• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌పంచ భౌగోళిక నైసర్గిక పరిస్థితులు

భూమండలంపై నివసించే ఏ జీవరాశికైనా, ఏ జీవసముదాయానికైనా చుట్టూ ఉన్న భౌగోళిక పరిసరాలపై కచ్చితమైన కనీస అవగాహన తప్పక ఉండాలి. లేకపోతే అవి ఎంతోకాలం తమ మనుగడ సాగించలేవు. మానవుల విషయంలో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఉంది. మానవుడు తన జీవన ప్రమాణాలను అందిపుచ్చుకోవడానికి నిరంతరం భౌగోళిక పరిసరాలపై ఆధారపడక తప్పదు. పురాతన కాలం నుంచి గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, అనంతరం బ్రిటిష్‌వారు తమ సామ్రాజ్యాలను విస్తరించడం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో వారు భౌగోళిక పరిజ్ఞానంలో ఇతరుల కంటే ముందుండటం ఒకటి. దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాలనేవి వారికి తోడ్పడ్డాయి.

ప్రపంచ రాజ్యాలు, వాటిని పాలించిన రాజులు తమ భౌగోళిక ప్రాంతాల పరిస్థితులను త్వరగా ఆకళింపు చేసుకున్నారు. ఇతర భౌగోళిక ప్రాంతాలు, రాజ్యాల పరిస్థితులను.. ముఖ్యంగా అక్కడి వనరులు, ప్రాదేశిక పరిమితులు, ఉప లబ్దమయ్యే ఇతర అంశాలు లాంటివాటిపై కూడా స్పష్టమైన అవగాహన ఏర్పరచుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు. ఈనాటి పరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాలు తమ పొరుగు దేశాలతో, ఇతర ప్రపంచ దేశాలతో ఏర్పరుచుకునే ద్వైపాక్షిక సంబంధాలు, సహకార భాగస్వామ్య ఒప్పందాలన్నీ ప్రధానంగా ఆయా దేశాల భౌగోళిక నైసర్గిక పరిస్థితులు, అవసరాల దృష్ట్యానే చేసుకుంటున్నాయి.అందువల్ల భౌగోళిక శాస్త్ర పరిజ్ఞానం అనేది చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
అంతేకాకుండా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను కూడా అక్కడి భౌగోళిక పరిస్థితులే నిర్ణయిస్తాయి.

ప్రపంచ భూగోళశాస్త్రం (వరల్డ్ జాగ్రఫీ)

ప్రపంచాన్ని ఏకమొత్తంగా చదవడం సంక్లిష్టం.. అశాస్త్రీయం. ప్రాంతాల ప్రాతిపదికన భౌగోళికాంశాలను చదివే ముందు.. భూమండలం గురించి తెలుసుకుందాం. భూమికి అంతర్గతంగా, బాహ్యంగానూ జరిగే కొన్ని ప్రధాన భూ భౌతిక ప్రక్రియలను తెలుసుకోవడం అవసరం.
అనంత విశ్వంలో నిర్దిష్ట దిశలో కదులుతున్న పాలపుంత (గెలాక్సీ)లు ఎన్నో.. అలాంటి ఒక పాలపుంతలో నిర్దిష్ట కేంద్రం చుట్టూ తిరుగుతున్న మధ్యశ్రేణి తరగతికి చెందిన నక్షత్రం సూర్యుడు. ఈ సూర్యుడి చుట్టూ నిర్దిష్టంగా తిరుగుతున్న 9 గ్రహాలతో ఏర్పడిన వ్యవస్థే సౌర కుటుంబం. ఈ వ్యవస్థలో మనుషులు నివసించే గ్రహం భూమి. సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి మూడోది, సౌర కుటుంబంలో పరిమాణాన్ని బట్టి 5వ పెద్ద గ్రహం. భూమి అంతర్గత శిలల ఆధారంగా.. భూమి వయసు సుమారు 4.5-5.0 బిలియన్ సంవత్సరాలు. సగటు సాంద్రత 5.5 కి.గ్రా./మీ3. భూమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అంతర్గతంగా, బహిర్గతంగా అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. ఈ మార్పులనేవి నిరంతర ప్రక్రియలని భూభౌతిక శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా సిద్ధాంతీకరించారు. ఈ పరిణామాలకు అంతర్జనిత (ఎండోజెనిక్), బహిర్జనిత (ఎక్సోజెనిక్) బలాలే కారణం.


భూ అంతర్గత నిర్మాణం
సుమారు 4.5-5.0 బిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన భూమి వేడిగా ఉన్న ధూళికణాల వాయుమండలంగా, తదనంతర కాలంలో చల్లబడి ఘనీభవించిన గోళంగా మారింది. కాలక్రమేణా అంతర్జనిత, బహిర్జనిత బలాల ప్రభావంతో మళ్లీ వేడి పెరిగే దశలో ఉంది. భూమి అంతర్గత నిర్మాణానికి సంబంధించి ఉపరితలం నుంచి అంతర్గతంగా ఉండే కేంద్రం వరకు మూడు ప్రధాన వలయ మండలాలుగా విభజించారు.

1. భూ పటలం (క్రస్ట్)
ఇది భూమి బాహ్య వలయ పొర. మిగతా పొరల కంటే దీని మందం చాలా తక్కువ. ప్రస్తుతం భూమి ఉపరితలంపై ఉండే అన్ని రకాల భూ స్వరూపాలు (పర్వతాలు, పీఠభూములు, మైదానాలు) ఈ పొరపై ఏర్పడినవే. ఈ పొరలో భూమి సాంద్రత తక్కువ (2.9కి.గ్రా./మీ3)గా ఉంటుంది. మాతృశిలల నుంచి వేరైన.. మెత్తని, సన్నని శిలా శైథిల్యాలు మృత్తికలుగా ఏర్పడ్డాయి. ఇవి వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా భూమి పైభాగాన ఉంటాయి. సిలికాన్ (Si), అల్యూమినియం (Al)అధిక మొత్తంలో ఉండటం వల్ల ఈ పొరను SiAl అని కూడా అంటారు. ఈ పొర మందం 30 నుంచి 100 కి.మీ.లు ఉంటుంది. పసిఫిక్ మహా సముద్రపు అడుగున ఈ పొర ఉండదు.


2. భూప్రావారం (మాంట్లీ)
ఇది భూపొరల్లో మధ్యస్థ పొర. ఇందులో సిలికాన్ (Si), మెగ్నీషియం (Ma) అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ పొరను SiMa అని కూడా అంటారు. ఈ పొర భూ పటలం దిగువ సరిహద్దు నుంచి 2,900 కి.మీ.ల లోతు (ఉపరితలం నుంచి) వరకు విస్తరించి ఉంటుంది. సగటు సాంద్రత 4.6 కి.గ్రా./మీ3 గా ఉంటుంది.


3. భూకేంద్రం (కోర్)
ఇది భూ ఉపరితలం నుంచి 6,371 కి.మీ.ల లోతు వరకు (భూప్రావారం కింద నుంచి) కేంద్రం చుట్టూ విస్తరించి ఉంటుంది. నికెల్(Ni), ఫెర్రస్ (Fe) అధికంగా ఉండటం వల్ల ఈ పొరను NiFe పొర అంటారు. దీని సాంద్రత 5.5-13.6 కి.గ్రా./మీ3 ల మధ్య మారుతూ ఉంటుంది.


ఖండాల ఆవిర్భావం
భూమి అంతర్గత నిర్మాణం ఆధారంగా ఉపరితల బాహ్యపొర -భూపటలం.. దాని కింద పొర - భూప్రావారం పైన (భూప్రావారం పొర అధిక పీడనం, ఉష్ణోగ్రతల మూలంగా ఘన-ద్రవ రూపంలో ఉంటుందని అంచనా) తేలియాడుతున్నట్లు ఉంటుందని భూభౌతిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఉపరితల పొర అంతా భూగోళం మొత్తంమీద ఒకే రీతిలో విస్తరించలేదు. ఉత్తరార్ధ గోళంలో అధికంగా భూభాగం ఉండగా, దక్షిణార్ధ గోళంలో సముద్ర జలాలు అధికంగా ఉన్నాయి. లొథియన్ గ్రీన్ అనే శాస్త్రవేత్త చతుర్ముఖ పరికల్పన (టెట్రాహెడ్రల్ హైపోథిసిస్)ని, ఎఫ్.బి.టేలర్ ఖండ చలన సిద్ధాంతం (కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ)ని ప్రతిపాదించారు.
ఎఫ్.బి.టేలర్ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం మొదటగా రెండు భూఖండాలు మాత్రమే ఉండేవి. అవి 1. లారెన్షియా (ఉత్తర ధ్రువం వద్ద), 2. గోండ్వానా (దక్షిణ ధ్రువం వద్ద). ఈ రెండు భూఖండ భాగాలు చంద్రుడి గురుత్వాకర్షణతో ఏర్పడిన సముద్ర తరంగాల బలం వల్ల ధ్రువాల నుంచి భూమధ్యరేఖ వైపు పయనిస్తూ పశ్చిమదిశగా కూడా కదలడంతో విచ్ఛిన్నమై ప్రస్తుత ఖండాల ఆకృతిని సంతరించుకున్నాయి.
ఆల్ఫ్రెడ్ వెజెనర్ అనే శాస్త్రవేత్త కూడా ఖండ చలన సిద్ధాంతాన్ని.. టేలర్ సిద్ధాంతానికి కొద్దిగా భిన్నంగా విశదీకరించారు. పురాతన యుగంలో భూభాగం మొత్తం ఒకే ముద్దలా (Pangea) ఉండి దానిచుట్టూ నీరు ఆవరించి ఉండేది. Pangea చుట్టూ ఆవరించి ఉన్న సముద్ర భాగాన్ని Panthalasa గా ఆయన పేర్కొన్నారు. తర్వాత క్రమంలో ఒకటిగా ఉన్న భూభాగం రెండుగా చీలిపోయి మధ్యలో Tethyssea ఏర్పడగా విడిపోయిన రెండు భాగాలూ మళ్లీ విచ్ఛిన్నం చెంది ప్రస్తుత ఖండాల ఆకృతిని పొందాయి.
మెకెంజీ, పార్కర్‌లు 1967లో ప్లేట్ టెక్టోనిక్ సిద్ధాంతాన్ని విశదీకరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం భూపటలంలో ఉండే రాతి నిర్మాణాలైన భూఖండాల విభాగాలనే పలకలు (ప్లేట్స్)గా పిలిచారు. ఈ పలకలు చలనం చెందడం వల్ల చోటుచేసుకునే అన్ని పర్యవసానాలను (భౌమిక) కలిపి ప్లేట్ టెక్టోనిక్స్ అంటారు. ప్రస్తుత ప్రపంచ భూభాగాలు, మహాసముద్రాల విస్తరణను సహేతుకంగా ఈ సిద్ధాంతం వివరించడం వల్ల ప్రపంచ భౌగోళిక శాస్త్రవేత్తల దృష్టిలో ఇదో అద్భుత ఆవిష్కరణ.


భూసమతాస్థితి (Isostasy)
భూ ఉపరితలం సమతలంగా కాకుండా ఎగుడు దిగుడు నిర్మాణ స్వరూపాలను కలిగి ఉంటుంది. దీన్ని భూనిర్మితి (Relief) అంటారు. ఉదా: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, మహాసముద్రాలు, లోయలు... ఇలా భిన్నరీతుల్లో భూమిపైన వేర్వేరు ఎత్తుపల్లాలుగా నిలిచి ఉండటానికి అవి నిర్దిష్టమైన 'సమతాస్థితిని కలిగి ఉండటమే కారణమని ప్లేట్ టెక్టోనిక్ సిద్ధాంతం వివరిస్తుంది.

భూచలనాలు (ఎర్త్ మూవ్‌మెంట్స్)
భూమి అంతర్గతంగా, బహిర్గతంగా అనేక మార్పులకు గురయ్యే ప్రక్రియలను భౌమిక ప్రక్రియలు (జియో మార్ఫలాజికల్ ప్రాసెస్) అంటారు. దీనికి ప్రధాన కారకాలు రెండు. 1. అంతర్జనిత బలాలు (ఎండోజెనిక్ ఫోర్సెస్), 2. బహిర్జజనిత బలాలు (ఎక్సోజెనిక్ ఫోర్సెస్). ఈ బలాల ప్రభావం వల్లే భూమి పొరల్లో చలనాలు ఏర్పడతాయి. వాటినే భూచలనాలు అంటారు. ఇవి భూమిలో అనేక రకాల భౌమిక ప్రక్రియలకు కారణమవుతాయి.


అంతర్జనిత బలాలు
భూమి అంతర్గత పొరల్లో ఉండే అధిక ఉష్ణం, పీడనం.. వాటివల్ల కలిగే స్థానిక మార్పుల వల్ల ఏర్పడే బలాలే అంతర్జనిత బలాలు. ఈ బలాల వల్ల 2 రకాల భూచలనాలు ఏర్పడతాయి. అవి..
1. ఆకస్మిక చలనాలు: అత్యంత తక్కువ కాలవ్యవధిలో ఈ చలనాలు చోటు చేసుకుంటాయి. ఇవి కొన్ని సెకన్ల నుంచి కొద్ది గంటలు/ రోజుల వరకు ఉంటాయి.
ఉదా: భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటం
* మానవుడు తన జీవిత కాలంలో చూడగలిగే భౌమిక ప్రక్రియలు ఇవి మాత్రమే. ఇతర ప్రక్రియలు దీర్ఘకాలికమైనందున వాటిని మానవుడు చూడగలిగే ఆస్కారం లేదు. ఆకస్మిక చలనాలు కొన్నిరకాల భూ స్వరూపాలను తమ జీవిత కాలంలో నిర్మిస్తాయి.
ఉదా: వోల్కనోయిక్ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు


2. ద్విస్వభావ చలనాలు: ఈ చలనాలు నిలువుగా, అడ్డంగా సంభవిస్తాయి. ఇవి చాలా దీర్ఘకాలికమైనవి. కొన్ని వేల సంవత్సరాల నుంచి మిలియన్ల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇవి కూడా వివిధ రకాల భూస్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, సరస్సులు, మైదానాలు, విదీర్ణదరులు/లోయలు ఏర్పడతాయి.
ఉదా: ఆండీస్, రాఖీస్, ఆల్ఫ్స్, హిమాలయాల లాంటి ముడుత పర్వతాలు ఈ ప్రక్రియలోనే ఏర్పడ్డాయి.


బహిర్జనిత బలాలు
భూమి లోపలి నుంచి కాకుండా భూమికి బాహ్యంగా ఉండే అంశాల వల్ల ఏర్పడే బలాలు. అంటే శీతోష్ణస్థితి కారకాలైన గాలి, నీరు, మంచు లాంటి వాటి వల్ల.. ముఖ్యంగా అవి కలగజేసే భౌతిక, రసాయన, జీవ సంబంధ ప్రక్రియలు భూమిపై ఉన్న నిర్మితీయ స్వరూపాలను (అంతర్‌జనిత బలాల వల్ల ఏర్పడినవి) శుష్కింపజేసి లేదా శైథిల్యపరచి విచ్ఛిన్నం చేస్తాయి. దీన్నే వికోషీకరణం (డెన్యూడేషన్) అంటారు. ఇందులో శిలా శైథిల్యం, క్రమక్షయం అనే 2 ప్రక్రియలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ ప్రక్రియలు ఉత్పన్నాలుగా అనేక రకాలైన సూక్ష్మ స్థాయి భూస్వరూపాలు ఆవిర్భవిస్తాయి.
ఉదా: నీటి ప్రవాహం వల్ల నేల కోతకు గురై.. లేదా నదుల వల్ల ఏర్పడే లోయలు (కాన్యోన్స్).
వాయు ప్రవాహాల వల్ల ఏర్పడే ఎడారి ప్రాంత స్వరూపాలు, హిమనీ నదాల వల్ల ఏర్పడేవి.


శిలలు
భూమి ఉపరితల పొరను భూపటలం అంటారు. ఇది అనేక మూలకాల సముదాయాల వల్ల ఏర్పడే ఖనిజ పదార్థాల అమరిక. వీటినే శిలలు అంటారు. ఈ మూలకాల నైష్పత్తిక ప్రాధాన్యం భూమి మొత్తానికి, భూప్రవారానికి వేర్వేరుగా ఉంటుంది.
పట్టిక-1లో ఇచ్చిన మూలకాల సముదాయాలైన ఖనిజాల వల్ల ఏర్పడే శిలలు ప్రధానంగా 3 రకాలు. అవి..

1. అగ్ని శిలలు
భూమి అంతర్గత పొరల్లో అత్యధిక వేడి(ఉష్ణం), పీడన పరిస్థితులు ఆయా ప్రదేశాల్లో ఉన్న భూమి పొరల భౌతిక, రసాయన లక్షణాల ఆధారంగా ద్రవీభవనం చెందగా ఏర్పడేది శిలాద్రవం (మాగ్మా). ఇది ఆయా ప్రదేశాల పరిస్థితుల దృష్ట్యా అనువైన ప్రదేశాల్లో భూఉపరితలం పైకి ఊర్ధ్వముఖంగా ప్రవహించి చివరకు భూ ఉపరితలంపైకి నెమ్మదిగా లేదా ఆకస్మిక విస్ఫోటం ద్వారా చేరుతుంది. దీన్నే వోల్కానిక్ ఆక్టివిటీ అంటారు. ఇలా బయటకు వచ్చిన శిలాద్రవమే లావా. ఈవిధంగా అంతర్గత శిలాద్రవమైన మాగ్మా, భూ ఉపరితలంపైకి చేరిన శిలాద్రవమైన లావా అనువైన ప్రదేశాల్లో చల్లబడి ఘనీభవించగా ఏర్పడే భూశిలలనే అగ్నిశిలలు అంటారు. ఉదా: బసాల్ట్, గ్రానైట్. అగ్నిశిలలను మాతృ శిలలు, ప్రాథమిక శిలలని కూడా అంటారు.

2. నిక్షేపిత శిలలు
బహిర్జనిత బలాల కారకాలైన ప్రవహించే నీరు, వాయువు, హిమనీ నదాలు... వికోషీకరణ ప్రక్రియల వల్ల ఏర్పడిన శిలా శైథిల్యాలను ఆయా కారకాలు తమ వెంట అవశేషాలుగా తీసుకుని వెళతాయి. వాటిని అనువైన ప్రదేశాల్లో నిక్షేపం చేస్తాయి. ఇలా నిక్షేపితమైన శిలా శైథిల్యాలు స్థిరీకరణ, స్తరీకరణ ప్రక్రియల ద్వారా ఏర్పరిచే శిలలను నిక్షేపణ శిలలు అంటారు. ఉదా: ఇసుక రాయి (సాండ్ స్టోన్), సున్నపురాయి (లైమ్ స్టోన్), జిప్సమ్, రాతి బొగ్గు (కోల్). పురాతన జీవుల అవశేషాలు, కళేబరాలు, శిలాజాల రూపంలో ఈ శిలల్లోనే లభిస్తాయి. ముడిచమురు, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలను కూడా ఈ శిలల నుంచి సేకరిస్తారు.

3. రూపాంతర శిలలు
మొదటి రెండు రకాలైన అగ్ని శిలలు, నిక్షేపిత శిలలపై తీవ్రమైన ఉష్ణం, పీడనాల ప్రభావం వల్ల భౌతికంగా లేదా రసాయనకంగా మార్పు చెంది ఇతర కొత్త శిలలుగా ఏర్పడితే వాటిని రూపాంతర శిలలు అంటారు.
ఉదా: మార్బుల్, పలకరాయి, క్వార్ట్జ్.


భూనిర్మితీయ స్వరూపాలు
భూమి ఉపరితలంపై ఉండే నిర్మితీయ స్వరూపాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...

1. పర్వతాలు
పరిసర భౌగోళిక ప్రదేశాల కంటే ఎక్కువ ఎత్తులో నిట్రవాలుగా ఉండే భూ నిర్మాణాలను పర్వతాలు అంటారు. సాధారణంగా 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవాటిని పర్వతాలు అంటారు. ఇవి 3 రకాలు.


i) ముడుత పర్వతాలు
ఇవి అంతర్జనిత భూచలనాల వల్ల ఏర్పడతాయి. భూమి పొరలు సంపీడనం చెందే సందర్భంలో ఆ పొరలు ముడతలు పడటంతో ఇవి ఏర్పడతాయి.
ఉదా: హిమాలయాలు, ఆండీస్, రాకీ, ఆల్ఫ్స్ పర్వతాలు


ii) ఖండ పర్వతాలు
అంతర్జనిత భూ చలనాల వల్ల భూమి పొరలు తన్యతకు గురికావడం వల్ల ఇవి ఏర్పడతాయి.
ఉదా: వాస్‌జెస్, బ్లాక్ మౌంటెన్ (యూరప్), సైనా నవాడ (యూఎస్ఏ)


iii) అగ్ని పర్వతాలు
భూమిలో నుంచి శిలాద్రవం (మాగ్మా) ఊర్ధ్వంగా పయనించి భూ ఉపరితలం పైకి ఎగజిమ్మినప్పుడు గుట్టలుగా పోగుపడగా ఏర్పడే వాటినే అగ్నిపర్వతాలు అంటారు.
ఉదా: మౌంట్ ఫ్యూజియామా (జపాన్), మౌంట్ మౌనాకీ (యూఎస్ఏ) మౌంట్ ఎత్న (ఇటలీ).


2. పీఠభూములు
పరిసర ప్రాంతాల కంటే ఎత్తుగా ఉండి కనీసం ఒకవైపు నిట్రవాలుగా లేదా లంబంగా ఉంటూ ఉపరితల భాగం కొద్దిపాటు ఎత్తుపల్లాలతో లేదా సాపేక్షంగా బల్లపరుపుగా ఉండే నిర్మాణ స్వరూపమే పీఠభూమి. ఇది ఖనిజ నిక్షేపాలకు నెలవు. పీఠభూముల్లో రకాలు..

i) పర్వతాంతర పీఠభూములు: ఇవి దాదాపు అన్నివైపులా పర్వతాలు, కొండలతో చుట్టుముట్టి ఉంటాయి.
ఉదా: టిబెట్, కొలంబియా, మెక్సికన్ పీఠభూములు


ii) పర్వతపాద పీఠభూములు: పర్వత పాదాల వద్ద ఉండి మరోవైపు మైదానాలతో సరిహద్దును కలిగి ఉంటాయి.

ఉదా: అపలేచియన్ (యూఎస్ఏ), పెటగోనియా (దక్షిణ అమెరికా) పీఠభూములు

iii) డోమ్ (కుంభాకార) పీఠభూములు: అంతర్జనిత భూచలనాల వల్ల భూపటలం పైకి వచ్చినప్పుడు ఇవి ఏర్పడతాయి.

ఉదా: ఒజార్క్ పీఠభూమి (యూఎస్ఏ), ఛోటానాగపూర్ పీఠభూమి (భారతదేశం).

iv) అంతరఖండ పీఠభూములు: ఇవి పర్వత ప్రాంతాలకు దూర భాగాల్లో ఉంటాయి. తరుచుగా కోస్తా మైదానాల్లో సరిహద్దును కలిగి ఉంటాయి.
ఉదా: దక్కన్ పీఠభూమి, అరేబియన్, ఆస్ట్రేలియా పీఠభూములు.


v) అగ్నిపర్వత పీఠభూములు: లావా, మందమైన పొరలుగా విశాల భూభాగంలో పోగుపడినప్పుడు ఈ పీఠభూములు ఏర్పడతాయి.
ఉదా: దక్కన్ పీఠభూమి, కొలంబియా పీఠభూమి.


3. మైదానాలు
సముద్ర మట్టం నుంచి అతి తక్కువ ఎత్తులో ఉంటూ, సమతలంగా ఉండే భూస్వరూపాలే మైదానాలు.
ఉదా: గంగా మైదానాలు (భారత దేశం), గ్రేట్ ప్లెయిన్ (అమెరికా).


భూ సమస్తం
భౌగోళిక శాస్త్రాన్ని 'భూమిని వర్ణించే లేదా అధ్యయనం చేసే శాస్త్రం' అని స్థూలంగా నిర్వచించవచ్చు. ఇక్కడ భూమి అంటే భౌతిక రూపంలో ఉన్న భూస్వరూపం, దానిలో జరిగే అంతర్గత, బహిర్గత ప్రక్రియలే కాకుండా భూమిపై నివాసం ఉండే జీవరాశులు కూడా. ప్రధానంగా మానవుల కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేకాకుండా భూమిపై నివాసం ఉండే మానవుల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక.. ఇతర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా ప్రక్రియలు వేర్వేరుగా, ఒకదానిపై ఒకటి చూపించే ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రంగా దీన్ని విశదీకరించవచ్చు.

Posted Date : 10-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌