• facebook
  • whatsapp
  • telegram

వరదలు

  నదీప్రవాహ మార్గాల హద్దులు (గట్లు)జల ప్రవాహాన్ని నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిని 'వరద' అంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు, వర్షపాతం ఉండటంవల్ల ఏటా ఏదో ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. అధిక వర్షపాతం ఉండే జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తుపాను, వాయుగుండాలు వచ్చినప్పుడు కూడా వరదలు వస్తాయి. అధిక వర్షపాతం, కూడా వరదలు రావడానికి కారణమవుతుంది. భారతదేశంలోని సుమారు 3290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని భూమి వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

  ఏటా సరాసరి 75 లక్షల హెక్టార్ల భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. సుమారు 1600 మంది వరదల వల్ల మరణిస్తున్నారు. సాలీనా రూ.1805 కోట్ల రూపాయల ఆస్తి, పంటనష్టం జరుగుతోంది. ఇళ్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. 1977లో అత్యధికంగా 11,316 మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. దేశ విస్తీర్ణంలో 8 శాతం వరకూ భూభాగం వరదలకు గురయ్యే అవకాశముంది. గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయి.

 

వరదలు రావడానికి కారణాలు

* నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

* అధిక వర్షపాతం, వాయుగుండాలు, తుపాన్లు వరదలకు కారణమవుతాయి.

* నదులు, చెరువులు, కాల్వలకు గండ్లు పడటం; నదీ ప్రవాహ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి.

* అతిగా అడవులను నరికివేయడం, పర్వత ప్రాంతాల్లో నేల క్రమక్షయానికి గురవడం వల్ల వరదల ఉద్ధృతి పెరుగుతోంది.

* కొండ చరియలు విరిగిపడటంతో నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

* చెరువులు, ఆనకట్టలు, గట్ల నిర్మాణంలో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కూడా వరదలు రావొచ్చు.

* మహానగరాల్లోని నాలాలు ప్లాస్టిక్ కవర్లు, చెత్త, ఇతర ఘన పదార్థాలతో నిండిపోవడం వల్ల అవి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో ఈకారణంగానే వరదలు సంభవించాయి.

* వర్షం పడినప్పుడు నీరు నేలలోకి సరైనవిధంగా ఇంకకపోవడం వల్ల వరదలు ఎక్కువవుతాయి. నగరాల్లో నీరు ఇంకే మార్గాలకు పూర్తిగా అడ్డుపడటం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదల తాకిడిని, వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాం.

 

వరద విపత్తు ఆధారంగా భారతదేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించవచ్చు.

 

బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం

  బ్రహ్మపుత్ర, బారక్ నదులు, వీటి ఉపనదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధిక వర్షపాతం (1100 మి.మీ. నుంచి 6350 మి.మీ.) నమోదవుతోంది. అందువల్ల సర్వసాధారణంగా ఈ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇక్కడి నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, దిగువకు రావడం వల్ల నేల క్రమక్షయానికి గురవడం, కొండచరిచయలు విరిగి పడటం కూడా ఎక్కువగా ఉంటోంది.

 

గంగానదీ పరీవాహక ప్రాంతం 

  గంగా దాని ఉపనదులైన యమున, సోన్, గండక్, కోసి, మహానంద, రాఫ్తి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. వీటి వల్ల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌ని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వరద ముప్పు ఉంది. ఇక్కడ సంవత్సరానికి 600 మి.మీ. నుంచి 1900 మి.మీ. వరకూ వర్షం కురుస్తుంది. ఈ రాష్ట్రాల్లో గంగానది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి.

 

ఉత్తర-పశ్చిమ నదీ పరీవాహక ప్రాంతం

  బియాస్, రావి, చీనాబ్, జీలమ్ లాంటి నదుల ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాల్లో ఈ నదుల వల్ల వరదలు సంభవిస్తాయి. గంగా పరీవాహక ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వరద ముప్పు తక్కువే అయినప్పటికీ పూడిక సమస్య ఎక్కువ.

 

మధ్య భారతదేశం - దక్కన్ ప్రాంతాలు

  నర్మదా, తిరుపతి, మహానంది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిషా రాష్ట్రాలు ఈ నదుల వల్ల వరదల బారిన పడతాయి.

  ఒడిషాలోని కొన్ని జిల్లాల్లో వరదలు తరచుగా వస్తుంటాయి. ఈ రాష్ట్రాల్లో రుతుపవనాల సమయంలో, తుపాన్లు సంభవించినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఎక్కువ.

 

వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  నదీతీర ప్రాంతాల్లో, తరచుగా వరదలకు గురవడానికి అవకాశమున్న ప్రజలు వరదలు రావడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వరదల సమయంలో తక్కువ నష్టం జరుగుతుంది.

* దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి.

* ప్రథమ చికిత్స పెట్టెలో మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్రత్యేకంగా డయేరియా, పాముకాటుకు సరైన ఔషధాలను సిద్ధం చేసుకోవాలి.

* రేడియో, టార్చిలైటు, బ్యాటరీలు, తాళ్లు, గొడుగు లాంటివి సమకూర్చుకోవాలి.

* మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలి.

* నీరు తాకినా తడవని సంచుల్లో (water proof bags) దుస్తులు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తయిన ప్రదేశాలను గుర్తించి, పశువులను అక్కడికి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి.

 

వరద వచ్చిన ప్రాంతంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* సురక్షిత (కాచి వడపోసిన) నీటినే తాగాలి. లేకపోతే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.

* ఆహార పదార్థాలను వరదనీటిలో తడవకుండా చూడాలి. వరద నీటిలో తడిసిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు.

* నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడరు కలపాలి. పరిసరాల్లో సున్నాన్ని చల్లాలి.

* వరదనీటిలోకి వెళ్లకూడదు. వరదల సమయంలో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌