• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

పరిసరాలతో జీవుల బంధం!


పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ఇల్లు, పెరిగే మొక్కలు, తిరిగే జంతువులు తదితరాలతో కలిపి చుట్టూ ఉన్న పరిసరాల వ్యవస్థే పర్యావరణం. సమస్త జీవుల మనుగడకు మూలాధారం. ఇందులో సహజ అనుఘటకాలతోపాటు మానవ నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ నిర్మాణాత్మక జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి సాయపడతాయి. ఈ జీవనిర్జీవ కారకాల సముదాయ లక్షణాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు పర్యావరణంలోని రకాలు, వాతావరణ పొరల వివరాలపై అవగాహన పెంచుకోవాలి. 

 

మన చుట్టూ ఉన్న పరిసరాలను పర్యావరణం అంటారు. అందులో సజీవులు, నిర్జీవులు అనుఘటకాలుగా ఉంటాయి. పర్యావరణం అనే పదం ‘ఎన్విరాన్‌’ అనే ఫ్రెంచ్‌ పదం నుంచి పుట్టింది. ఫ్రెంచ్‌ భాషలో ‘ఎన్విరాన్‌’ అంటే ‘చుట్టూ ఆవరించి ఉన్న’ అని అర్థం. జీవుల సమూహం చుట్టూ పరివేష్ఠితమైన పరిస్థితులనే పర్యావరణం అంటారు. ఒక జీవిపై లేదా సమాజంపై ప్రభావాన్ని చూపే సంక్లిష్టమైన సామాజిక లేదా సాంస్కృతిక పరిస్థితులను పర్యావరణంగా పేర్కొనవచ్చు.


జీవరాశులు తమ నిర్మాణాత్మకమైన జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి ఉపయోగించే మృత్తిక, నీరు, గాలి, కాంతి, ఉష్ణం లాంటి వాటిని స్థూలంగా పర్యావరణం అంటారు. గాలి, నీరు, భూమిలో ఉండే రసాయనాలు; జీవరాశులు, ఇతర నిర్జీవ పదార్థాలకు సంబంధించి వాటి మూలం, చర్య, విస్తరణ, ఉనికి, మానవుడి వల్ల వాటిపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పరిసరాల విజ్ఞానం’ అంటారు.


ముఖ్య లక్షణాలు:

* ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట కాల వ్యవధిలో ఉండే జీవ, నిర్జీవ కారకాల మొత్తం పర్యావరణం.

 ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే జీవవైవిధ్యత, జీవుల ఆవాసాలు, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నీంటిని కలిపి ఆవరణ వ్యవస్థ నిర్మాణంగా పేర్కొనవచ్చు. 

ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని అనుసరించి పర్యావరణం అనేక మార్పులకు లోనవుతుంది. అంటే పర్యావరణం అనేది ఒక గతిశీలమైన వ్యవస్థ. 

జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలు; జీవుల మధ్య ఉండే విధి పూర్వక సంబంధాలపై పర్యావరణ మనుగడ ఆధారపడి ఉంటుంది. పర్యావరణ నిర్వహణ విధానం అనేది అందులోని శక్తి ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది. 

 పర్యావరణం తనకు కావాల్సిన సేంద్రియ పదార్థాలను తనే ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఈ ఉత్పాదన అనేది ప్రాంతం, శీతోష్ణస్థితిని బట్టి మారుతూ ఉంటుంది.

ఆవరణ వ్యవస్థల సమతౌల్యాన్ని కాపాడటం అనేది పర్యావరణ వ్యవస్థ ముఖ్య లక్షణం.


విధులు: 

 ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను అందిస్తుంది.

 ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తనలో విలీనం చేసుకుంటుంది. 

జీవావరణ సమతౌల్యాన్ని కాపాడటానికి అవసరమైన ప్రాణాధార సేవలను అందిస్తుంది.


పర్యావరణ అనుఘటకాలు: పర్యావరణంలో రెండు రకాల అనుఘటకాలు ఉంటాయి.

1) జీవ అనుఘటకాలు: వృక్షాలు (ఉత్పత్తిదారులు), జంతువులు, సూక్ష్మజీవులు లాంటివి.


2) నిర్జీవ అనుఘటకాలు: ఇందులో మళ్లీ మూడు రకాలు ఉన్నాయి.


ఎ) శీతోష్ణస్థితి పరమైనవి: కాంతి, ఉష్ణం, వర్షపాతం లాంటివి.


బి) భౌతిక పరమైనవి: గాలి, నేల, నీరు.


సి) రసాయనిక పరమైనవి: సేంద్రియ పరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు, నిరేంద్రియ పరమైన సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌. ఈ జీవ, నిర్జీవ వనరుల మధ్య జీవ-భూ-రసాయనాల ద్వారా జరిగే అంతఃచర్యల వల్ల ఆయా జాతి జీవులకు కావాల్సిన ఆహారం, ఆవాసం, నీరు లాంటి ప్రాథమిక అవసరాలు అందుతాయి. పర్యావరణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.              


1) కృత్రిమ లేదా మానవ నిర్మిత పర్యావరణం:  మానవుడు తన మనుగడ కోసం, తనకు కావాల్సిన అవసరాలను పొందడం కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్న సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయపరమైన వ్యవస్థలతో కూడిన పరిసరాలే కృత్రిమ పర్యావరణం. దీనిని నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు.


ఎ) సాంఘిక పర్యావరణం: సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థలు.


బి) సాంస్కృతిక పర్యావరణం: మానవ సమాజాల సంప్రదాయాలు; కట్టుబాట్లు, పండగలు, వినోదాత్మక నిర్మాణాలు.


సి) ఆర్థికపర వ్యవస్థలు: వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార సముదాయాలు.


డి) రాజకీయపర వ్యవస్థలు: అసెంబ్లీ, సచివాలయం..,


2) సహజసిద్ధ పర్యావరణం: ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా భూమిపై ఉండే అనుకూల శీతోష్ణస్థితి ప్రభావాల కారణంగా ఏర్పడిందే సహజసిద్ధ పర్యావరణం.దీనిని నాలుగు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. 


1) శిలావరణం: భూఉపరితలం నుంచి సగటున    40 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉండే ఘనస్థితిలోని భూమి బాహ్య పొర. 

* భూఉపరితల స్వరూపం వివిధ భౌమ కాలాల్లో బహిర్జనిత, అంతర్జనిత బలాలకు లోనవుతుంది. దాంతో శైథిల్య, క్రమక్షయ, నిక్షేపణ చర్యలకు గురై పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, నదీలోయలు లాంటి భూస్వరూపాలు భౌమ పరిణామ క్రమంలో ఆవిర్భవిస్తాయి. పలు జీవ జాతుల మనుగడకు కావాల్సిన భౌతిక పర్యావరణం ఏర్పడుతుంది.నేలల ఆవిర్భావానికి, వృక్షజాతుల పెరుగుదలకు కావాల్సిన వివిధ రకాల పోషకాలను అందిస్తూ, సమస్త జీవజాతులకు కావాల్సిన ఆహార వనరులను, ఆవాసాలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మానవ సాంఘిక, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన పలు రకాల వనరులను సమకూరుస్తూ జీవజాతి మనుగడకు ఆధారంగా ఉంది.


2) జలావరణం: భూఉపరితలంపై 71 శాతం అంటే 2/3వ వంతు జలం ఆవరించింది. ఇందులో సముద్రాల్లోని ఉప్పు నీటి శాతం 97.3 శాతం, మంచినీటి శాతం 2.7 శాతం.  జీవులకు ఆధారమైన నీటిని సమకూర్చడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. భూగోళ ఉష్ణోగ్రతలను క్రమపరుస్తుంది. అనేక రకాల వనరులకు నిలయంగా ఉంది. ప్రధానంగా ‘కార్బన్‌  శోషకం’గా వ్యవహరిస్తుంది. 


3) వాతావరణం: భూ ఉపరితలం నుంచి దాదాపు  600 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న భూమి బాహ్యపొరను వాతావరణం అంటారు. భూమిపై జీవజాతి ఆవిర్భావం, మనుగడకు కావాల్సిన, అనువైన శీతోష్ణస్థితిని ఏర్పరచడంలో వాతావరణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్వాస-నిశ్వాసాలకు ప్రాణధారమైంది వాతావరణం. ఈ ఆవరణంలోని అనుఘటకాల శాతాల్లో మార్పులు సంభవిస్తే జీవుల మనుగడకు ప్రమాదకరమవుతుంది. సూర్యుడి నుంచి వెలువడే అధిక శక్తిమంతమైన వికిరణ కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్‌ వాయువులతో విభేదించే స్థాయి ఫలితంగా రసాయన చర్యలు జరిగి మిరుమిట్ల్లుగొలిపే కాంతి వెలువడుతుంది. ఈ కాంతినే ‘ఆరోరా’ అంటారు. వాతావరణం అనేది భూ ఉపరితలంపై దుప్పటి లాంటిది. అందులో వివిధ వాయువులు, తేమ, దుమ్ము, ధూళి, రేణువులు ఉంటాయి.


వాతావరణంలో ఉండే ముఖ్య వాయువులు:

1) నైట్రోజన్‌ 

2) ఆక్సిజన్‌ 

3) కార్బన్‌ డై ఆక్సైడ్‌.

గాలిలో వాయువుల శాతాలు: 

* నైట్రోజన్‌ 78.08 శాతం 

* ఆక్సిజన్‌ 20.94 శాతం

* ఆర్గాన్‌ 0.93 శాతం

* కార్బన్‌ డై ఆక్సైడ్‌ 0.03 శాతం

* నియాన్‌  0.0018 శాతం. భూ ఉపరితలంపై వాతావరణాన్ని నాలుగు పొరలుగా విభజించారు.


ఎ) ట్రోపో ఆవరణం:

 * ఇది భూమి ఉపరితలంపై ఉన్న వాతావరణ పొర. 

* ధ్రువాల వద్ద 8 కి.మీ. వరకు, భూమధ్యరేఖ వద్ద 18 కి.మీ. వరకూ విస్తరించి ఉంటుంది. 

* జీవులకు సంబంధించి ఈ పొర అత్యంత అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలోని వాయువులు ఈ పొరలోనే ఉంటాయి.

 * ఈ పొర 3/4వ వంతు వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. 

* మేఘాలు, వర్షపాతం, ఉరుములు, మెరుపులు ఇందులోనే ఏర్పడతాయి. 


* ఈ పొరలో పైకి వెళ్లే కొద్దీ ప్రతి కిలోమీటరుకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. 


* ఈ పొరలో (-)50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి (-)60 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుంది.


బి) స్ట్రాటో ఆవరణం: 

* ఇది భూవాతావరణంలో రెండో పొర. ధ్రువాల వద్ద 39 కి.మీ.వరకు, భూమధ్యరేఖ వద్ద 50 కి.మీ.వరకు విస్తరించి ఉంటుంది.

* ఇందులో అతిముఖ్యమైన ఓజోన్‌ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమి పైకి చేరకుండా అడ్డుకుంటుంది.

 జెట్ విమానాలు, ఎయిర్‌క్రాప్ట్‌లు ఈ పొరలోనే ప్రయాణిస్తాయి.


సి) మీసోస్ఫియర్‌: ఇది భూ ఉపరితలానికి 85 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


డి) థర్మో ఆవరణం: 

* ఈ ఆవరణం భూ ఉపరితలానికి 80 కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది. 

* ఇందులో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పొరలో సరాసరి ఉష్ణోగ్రత దాదాపు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉంటుంది. 

* ఈ ఆవరణంలో రేడియో తరంగాలు పరావర్తనం చెంది భూమి మీదకు ప్రయాణిస్తాయి. ఈ పొర ఉపగ్రహాలకు అనుకూలంగా ఉంటుంది.


ఎక్సో ఆవరణం:

* ఈ ఆవరణంలో హైడ్రోజన్, హీలియం వాయువులు ఉంటాయి.

ఇది భూఉపరితలానికి 800 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


4) జీవావరణం: భౌతిక పరిసరాల్లో నివసించే సమస్త జీవజాతినే జీవావరణం అంటారు. ఇది భూ ఉపరితలం మీద, భూ ఉపరితలం నుంచి దాదాపు 200 మీటర్ల లోతు వరకు, భూ ఉపరితల వాతావరణంలో దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో మానవుడు తన పరిసరాలతో అత్యధిక సంబంధాలను కలిగి, వనరులను ఉపయోగించుకుని, తద్వారా తన అవసరాలను తీర్చుకుంటాడు. జీవావరణానికి మిగిలిన భౌతిక ఆవరణాలైన జల, వాయు, శిల ఆవరణాలకు మధ్య పదార్థాలు భ్రమణం చెందుతూ ఉంటాయి. భౌతిక ఆవరణాల్లో ఉండే అనుఘటకాల శాతం ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మానవీయ చర్యల ద్వారా లేదా ప్రకృతి కారణాల వల్ల, ఆ వలయాల్లో చేరితే అవి కాలుష్యాన్ని కలగజేస్తాయి. అందువల్ల ప్రతి భౌతిక ఆవరణాన్ని కాపాడుకుంటే జీవావరణ మనుగడ ఉంటుంది. లేకపోతే అన్ని ఆవరణాలు నాశనమై మనిషి జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. 


​​​​​​​

రచయిత: ఇ.వేణుగోపాల్‌ 

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌