• facebook
  • whatsapp
  • telegram

విపత్తు నిర్వహణలో అవశిష్ట నైపుణ్యాలు

ప్రాణాలు కాపాడే నేర్పరితనం!

 


  
  హఠాత్తుగా అనుకోని సంఘటనలు ఎదురైతే దాదాపు అందరూ కాసేపు స్తంభించిపోతారు. అలాంటిది పెద్ద ప్రమాదమే జరిగితే దాన్ని చూసిన, అందులో ఉన్న బాధితుల మానసిక స్థితిని ఊహించడం కష్టం. కానీ ఆ విధమైన విపత్కర పరిస్థితుల్లో కూడా విపరీత భావోద్వేగాలకు గురికాకుండా, పరిస్థితులకు అనుగుణంగా, సృజనాత్మకంగా ఆలోచించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమాచారాన్ని అందించడం, సమన్వయం చేసుకోవడం వంటి చర్యలను అవశిష్ట నైపుణ్యాలు అంటారు. విపత్తు నిర్వహణలోని ఆ నేర్పరితనం ప్రాణాలను కాపాడుతుంది. ఆస్తులు సహా ఇతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తుంది. 

 


  విపత్తు ఎప్పుడు, ఎక్కడ సంభవించినా మొదట స్పందించేది స్థానికులే. వారే వేగంగా తక్షణ, రక్షణ చర్యలు మొదలుపెడతారు. శిక్షణ, సరైన వనరులు లేకుండా విపత్తుల నుంచి బాధితులను రక్షించడం స్థానికులకు కష్టతరమైన అంశం. విపత్తు తర్వాత అక్కడి భౌతిక, పర్యావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో శోధన, రక్షక చర్యలు (సెర్చ్, రెస్క్యూ) కీలకపాత్ర పోషిస్తాయి. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటం శోధన, రక్షక చర్యల బృందాల బలం, సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.

 


  అత్యంత అననుకూల పరిస్థితుల్లో కూడా ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వ్యక్తి/వ్యక్తుల సమూహం నిర్వహించే ఒక సాంకేతిక చర్యను శోధన, రక్షక చర్యలుగా నిర్వచించవచ్చు. వీటిని కమ్యూనిటీ సాన్నిహిత్య సహకారం, బృంద దృక్పథంతో నిర్వహిస్తారు

 


శోధన, రక్షక చర్యల బృందం కూర్పు: నిజాయతీ, భావోద్వేగం, వృత్తిపరంగా తిరుగులేని నైపుణ్యం, శారీరక దారుఢ్యం, ప్రదర్శనా సామర్థ్యం, అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండే స్త్రీ, పురుష వాలంటీర్లతో రక్షక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వీరికి 18 ఏళ్లు నిండి, స్థానిక భాషలో చదివే, రాయగలిగే సామర్థ్యం ఉండాలి. మాజీ సైనిక సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుంది.

 


ప్రధాన లక్ష్యాలు:  * కూలిన భవనాల శిథిలాల నుంచి లేదా తుపాను, సునామీ, వరదలు లాంటి కల్లోలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడటం.


* బాధితులకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యచికిత్సకు పంపడం.

 

* కూలేందుకు సిద్ధంగా/ప్రమాదంలో ఉన్న భవనాలను తాత్కాలికంగా కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం.


* ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి, అక్కడినుంచి తొలగించి, సంబంధీకులకు అందజేయడం.


* స్థానిక వనరులను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ, ప్రదర్శన ద్వారా కమ్యూనిటీ ప్రజలకు అవగాహన కల్పించడం.

 


విధులు: దుర్ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలుసుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టడం బృంద సభ్యుల ప్రాథమిక విధి. ఇది సమర్థ రక్షణకు ఉపయోగపడుతుంది. నష్టం జరిగిన ప్రాంతం పరిధి, వివరాలు, ఇంకా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా లాంటి సమాచారం సేకరించడం చాలా ముఖ్యం.

 


మూడు కీలక సూత్రాలు: బృంద సభ్యులు శోధన, రక్షక చర్యల్లోకి దిగే ముందు కింది సూత్రాలు పాటించాలి.

 


పరిశీలించు (Look): జరిగిన సంఘటన ఏ రకమైందో కళ్లతో చూసి తనిఖీ చేయాలి.

 


విను (Listen): జరిగిన సంఘటన వివరాలు కమ్యూనిటీ (స్థానిక ప్రజలు) నుంచి లేదా ప్రభుత్వ రికార్డులు, మీడియా వంటి వనరుల నుంచి పూర్తిస్థాయిలో సేకరించి చర్యల్లోకి దిగాలి.

 


స్పందించు (Feel): ప్రమాద తీవ్రత గురించి వాస్తవాన్ని గ్రహించి, దానికి ప్రతిస్పందించి చర్యల్లోకి దిగే ముందు వనరులను, సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి.

 


రక్షక బృందం వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) తాడు  2) నిచ్చెన  3) కత్తిరించే చిన్న సాధనాలు  4) ప్రథమ చికిత్స పెట్టె  5) గునపం 6) సుత్తి  7) బాధితుడిని మోసుకెళ్లే జోలె (స్ట్రెచర్‌). అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సామగ్రి బృందానికి అందుబాటులో లేనప్పుడు స్థానికంగా లభించే పీపాలు, టిన్‌ డబ్బాలు, గొట్టాలు, కర్రలు లాంటి వస్తువులు వినియోగించుకునే సమయస్ఫూర్తి ఉండాలి.

 


రక్షక బృందం సభ్యుడి వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) హెల్మెట్‌  2) టార్చ్‌లైట్‌  3) గమ్ముతో అతికించిన బూట్లు  4) లైఫ్‌ జాకెట్‌  5) విజిల్‌

 


ప్రథమ చికిత్సే ప్రధానం: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన చర్య ప్రథమ చికిత్స. గాయం తగిలిన లేదా అకస్మాత్తుగా జబ్బు పడిన బాధితుడికి అధునాతన వైద్యం అందించడానికి ముందు ప్రమాదం జరిగిన చోట లభించే మానవ, ఇతర వనరులతో తొలి సంరక్షణ అందించడమే ప్రథమ చికిత్స. దీనికి బంగారు సూత్రం.. ‘ప్రశాంతంగా ఉండాలి, భయాందోళన చెందవద్దు.’

 


కార్యాచరణ ప్రణాళిక: ప్రథమ చికిత్స అవసరమా, లేదా అని మదింపు చేసుకోవడంలో బృంద సభ్యులకు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. లేదంటే ప్రాణం పోయిన శవాన్ని ఆస్పత్రిలో చేర్చినట్లవుతుంది. అందుకోసం రక్షక చర్యల బృందం సభ్యులు ముందుగా కింది పరిశీలనలు చేయాలి. వీటినే DRABC అంటారు.


* D - డేంజర్‌ (ప్రమాదం): మీకు/బాధితులకు/ఇతరులకు ఏదైనా ప్రమాదం ఉందేమో గమనించాలి.


* R - రెస్పాన్స్‌ (ప్రతిస్పందన): బాధితుడు స్పృహలో ఉన్నాడా లేదా అచేతనంగా ఉన్నాడా అని పరిశీలించాలి.


* A - ఎయిర్‌వే (వాయునాళం): ముక్కు తెరచుకుని ఉందో లేదో చూడాలి.


* B - బ్రీతింగ్‌ (శ్వాస): బాధితుడి శ్వాస శబ్దం వినిపిస్తుందా, గుండె కొట్టుకుంటుందా అనేది పరిశీలించాలి.


* C - సర్క్యులేషన్‌ (రక్తప్రసరణ): బాధితుడి నాడీ కొట్టుకుంటుందో లేదో పరిశీలించాలి.ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సిన 12 వస్తువులు: 1) దూది  2) టేపు  3) బ్యాండేజ్‌  4) డ్రెస్సింగ్‌ క్లాత్‌  5) ట్రయాంగులర్‌ బ్యాండేజ్‌ 6) థర్మామీటర్‌ 7) కత్తెర  8) గ్లౌజులు 9) సబ్బు  10) నొప్పి నివారణ మందులు 11) యాంటాసిడ్‌ 12) ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు.

 


స్పృహ కోల్పోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స:


ఆ వ్యక్తిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. తల వెనక్కి వంచి, చేతులు శరీరానికి లంబకోణంలో ఉంచాలి.


* కాలిని 8 నుంచి 12 అంగుళాలు ముందుకు జరపాలి. దీనివల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది.


* దుస్తులు బిగుతుగా ఉంటే తొలగించాలి.


* బాధితుడి చుట్టూ జనం గుమికూడనీయకూడదు. 

 


కాలిన గాయాలకు చికిత్స: * కాలిన భాగాన్ని వెంటనే చల్లటి నీటిలో ముంచిన వస్త్రాలతో తుడవాలి.

 

* మంటల్లో చిక్కుకున్నట్లయితే వెంటనే బయటకు లాగి వస్త్రంతో కప్పి దొర్లించాలి. లేదా తక్షణమే దుప్పటి చుట్టాలి.


* కాలిన ప్రాంతంలో వెన్న, నూనె, ఐస్‌ లాంటివి పూయకూడదు.


* గాయంపై నేరుగా నీటిని ధారాళంగా పోయకూడదు.

 


ఎముకలు విరగడం లేదా బెణకడం:  * విరిగిన ప్రదేశంలో దన్నుగా సరైన ప్యాడింగ్‌ చేయాలి.


* విరిగిన ప్రదేశాన్ని కదలకుండా ఉంచాలి.


* గాయం తగిలిన ప్రాంతంలో నొప్పి తగ్గే విధంగా వాపు రాకుండా ఐసు ముక్కతో రుద్దాలి.


* గాయంపై షాక్‌ తగలకుండా చికిత్స చేయాలి.

 


విద్యుదాఘాతం జరిగినప్పుడు: * కరెంట్‌ షాక్‌ తగిలిన వ్యక్తికి చికిత్స చేయడానికి ముందు విద్యుత్తు ప్రవాహాన్ని నిలిపివేయాలి.


* విద్యుత్తు నిరోధకం సాయంతో బాధితులను అక్కడి నుంచి తీయాలి.


* ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు షాక్‌ తగిలిన భాగాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పి ఉంచాలి.


*  DRABC ని పాటించాలి.

 


పాము కాటుకు గురైనప్పుడు: 


* పాము కాటుకు గురైన భాగాన్ని గుండె ఉన్న ఎత్తు కంటే తక్కువ ఎత్తులో ఉండేలా చూడాలి.


* కాటు వేసిన భాగం నుంచి 15 నుంచి 30 సెకన్ల వరకు రక్తం కారనివ్వాలి.


* కాటు వేసిన ప్రాంతానికి రెండు అంగుళాలపైన బిగువైన రోలర్‌ బ్యాండ్‌ వేయాలి.


* కాటు వేసిన భాగాన్ని శుభ్రంగా సబ్బుతో కడగాలి.


* పాము కాటు వేసిన వెంటనే అక్కడి రక్తాన్ని నోటితో పీల్చి ఉమ్మివేయాలి. అలా చేసిన తర్వాత నీళ్లతో నోటిని పుక్కిలించాలి.


ఈ విధంగా చేసే ప్రథమ చికిత్స అనేక సందర్భాల్లో మరణం నుంచి వ్యక్తులను కాపాడుతుంది.

 


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 06-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌