• facebook
  • whatsapp
  • telegram

వరద విపత్తులు


     మానవ మనుగడకు ప్రకృతి ప్రాణాధారం.. అది వికృత రూపం దాలిస్తే మాత్రం ప్రమాదకర పరిణామం.. ఇలాంటి ప్రమాదకర విపత్తుల్లో వరదలు ఒకటి. వివిధ రీతుల్లో ముంచుకొచ్చే ఈ వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లుతోంది. భారతదేశంలోనూ వీటి ప్రభావం తీవ్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాలకూ అప్పుడప్పుడూ ఈ ముప్పు తప్పడం లేదు. అసలు వరదలెలా సంభవిస్తాయి? ఏవిధంగా తీవ్ర నష్టాలకు కారణమవుతున్నాయి? తదితర అంశాలు తెలుసుకుందామా!
ప్రకృతి సహజ వికృత రూపాల్లో వరదలు ఒకటి. ఏటా వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణ నష్టం కూడా ఎక్కువే. సూర్యపుటం (సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత) వల్ల భూమి వేడెక్కి.. నేల మీద ఉన్న తేమ, జలాశయాల్లోని నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు అనుకూల పరిస్థితుల్లో వర్షం లేదా మంచు లేదా వడగళ్లుగా మారి నేలపై అవపాతం చెందుతాయి. ఈ ప్రక్రియ విపరీతంగా జరిగి అధిక వర్షాలు పడినప్పుడు సాధారణంగా వరదలు ఏర్పడతాయి. ఏదైనా ప్రాంతంలో సాధారణ ప్రవాహస్థాయిని మించి నీరు ప్రవహించినప్పుడు వరదలు సంభవిస్తాయి. వరద ఉద్ధృతి పెరగడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే ఆనకట్టలు తెగిపోవడం, భారీ వర్షాలు తదితర ప్రక్రియల వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగా వరదలు వస్తాయి.

 

వరదలు.. రకాలు

1. నదీ వరదలు
     నది తనలో ఉంచుకోగల నీటి పరిమాణాన్ని పారుదల సామర్థ్యం (ఛానెల్ కెపాసిటీ) అంటారు. సముద్రంలోకి పంపే నీరు కంటే ఎక్కువ నీరు నదిలో ఉన్నప్పడు ఆ నీరు పొంగి నది గట్టును దాటి వరదలు సంభవిస్తాయి. వీటిని 'నదీ వరదలు అంటారు.
2. మెరుపు వరదలు
     కుండపోత వర్షాలు.. మంచు హఠాత్తుగా కరిగి నదిలో చేరడం.. ఆనకట్టలు విరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా వచ్చే వరదలను 'మెరుపు వరదలు అంటారు.
3. తీర ప్రాంత వరదలు
     సముద్రంలో ఉప్పెనలు, సునామీలు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ఏర్పడిన వరదలను 'తీర ప్రాంత వరదలు అంటారు.
4. నదీ ముఖద్వార వరదలు
     సముద్రంలోని ఉప్పెన కారణంగా సముద్రంలోని అలలు నదీ నీటి ప్రవాహాన్ని వెనక్కి నెడతాయి. ఫలితంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాల్లో ఏర్పడిన వరదలను 'నదీ ముఖద్వార వరదలు అంటారు.
5. పట్టణ వరదలు
     సరైన మురుగునీటి వ్యవస్థ లేని నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడిన వరదలను 'పట్టణ వరదలు అంటారు.
6. ప్రమాద కారణ వరదలు
     అధిక పరిమాణంలో నీటిని సరఫరా చేసే గొట్టాలు పగిలిపోయినప్పుడు చుట్టు పక్కల ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. ఇలా ఏర్పడే వరదలే 'ప్రమాద కారణంగా ఏర్పడిన వరదలు.

 

కొత్త సవాళ్లు

     ప్రాచీన కాలంలో మానవులు జలాశయాలకు దగ్గరలోనే నివసించేవారు. అయితే వరదల ప్రభావాన్ని తప్పించుకోవడానికి తగినంత దూరంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు. నాగరకతలు అభివృద్ధి చెందిన కాలంలో మానవులు నదీలోయ ప్రాంతాల్లో జీవించేవారు. యూఫ్రటిస్, టైగ్రిస్ నదీ లోయల్లో మెసపటోమియా నాగరకత; నైలు నదీలోయలో ఈజిప్టు నాగరకత; సింధు నదీ ప్రాంతంలో సింధు నాగరకత; యాంగ్జీ, పసుపు నదీ ప్రాంతంలో చైనా నాగరకత ఇలాంటివే. 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవుడి జీవిత కాలం పెరిగింది. అదే సమయంలో అనేక విపత్తుల వల్ల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. అభివృద్ధి, జనాభా, నగరీకరణ తరచూ వరదలు రావడానికి కారణమవుతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ సహజ వనరులపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది మానవ జీవితాలను అత్యంత అపాయంలోకి నెడుతోంది. కొన్ని చోట్ల సరైన అభివృద్ధి ప్రణాళిక లేకపోవడం వల్ల వరదలు ఏర్పడుతుండగా మరికొన్ని చోట్ల అతి అవస్థాపనా సౌకర్యాల కల్పన వల్ల వరదలు సంభవిస్తున్నాయి. మెక్సికోలోని మిసిసిపీ నదీ ప్రాంతం, బంగ్లాదేశ్‌లోని హోండూరస్ పర్వత ప్రాంతాల్లోని అభివృద్ధి చెందుతున్న (జనసాంద్రత ఎక్కువగా ఉన్న) ప్రాంతాల్లో ఈ వరదల బీభత్సం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మానవుడి అభివృద్ధి కూడా కొత్త సవాళ్లను విసురుతోంది.
 

రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ

     వివిధ రకాల విపత్తుల వల్ల జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలను లెక్కించడానికి, నమోదు చేయడానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంస్థ పనిచేస్తోంది. వాతావరణ విపత్తుల్లో వరద విపత్తు వల్ల ప్రపంచంలో అత్యధిక ఆస్తి, ప్రాణ నష్టాలు, అత్యధిక ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని ఈ సంస్థ పేర్కొంది.
 

భారతదేశంలో వరదల ప్రభావం

     ప్రపంచ వ్యాప్తంగా వరదల కారణంగా మరణిస్తున్నవారిలో 20% భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముప్పునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే. ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదలు సంభవిస్తున్నాయి.
1. గంగానదీ పరీవాహక ప్రాంతం
     ఉపనదుల వల్ల గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉత్తర భాగం తీవ్ర వరదలకు గురవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లోని ఉత్తర భాగాలు ప్రతి సంవత్సరం వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదులు వరదలకు కారణమవుతున్నాయి. బిహార్‌లో ఏటా కోసి, గండక్ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ్ బంగలోని దామోదర్, అజయ్ నదుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.
2. బహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం
     బ్రహ్మపుత్ర, బరాక్ నదులు.. వాటి ఉపనదుల కారణంగా అసోం ఎక్కువగా వరదలకు గురవుతోంది. జల్దాకా, తీస్తా, తోర్సా నదుల వల్ల పశ్చిమ్‌బంగ ఉత్తర ప్రాంతం నీటి ముంపునకు గురవుతోంది.
3. వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం
     వాయవ్య భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్ నదుల పరీవాహక ప్రాంతాలు జలసమాధి అవుతున్నాయి.
4. మధ్య, దక్కన్ భారతదేశం
     గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా, తుంగభద్ర, నర్మదా తదితర నదులు.. మధ్య, దక్కన్ భారతదేశంలో ఏటా వరదలకు కారణమవుతున్నాయి. ఒడిశాలో మహానది, వైతరణి, బ్రాహ్మణి నదీపరీవాహక ప్రాంతాలు కూడా వరదల బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి.
5. ముప్పు ముంగిట తెలుగు రాష్ట్రాలు
     తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో నాగావళి, వంశధార నదులు; దక్షిణ ఆంధ్రాలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి. 2009లో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల మహబూబ్‌నగర్, కర్నూలు, నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు అపార నష్టం వాటిల్లింది. ముంబయి, కోల్‌కత లాంటి పెద్ద నగరాల్లోనూ మురుగునీటి వ్యవస్థ ప్రణాళికాయుతంగా లేదు. అధిక వర్షాలు వచ్చినప్పుడు నగరాలు నీట మునుగుతున్నాయి. 2005లో ముంబయిలో ఒకే రోజున 10 సెంటీ మీటర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి.
ముఖ్యాంశాలు
* జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం భారతదేశ భూభాగంలో 12.8 శాతం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలకు గురవుతోంది. ఇందులో అధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 21.9 శాతం, బిహార్‌లో 12.7 శాతం భూభాగంలో వరదలు సంభవిస్తున్నాయి.
* వరదల కారణంగా 1953-2009 మధ్య భారతదేశం ఏడాదికి సగటున రూ.1,650 కోట్లను నష్టపోయింది. ప్రతి సంవత్సరం సగటున 1,464 మంది చనిపోతుండగా, 86,288 పశువులు మృత్యువాత పడుతున్నాయి.
* మన దేశంలో వరద ఉద్ధృతిని తెలుసుకోవడానికి శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
* మన దేశంలో వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు, వరద నియంత్రణ శాఖ లేదా జలవనరుల శాఖ జారీ చేస్తాయి.
* సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే అవి విపత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌