• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - వ్యవసాయ విధానం  

 కేంద్ర వ్యవసాయ సహకార - రైతు సంక్షేమ శాఖ వార్షిక నివేదిక 202021 ప్రకారం దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 54.6% జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్నారు. మనదేశ స్థూల విలువ (జీవీఏ)లో వ్యవసాయ రంగం వాటా 17.8 శాతంగా ఉంది.

 వ్యవసాయ రంగం ప్రజలకు ఆహార భద్రతను కలిగిస్తూనే, వివిధ పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తోంది. ఎంతోమంది నైపుణ్యం లేని కార్మికులు ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 

 జాతీయ వ్యవసాయ కమిషన్‌ సిఫార్సుల మేరకు వ్యవసాయాన్ని కేంద్ర జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చారు.

 2020-21 పంట సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 308.65 మిలియన్‌ టన్నులుగా అంచనా వేశారు. అదే కాలంలో దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి అత్యధికంగా వరి ఉత్పత్తి జరిగింది. సుమారు 52% ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (FCI)కు అందించింది. 

భారతదేశం - అగ్రికల్చర్‌ ప్రొఫైల్‌

 జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) నివేదిక 201617 (ప్రస్తుత ధరల వద్ద) ప్రకారం, దేశంలోని అయిదు రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల విలువ (జీవీఏ) 30% కంటే ఎక్కువ ఉండటానికి వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు దోహదం చేస్తున్నాయి. ఆ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర.

 2015-16లో 10వ జాతీయ వ్యవసాయ, భూ కమతాల గణాంకాలను నిర్వహించారు. అందులో 2020-21 నాటికి దేశంలో భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే కుటుంబాల సంఖ్య 14.64 కోట్లుగా ఉంటుంద‌ని అంచనా వేశారు.

 దేశంలోని మొత్తం కార్మికుల్లో వ్యవసాయ కూలీల వాటా 54.6 శాతం ఉండగా, గ్రామాల్లో 57.8% కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. 

 భారత్‌లోని మహిళల్లో 30.33% పంటసాగు చేస్తుంటే, 40.67% మంది వ్యవసాయ కూలీలుగా ఉన్నారు.

 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం, భారతదేశ సగటు భూకమతం పరిమాణం 1.08 హెక్టార్లు. మొత్తం కౌలుదారుల్లో చిన్న, ఉపాంత భూకమతదార్ల (0.00 -  2.00 హెక్టార్లు) వాటా 86.08 శాతంగా ఉంది. ఇందులో మహిళల వాటా 13.87%.

 మనదేశంలో అత్యధిక కౌలు రైతులున్న రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌. సగటు భూకమతాల పరిమాణం నాగాలాండ్‌లో అత్యధికంగా 5 హెక్టార్లు ఉండగా, కేరళలో అత్యల్పంగా 0.18 హెక్టార్లు ఉంది. 

 భారత్‌లో మొదటిసారి 1970-71 నుంచి భూకమతాలను లెక్కించడం ప్రారంభించారు. వీటిని ప్రతి అయిదేళ్లకోసారి గణిస్తారు.

 నీతి ఆయోగ్‌ 2020-21 ఏడాదికి ఆహార ధాన్యాల డిమాండ్‌ - సప్లయ్‌ ప్రొజెక్షన్స్‌ను విడుదల చేసింది. అందులో వరి ఉత్పత్తిని 118.43 మిలియన్‌ టన్నులుగా, గోధుమలు - 107.59 మి. టన్నులు, పోషక ధాన్యాలు - 273.50 మి. టన్నులు, పప్పుల ఉత్పత్తిని 23.15 మి. టన్నులుగా ముందస్తు అంచనా వేసింది.

 కేంద్ర వ్యవసాయ శాఖ ఆధీనంలో ఉండే డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (DES) పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) నిర్ణయించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఇది పంట విస్తీర్ణం, ఉత్పత్తి, భూమి వినియోగం, ప్రధాన పంటల ఖర్చు, దిగుబడి మొదలైన గణాంకాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంది.

 వ్యవసాయ ఖర్చులు - ధరల కమిషన్‌ (Commission for Agricultural Costs & Prices - CACP) 22 పంటలను MSPలో చేర్చింది. ఇందులో 14 ఖరీఫ్‌ పంటలు - వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, తుర్, మూంగ్, ఉరద్, వేరుసెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు, వైజర్‌సీడ్, పత్తి; 6 రబీకి చెందినవి - గోధుమ, బార్లీ, గ్రామ్, పప్పులు, ఆవాలు, కుసుమ; 2 వాణిజ్య పంటలు - జనపనార, కాప్రా మొదలైనవి ఉన్నాయి.

నూతన వ్యవసాయ చట్టాలు

 భారత పార్లమెంట్‌ 2020 సెప్టెంబరు వర్షాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. 

ఆ చట్టాలు:

1. రైతు ఉత్పత్తి వాణిజ్య చట్టం (ప్రోత్సాహం - సులభతరం), 2020 The Farmers' Produce Trade and Commerce (Promotion and Facilitation) Act, 2020

2. రైతు ధరల హామీ ఒప్పంద సేవల  చట్టం (సాధికారత - రక్షణ) - 2020 The Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Act, 2020

3. వ్యవసాయ-నిత్యావసర వస్తువుల చట్టం (సవరణ) - 2020 The Essential Commodities (Amendment) Act, 2020

వ్యవసాయం - అభివృద్ధి

 బ్రిటిష్‌వారు 1905లో మనదేశంలో బిహార్‌లోని పూసా వద్ద మొదటి వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని (ఏఆర్‌ఐ) ఏర్పాటు చేశారు. 

ఐకార్‌ (ICAR)

 1929 జులై 16న ‘ఇంపీరియల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌’ను ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చాక దీని పేరును ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ICAR)గా మార్చారు. ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇందులో వ్యవసాయ విద్యను అందిస్తారు, అనేక పరిశోధనలు నిర్వహిస్తారు.  ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వ్యవసాయ విద్యాసంస్థలను కలిగి

ఉంది. 

2020 జనవరి నాటికి ఐకార్‌ ఆధీనంలో ఉన్న విద్యా సంస్థలు:

 4 డీమ్డ్‌ యూనివర్సిటీలు

* ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - న్యూదిల్లీ

* నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - కర్నాల్, హరియాణ

* ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - ఇజత్‌నగర్, బరేలీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ 

* సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌ - ముంబయి

 65 ఐకార్‌ విద్యాసంస్థలు

 14 నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్లు

 6 నేషనల్‌ బ్యూరోలు

 13 ప్రాజెక్ట్‌ డైరెక్టరేట్‌లు

* ప్రభుత్వం 1963లో న్యూదిల్లీ కేంద్రంగా జాతీయ వ్యవసాయాభివృద్ధి బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. ఇది వ్యవసాయ ఉత్పత్తులు, పశుగణాభివృద్ధి, అటవీ సంపద, మత్స్య పరిశ్రమ అభివృద్ధి లాంటి అంశాలను పరిశీలిస్తుంది.

* వ్యవసాయ శాస్త్రవేత్త  అయిన సుభాష్‌ పాలేకర్‌ 1991లో మొదటగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించి, అభివృద్ధి చేశారు. ఈయన్ను ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌’గా పిలుస్తారు. 

* సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం  ‘జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌  (ZBNF)’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

* 2016, జనవరి 18న భారత ప్రభుత్వం సిక్కింను తొలి సేంద్రియ రాష్ట్రంగా (ఆర్గానిక్‌ స్టేట్‌) గుర్తించింది. 2018లో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (UNO-FAO) సిక్కింను ప్రపంచ తొలి ఆర్గానిక్‌ స్టేట్‌గా గుర్తించి ‘అగ్రిగోల్డ్‌ అవార్డ్‌’ ఇచ్చింది. 

* లక్షద్వీప్‌ మనదేశంలో రెండో సేంద్రియ ప్రాంతంగా 2020లో  గుర్తింపు పొందింది. 

* సేంద్రియ వ్యవసాయంపై మరిన్ని పరిశోధనల కోసం నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ను ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ వద్ద, నేషనల్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సిక్కింలోని గాంగ్‌టక్‌ వద్ద ఏర్పాటు చేశారు.

* 2016, ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్‌- నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (e-NAM)ను ప్రారంభించింది. ఇది ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మార్కెట్‌. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో 1000 కేంద్రాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లో తొలిసారి e-NAM ఉత్తర్‌ ప్రదేశ్‌  - ఉత్తరాఖండ్‌ మధ్య జరిగింది.

* రైతులు, వ్యాపారుల మధ్య అమ్మకం - కొనుగోళ్ల కోసం కేంద్రం 2017, ఆగస్టులో ఎలక్ట్రానిక్‌- రాష్ట్రీయ కిసాన్‌ అగ్రి మండి (e-RaKAM)అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది.

* 2017 నుంచి భారత ప్రభుత్వం ఏటా డిసెంబరు 3న జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

Posted Date : 30-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌