస్తారు.  భారతదేశంలో అగ్ని - 4 క్షిపణి ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన మొదటి మహిళ టెస్సీథామస్‌. ఈమెను మిస్సైల్‌ ఉమెన్‌ లేదా అగ్నిపుత్రిగా పిలుస్తారు.


అగ్ని క్షిపణి

ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. 1000 కి.గ్రా. ఆయుధాలను మోసుకొని వెళ్లగలదు. దీనిలో అయిదు రకాలు ఉన్నాయి.

అగ్ని - I: దీని పరిధి 700 - 1250 కి.మీ. ఒకే దశలో ఘన ఇంధనం ఉంటుంది. ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి. దీన్ని భారత సైన్యంలో ప్రవేశపెట్టారు.

అగ్ని - II: దీని పరిధి 2000 - 3000 కి.మీ. రెండు దశల్లో ఘన ఇంధనం ఉంటుంది. ఇది మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి. దీన్ని సైన్యంలోకి ప్రవేశపెట్టారు.

అగ్ని - III: దీని పరిధి 3000 - 4000 కి.మీ. రెండు దశల్లో ఘన ఇంధనం ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి. దీన్ని సైన్యంలోకి ప్రవేశపెట్టారు.

అగ్ని - IV: దీని పరిధి 3500 - 5000 కి.మీ. రెండు దశల్లో ఉన్న ఘన ఇంధనం ఉంటుంది. ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి. వీటిని భారత సైన్యం వినియోగిస్తుంది.

అగ్ని - V: దీని పరిధి 5000 - 8000 కి.మీ. దీనిలో మూడు దశల్లో ఘన ఇంధనం ఉంటుంది. ఇది ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి. వీటిని ఇంకా సైన్యంలో ప్రవేశపెట్టలేదు. వివిధ దశల్లో పరీక్షిస్తున్నారు.

అగ్ని - P: డీఆర్‌డీవో ఇటీవల అణ్వాయుధాలను మోసుకెళ్లగల అధునాతన అగ్ని- P (prime) క్షిపణిని పరీక్షించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించ గల బాలిస్టిక్‌ క్షిపణి. దీని పరిధి 2000 కి.మీ.

 

పృథ్వి క్షిపణి

ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి (Short range Balistic Missile). దీనిలో మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనం ఉంటుంది. ఇది 500 - 1000 కి.గ్రా. ఆయుధాలను మోసుకొని వెళ్లగలదు. దీనిలో రకాలు....

పృథ్వి - I: దీని పరిధి 150 కి.మీ. ఇది పదాతిదళ రకానికి చెందింది.

పృథ్వి - II: దీని పరిధి 250 - 350 కి.మీ.

పృథ్వి - III: దీన్ని ధనుష్‌ అనే పేరుతో పిలుస్తారు. దీని పరిధి 350 - 600 కి.మీ. ఇది నావికాదళం రకం. దీన్ని యుద్ధ నౌక నుంచి యుద్ధనౌక పైకి ప్రయోగిస్తారు.

ఆకాష్‌: ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీనిలో రామ్‌జెట్‌ ఇంజిన్‌ ఉంటుంది. 2.5 మాక్‌ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 25 - 30 కి.మీ. దీన్ని అడ్డగించే క్షిపణి (Inter Ceptor Missile) అంటారు. ఈ క్షిపణిని వియత్నాంకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల వాయుసేన అధునాతన ఆకాష్‌ క్షిపణిని పరీక్షించింది.

త్రిశూల్‌: ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 9 కి.మీ. దీన్ని త్వరగా ప్రతిస్పందించే (Quick Reaction) క్షిపణి అంటారు. ఇది 15 కి.గ్రా. బరువు గల ఆయుధాలను మోసుకువెళ్తుంది.  ప్రస్తుతం వీటి ఉత్పత్తిని నిలిపివేశారు. 

 

ట్యాంకు విధ్వంసక క్షిపణులు (యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌)

1) నాగ్‌: దీని పరిధి 4 - 5 కి.మీ. ఇది ఫైర్‌ అండ్‌ ఫర్‌గెట్‌ రకానికి చెందింది. ఇది 8 కి.గ్రా. బరువును తీసుకువెళ్లగలదు. వీటిని నమిక (NAMICA)  - నాగ్‌ మిస్సైల్‌ క్యారియర్‌) నుంచి ప్రయోగిస్తారు.

2) మ్యాన్‌ పోర్టెబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ (MPATGM) :  ఇది మూడో తరానికి చెందిన అధునాతన క్షిపణి. దీని పరిధి 2.5 కి.మీ.

3) అమోఘ: ఇది రెండో తరానికి చెందిన క్షిపణి. దీని పరిధి 2.8 కి.మీ. వీటిని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ తయారు చేసింది. 

4) హెలినా: హెలికాప్టర్‌ నుంచి ప్రయోగించగలిగే నాగ్‌ క్షిపణిని హెలినా అంటారు. ఇది మూడో తరానికి చెందింది. దీని పరిధి 7 - 8 కి.మీ. ఇది 8 కి.గ్రా. పేలోడ్‌ను తీసుకెళ్లగలదు. దీన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసింది. ఈ క్షిపణిని పదాతిదళం (ఆర్మీ) వినియోగిస్తుంది.

5) ధ్రువాస్త్ర: దీని పరిధి 7 - 8 కి.మీ. దీన్ని అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ నుంచి ప్రయోగిస్తారు. వాయుసేనలో ఉపయోగిస్తున్నారు. 

శౌర్య: ఇది హైపర్‌ సోనిక్‌ క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. దీన్ని జలాంతర్గామి నుంచి ప్రయోగించే K-15 క్షిపణికి ఉపరితలం రకంగా పిలుస్తారు. దీని పరిధి 750 - 1800 కి.మీ. ఇది 1000 కి.గ్రా. వరకు పేలోడ్‌ను (ఆయుధాలు) మోసుకెళ్లగలదు. దీనిలో రెండు దశల్లో ఘన ఇంధనం ఉంటుంది.

అస్త్ర: దీన్ని బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ మిస్సైల్‌ (BVRM) అంటారు. ఇది గాలి నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీన్ని సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి ప్రయోగించవచ్చు. దీని పరిధి 20 - 80 కి.మీ.

ప్రహార్‌: ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 150 కి.మీ. ఇది 200 కి.గ్రా. బరువును తీసుకొని వెళ్తుంది. దీనిలో ఒకే దశలో ఉన్న ఘన ఇంధనం ఉంటుంది. ఈ క్షిపణిని ప్రగతి పేరుతో ఎగుమతి చేస్తున్నారు. 

నిర్భయ్‌: ఇది దూర శ్రేణి క్రూయిజ్‌ క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 800 - 1000 కి.మీ. ఇది 450 కి.గ్రా. బరువును మోసుకొని వెళ్తుంది. దీని వేగం 0.7 మాక్‌ (సబ్‌ సోనిక్‌ వేగం). ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. దీన్ని ఏరోనాటిక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, బెంగళూరు అభివృద్ధి చేసింది. 

పినాక: ఇది మల్టీ బారెల్‌ రాకెట్‌ లాంఛర్‌. దీనిలో ఉన్న 12 రాకెట్లను 44 సెకన్లలో ప్రయోగించగలదు. దీనిలో రెండు రకాలున్నాయి. 

1) MK-I: దీని పరిధి 40 కి.మీ. 

2) MK-II: దీని పరిధి 75 కి.మీ.

 

బ్రహ్మోస్‌ క్షిపణి 

రష్యా, భారత్‌ (డీఆర్‌డీవో) సంయుక్తంగా ఏర్పరిచిన బ్రహ్మోస్‌ కార్పొరేషన్‌ (బ్రహ్మోస్‌ ఎయిరోస్పేస్‌ లిమిటెడ్‌) సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఈ సంస్థకు మొదటి డైరెక్టర్‌ శివథాన్‌ పిళ్లై. ఈయనను బ్రహ్మోస్‌ క్షిపణి పితగా వ్యవహరిస్తారు.

     భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోవా నదుల పేరు మీదుగా దీనికి బ్రహ్మోస్‌ అనే పేరు పెట్టారు. దీని వేగం 2.8 మాక్‌. ఇది ప్రపంచంలోనే అధునాతన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. దీని పరిధి 290 కి.మీ. ఇది 200 - 300 కి.గ్రా. వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. దీనిలో మొదటి దశలో ఘన ఇందనం, రెండో దశలో రామ్‌జెట్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ క్షిపణిలో అన్ని రకాల వేరియంట్‌లను అంటే యుద్ధనౌక, ఉపరితలం, యుద్ధ విమానం, జలాంతర్గామి నుంచి ప్రయోగించగలిగే రకాలను అభివృద్ధి చేశారు. దీనిలో బ్రహ్మోస్‌ - I, II క్షిపణిలు ఉన్నాయి. బ్రహ్మోస్‌  I లో బ్లాక్‌  I రకాన్ని యాంటీ షిప్‌ వెర్షన్‌గా, బ్లాక్‌ - II ను నేలపై దాడిచేసే వెర్షన్‌గా, బ్లాక్‌ - III ను పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడానికి అభివృద్ధి చేశారు.  

బ్రహ్మోస్‌  II రకం 7 మాక్‌ వేగంతో ప్రయాణించే హైపర్‌ సోనిక్‌ క్షిపణి. దీనిలో మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో స్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ క్షిపణి అభివృద్ధి దశలో ఉంది.

 

బరాక్‌ మిస్సైల్‌ సిస్టం (Barak Missile System)

వీటిని డీఆర్‌డీవో, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇవి ఎయిర్‌ డిఫెన్స్‌ అంటే గగనతల దాడుల నుంచి రక్షణకు ఉపయోగపడతాయి. ఇవి ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించ గల సూపర్‌ సోనిక్‌ క్షిపణులు. వీటి పరిధి 70 - 100 కి.మీ. ఈ వ్యవస్థలో 8 క్షిపణులు ఉండి 60 కి.గ్రా. బరువును మోసుకెళ్తాయి. 

 

K - శ్రేణి క్షిపణులు (K - series missiles)

ఇవి జలాంతర్గాముల నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్‌ క్షిపణులు(SLBM - Submarine Launched Ballistic Missiles). వీటిలో రకాలు.....

K-15 క్షిపణి: దీన్ని సాగరిక అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షిపణి పరిధి 750 కి.మీ. ఇది రెండో దశలో ఉన్న ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. 500 కి.గ్రా. పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. దీన్ని ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ జలాంతర్గామిలో ఉంచారు. 

K-4 క్షిపణి: ఇది మధ్యంతర శ్రేణి క్షిపణి. దీని పరిధి 3500 కి.మీ. ఇది 2500 కి.గ్రా. బరువును మోసుకెళ్లగలదు.

K-5 క్షిపణి: ఇది దూరశ్రేణి క్షిపణి. దీని పరిధి 5000 కి.మీ

రుద్రం (Rudram-I): ఇది యాంటీ రేడియన్‌ క్షిపణి. దీన్ని శత్రు దేశాల రాడార్‌లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, ఇతర నిఘా పరికరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని సుఖోయ్‌ - 30 MKI నుంచి ప్రయోగించవచ్చు. దీని వేగం 2 మాక్‌.

 

యాంటీ శాటిలైట్‌ క్షిపణి (ASAT Missile)

దీని సహాయంతో కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలను కూల్చివేయవచ్చు. డీఆర్‌డీవో మిషన్‌ శక్తి పేరుతో ఈ క్షిపణిని ఉపయోగించి 238 కి.మీ. లో ఎర్త్‌ ఆర్బిట్‌లో  తిరుగుతున్న మైక్రోశాట్‌ (Microsat-R) అనే భారత ఉపగ్రహాన్ని కూల్చివేసి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి పరిజ్ఞానం అమెరికా, రష్యా, చైనా లాంటి వాటికి మాత్రమే ఉంది.

 

రచయిత: బి.నరేశ్‌

Posted Date : 11-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌