• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ అంశాలు

  మానవుడు ఎదుర్కొంటున్న ప్రకృతి సిద్ధమైన విపత్తుల్లో భూకంపాలు అత్యంత విధ్వంసకరమైనవి. రోజురోజుకూ సాధిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని ఎదుర్కోవడానికి మనిషి ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇవి సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. భౌతిక, ఆర్థిక, సాంఘిక, పర్యావరణ అంశాల్లో ఎప్పటికప్పుడు మానవులను వెనక్కు నెట్టేస్తున్నాయి. ఇంతటి విపత్తు కారకాలైన భూకంపాలు ఎలా వస్తాయి? ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో ఇవి సంభవించడానికి దారితీసే పరిస్థితులున్న ప్రాంతాలు ఏవి? హైదరాబాద్ నగరం పరిస్థితి ఏమిటి? భూకంపాలకు సంబంధించిన విపత్తు నిర్వహణ ఎలా ఉండాలి? టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగం - 'విపత్తు నిర్వహణ'లో భూకంపాలు కీలకాంశాల్లో ఒకటి. వీటిపై అభ్యర్థులు సమగ్ర అవగాహన సాధించాలి.

  సరైన సాంకేతిక పరిజ్ఞానం కొరవడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలు (సూపర్ కంట్రీలు)గా నిలవాలని ప్రయత్నిస్తున్న చైనా, జపాన్ లాంటి వాటికి కూడా భూకంపాలు పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి. ఒక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిగా చిన్న ప్రకంపనలు, భూకంపాలు సంభవిస్తుండగా.. ఒక మాదిరి నష్టం కల్పించే భూకంపాలు రెండెంకెల్లోను, తీవ్రమైన నష్టాలు మిగిల్చే భూకంపాలు ఒక అంకెలోనే ఏర్పడుతున్నాయి. ఇవి మానవుల అభివృద్ధిని కొన్ని దశబ్దాల వెనక్కు నెట్టేస్తున్నాయి. ఇవి వాటిల్లేటప్పుడు ఏమాత్రం ముందుస్తు హెచ్చరికలు జారీచేసే సమయం కూడా ఉండదు.

 

ఎలా సంభవిస్తాయి?

  భూమి ఉపరితలం ఆకస్మికంగా కదలడాన్నే భూకంపం అంటారు. ఖండ పలకల కదలికలు లేదా భూపటల కదలికలు లేదా విరూప కారక చలనాల (టెక్టోనిక్ చలనాలు) వల్ల ప్రధానంగా భూకంపాలు సంభవిస్తాయి. అయితే కొండ చరియలు విరిగి పడటం (భూపాతం), హిమశిఖరాలు విరిగి పడటం (హిమపాతం).. అగ్నిపర్వతాల విస్ఫోటం సందర్భాల్లో; భూమిలోపల యురేనియం, థోరియం లాంటివి విస్ఫోటనం చెందినప్పుడు.. భూపొరల మధ్య సర్దుబాటు జరిగినప్పుడు.. ఇలాంటి మరికొన్ని కారణాల వల్ల కూడా భూమి కంపిస్తుంది.
భూపటల పలకలు అంచుల వద్ద జారడం వల్ల, ఎదురుగా అభిసరణం (కన్వర్జెన్స్) చెందే ప్రాంతాల్లో భూమి పొరల లోపల సంచిత శక్తి విడుదలవుతుంది. ఇలాంటి ప్రాంతాలను భ్రంశ మండలాలు (ఫాల్ట్ జోన్స్) అంటారు. ఈ ప్రాంతాల్లో స్థితి స్థాపక శక్తి, నిరోధక స్థితి స్థాపకతగా మారి ప్రకంపనాలు విడుదలవుతాయి. అవి భూఉపరితలానికి శి, ళీ, లి అనే మూడు రకాల తరంగాలుగా చేరి భూమిని కంపింపజేస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఒక్క నిమిషంలో పూర్తవుతుంది.

 

ఎలా గుర్తిస్తారు?

  భూకంపాలను, భూకంపన పరిమాణాన్ని గుర్తించడానికి సిస్మోగ్రాఫ్ (భూకంప లేఖిని) అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. భూకంపాల తీవ్రత / బలం / శక్తిని కొలిచే స్కేలే రిక్టర్ స్కేలు. ఈ మాట బాగా వాడుకలో ఉంది. భూకంపం వల్ల నష్టం జరిగే ప్రాంతాన్ని అధికేంద్రం (న్ప్ఞ్ఠ్థ్మ్ఠ్ిౖ) అంటారు. ఇది నాభికి నేరుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు. భూమి లోపలి పొరల మధ్య ప్రకంపనాలు ఏర్పడే అంతర్భాగ కేంద్ర బిందువును నాభి (హైపో సెంటర్) అంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న దూరం మీద భూకంప బలం ఆధారపడి ఉంటుంది. నాభిలోతు పెరుగుతుంటే భూకంపం బలం తగ్గుతుంది. నాభిలోతు తగ్గుతుంటే భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 1943లో ఇండోనేషియాలో జరిగిన భూకంప నాభి లోతు 720 కిలోమీటర్లుగా నమోదైంది.

 

భూకంపాలు - రకాలు

1. గాధ భూకంపాలు: భూకంప నాభిలోతు 60 కిలో మీటర్ల కన్నా తక్కువ ప్రాంతంలో ఏర్పడే భూకంపాలు. అధిక శాతం భూకంపాలు ఇవే.

2. మాధ్యమిక భూకంపాలు: నాభిలోతు 60 నుంచి 300 కి.మీ.ల మధ్య ఏర్పడే భూకంపాలు.

3. అగాధ భూకంపాలు: నాభిలోతు 300 నుంచి 700 కి.మీ.లు, ఆపైన జరిగే భూకంపాలు.

 

ఎలా కొలుస్తారు?

  భూకంపాల తీవ్రతను కొలవడానికి పురాతన, నవీన అనే రకాల స్కేళ్లు ఉన్నప్పటికీ మెర్కిలీ స్కేలు, రిక్టర్ స్కేలు ముఖ్యమైనవి. రిక్టర్ స్కేలులో 0-9 వరకూ పాయింట్లు ఉంటాయి. ఇది భూకంప నష్టాన్ని, బలాన్ని రెండింటినీ కొలవగలదు. అందువల్ల దీన్ని మాగ్నిట్యూడ్ స్కేలు అంటారు. ఎంఎస్‌కే స్కేలు (మెద్వదేవ్ స్పాన్ హువర్ - కార్నిక్ స్కేలు), మెర్కిలీ స్కేలు రెండూ ఒకే రకమైనవి. ఇందులో | - శ్రీ|| భాగాలుగా విడగొట్టి ఉంటాయి.
ఎక్కువ దేశాలు రిక్టర్ స్కేలును వాడుతున్నాయి. ఈ స్కేలు ప్రకారం 5.9 లేదా 6 పాయింట్లు దాటితే స్థలాన్ని బట్టి కొంత నష్టం ప్రారంభమవుతుంది. ట్రై నైట్రో టోలిన్ అనే రసాయన పదార్థ విస్ఫోటంతో సంతులనం చేస్తూ ఈ స్కేలును తయారు చేశారు.

 

రెండు భూకంప ప్రాంతాలు

ప్రపంచంలో రెండు భూకంప ప్రాంతాలను నిర్ణయించారు.
1. ఫసిఫిక్ పరివేష్ఠిత మేఖల: ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతం. ఇందులో దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పెరూ, ఈక్విడార్, చిలీ, కొలంబియా, వెనుజులా వంటి దేశాలున్నాయి. ఉత్తర అమెరికా పశ్చిమతీరంలోని మెక్సికో, కాలిఫోర్నియా, అలస్కా లాంటి అమెరికా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఆసియా ఖండం తూర్పుతీరంలోని చైనా, జపాన్, రష్యా, ఫిలిప్పైన్స్, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్ దేశాల్లో భూకంపాలు తరుచుగా సంభవిస్తున్నాయి.

2. మధ్యపర్వత మేఖల: ఈ భ్రంశ మండలం యూరప్ ఖండంలోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి, హిమాలయాల వరకూ విస్తరించి ఉంది. ఇందులో భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలున్నాయి. ఈ విధంగా భూకంపాలన్నీ భ్రంశ మండలాలు, ముడుత పర్వతాలున్న ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి.

 

భారతదేశంలో భూకంపాలు

  ప్రపంచంలో అత్యంత నవీన ముడుత పర్వతాలు హిమాలయాలు. నేపాల్‌లో 2015 ఏప్రిల్ 25, ఆ తరువాత సంభవించిన భూకంపాలకు కారణం ఇవే. భారతదేశాన్ని 5 భూకంప జోన్లు(మండలాలు)గా నిర్ణయించారు. అయితే 1997లో వల్నరబులిటీ అట్లాస్ (దుర్బలత్వ అట్లాస్) ప్రకారం ఒకటో జోన్‌ను రెండో జోన్‌లో కలిపేశారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందించిన మ్యాప్ ప్రకారం కింది జోన్‌లు మన దేశంలో ఉన్నాయి.
5వ జోన్: రిక్టర్ స్కేలు తీవ్రత 7 పాయింట్లు దాటిన భూకంప ప్రాంతం. ఇది అత్యంత అపాయకరమైన జోన్. ఇందులో ఉత్తర బిహార్, ఉత్తరాఖండ్ ఉత్తర భాగం, అన్ని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో కొంతప్రాంతం, గుజరాత్‌లోని కచ్, బుజ్ ప్రాంతాలు ఉన్నాయి.
4వ జోన్: రిక్టర్ స్కేలు 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత నమోదైన ప్రాంతం. ఇది అధిక అపాయం ఉన్న ప్రాంతం. ఇందులో దిల్లీ, సిక్కింతో పాటు బిహార్, ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతం ఉంది.
3వ జోన్: రిక్టర్ స్కేలు తీవ్రత 4 నుంచి 6 పాయింట్లున్న ప్రాంతాలు. ఇవి ఒక మాదిరి అపాయం ఉన్న భూకంప ప్రాంతాలు. ఇందులో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌తోపాటు మధ్య, దక్షిణ భారతదేశం ఉంది. కోల్‌కతా, చెన్నై, ముంబయి నగరాలు కూడా ఉన్నాయి.
2వ జోన్(1, 2 జోన్లు కలిపి): ఈ ప్రాంతాలు అత్యల్ప అపాయం ఉన్నవి లేదా అపాయం లేనివి. ఇందులో రిక్టర్ స్కేలు తీవ్రత 4 పాయింట్ల కంటే తక్కువగా ఉంటుంది. ఈ జోన్ పరిధిలో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఉన్నాయి.

 

ఉపశమన చర్యలు

సాంకేతిక రంగం అత్యంత అభివృద్ధి సాధించినా భూకంపాలను రాకుండా ఆపలేం. కొన్ని ఉపశమన చర్యలు మాత్రం చేపట్టవచ్చు.
నిర్మాణాత్మక చర్యలు: సరైన ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ పద్ధతులను పాటించడం ద్వారా భవన నిర్మాణాలు చేపడితే కొంత నష్టాన్ని నివారించే వీలుంది.
నిర్మాణేతర చర్యలు: భూకంప దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చిన భవన నిర్మాణ నిబంధనలను అనుసరించడం. భవన నిర్మాణానికి ముందు నిర్మాణ ప్లాన్‌ను పురపాలక యంత్రాంగాలు క్షుణ్నంగా తనిఖీ చేయడం.
జాతీయ భవన నిర్మాణ కోడ్: సమగ్రమైన కోడ్‌ను 1970లో రూపొందించారు. దీన్ని 1987లో రెండుసార్లు, 1997లో ఒకసారి సవరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నియమాలను రూపొందించారు.
బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్: ఇది భవనాల పునర్నిర్మాణానికి, ప్రాణాలు కాపాడే విధంగా నిర్మాణాలు చేపట్టడానికి సరైన సాంకేతిక పద్ధతులు, సరైన మెటీరియల్ వాడటానికి భాధ్యత వహిస్తుంది.

 

ఇతర నియమాలు:

* గట్టినేలపై ఇల్లు కట్టు కోవాలి.
* మూల మట్టాలన్నింటి వద్ద కనెక్షన్ దృఢంగా ఉండాలి.
* పటిష్ఠమైన పునాది నిర్మించుకోవాలి.
* పైకప్పు దృఢంగా వేయాలి.
* పైకప్పు ఒకే సమీకృత యూనిట్‌గా వేయాలి.
* భవనం సాధారణంగా దీర్ఘ చతురస్రాకార ప్రణాళికతో ఉండాలి.

 

ముఖ్యాంశాలు

* భారతదేశంలో భూకంపాల పర్యవేక్షణకు భారత వాతావరణ విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది.
* భారత వాతావరణ విభాగం నేషనల్ సిస్మలాజికల్ నెట్‌వర్క్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 55 అధ్యయన కేంద్రాలున్నాయి.
* మనదేశంలోని మెట్రో నగరాల్లో ఒక్క దిల్లీ మాత్రమే భూకంపాల పరిధిలో ఉంది.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద భూకంపం 1969 ఏప్రిల్ 13న కిచ్చెన్నపల్లి
- గొల్లగూడెం ప్రాంతంలో సంభవించింది. దీన్నే భద్రాచలం భూకంపం అంటారు.
* హైదరాబాద్ నగరం భూకంపాల తీవ్రతలో రెండో జోన్ పరిధిలో ఉంది.
* భారతదేశంలో ఇంతవరకూ పెద్ద భూకంపం 1897లో షిల్లాంగ్ పీఠభూమిలో సంభవించింది. ఇది రిక్టర్‌స్కేలుపై 8.7గా నమోదయింది.
* ప్రపంచంలో ఇంతవరకూ పెద్ద భూకంపం చిలీ భూకంపం. 1960 మే 20న సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 9.25గాను, మెర్కిలీ స్కేలుపై 9.5గాను నమోదైంది.
* ప్రపంచంలో ఇంతవరకు సంభవించిన భూకంపాల్లో రెండో అతిపెద్దది అలస్కా భూకంపం. 1965లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1 గాను, మెర్కిలీ స్కేలుపై 9.2 గాను నమోదైంది.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌