• facebook
  • whatsapp
  • telegram

గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం)

భూగోళం భగభగ!

ఏటేటా ప్రపంచం అంతటా ఉష్ణోగ్రతలు తీవ్రమైపోతున్నాయి. వేసవిలో వడగాలులు, శీతాకాలంలో చలితీవ్రత అంతకంతకు అధికమవుతూ జీవుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడి పర్యావరణ సమతౌల్యత ప్రమాదంలో పడిపోతోంది. నదులతో పాటు సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువై జలచరాలు, భూమిపై కొన్ని సున్నిత జీవజాతులు అంతరించిపోతున్నాయి. తుపాన్లు, వరదలు, దుర్భిక్షంతో మానవ జీవనం రోజురోజుకూ దుర్భరమైపోతోంది. ఇన్ని అనర్థాలకు కారణం భూగోళ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే. మనిషి విపరీత చర్యలతో తలెత్తుతున్న ఈ భూతాపానికి ప్రధాన కారణాలు, వాటి పర్యవసానాలు, నివారణ చర్యలపై పరీక్షార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

వేసవికాలం పెరిగిపోయి ఎండలు మండిపోతున్నాయి. శీతాకాలం తగ్గిపోయి రుతువులు క్రమం తప్పుతున్నాయి. అకాల వర్షాలతో వరదలు, వర్షాభావ పరిస్థితులతో కరవు కాటకాలు వంటి పరిస్థితులను శీతోష్ణస్థితి మార్పులుగా అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. వాటి ప్రభావం భూమిపై అన్ని ప్రాంతాల్లో స్పల్ప నుంచి తీవ్రస్థాయికి చేరినట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శీతోష్ణస్థితి మార్పుల అధ్యయనానికి వరల్డ్‌ మెటిరియోలాజికల్‌ ఆర్గనైజేషన్‌ (WMO), యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌(UNEP) సంయుక్త ఆధ్వర్యంలో 1988లో జెనీవా వేదికగా ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(IPCC)ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 1.80Cనుంచి  40C వరకూ పెరగవచ్చని అంచనా. సాధారణంగా భూగోళం సగటు ఉష్ణోగ్రత 15.4oC ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ (భూగోళం వేడెక్కడం లేదా భూతాపం)గా పిలుస్తారు.


సూర్యుడి నుంచి నిరంతరం బయటకు వెలువడే సౌరశక్తిని సౌర వికిరణం అంటారు. ఇందులో చాలా తక్కువ పరిమాణంలో శక్తి భూమిని చేరుతుంది. ఈ సౌరశక్తిని సూర్యపుటం అంటారు. దీని ద్వారా భూమి వేడెక్కిన తర్వాత కొంత శక్తిని భూమి నుంచి పరారుణ కిరణాల రూపంలో, దీర్ఘ తరంగాలుగా వాతావరణం తిరిగి తీసుకుంటుంది. దీనినే భూవికిరణం అంటారు. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి హరిత గృహ వాయువులు భూవికిరణాన్ని అడ్డుకుని తిరిగి భూమి వేడెక్కడానికి కారణమవుతున్నాయి. ఈ విధంగా భూవికిరణం వల్ల భూమి చల్లబడటానికి బదులు తిరిగి భూవాతావరణం వేడెక్కడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ లేదా భూతాపంగా పిలుస్తారు.


అతిశీతల వాతావరణంలో పెరగడానికి అనుకూలంగా లేని సున్నిత మొక్కలను ఆకుపచ్చని గాజు గదిలో పెంచినప్పుడు లోపలి వేడి పైకి వెళ్లకుండా కాపాడి మొక్కల పెరుగుదలకు సహకరించినట్లు గ్రీన్‌హౌస్‌ వాయువులు కూడా భూమి చుట్టూ వేడిని పెంచుతాయి. అయితే ఈ హరితగృహ వాయువులు పెరిగే కొద్దీ భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అధికమై క్రమంగా గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తుంది. దీనినే హరితగృహ ప్రభావం అంటారు. హరితగృహ వాయువు ఉద్గారాల్లో ఇంధన రంగం నుంచే అధికంగా విడుదలవుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధానంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ (72%), మీథేన్‌ (21%), నైట్రస్‌ ఆక్సైడ్‌ (7%) కారణమవుతున్నాయి.

కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న దేశాలు: 1) చైనా (29.18%), 2) అమెరికా (14.02%), 3) ఇండియా (7.09%), 4) రష్యా (4.65%).


గ్రీన్‌హౌస్‌ ఘన కారకాలు:

1) బ్లాక్‌ కార్బన్‌: ఇది వాతావరణాన్ని వేడి చేసే ఘన స్థితిలోని  ప్రధాన కాలుష్యం, వాతావరణంలోని పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ లేదా ఏరోసాల్‌. దీనినే మసి (Sooty) గా పిలుస్తారు. ఇది కార్బన్‌డై ఆక్సైడ్‌ తర్వాత వాతావరణాన్ని వేడెక్కించే రెండో ప్రధాన కారకం. జీవ సంబంధ పదార్థాలు/బొగ్గు/పెట్రోలియం అసంపూర్తిగా మండినప్పుడు బ్లాక్‌ కార్బన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. సూర్యుడి నుంచి భూమి గ్రహించిన సౌరశక్తికి, భూమి వెనుకకు పంపిన భూవికిరణానికి మధ్య నిష్పత్తిని తెలియజేసే అల్బిడో సామర్థ్యాన్ని ఇది తగ్గిస్తుంది. అంటే బ్లాక్‌ కార్బన్‌ సౌర వికిరణాన్ని ఎక్కువగా గ్రహించి మంచు ప్రాంతాల్లో నిక్షిప్తం చేస్తుంది. దాంతో హిందూ కుష్, హిమాలయాల్లో గ్లేసియర్స్‌ హెచ్చు పరిమాణంలో కరిగిపోతున్నాయి.

2) బ్రౌన్‌ కార్బన్‌: ఆర్గానిక్‌ ఏరోసాల్స్‌నే బ్రౌన్‌ కార్బన్‌ అంటారు. కర్ర, పంట అవశేషాలు; బొగ్గు, పిడకలు లాంటి జీవసంబంధ పదార్థాలను మండించినప్పుడు ఏర్పడతాయి. ఇవి కూడా వాతావరణంలోకి చేరి గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతాయి.

 

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల నష్టాలు:

* భూమి చుట్టూ వేడి అధికమవడంతో ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. దాంతో మాల్దీవులు లాంటి కొన్ని దీవులు సముద్రంలో మునిగిపోతాయి. 

* సైబీరియా భూభాగంలో కప్పి ఉన్న శాశ్వత మంచుపొర అయిన ‘ఫెర్మాప్రాస్ట్‌’ కరిగిపోతే అందులోని మీథేన్‌ వాయువు విడుదలై భూతాపాన్ని మరింత పెంచుతుంది.

* వ్యవసాయ దిగుబడులు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది.

* వరదలు, సునామీలు, టోర్నడోలు, తుపాన్లు లాంటి విపత్తులు మరింత విరుచుకుపడతాయి. 

* అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్నిరకాల సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువై సంక్రమణ వ్యాధులు పెరుగుతాయి.

* హిమనీనదాలు త్వరగా కరిగిపోయి గంగానది లాంటి కొన్ని నదుల్లో స్వల్పకాల వ్యవధిలో వరదలు వస్తాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో దుర్భిక్షానికి దారితీస్తుంది.

* వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ అధికమైన కొద్దీ సముద్రపు నీటిలో దాని మోతాదు కూడా పెరుగుతుంది. సముద్రపు నీటిలో కార్బానిక్‌ ఆమ్లం ఎక్కువై నీటి ఆమ్లత్వం పెరుగుతుంది. దీనినే ‘ఓషన్‌ ఎసిడిఫికేషన్‌’ అంటారు. ఫలితంగా సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటుంది.

 

గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణ వ్యూహాలు:

1) కార్బన్‌ ట్రేడింగ్‌ విధానం: హరిత విధానాన్ని అనుసరించే వర్ధమాన, పేద దేశాల్లోని పరిశ్రమలు తమ ప్రాజెక్టుల నుంచి తగ్గించే ప్రతి టన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌కు ఒక కార్బన్‌ క్రెడిట్‌ను పొందుతాయి. ఆ విధంగా సంపాదించిన పాయింట్లను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలు నిర్ధారించిన కర్బన వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోలేనప్పుడు వర్ధమాన దేశాలు విక్రయించే ఈ కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఏటా జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ ్బదివీశ్శి సదస్సుల్లో ఈ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను నిర్ణయిస్తుంటారు.

2) కార్బన్‌ శోషక విసర్జిత విధానం: దీన్నే కార్బన్‌ శోషక నిల్వ విధానం అంటారు. వాతావరణంలో పరిమితికి మించి చేరిన కర్బన ఉద్గారాలను తగిన సాంకేతిక విధానం ద్వారా సేకరించి సముద్రాలు, అడవులు, ఎండిపోయిన ముడిచమురు బావులు, తవ్వకాలు చేపట్టని, మిగిలిపోయిన గనులు లాంటి ప్రాంగణాల్లో నిల్వ చేస్తారు. లేదా భూగర్భంలో పాతిపెడతారు.

3) జీవసంబంధ కార్బన్‌ శోషక విధానాలు: వృక్ష జాతులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్‌ను గ్రహించి కార్బోహైడ్రేట్స్‌గా మార్చి తమలో విలీనం చేసుకుంటాయి. దీనినే గ్రీన్‌ కార్బన్‌ శోషకం అంటారు. అడవులను పెంచడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. తీర ప్రాంతాలు, మంచి నీటి ప్రాంతాల్లో పెరిగే మాంగ్రూవ్, సర్గోసా, నాచు లాంటి జలావరణ వ్యవస్థలో పెరిగే వృక్షజాతులు వాతావరణం, సముద్రాల్లోని కార్బన్‌ను తొలగించి వాటిని నిల్వ చేసుకుంటాయి లేదా వాటి నేల అడుగున సహజ ప్రక్రియ ద్వారా నిక్షిప్తం చేస్తాయి. దీన్నే బ్లూకార్బన్‌ శోషక విధానం అంటారు. గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించడానికి తీర ప్రాంత ఆవరణ వ్యవస్థను పెంచాలి.

4) కార్బన్‌ ట్యాక్స్‌ విధానం: కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి అనుసరించే అత్యంత సమర్థ విధానమిది. ఇందులో కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేసే పరిశ్రమలు, మైనింగ్‌ సంస్థలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు కర్బన పన్ను (కార్బన్‌ ట్యాక్స్‌) విధిస్తారు. ఈ విధంగా చేయడాన్ని Cap and Trade అంటారు. దీనివల్ల ఉత్పిత్తిదారులను కర్బన ఉద్గారాలను వెదజల్లే ఇంధన వినియోగం నుంచి కర్బన రహిత ఇంధనాల వినియోగం వైపు మళ్లించవచ్చు.

5) జియో ఇంజినీరింగ్‌: ఇదొక ప్రయోగాత్మక నూతన సాంకేతిక విధానం. భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని తగ్గించడానికి అంతరిక్షంలో గ్లాస్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడం, సల్ఫేట్‌ ఏరోసాల్స్‌ను స్ట్రాటోస్ఫియర్‌లోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాన్ని తెల్లగా చేయవచ్చు. నివాసాల పైకప్పులకు వైట్‌వాష్‌ చేయడం, ఇనుము సంబంధిత ప్లేట్స్‌ను సముద్రంలో ఉంచడం ద్వారా ఆల్గే లాంటి నాచు మొక్కలు ఒక చోట ఎక్కువగా పెరిగే విధంగా చూడవచ్చు. ఈ తరహా సాంకేతిక విధానాలను గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు అనుసరిస్తారు. అధిక సాంకేతికత గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైతే, అత్యాధునిక సాంకేతికతతో దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 05-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌