• facebook
  • whatsapp
  • telegram

యుద్ధ విమానాలు, డ్రోన్‌లు

* భారత వైమానిక దళం ప్రగతి 

  సువిశాల గగనతలం, సుదీర్ఘమైన సాగరతీరం ఉన్న భారతదేశంలో వైమానిక దళం పాత్ర ఎంతో కీలకం. స్నేహానికి మనసులేని పొరుగుదేశాల వైఖరి.. కొత్తపుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్తు సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవడానికి నిరంతరం కొత్త శక్తియుక్తులను కూడగట్టుకోవడం భారత వైమానిక దళానికి చాలా అవసరం. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అమోఘమైన సేవలందించే ఈ రక్షణ యంత్రాంగం ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరించుకుంటూ ముందుకెళుతోంది. ఈ క్రమంలో వైమానిక దళం కృషి.. అమ్ములపొదిలోని 'విహంగ' అస్త్రాల వివరాలు.. తదితర ఆసక్తికర అంశాలను తెలుసుకుందామా!

భారతదేశానికి విస్తారమైన గగనతలం ఉంది. చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన యుద్ధాలతో పొందిన అనుభవాల దృష్ట్యా భారత వైమానిక దళం నిరంతరం తనకు తాను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో వచ్చే పెను సవాళ్లను, సాంకేతిక యుద్ధాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు, భిన్న ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయ సహకారాలను అందించడానికి వైమానిక దళం నిరంతరం సిద్ధంగా ఉండాలి. దీనికి నవీన యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు, కార్గో, శిక్షణ విమానాలు, మానవ రహిత వైమానిక వాహనాలు(యూఏవీ), ఎగిరే రాడార్ (ఏయిర్ బార్న్) వ్యవస్థలను సమకూర్చుకోవడంతోపాటు, ఇప్పుడున్న వ్యవస్థలను పునర్‌వ్యవస్థీకరించాలి.
పాతతరం మిగ్ యుద్ధ విమానాలు కూలిపోవడం, ఫ్రాన్స్‌కి చెందిన రఫెల్ విమానాల కొనుగోలు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా తేజస్ ప్రాజెక్ట్‌ని బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తోంది.

 

డ్రోన్ - మానవ రహిత విమానం

  రిమోట్ కంట్రోలర్ సహాయంతో నడిచే చిన్నపాటి విమానమే డ్రోన్. పైలట్ సహాయం లేకుండానే విమానంలోని కంప్యూటర్ సూచనలతో ఇది ఎగురుతుంది. డ్రోన్ సాంకేతిక నామాలు యూఏవీ(అన్‌మాన్‌డ్ ఏరియల్ వెహికల్) / ఆర్‌పీఏఎస్ (రిమోట్‌లీ పైలెటెడ్ ఏరియల్ సిస్టమ్స్). దీని నిర్మాణంలో రోబోటిక్స్, ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ రంగాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. మానవ రహిత వాహనాల్లో పరారుణ కెమెరాలు, జీపీఎస్ వ్యవస్థ, ఆయుధాలు, క్షిపణులు ఉంటాయి.

  డ్రోన్‌లు గూఢచర్యానికి, పహారా కాసేందుకు, దాడి చేసేందుకు, ఉగ్రవాదుల చొరబాట్లను నివారించేందుకు ఉపయోగపడతాయి. భారతదేశానికి పొడవాటి తీరరేఖ, సులభంగా దాడికి లోనయ్యే సముద్రతీరం ఉన్నాయి. వీటితోపాటు అంత స్నేహతత్వం లేని పోరుగు దేశాలు ఉండటం వల్ల నిఘా అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ముప్పులను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధిపరచి సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

 

హెచ్ఏఎల్-ధ్రువ్

త్రివిధ దళాలకు, తీర రక్షక దళానికి, పౌర అవసరాలకు పనికొచ్చే విధంగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఇది. ఈ ధ్రువ్ హెలికాప్టర్‌కు ఆయుధాలు, మిసైల్స్‌ని అమర్చి రుద్ర హెలికాప్టర్‌ను తయారు చేశారు. హెచ్ఏఎల్-రుద్ర ఆక్రమణ రకానికి చెందిన హెలికాప్టర్.
హెచ్ఏఎల్-ఏఎమ్‌సీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)

హెచ్ఏఎల్, ఏడీఏ కలిసి అభివృద్ధి చేయనున్న అయిదోతరం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇది. దీనిలో రెండు ఇంజిన్‌లు, ఒక సీటు ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎగిరే బహుళ ఉపయోగ ఫైటర్ విమానం వైమానిక దళంలోని ఇతర విమానాలకు తోడ్పడనుంది.

 

ఎన్ఏఎల్-సరస్

  దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి పౌర విమానం. 8 నుంచి 14 మందిని తీసుకుని వెళ్లగల ఈ విమానాన్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్(ఎన్ఏఎల్) అభివృద్ధి చేసింది. సరస్ విమానాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ఎన్ఏఎల్‌తో హెచ్ఏఎల్ చేతులు కలిపింది. 2020 నాటికి 70 నుంచి 100 మందిని తీసుకుని వెళ్లగల ఎయిర్‌క్రాఫ్ట్‌ని తయారు చేయనున్నారు.

 

మానవరహిత యుద్ధ విమానాలు

 

నిషాంత్

  డీఆర్‌డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) చేసిన కృషి ఫలితంగా తయారైన తొలి దేశీయ మానవరహిత విమానం (యూఏవీ) ఇది. దీన్ని డీఆర్‌డీవో విభాగమైన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేసింది. దీన్ని మొబైల్ హైడ్రో-న్యూమాటిక్ లాంఛర్‌తో ప్రయోగిస్తే, పారాచ్యూట్ సహాయంతో తిరిగి పొందవచ్చు. ఇది గంటకు 125-150 కి.మీ.ల వేగంతో నాలుగున్నర గంటలు ప్రయాణిస్తుంది. శత్రు భూభాగంలోని సైనిక కదలికలపై నిఘా కోసం, లక్ష్యాలను గుర్తించడానికి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ (ఈఎల్ఐఎన్‌టీ), సిగ్నల్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐజీఎన్ఐటీ)కి ఉపయోస్తారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు. చక్రాలతో కూడిన ఈ నిషాంత్‌ని 'పంచి' అని పిలుస్తారు.

 

ఏయూఆర్ఏ

  శత్రువులకు తెలియకుండా ఆకాశం నుంచి బాంబులను వేసే భారతీయ మానవరహిత గగనతలం నుంచి దాడిచేసే వాహనాన్నే (ఐయూఎస్ఏవీ) ఏయూఆర్ఏ అని పిలుస్తున్నారు. దీని పూర్తి పేరు అటానమస్ ఆన్‌మ్యాన్‌డ్ రిసెర్చ్ ఎయిర్‌క్రాఫ్ట్. తేజస్ మాదిరిగా దీనికి కూడా ఒక భారతీయ పేరును నిర్ణయించాల్సి ఉంది.

  ఇది సంప్రదాయ, న్యూక్లియర్ బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ, శత్రువుల రాడార్ల నుంచి తప్పించుకుని దాడిచేస్తుంది. దీనికి తేజస్‌లో వాడిన 'కావేరి' ఇంజిన్‌ని ఉపయోగించారు.

 

లక్ష్య

  దీన్ని కూడా డీఆర్‌డీవోనే అభివృద్ధి చేసింది. ఇది అధిక వేగంతో ప్రయాణించే డ్రోన్ వ్యవస్థ. దీన్ని కొంత దూరం నుంచి నియంత్రించవచ్చు. శత్రు విమానాలను ఎదుర్కోవడంలో భాగంగా పైలట్‌లకు, సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ డ్రోన్ గాలిలో రెండు లక్ష్యాలను తాడుతో లాక్కొని వెళుతుంది. సైనికులు వీటిని కాల్చడం ద్వారా తర్ఫీదు పొందుతారు.

మొదటిసారి డీఆర్‌డీవో లక్ష్యకు సంబంధించిన టెక్నాలజీని ఎల్అండ్‌టీ కంపెనీతో పంచుకుంటుంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిపరిచిన లక్ష్య-2ను ఉత్పత్తి చేయనున్నారు. 'లక్ష్య'ను భూమి లేదా నౌక నుంచి 'జీరో లెన్త్ లాంఛర్‌'తో ప్రయోగిస్తారు.

 

నేత్ర

  ఐడియా ఫోర్జ్ అనే ముంబయి కంపెనీ, డీఆర్‌డీవో భాగస్వామ్యంతో తయారు చేసిన తేలికపాటి స్వయం నియంత్రిత మానవరహిత వైమానిక వాహనం. సాలీడు ఆకారంలో ఉండే దీని బరువు 1.5 కిలోల కంటే తక్కువ.

* వీటిని ప్రాథమికంగా సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లు ఉపయోగించనున్నాయి.

* ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, జగన్నాథ రథయాత్రలోని అశేష జనవాహినిని గమనించేందుకు దీన్ని ఇప్పటికే ఉపయోగించారు.

* ఈ విమానంలో కెమెరా, వీడియోలతోపాటు థర్మల్ (పరారుణ) కెమెరా కూడా ఉంటుంది. ఇది వైమానిక నిఘాకు, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది.

 

రుస్తోమ్

  ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ 'రుస్తోమ్ దమానియా' కృషికి గుర్తింపుగా డీఆర్‌డీవో దీనికి రుస్తోమ్ అని నామకరణం చేసింది. ఇది మధ్యంతర ఎత్తులో అధిక కాలం ఎగిరే మానవ రహిత యుద్ధ గగనతల వాహనం. (ఎమ్ఏఎల్ఈ-యూసీఏవీ). రుస్తోమ్ అటానమస్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ (ఏటీవోఎల్) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రుస్తోమ్-2 అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్‌లను పోలి ఉంటుంది. ఎల్ అండ్ టీ కంపెనీ రుస్తోమ్-2ను డీఆర్‌డీవో సహాయంతో మరింత ఆధునీకరించనుంది.

 

హెచ్ఏఎల్-తేజస్

 

  ఇది తేలికపాటి యుద్ధ విమానం (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-ఎల్‌సీఏ). ఒకే సీటు, ఒకే ఇంజిన్‌తో ఉండే తోకలేని ఫైటర్ విమానాన్ని దేశీయ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసింది. ఎల్‌సీఏ ప్రోగ్రాంలో భాగంగా తయారైన ఈ విమానానికి 'తేజస్' అని అటల్ బిహారీ వాజ్‌పేయి నామరణం చేశారు. 1980 వరకు భారత్ విదేశీ యుద్ధ విమానాల కొనుగోలుకు బిలియన్‌ల అమెరికన్ డాలర్లను వెచ్చించింది. విదేశీ రక్షణ వ్యవస్థలపై ఆధారపడకుండా, దేశీయ తేలికపాటి యుద్ధ విమానాలు తయారు చేసే లక్ష్యంతో ఎల్‌సీఏ ప్రోగ్రామ్‌ని 1983లో ప్రారంభించారు. 2001లో మొదటిసారి ఎల్‌సీఏ గాల్లో ఎగిరింది.

సూపర్‌సానిక్, మల్టీరోల్ టాక్టికల్, అడ్వాన్స్‌డ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మార్క్-I ని అభివృద్ధి చేసి తేజస్ మార్క్-II ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేయనున్నారు.

* రఫెల్ యుద్ధ విమానాలకు బదులు 120 దేశీయ తేజస్ విమానాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) సమకూర్చుకోనుంది.

 

తేజస్ పితామహుడు

 

  మిగ్ విమానాల స్థానంలో నిర్మించతలపెట్టిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ) ప్రాజెక్ట్‌ని, 1985లో డీఆర్‌డీవో సంస్థ అయిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చేపట్టింది. దీనికి డాక్టర్ కోట హరినారాయణను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఆయన 25 సంవత్సరాల పాటు 40 ప్రయోగశాలలు, 25 విద్యాసంస్థలు, 300 సంస్థలతో పనిచేసి తేజస్‌కు రూపమిచ్చారు. అందుకే హరినారాయణను తేజస్ పితామహుడుగా పిలుస్తారు.

Posted Date : 26-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌