• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత ప్రాచీనం నుంచి నవీనానికి!

 కంచు యుగంలో నవీన న‌గ‌రాలు !

ఆధునిక యుగానికి ఏమాత్రం తీసిపోని జీవనశైలి, సాంకేతిక నిర్మాణాలు, ప్రణాళికతో కూడిన పట్టణ సంస్కృతి క్రీస్తు పూర్వమే సింధు నాగరికత రూపంలో భారతదేశంలో విరాజిల్లింది. పూర్వ భారతదేశ చరిత్రలో కలికితురాయిగా, తొలి నాగరిక ప్రపంచానికి తలమానికంగా నిలిచిపోయింది. చారిత్రక ఆధారాల ప్రకారం అప్పటి సమాజం కూర్పు, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన విధానం, వ్యాపకాలు, వినోదాలు, పండించిన పంటలు, తిన్న ఆహారం గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రకృతి ఆరాధన, స్త్రీ పురుష భేదం లేని వైఖరి, కళా కౌశలత లాంటి ఆదర్శాలతో పాటు భూమి పొరల్లో దాగిన నాటి గుర్తులు, వారు వదిలివెళ్లిన వారసత్వపు అంశాలను తెలుసుకోవాలి.

వ్యవసాయ పరిజ్ఞానం సాధించి, పంటలు పండించి, సంచార జీవితానికి స్వస్తి చెప్పి, స్థిర జీవితాన్ని గడపడం మొదలైన నవీన రాతి యుగం మానవ సమాజ మహాప్రస్థానంలో ఒక విప్లవాత్మక యుగం. ఆ తదనంతర పరిణామమే తామ్ర శిలాయుగం. ఈ యుగంలోనే భారతదేశ వాయవ్య ప్రాంతంలో అనేక గ్రామీణ సంస్కృతులు ఏర్పడ్డాయి. తామ్రం, సీసం కలిపి కాంస్యం తయారు చేయడం ప్రారంభమైంది. అధిక వ్యవసాయోత్పత్తి అమ్మకానికి దారితీసి, వ్యాపార కూడళ్లు ఏర్పడి క్రీ.పూ. 2700 నాటికి పట్టణాలుగా రూపొందాయి. ఈ కాంస్య యుగానికి చెందిందే పశ్చిమోత్తర భారతంలో వర్ధిల్లిన నగర నాగరికత - ‘సింధు నాగరికత’.

ప్రధాన అంశాలు:

పట్టణాలు: సింధు నాగరికత నిర్మాణాలు, నాటి ప్రజల జీవన విధానాన్ని, నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి. దాదాపు పట్టణాలన్నీ ఒకే విధమైన ప్రణాళికతో ఉన్నాయి. 

(i) ప్రతి పట్టణం రెండు భాగాలుగా ఉంది. ఒకటి పడమటి దిక్కున ఉన్న ఎత్తయిన ప్రాంతంలో (సిటాడెల్‌/ కోట) నిర్మించిన ప్రజాభవనాలు, స్నానవాటికలు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి (ఒక్క చాన్హుదారో మాత్రం దీనికి మినహాయింపు). 

(ii) పట్టణ తూర్పు వైపు సామాన్యులు నివసించే పౌర గృహాలు ఉన్నాయి. ఇక్కడి వీధులు, ఇళ్లన్నీ ఒక పద్ధతి ప్రకారం నిర్మితమయ్యాయి.

వీధులు: ప్రధాన వీధులను ఉత్తర, దక్షిణ దిశలుగా; ఉప వీధులను తూర్పు పడమరగా సరళరేఖ ఆకారంలో నిర్మించారు. వీధులు పట్టణాన్ని దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా తీర్చిదిద్దాయి. ప్రతి వీధికి అటూ, ఇటూ నివాస గృహాలున్నాయి. అన్ని వీధుల్లో దీపపు స్తంభాలు, చెత్తకుండీలు ఉన్నాయి. ఇళ్ల నుంచి మురుగు జలాలు మట్టిగొట్టాల ద్వారా వీధిలో పక్కాగా నిర్మించిన మురుగు నీటి కాల్వలోకి చేరే ఏర్పాటు ఉంది. కాల్చిన ఇటుకలతో నిర్మించిన గృహాలు వీధికి ఇరువైపుల్లో కనిపిస్తాయి. ఇళ్ల నిర్మాణంలో వైవిధ్యం  ఉంది. ఇంటి ప్రధాన ద్వారాన్ని పెరటి వైపు ఏర్పాటు చేశారు. ఇళ్లు రెండు నుంచి అయిదారు గదులతో విశాలంగా ఉన్నాయి. కొన్ని గృహాలు ఒకట్రెండు అంతస్తులతో నిర్మితమయ్యాయి. ఇంటి పెరట్లో బావి, మరుగుదొడ్లు ఉన్నాయి.  హరప్పాలో రావి నది ఒడ్డున ‘గొప్ప ధాన్యాగారం’ గుర్తించారు. ఒక్కొక్కటి ఆరు గదులతో ఉన్న రెండు దీర్ఘచతురస్రాకార బ్లాకులు ఒక ఎత్తయిన వేదికపై నిర్మించి ఉన్నాయి. వీటిని పన్నుల రూపంలో సేకరించిన ధాన్యాన్ని లేదా వ్యాపారం కోసం తెచ్చిన ధాన్యాన్ని నిల్వ  చేసేందుకు ఉపయోగించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు.  మొహెంజోదారో వద్ద తవ్వకాల్లో అద్భుత వాస్తు ప్రావీణ్యంతో నిర్మించిన ‘స్నానవాటిక’ బయటపడింది. దీర్ఘచతురస్రాకార స్నానఘట్టంలోకి దిగడానికి ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి - మొత్తం రెండు వెడల్పాటి మెట్ల వరుసలున్నాయి. నీరు ప్రవేశించడానికి ఒక మూల మార్గాన్ని ఏర్పాటు చేశారు. స్నానఘట్టపు అడుగులో నీరు కారిపోకుండా ఇటుకలతో, అంచులను మట్టి అడుసుతో కట్టారు. చుట్టూ ఉన్న గోడలనూ అదే విధంగా నిర్మించారు. తూర్పు, ఉత్తర, దక్షిణ అంచుల్లో ఇటుకలతో వసారా నిర్మించారు. వేదిక మీద వస్త్రాలు మార్చుకోవడానికి గదులను ఏర్పాటు చేశారు. 

సాంఘిక పరిస్థితులు: వీరి ప్రధాన ఆహారం బార్లీ, గోధుమ. జంతుమాంసం, పాలు, పాల ఉత్పత్తులు, కూరలు, పండ్లు కూడా వీరి ఆహారంలో భాగమే. చెరకు వీరికి తెలుసు అనే అంశంపై సందేహాలు ఉన్నాయి.  సింధు ప్రజలే ప్రపంచంలో మొదటగా పత్తి పండించిట్లు తెలుస్తోంది. వీరు కాటన్‌ (నూలు), ఊలు దుస్తులు వాడేవారు. వస్త్రధారణ, ఆభరణాల విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. కంఠాభరణాలు, వడ్డాణాలు, గాజులు, ముక్కుపుడకలు, చెవిదుద్దులు, చెవిపోగులు, కడియాలు వారి ఆభరణాల్లో కొన్ని రకాలు. సింధు ప్రజలు అలంకార ప్రియులు. పురుషులు గడ్డాలు, మీసాలు క్రమపద్ధతిలో పెంచేవారు. స్త్రీలు అనేక సౌందర్య సాధనాలు వాడారు. ఈ విషయంలో ప్రస్తుతకాల మహిళలకు సింధు నాగరికత స్త్రీలు ఏ విధంగానూ తక్కువ కారని ఆర్‌.సి.మజుందార్‌ అనే చరిత్రతకారుడు వ్యాఖ్యానించారు. సంగీతం, నృత్యం, వేట, జూదం, చదరంగం నాటి ముఖ్య వినోదాలు. రాతి శిల, రాగి, కంచుతో చేసిన గొడ్డలి, బల్లెం లాంటి ఆయుధాలు వాడారు. సింధు నాగరికత పట్టణాల్లో పురావస్తు శాఖ తవ్వకాల్లో సుమారు రెండు వేలకు పైగా, స్టియాటైట్‌ (Steatite) అనే మెత్తటి రాతితో చేసిన దీర్ఘచతురస్రాకార లేదా చతురస్రాకార ముద్రలు (సీల్స్‌) బయటపడ్డాయి. వీటి పైభాగంలో చిత్ర లిపి ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. 

ఆర్థిక పరిస్థితులు: వీరి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, పశుపోషణ, వ్యాపార వాణిజ్యాలు ఉన్నాయి. బార్లీ, గోధుమ, నువ్వులు, ఆవాలు, ఖర్జూరం, బఠానీ ముఖ్యపంటలు. ఈ కాలం నాటికి వ్యవసాయాభివృద్ధి జరిగి, అధిక ఉత్పత్తి వాణిజ్యానికి దారితీసి అభివృద్ధి జరిగింది. వీరు సమకాలీన మెసపటోమియా నాగరికతతో వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించారు. మెసపటోమియా ఆధారాలు (రికార్డులు) సింధు నాగరికతను ‘మెలూహ’ అని పేర్కొన్నాయి. రెండు నాగరికతల మధ్య ‘దిలమున్‌’, ‘మకాన్‌’ అనే రెండు వాణిజ్య కేంద్రాలు ఉండేవి. వాటినే ప్రస్తుత బెహ్రెయిన్, మక్రాన్‌ తీరంగా భావిస్తున్నారు. ఎద్దుల బండి, పడవలు.. వారి రవాణా, ప్రయాణ సాధనాలు. సమాజంలో  వ్యవసాయదారులు, వడ్రంగి, కుమ్మరి, స్వర్ణకారులు, ఇటుకలు తయారుచేసేవారు తదితర అనేక వృత్తులవారు ఉన్నారు. లోథాల్‌ ముఖ్య ఓడరేవు. సముద్ర వ్యాపారం లోథాల్‌ రేవు ద్వారా జరిగేది. సింధు ప్రజలు నిర్ణీత బరువున్న రాళ్లను (13.64 గ్రాములకు సమానం) తూనికలుగా వాడేవారు. గాడిదలు, గొర్రెలు, ఏనుగులు, ఎద్దులు మొదలైన జంతువులను ఆ కాలం ప్రజలు మచ్చిక చేసుకున్నారు. గుర్రం అవశేషాలు సర్కుతోడ (గుజరాత్‌) అనే ప్రాంతంలో లభించినప్పటికీ, సింధు ప్రజలు గుర్రాన్ని మచ్చిక చేసుకుని ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. సింధు ప్రజలకు లోహ పరిజ్ఞానం ఉంది. తవ్వకాల్లో రాగి, కాంస్యం, వెండి, బంగారంతో చేసిన వస్తువులు లభించాయి. వీరికి ఇనుము తెలియదు.

మత పరిస్థితులు: తవ్వకాల్లో దేవాలయాల లాంటి నిర్మాణాలు లేదా పురోహిత వర్గం ఉన్నట్లు రుజువులు లభించలేదు. అయితే వీరికి మత విశ్వాసాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. తలపై విసనకర్ర లాంటి తలపాగా అలంకారం, నడుముకు వడ్డాణం, శరీరంపై విశేష ఆభరణాలున్న స్త్రీమూర్తి, టెర్రకోట (మట్టి) బొమ్మలు అన్ని ప్రాంతాల్లో విరివిగా లభించాయి. బహుశా ఈమె సింధు ప్రజల దేవత (అమ్మతల్లి) అయి ఉండవచ్చని భావిస్తు న్నారు. సింధు ప్రజలు అమ్మతల్లి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చారు. పశుపతి, వృక్షాలు, నదులతోపాటు సర్పం లాంటి వాటిని ఆరాధించారు.మరణించిన వారిని భూస్థాపితం చేయడం లేదా పార్థివ దేహాన్ని ప్రకృతికి వదిలిపెట్టి తర్వాత అవశేషాలను భూస్థాపితం చేయడం లేదా దహనం చేయడం లాంటి విధానాలు అనుసరించేవారు.

కళ: సింధు ప్రజల కళా కౌశలం వారు తయారుచేసిన ముద్రలు (సీల్స్‌), మట్టి, లోహం, రాతితో చేసిన బొమ్మలు, కుండలపై వేసిన చిత్రకళలో ప్రతిబింబిస్తుంది. ఒక ముద్ర మీద ముక్కాలి పీటపై ఒక వ్యక్తి ధ్యానంలో కూర్చొని ఉంటాడు. అతడి తలపై మూడు కొమ్ములతో ఉన్న తలపాగా ఉంది. చుట్టూ ఏనుగు, పులి, గేదె, ఖడ్గమృగం ఉన్నాయి. పీఠం కింద రెండు జింకలు ఉన్నాయి. ఆ యోగి రెండు చేతులకు గాజులు ఉన్నాయి. ఛాతీ మీద నిండుగా ఒక కవచం ఉంది. జాన్‌ మార్షల్‌ ఈ యోగిని మూల పశుపతినాథుడు అని పిలిచాడు. మొహెంజోదారోలో లభించిన నాలుగున్నర అంగుళాల నాట్యగత్తె కాంస్య విగ్రహం - కుడిచేయి నడుముకు ఆనించింది. ఎడమచేయి నిండా గాజులతో, మెడలో కంఠాభరణంతో, అర్ధ నిమిలిత కళ్లతో ఉండి, ఆనాటి కళా  కౌశలానికి పరాకాష్టగా నిలిచింది. హరప్పాలో ఎరుపు రాతితో చెక్కిన నగ్నంగా ఉన్న పురుషుడి ఛాతి విగ్రహం లభించింది. ఇలాంటివన్నీ ఆనాటి కళాకారుల అద్భుత ప్రతిభకు తార్కాణాలు. ఇన్ని విశిష్ట లక్షణాలతో ఉన్న భారతదేశ తొలి నాగరికత క్రీ.పూ.1500 నాటికి పూర్తిగా అదృశ్యమైంది. దీనికి కారణాలు వివరించడంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ నాగరికత ఒక్కసారిగా అదృశ్యమవడానికి భూకంపాలు, అకస్మాత్తు వరదలు, వాతావరణంలో మార్పులు, ఆర్యుల దండయాత్రలు మొదలైన వాటిని కారణాలుగా భావి స్తున్నారు. సుమారు 1500 సంవత్సరాలు భారతదేశ పశ్చిమోత్తర భాగంలో వర్ధిల్లిన ఈ నాగరికత తర్వాతి తరాలను ప్రభావితం చేసి, అనేక అంశాలను వారసత్వంగా అందించింది. కాల్చిన ఇటుకలతో క్రమబద్ధమైన ఇళ్ల నిర్మాణం, మురికి కాలువ నిర్మాణాలు ఇప్పటికీ కొనసాగుతు న్నాయి. అమ్మతల్లి, పశుపతినాథుడు, ప్రకృతిల ఆరాధన, స్వస్తిక్‌ చిహ్నం నేటికీ నిలిచి ఉన్నాయి. మహోన్నత సింధు నాగరికత క్రీ.పూ.1500 నాటికి అదృశ్యమైంది. ఆ స్థానంలోకి ఆర్యులు ప్రవేశించడంతో మరో సరికొత్త నాగరికత ప్రారంభమైంది.


 


వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 12-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌