• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ కాలుష్యం

కలుషిత పరిసరాల్లో జీవావరణ వధ!

వాతావరణంలో ఆకస్మిక మార్పులతో వ్యవసాయంలో వ్యతిరేక ఫలితాలు. ఆస్తమా, ఎలర్జీ అందరికీ వచ్చే ఆరోగ్య సమస్యలు. ఒత్తిడి, నిద్ర పట్టకపోవడం తదితరాలు తరచూ ఎదురయ్యే ఇబ్బందులు. ఇవన్నీ పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే పరిణామాలు. ప్రకృతి సహజ స్వభావానికి అంతరాయం ఏర్పడి, జీవులకు ప్రతికూలంగా పరిసరాలు ప్రభావం చూపడమే పర్యావరణ కాలుష్యం. మనిషి సాధించిన పారిశ్రామిక ప్రగతి, కనుగొనే కొత్త ఉపకరణాల వల్ల పలువిధాలుగా పరిసరాలు కలుషితమవుతున్నాయి. శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ కాలుష్యం అధికమై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన ఈ పర్యావరణ కాలుష్యం రకాలు, జరిగే నష్టాలు, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఉద్యోగార్థులు తెలుసుకోవాలి.


ఉత్పత్తి, వినియోగ కార్యకలాపాలతో వచ్చే వ్యర్థాలను అనేక విధాలుగా పర్యావరణంలోకి వదిలివేస్తున్నారు. ఈ వ్యర్థాలను జీర్ణించుకునే శక్తి పర్యావరణానికి ఒక స్థాయి వరకే ఉంటుంది. ఆ స్థాయి దాటి వ్యర్థాలు పెరిగితే దాని నాణ్యత తగ్గుతుంది. ఆ విధంగా ఏర్పడే పర్యావరణ క్షీణతను పర్యావరణ కాలుష్యం అంటారు. భారత పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం ‘‘ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉన్న ఏవైనా అవాంఛనీయ పదార్థాలు పరిమితికి మించి గాలి, నీరు, నేల అనుఘటకాల్లోకి చేరి, వాటి సహజ సంఘటనంలో మార్పు తీసుకొచ్చి మానవుడికి, ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించే స్థితే పర్యావరణ కాలుష్యం’’. కాలుష్యాన్ని ఆంగ్లంలో పొల్యూషన్‌ అంటారు. ఇది పొల్యుటోనియం అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘అపరిశుభ్రత’.


పారిశ్రామిక, హరిత విప్లవాల వల్ల ముందు తరం కంటే తర్వాత తరం జీవన నాణ్యత పెరుగుతూ వచ్చింది. అయితే దాని వెనుక తలెత్తిన పర్యావరణ సంక్షోభాలు మానవ జీవనానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు, నివసించే నేల కలుషితమై జీవరాశుల మనుగడకే అంతరాయం కలుగుతోంది. ఈ విధంగా మనిషి జీవనసరళి వల్ల తటస్థపడే పరిసరాల క్షీణత క్షయాన్ని ‘జీవావరణ వధ’గా 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ‘మానవుడు-పర్యావరణం’ అనే అంతర్జాతీయ సదస్సులో అభివర్ణించారు. కాలుష్యానికి కారణమైన పదార్థాలను కాలుష్యకాలు అంటారు. ఉదా: సీసం, పాదరసం, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

ఉనికి: ఉనికి ఆధారంగా కాలుష్యాలు రెండు రకాలుగా ఉన్నాయి.

1) పరిమాణాత్మక కాలుష్యకాలు: సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండి పరిమితికి మించి పర్యావరణం అనుఘటకాల్లోకి ప్రవేశించి వాటి నిష్పత్తిలో మార్పు తీసుకొచ్చి నష్టపరిచేవి. ఉదా: కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

2) గుణాత్మక కాలుష్యకాలు: ఇవి సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండవు. మానవ చర్యల వల్ల పర్యావరణంలోకి విడుదలై కాలుష్య కారకాలవుతాయి.

ఉదా: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు, వ్యర్థాలు.

స్వభావం: క్షయ స్వభావం ఆధారంగా కాలుష్యకాలను రెండు రకాలుగా పేర్కొన్నారు. 

1) జీవక్షయం చెందే కాలుష్యకాలు: కొన్ని వ్యర్థాలు సూక్ష్మజీవుల చర్యల వల్ల పర్యావరణ విభాగాల్లో కలిసిపోతాయి. ఆ విధంగా పర్యావరణానికి అనుకూలంగా మారిపోయే కాలుష్యాలను జీవక్షయం చెందే కాలుష్యకాలుగా భావిస్తారు. ఉదా: చెత్త, వృక్ష, జంతు సంబంధ అవశేషాలు, వ్యవసాయ సంబంధ వ్యర్థాలు.

2) జీవక్షయం చెందని కాలుష్యకాలు: సూక్ష్మజీవుల చర్యల వల్ల క్షయం కాకుండా కొన్ని వందల ఏళ్ల వరకు వాతావరణ విభాగాల్లో అదే స్థితిలో ఉండి పర్యావరణానికి హాని కలిగించేవి. ఉదా: ప్లాస్టిక్‌ సంబంధ వస్తువులు, గాజు, పాలిథీన్‌ సంచులు, క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్స్‌

మార్పు: పర్యావరణంలో మార్పు చెందే కాలుష్యకాలు రెండు రకాలు.

1) ప్రాథమిక కాలుష్యకాలు: పర్యావరణంలోకి విడుదలకాక ముందు ఏ స్థితిలో ఉన్నాయో, విడుదలయ్యాక కూడా అదే స్థితిలో ఉండి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యేవి. ఉదా: డీడీటీ, పాదరసం లాంటివి.

2) ద్వితీయ కాలుష్యకాలు: ప్రాథమిక కాలుష్యకాలు పర్యావరణంలోకి విడుదలైన తర్వాత రసాయనిక మార్పుల కారణంగా కొత్త కాలుష్యకాలుగా మారడం.

ఉదా: వాతావరణంలోని నైట్రోజన్‌ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు కాంతి సమక్షంలో చర్య జరిపి పైరోగ్జిఎసిటైల్‌ నైట్రేట్‌గా మారుతుంది.

కాలుష్యంలోని విభాగాలు: పర్యావరణంలో ఏ భాగమైతే కాలుష్యానికి గురవుతుందో వాటి ఆధారంగా కాలుష్యాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. 1) వాయు కాలుష్యం 2) నీటికాలుష్యం 3) భూమి కాలుష్యం 4) ఘన వ్యర్థ కాలుష్యం 5) సముద్ర కాలుష్యం 6) ధ్వని కాలుష్యం 7) ఉష్ణ కాలుష్యం 8) కిరణధార్మిక కాలుష్యం.


ప్రపంచంలో పెద్ద పర్యావరణ ప్రమాదాలు:

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఝటన: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ అనే క్రిమిసంహారక మందులు తయారుచేసే పరిశ్రమ నుంచి 1984, డిసెంబరు 2 - 3 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో మిథైల్‌ ఐసోసైనేట్‌ (ఎమ్‌ఐసీ) అనే విషవాయువు విడుదలైంది. పరిశ్రమ చుట్టూ 40 చ.కి.మీ. ప్రాంతంలో ప్రభావం చూపించడంతో, సుమారు 3,700 మంది చనిపోయారు, వెయ్యి మంది అంధులయ్యారు. 5,58,000 మంది విషవాయువు బారిన పడ్డారు.

చెర్నోబిల్‌ అణుప్రమాదం: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రంలో 1986, ఏప్రిల్‌ 26న అణు రియాక్టర్‌ పేలిపోయింది. రేడియో అయోడిన్‌-131, సీజియం-137 లాంటి రేడియోధార్మిక పదార్థాలు విడుదలైన వెంటనే 31 మంది మరణించగా, ఆస్పత్రిలో 239 మంది చనిపోయారు. అణు రేడియేషన్‌ చుట్టుపక్కల ఉన్న పోలండ్, డెన్మార్క్, నార్వే దేశాలకూ విస్తరించింది. పాలల్లో కూడా రేడియేషన్‌ విస్తరించి పాలు తాగే చాలామంది చిన్నారులు చనిపోయారు.

సామూహిక విధ్వంస ఆయుధాలు: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా అణ్వాయుధాల దాడి పర్యావరణాన్ని అతలాకుతలం చేసింది. 1945, ఆగస్టు 6న మొదటిసారిగా లిటిల్‌ బాయ్‌ అనే అణుబాంబును బాంబర్‌ ఎనోలాగే అనే యుద్ధ విమానం నుంచి హిరోషిమా నగరంపై జారవిడిచారు. ఈ ఘటనలో 66 వేల మంది చనిపోగా 90% పట్టణం నాశనమైంది. 10 చ.కి.మీ. ప్రాంతం ప్రభావితమైంది. రెండోసారి ఆగస్టు 9న ప్యాట్‌ మాన్‌ అనే బాంబును అదే యుద్ధవిమానంతో నాగసాకి నగరంపై వేశారు. ఈసారి 1/3వ వంతు నగరం నాశనం కాగా 39 వేల మంది చనిపోయారు.


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌