• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

అంత‌టా ఆవ‌రించి... స‌మ‌స్త జీవుల‌ను సంర‌క్షించి!


సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం, ప్రకృతిని సమతౌల్య స్థితిలో నడిపించే సహజసిద్ధ చర్యల సమాహారం పర్యావరణం. అందరూ ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన పరిసరాలు ఎంతో అవసరం. అందుకే పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ వ్యాప్తంగా కృషి జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల సిలబస్‌లో ఈ విభాగానికి ప్రాధాన్యం ఉంది. దానిపై అభ్యర్థులు స్థూల అవగాహన ఏర్పరచుకోవాలి.

 

పర్యావరణం 

నిర్దిష్ట కాలవ్యవధిలో ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న జీవ, నిర్జీవ ఘటకాల మొత్తాన్ని పర్యావరణం అంటారు. ఆంగ్లంలో ‘ఎన్విరాన్‌మెంట్‌’ అని వ్యవహరిస్తారు. ఎన్విరాన్‌ అనే ఫ్రెంచి పదం నుంచి దీన్ని గ్రహించారు. ఎన్విరాన్‌ అంటే ‘చుట్టూ ఆవరించి ఉన్న’ లేదా ‘చుట్టుకొని ఉండటం’ అని అర్థం.

 

లక్షణాలు:

* పర్యావరణంలో ఆవరణ వ్యవస్థ నిర్మాణం ప్రధానమైంది. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే జీవుల్లో వైవిధ్యం, జీవుల ఆవాసాలు, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నీ ఆవరణ వ్యవస్థ నిర్మాణంగా పేర్కొనవచ్చు.

* ఆవరణ వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటం పర్యావరణ వ్యవస్థ ముఖ్య లక్షణం.

* పర్యావరణం ఒక గతిశీల వ్యవస్థ. ప్రాంతం, కాలాన్ని బట్టి అనేక మార్పులకు లోనవుతుంది. 

* జీవుల మధ్య విధిపూర్వక సంబంధాలు; జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలపై పర్యావరణ మనుగడ ఆధారపడి ఉంటుంది.

* పర్యావరణ నిర్వహణ విధానం దానిలోని శక్తి ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది.

* పర్యావరణం దానికి కావాల్సిన పదార్థాలను ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఆ పదార్థాలు ప్రాంతం, శీతోష్ణస్థితి ఆధారంగా మారుతూ ఉంటాయి.

 

విధులు:

* మానవుడి మనుగడకు, ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను అందిస్తుంది.

* ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, కాలుష్యాలను విలీనం చేసుకుంటుంది.

* జీవావరణ సమతౌల్యాన్ని కాపాడటానికి అవసరమైన ప్రాణాధార చర్యలు, సేవలను అందిస్తుంది.

* మానవుడి ప్రభావం లేనంత వరకు జీవవైవిధ్య సమతౌల్యాన్ని కాపాడుతుంది.

* జీవి మనుగడకు అనుగుణమైన ప్రకృతి సేవలను అందిస్తుంది.

జీవ, నిర్జీవ వనరుల మధ్య జీవ, భూరసాయన అంతఃచర్యల వల్ల జీవ జాతులకు కావాల్సిన ఆహారం, ఆవాసం, నీరు లాంటి ప్రాథమిక అవసరాలు అందుతున్నాయి. అందువల్ల పర్యావరణాన్ని సాధారణంగా రెండు అనుఘటకాలుగా విభజించవచ్చు.

జీవ అనుఘటకాలు: ప్రాణం ఉండి తమ జీవనచర్యల ద్వారా ప్రతి జీవి ప్రాథమిక అవసరాలు తీర్చేవి.

ఉదా: వృక్షాలు, మొక్కలు, గడ్డి (ప్రాథమిక ఉత్పత్తిదారులు), జంతువులు (వినియోగదారులు), సూక్ష్మజీవులు (విచ్ఛిన్నకారులు)

నిర్జీవ అనుఘటకాలు: ఇవి ప్రాణం లేనివి అయినా తమ చర్యల ద్వారా జీవుల మనుగడకు సహకరిస్తుంటాయి. 

ఉదా: భౌతికపరమైనవి - నేల, నీరు; శీతోష్ణపరమైనవి - కాంతి, ఉష్ణం, గాలి, వర్షపాతం; రసాయనపరమైనవి - సేంద్రియపరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు, నిరేంద్రియపరమైన కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం.

 

రెండు రకాలు

మానవుడి ప్రమేయం ఆధారంగా పర్యావరణాన్ని రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

మానవ నిర్మిత పర్యావరణం: మనిషి మనుగడ సాగించడానికి సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థ లాంటి సాంఘిక పర్యావరణాన్ని ఏర్పరచుకుంటాడు. అలాగే పండుగలు, కట్టుబాట్లు లాంటి సాంస్కృతిక పర్యావరణాన్ని; వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన ఆర్థిక పర్యావరణాన్ని; ఎన్నికల్లో పాల్గొనడం, చట్టాలు చేయడం లాంటి రాజకీయ పర్యావరణాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. దీన్నంతా కృత్రిమ పర్యావరణంగా పేర్కొనవచ్చు.

సహజసిద్ధ పర్యావరణం: దీన్ని ప్రకృతిసిద్ధ పర్యావరణం అని కూడా అంటారు. ఇది మానవుడి ప్రభావం లేకుండా భూమిపై సహజసిద్ధమైన అంశాలతో ఏర్పడిన పర్యావరణం. దీన్ని నాలుగు రకాలుగా విభజించారు. 

1) శిలావరణం (లిథో స్ఫియర్‌): భూఉపరితలం నుంచి సుమారుగా 60 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఘనస్థితిలోని భూమికి చెందిన మొదటి లేదా బాహ్యపొరనే శిలావరణం అంటారు. ఇది వివిధ భౌమ కాలాల్లో అంతర్గత, బహిర్గత బలాలకు లోనుకావడంతో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు లాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. శిలావరణం భూమిపై సమస్త జీవరాశులకు ఆవాసాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మృత్తికలు, నీరు, అటవీ వనరులు, శక్తి వనరులు, ఖనిజ వనరులను అందించి మానవుడి సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి; జీవన మనుగడకు ఆధారంగా ఉంది.

2) జలావరణం: భూమి ఉపరితలంపై 71% నీరు ఆవరించి ఉంది. నీరు ఆవిరై మేఘాలుగా మారి తిరిగి భూమి మీదకు వర్షించే జలచక్రీయ ప్రక్రియ వల్లే సమస్త జీవులు మనుగడ సాగిస్తున్నాయి. 

*************

భూమిపై జలాల పంపిణీ

మహాసముద్రాలు, ఉప్పునీటి సరస్సులు - 97.20%

మంచు కప్పిన ప్రాంతాలు, గ్రేసియర్స్‌ - 2.15% 

భూగర్భజలాలు - 0.64% 

సరస్సులు, నదులు, సెలయేళ్లు - 0.0085%

వాతావరణం - 0.00015%

*************

3) వాతావరణం: భూమిపై జీవజాతి ఆవిర్భావం, జీవుల మనుగడకు కావాల్సిన అనువైన శీతోష్ణస్థితి ఏర్పరచడంలో వాతావరణం కీలకపాత్ర పోషిస్తుంది. భూమి ఉపరితలం నుంచి దాదాపు 1600 కి.మీ. వరకు భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిపొరనే వాతావరణం అంటారు. దీన్ని ట్రోపో ఆవరణం,  స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం అని అయిదు రకాలుగా విభజించారు. భూమిని ఆవరించి ఉన్న మొదటి వాతావరణ పొర ట్రోపో ఆవరణం భూమి మీద పర్యావరణానికి అత్యంత ముఖ్యమైంది. దీనిలో వాయు పదార్థాలు, మేఘాలు ఏర్పడటం, వర్షాలు కురవడం, గాలులు వీయడం, ఉష్ణోగ్రత నియమాలు అన్నీ కలసి పర్యావరణానికి సహకరిస్తాయి. అందువల్ల దీన్ని మిశ్రమ ఆవరణం అని కూడా పిలుస్తారు. ట్రోపో ఆవరణంలో నైట్రోజన్‌ వాయువు 78.08%, ఆక్సిజన్‌ 20.95% ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఆర్గాన్, కార్బన్‌ డై ఆక్సైడ్, నియాన్‌ లాంటి వాయువులు విస్తరించి ఉన్నాయి.

4) జీవావరణం: భూమి మీద ఆవరించి ఉన్న సమస్త జీవరాశిని జీవావరణంగా పిలుస్తారు. ఇది శిలావరణం, జలావరణం, వాతావరణం కలుసుకునే సంధి ప్రాంతంలో జరిగే మార్పిడి వల్ల జీవజాతుల ఆవిర్భవానికి, వాటి మనుడగకు కావాల్సిన అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా ఒక ఆవరణ వ్యవస్థ నుంచి మరొక ఆవరణ వ్యవస్థకు, ఒక ఆవరణంలోనే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జరిగే శక్తి బదిలీ ద్వారా పర్యావరణం తన ప్రక్రియలను నిర్ణయించుకుంటుంది.

రచయిత: జల్లు సద్గుణరావు

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు