• facebook
  • whatsapp
  • telegram

భూమి ఆవిర్భావం


ఆకాశంలో అనంత కుటుంబం!

అలా ఆకాశంలోకి చూస్తుంటే కనిపించేదంతా ఏమిటి? అనంతదూరంలో లక్షల సంఖ్యలో మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు ఎక్కడివి? ఇంకా అవతల ఏముంది? అదంతా ఎలా ఏర్పడింది? అసలు అందరం నివసిస్తున్న ఈ భూమి పుట్టుక ఏవిధంగా జరిగింది? ఇలా మన పరిసరాల్లోనే మన చుట్టూ ఎన్నో ప్రశ్నలు. వీటికి సంబంధించిన సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షార్థులు సంపాదించుకోవాలి. జనరల్‌ స్టడీస్‌ ప్రపంచ భూగోళశాస్త్రంలో భాగంగా తరచూ పరీక్షల్లో  విశ్వం - సౌరకుటుంబంపై ప్రశ్నలు అడుగుతున్నారు.  

 

భౌతిక భూగోళశాస్త్రంలో అత్యంత వివాదాస్పదాంశం భూమి పుట్టుక. దీని గురించి తెలుసుకోవాలంటే సౌరకుటుంబం ఆవిర్భవాన్ని తెలుసుకోవాలి. భూమి విశ్వంలో ఒక భాగం కాబట్టి భూమి పుట్టుకకు, విశ్వం పుట్టుకకు సంబంధం ఉంటుంది. కొన్నివేల మిలియన్‌ల గెలాక్సీలు, నీహరికలు, శూన్య ప్రదేశాల సమూహాన్నే విశ్వం అని చెప్పవచ్చు. విశ్వ ఆవిర్భవాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్‌ పరిభాషలో ‘కాస్మాలజీ’, అమెరికన్‌ పరిభాషలో ‘ఆస్ట్రాలజీ’ అని పిలుస్తారు. దీనికి సంబంధించి అనేక సిద్ధాంతాలు అమల్లో ఉన్నాయి. 

విశ్వం పుట్టుక- సిద్ధాంతాలు 

బిగ్‌బాంగ్‌ సిద్ధాంతం (మహా విస్ఫోటన సిద్ధాంతం): ఇది విశ్వం ఏర్పడటాన్ని వివరించే సిద్ధాంతం. దీన్ని  ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జ్‌ లెమైటర్‌. ఈ సిద్ధాంతం ప్రకారం మొదట్లో విశ్వమంతా సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థంతో నిండి ఒక బంతిలా ఉండేది. దీన్నే ‘ప్రైమోర్డియల్‌ మ్యాటర్‌ లేదా సింగులారిటి’ అని పిలుస్తారు. దాదాపు 13 నుంచి 15 బిలియన్‌ల సంవత్సరాల కిందట ప్రైమోర్డియల్‌ మ్యాటర్‌ విస్ఫోటనం చెందడం వల్ల విశ్వం అనే పదార్థం ఏర్పడింది. ఈ విశ్వ పదార్థం కొన్నివేల మిలియన్‌ల గెలాక్సీలు, నీహరికలు, శూన్య ప్రదేశాలుగా విడిపోయింది.   

డోలన సిద్ధాంతం (పల్సేటింగ్‌ థియరీ): దీన్ని ప్రతిపాదించిన వారు డాక్టర్‌ అలెస్‌ రౌండేజ్‌. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచించి మళ్లీ కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుంది. 

స్టడీస్టేట్‌ సిద్ధాంతం (నిరంతర సృష్టి సిద్ధాంతం): ఈ సిద్ధాంత ప్రతిపాదకర్తలు హెర్మన్‌ బోండీ, థామస్‌ గోల్ట్,  ఫ్రెడ్‌ హోయ్‌లే. వీరు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందినవారు. 

భూకేంద్రక సిద్ధాంతం: క్రీ.శ.140లో టాలెమీ, గ్రయోకో అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించారు. భూమి కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ సూర్యుడు, ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. 

సూర్యకేంద్రక సిద్ధాంతం: క్రీ.శ.1543లో పోలెండ్‌ దేశానికి చెందిన కోపర్నికస్‌ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయి.  

గెలాక్సీలు 

విశ్వంలోని కొన్ని వేల మిలియన్‌ల నక్షత్రాల సమూహాన్నే గెలాక్సీ అంటారు. ప్రతి గెలాక్సీలో 100 బిలియన్‌ల నక్షత్రాల వరకు ఉంటాయి. సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని పాలపుంత లేదా ఆకాశగంగ అని పిలుస్తారు. ఇది సర్పిలాకారంలో ఉంటుంది. ఇప్పటి వరకు గుర్తించిన గెలాక్సీల్లో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. పాలపుంతకు అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. పాలపుంతను (Milkyway Galaxy) వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. 

భారతీయులు పాలపుంత/ఆకాశగంగ, చైనీయులు ఖగోళ నదులు, హిబ్రువులు కాంతి నదులు, గ్రీకులు స్వర్గానికి దారులు, ఎస్కిమోలు తెల్లటి భస్మీ పటలాలు, యాకోట్స్‌ దేవుడి అడుగుల జాడలు అని అంటారు. యాకోట్స్‌ లేదా సాఖా (Sakha) అనేది టర్కీకి చెందిన మానవ జాతి.  

నక్షత్రాలు

ఇవి స్వయం ప్రకాశకాలు. నక్షత్రాలు స్వయం ప్రకాశక శక్తిని కలిగి ఉండటానికి కారణం వాటిలో జరిగే కేంద్రక సంలీన చర్య. 

* అతిపెద్ద నక్షత్రం బెటిల్‌ గ్లక్స్‌.

* అతి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్‌ - A/డాగ్‌స్టార్‌

* భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు.  

* సూర్యుడి తర్వాత భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్జిమా సెంటారియా.

* నక్షత్రాలు, విశ్వంలో అధిక శాతంలో ఉన్న వాయువు హైడ్రోజన్‌ (71%), జడవాయువు హీలియం (26.5%).

నీహరిక 

అతివేగంగా ప్రయాణిస్తూ వేడి వాయువులతో కూడిన మేఘాల లాంటి వాయు మండలాన్ని నీహరిక లేదా నెబ్యులా అంటారు. ఇవి నక్షత్రాలకు జన్మస్థలాలు. వీటిని మొదటిసారి హ్యూజెన్స్‌ అనే డచ్‌ మ్యాథమెటీషియన్, ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుక్కున్నాడు. 

శూన్య ప్రదేశాలు 

గెలాక్సీలకు, నీహరికలకు మధ్య ఉండేవి ఖాళీ ప్రదేశాలు (97% విశ్వమంతా శూన్యమే). 

Posted Date : 27-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌