• facebook
  • whatsapp
  • telegram

నదీ వ్యవస్థ - నీటిపారుదల

రెండు నదుల పరీవాహకంలో తెలంగాణం

ఏ ప్రాంత అభివృద్ధికైనా నదీవ్యవస్థ, నీటిపారుదల చాలా ముఖ్యమైనవి. ప్రజలకు అత్యంత అవసరమైన విద్యుత్తు, తాగునీరు, వ్యవసాయం తదితరాలన్నీ వీటిపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక రాష్ట్రం గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ విభాగాలను అభ్యర్థులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. జాగ్రఫీలో భాగంగా పోటీ పరీక్షల్లో వాటి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. 

మానవ చరిత్రలో నదులు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సహజ వనరులైన నదీ జలాలు వివిధ మానవ కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా నాగరికతలు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయి. ప్రజలు తమ జీవనోపాధికి, జలమార్గాలు, జల విద్యుత్‌ ఉత్పత్తి, వ్యవసాయం, నీటిపారుదల కోసం నదులను ఉపయోగించుకుంటున్నారు. భారతదేశంలోని ముఖ్యమైన రెండు నదులు గోదావరి, కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ విస్తరించి ఉంది. 

 

నీటిపారుదల ప్రాజెక్టుల వర్గీకరణ  


ప్రాజెక్టులను ప్రణాళికా సంఘం (1950 మార్చి 15) ఆయా నదుల కింద ఉండే ఆయకట్టు ప్రాంతం పరిమాణం ఆధారంగా 3 రకాలుగా పేర్కొంటే,  ఆర్థిక సంఘం మరో రకాన్ని కలపడంతో మొత్తం 4 రకాలుగా ప్రాజెక్టుల వర్గీకరణ జరిగింది. 

 

1) భారీ నీటిపారుదల ప్రాజెక్టులు: పదివేల హెక్టార్‌లు లేదా 25 వేల ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు గల ప్రాంతాలను భారీ ప్రాజెక్టులు అంటారు. వీటిని పెద్ద నదులు, ఉపనదులపై నిర్మిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 13 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించింది. మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకో 5 ప్రణాళిక స్థాయిలో ఉన్నాయి. 

 

2) మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు: 2 వేల నుంచి 10 వేల హెక్టార్‌ల మధ్య లేదా 5 వేల నుంచి 25 వేల ఎకరాల మధ్య ఆయకట్టు గల ప్రాంతాలను మధ్యతరహా ప్రాజెక్టులు అంటారు. వీటిని చిన్న నదులు, వాగులు, ఉపనదులపై నిర్మిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం 37 మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించారు. మరో 9 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.

 

3) చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టులు: ఇందులో 2 వేల హెక్టార్‌ల కంటే తక్కువ లేదా 5 వేల ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల వాటిని చిన్నతరహా ప్రాజెక్టులు అంటారు. దీనిలో నదులు, ఉపనదులు అంటే దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో 17 ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతల పథకంలో భాగంగా చెరువులు, రిజర్వాయర్‌లను నింపుతూ నీటిపారుదల, తాగునీరు అందిస్తున్నారు. ఇందులో దేవాదుల ఎత్తిపోతల పథకం, ఆర్‌ విద్యాసాగర్‌ రావు డిండి ఎత్తిపోతల, భక్తరామదాసు పాలేరు ఎత్తిపోతల, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ముఖ్యమైనవి.

 

4) సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులు: దీన్ని పూర్వం బిందువుల పథకంగా పేర్కొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ నీటిపారుదల వసతి కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇటీవల ప్రధానమంత్రి కిసాన్‌ సించాయ్‌ యోజన కింద ‘ప్రతిచుక్క - అధిక పంట’ (Per drop - More crop) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణలో ప్రతి ఏడాది కనీసం లక్ష ఎకరాలకు సూక్ష్మ నీటిపారుదల కింద ఆయకట్టు కల్పించాలని నిర్ణయించారు. దీని కింద బిందుసేద్యం (drip irrigation), తుంపరసేద్యాన్ని అమలు చేస్తారు.

 

గోదావరి నది 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహించే పరీవాహక ప్రాంతలో గోదావరి నది దాదాపు 79% కలిగి ఉంది. రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో గోదావరి దాని ఉపనదులైన మంజీర, ప్రాణహిత, మానేరు ముఖ్యమైనవి. ద్వీపకల్పంలో గోదావరి నది అతిపెద్ద వ్యవస్థ. దీన్ని దక్షిణ గంగ, వృద్ధ గంగ, తేలివాహన, ఇండియన్‌ రైన్‌ అని పిలుస్తారు

  గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా త్రయంబకేశ్వర్‌ వద్ద జన్మించి తెలంగాణలో సుమారు 600 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. ఈ నది తెలంగాణ సరిహద్దు రేంజల్‌ మండలం (నిజామాబాద్‌) కందకుర్తి వద్ద ప్రవేశించి నిర్మల్‌ - జగిత్యాల, ఆదిలాబాద్‌ - నాందేడ్‌ జిల్లాలను వేరు చేస్తుంది. గోదావరి నదికి మంజీర, ప్రాణహిత, పూర్ణ, ప్రవర, ఇంద్రావతి, మానేరు, కిన్నెరసాని, శబరి ముఖ్యమైన ఉపనదులు.

 

ఉపనదులు

ప్రాణహిత: గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత పరిమాణంలో అతిపెద్ద ఉపనది, అధిక నీటిని కలిగి ఉంటుంది. ఈ నది మధ్యప్రదేశ్‌ సాత్పురా కొండల్లో వైన్‌గంగా, వార్ధా నదులు; మహారాష్ట్ర సహ్యాద్రి కొండల్లో పెన్‌గంగా నదిగా జన్మించి తెలంగాణ కొమురం భీమ్‌ జిల్లాలో ప్రాణహిత నదిగా మారి మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లో నుంచి సిరోంచి గ్రామానికి దిగువన గోదావరి నదిలో కలుస్తుంది. ప్రాణహిత 34.87% పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ నదిపై ఆసిఫాబాద్‌ జిల్లా కేటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం ఉంది.     

 

మంజీర నది: ఇది గోదావరి నదికి అతి పొడవైన ఉపనది. దీని మొత్తం పొడవు 724 కి.మీ. ఈ నది వేసవి కాలంలో ఎండిపోతుంది. దీన్ని మహారాష్ట్ర మంజ్రూ నది అని పిలుస్తారు. ఇది మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌ జిల్లా బాలాఘాట్‌ కొండల్లో మొదలై కర్ణాటక బీదర్‌ నుంచి తెలంగాణలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, నర్సాపూర్‌ మీదుగా ప్రవహించి కామారెడ్డి, నిజామాబాద్‌లోని కందకుర్తి వద్ద హరెద్రానదిలో కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తూ గోదావరి నదిలో కలుస్తుంది. మంజీర నదిపై అచ్చంపేట బంజపల్లె గ్రామం వద్ద నిజాంసాగర్‌ డ్యామ్, సంగారెడ్డిలో సింగూర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు ఉంది. సింగూర్‌ ప్రాజెక్టు తాగునీటిని హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలకు అందిస్తుంది.

 

మానేరు నది: ఈ నది సిరిసిల్ల కొండల్లో జన్మించి కరీంనగర్‌ పట్టణం మీదుగా 128 కి.మీ. పొడవున ప్రవహించి పెద్దపల్లి నుంచి భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నదిపై కరీంనగర్‌ వద్ద దిగువ మానేరు డ్యామ్, సిరిసిల్ల మాన్‌వాడ వద్ద మధ్యమానేరు డ్యామ్, సిరిసిల్ల గంభీరావుపేట నర్యాల వద్ద నిజాం కాలంలో ఎగువ మానేరు డ్యామ్‌ను నిర్మించారు.

 

కడెం: ఇది ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలంలో జన్మించి నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మీదుగా ప్రవహించి పసుపుల గ్రామం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నదిపై కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఉంది. తెలంగాణలో ఎత్తయిన కుంతల జలపాతం, పోచ్చెర, గాయత్రి జలపాతాలు ఈ నదిపై ఉన్నాయి.

 

హరిద్ర: ఈ నది సంగారెడ్డి సమీప కొండల్లో జన్మించి నిజామాబాద్‌ జిల్లా ఎల్లమ్మ తీరం మీదుగా ప్రవహిస్తూ కందకుర్తి వద్ద గోదావరి నదిలో కలిసి త్రివేణి సంగమం ఏర్పడటానికి దోహదం చేసింది.

 

శబరి నది: ఇది గోదావరి నది ప్రధాన ఉపనదుల్లో ఒకటి. దీన్నే కొలాబ్‌ నది, ఆంధ్రా ఆడపడుచుల నది అని పిలుస్తారు. ఈ నది చత్తీస్‌గఢ్‌ సింకరం వద్ద తూర్పు కనుమల్లో జన్మించి కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. శబరి నది పరీవాహక ప్రాంతం ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉంది. దీనికి సీలేరు ప్రధాన ఉపనది. దీనిపై విశాఖపట్నం వద్ద ఎగువ సీలేరు, భద్రాచలం వద్ద దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి.

 

ఇంద్రావతి నది: ఈ నది అత్యధిక శాతం అటవీ ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని పర్యావరణ స్నేహ పూర్వక నది అంటారు. దీన్నే ఒడిశా కల్హండి జీవనది అని కూడా అంటారు. ఈ నది చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు ప్రాణవాయువు లాంటిది. ఇది ఒడిశా దండకారణ్య కనుమల్లో జన్మించి చత్తీస్‌గఢ్‌ నుంచి మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దు మీదుగా భూపాలపల్లి మేడిగడ్డ సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 535 కి.మీ. ఈ నదిపై చత్తీస్‌గఢ్‌ చిత్రకూట్‌ జలపాతం ఉంది. దీన్నే ఇండియన్‌ నయగారా అంటారు.

 

కిన్నెరసాని: ఇది గోదావరి ముఖ్య ఉపనదుల్లో చివరగా కలిసే నది. ములుగు జిల్లా మేడారం కొండల్లో జన్మించి భద్రాద్రి జిల్లా పాల్వంచ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భూర్గాంపాడు సమీపంలో గోదావరిలో కలుస్తుంది. ఈ నదిపై భద్రాద్రిలోని పాల్వంచలో కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. ఇది కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు నీరు ఇస్తుంది. ఇక్కడ కిన్నెరసాని అభయారణ్య కేంద్రం ఉంది.

 

మాదిరి ప్రశ్నలు

1. కిన్నెరసాని డ్యామ్‌ ఏ జిల్లాలో ఉంది.

1) భద్రాద్రి       2) ఖమ్మం      3) ములుగు       4) వరంగల్‌

 

2. సింగూర్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

1) కృష్ణానది     2) గోదావరి నది    3) మంజీర    4) ప్రాణహిత

 

3. గోదావరి నది కింది ఏ జిల్లాలను వేరు చేస్తుంది?

1) జగిత్యాల - నిర్మల్‌      2) భూపాలపల్లి - ములుగు 

3) ఆదిలాబాద్‌ - నిర్మల్‌     4) నిజామాబాద్‌ - కరీంనగర్‌

 

4. తేలివాహన నది అని ఏ నదికి పేరు?

1) గోదావరి     2) కృష్ణా     3) మంజీర     4) కిన్నెరసాని

 

5. ప్రవర, ప్రాణహిత ఏ నదికి ఉపనదులు?

1) గోదావరి 2) కృష్ణా 3) తుంగభద్ర 4) ఏదీకాదు

 

సమాధానాలు

1-1,     2-3,     3-1,     4-1,     5-1.

 

రచయిత:కొత్త గోవర్ధన్‌ రెడ్డి

Posted Date : 18-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌