• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంత తరంగాలు

నకిలీ నోట్ల నిగ్గు తేల్చే కిరణాలు!

కారు ఆగకపోయినా టోల్‌ కట్‌ అయిపోతుంది. వందల నోట్లలో దాక్కున్న నకిలీ కరెన్సీ ఇట్టే దొరికిపోతుంది. కుళ్లిపోయిన కోడిగుడ్డు కిక్కురుమనకుండా పక్కకొస్తుంది. నిత్యజీవితంలో జరిగే ఇలాంటి ఎన్నో చర్యల వెనుక కొన్ని కిరణాలు పనిచేస్తుంటాయి. అవే విద్యుదయస్కాంత తరంగాలు. ఈ విధంగా పరిసరాల్లో ఎదురయ్యే సంఘటనల్లోని భౌతికశాస్త్ర సూత్రాలను తెలుసుకుంటే జనరల్‌ సైన్స్‌లో మార్కులు సులభంగా సంపాదించుకోవచ్చు. 

విద్యుత్, అయస్కాంత క్షేత్రాలకు లంబంగా ప్రయాణించే తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. ఇవి శూన్యంలో కూడా ప్రయాణిస్తాయి.  

 

ధర్మాలు:

* అన్ని విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్‌ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి.

* అన్ని తరంగాలు శూన్యంలో లేదా గాలిలో ఒకే వేగంతో (కాంతి వేగంతో 3 × 108 మీ./సె.) ప్రయాణిస్తాయి.

*  వివిధ రకాల విద్యుదయస్కాంత తరంగాలు వాటి తరంగదైర్ఘ్యం పెరిగే క్రమంలో కింది విధంగా ఉంటాయి.

 

వర్ణపటం 

పౌనఃపున్యాల సముదాయాన్ని వర్ణపటం అంటారు. పై పట్టికను విద్యుదయస్కాంత తరంగ వర్ణపటం అంటారు. దీన్నే మాక్స్‌వెల్‌ ఇంద్రధనస్సు అని కూడా అంటారు.

తెల్లని కాంతి: విద్యుదయస్కాంత వర్ణపటంలోని ఈ భాగం ప్రకృతిలో ఉండే వస్తువులను చూడటానికి ఉపయోగపడుతుంది. దీన్ని న్యూటన్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. ఈ కాంతిని లైఫై (లైట్‌ - ఫెడిలిటి) టెక్నాలజీలో వాహక తరంగాలుగా ఉపయోగిస్తారు.
 

అతినీలలోహిత వికిరణాలు

వీటిని విల్‌హెల్మ్‌ రిట్టర్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. 

 

అనువర్తనాలు:

* సూర్యుడి నుంచి వచ్చే అల్ప శక్తి ఉన్న అతినీలలోహిత వికిరణాలు మన శరీరంలో విటమిన్‌ - డి ని ఉత్పత్తి చేస్తాయి.

* ఈ కిరణాలను నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

* నీటిలోని బ్యాక్టీరియాను నశింపజేయడానికి వాటర్‌ ప్యూరిఫయర్‌లలో వినియోగిస్తారు.

* నకిలీ బంగారం, వజ్రాలను; ఫోరెన్సిక్‌ సైన్స్‌లో వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

* కుళ్లిన కోడిగుడ్లను తెలుసుకోవడానికి వాడతారు.

నోట్‌: అధిక శక్తి గల అతినీల లోహిత వికిరణాలు భూమికి చేరకుండా ఓజోన్‌ ఆవరణం కాపాడుతుంది.

 

X - కిరణాలు

వీటిని రాంట్‌జన్‌ అనే శాస్త్రవేత్త 1895లో కనుక్కున్నారు. దీనికిగానూ ఈయనకు 1901లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. ప్రపంచంలో భౌతికశాస్త్రంలో మొదటి నోబెల్‌ బహుమతి గ్రహీత రాంట్‌జన్‌.

 

అనువర్తనాలు:

* లోహాలు, విమానాల విడి భాగాల్లోని లోపాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

* క్రికెట్‌లో బంతి, బ్యాట్, వికెట్‌లలో పగుళ్లు; ఘనపదార్థాల్లో స్ఫటిక నిర్మాణాలను తెలుసుకోవడానికి వాడతారు. 

* లగేజ్‌ తనిఖీ యంత్రాల్లో ఈ కిరణాలను ఉపయోగిస్తారు. 

* వైద్యరంగంలో సాధారణ ఎక్స్‌రే, సి.టి. స్కానింగ్‌లలో ఉపయోగిస్తారు.

* ఒక పదార్థంలోని రసాయనిక సమ్మేళనాలను విశ్లేషించడానికి వాడతారు. 

 

గామా కిరణాలు

వీటిని పాల్‌ విల్లార్డ్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. వీటికి అత్యధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంటుంది. ఈ కిరణాల వల్ల వివిధ రకాల క్యాన్సర్‌లకు గురయ్యే ప్రమాదం ఉంది. 

 

అనువర్తనాలు:

* వీటిని ఆహార పదార్థాలపై ఉండే బ్యాక్టీరియాను నశింపజేయడానికి ఉపయోగిస్తారు.

* కొన్ని రకాల సర్జరీలలో వీటిని కత్తులుగా వాడతారు. 

* కృత్రిమ రేడియోధార్మికత వల్ల విడుదలయ్యే గామా కిరణాలను ఉపయోగించి వివిధ రకాల క్యాన్సర్‌లను నయం చేస్తారు.

 

పరారుణ వికిరణాలు

వీటిని విలియం హర్షెల్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. 

 

అనువర్తనాలు:

* ఆటోమాటిక్‌ ఓపెనింగ్, క్లోజింగ్‌ డోర్‌లు, వాటర్‌ టాప్‌లు, సీసీటీవీ కెమెరాల్లో ఉపయోగిస్తారు.

* చీకటి, మంచు ప్రాంతాల్లో ఫొటోలను తీయడానికి ఉపయోగించే నైట్‌ విజన్‌ కెమెరాల్లో వాడతారు. 

* రక్షణ రంగంలో రహస్య తరంగాలుగా, శత్రు క్షిపణులు, విమానాల మార్గాలను తెలుసుకోవడానికి వినియోగిస్తారు.

* వీటిని ఫిజియోథెరపీ పద్ధతిలో, టీవీ రిమోట్‌ కంట్రోలర్, ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్‌లలో ఉపయోగిస్తారు.

 

మైక్రో తరంగాలు (సూక్ష్మ తరంగాలు)

వీటిని హెర్జ్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. 

 

అనువర్తనాలు:

* వీటిని మైక్రోవేవ్‌ ఓవెన్‌లలో ఉపయోగిస్తారు. ఈ ఓవెన్‌లలో మైక్రో తరంగాలను ఉత్పత్తి చేసే  పరికరం మాగ్నట్రాన్‌. 

* మైక్రో తరంగాలను కొన్ని రకాల మొబైల్‌ నెట్‌వర్క్‌లలో ఉపయోగిస్తారు.

 

రేడియో తరంగాలు

వీటిని హెర్జ్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. కానీ మొదటిసారి రేడియో ప్రసారాల కోసం ఈ తరంగాలను ఉపయోగించినవారు మార్కొని.

అనువర్తనాలు:

* వీటిని వివిధ రకాల కమ్యూనికేషన్‌ రంగంలో వాహక తరంగాలుగా ఉపయోగిస్తారు. ఈ వాహక తరంగాల నాణ్యతను పౌనఃపున్యం ఆధారంగా నిర్ధారిస్తారు.

 

రేడియో పౌనఃపున్య వర్ణపటం

రేడియో తరంగాల పౌనఃపున్య వ్యాప్తి 3 kHz -  300 GHz. ఈ వ్యాప్తిని వివిధ రకాల పౌనఃపున్య బ్యాండ్‌లుగా విభజిస్తారు. ఈ పౌనఃపున్య బ్యాండ్‌ల పేర్లు, పౌనఃపున్య వ్యాప్తి,  ఉపయోగాలను కింది పట్టికలో చూడవచ్చు. 

* రేడియో తరంగాలను ఫాస్టాగ్‌లో ఉపయోగిస్తారు. దీనిలో ఉపయోగించే రేడియో తరంగాల పౌనఃపున్య వ్యాప్తి 860 - 960 MHz.

* వీటిని ఎమ్‌ఆర్‌ఐ స్కానర్, బ్లూటూత్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) లాంటి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లలో ఉపయోగిస్తారు.

* వీటిని రాడార్‌ పరికరాల్లో వినియోగిస్తారు. 

 

రచయిత: వడ్డెబోయిన సురేష్‌

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌