• facebook
  • whatsapp
  • telegram

గంగా, సింధూ మైదానం

ఒండ్రు నిక్షేపాలు...  అగ్నిమయ శిలలు!

మనదేశం వైవిధ్య భౌగోళికాంశాల మిశ్రమం. అందులో సారవంతమైన ఒండ్రుమట్టితో ఏర్పడిన మైదానాలు, కఠిన అగ్నిమయ శిలలతో తయారైన నేలలు, పర్వతాలు, కొండలు తదితరాలు ఉన్నాయి. మైదానాలు, నేలల్లో  రకాలు, అవి విస్తరించి ఉన్న తీరుపై భారతదేశం-నైసర్గిక స్వరూపాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

  హిమాలయ పర్వతాలకు దక్షిణాన దిగువన, భారత ద్వీపకల్పానికి ఉత్తరం వైపున ఒక అభినతిలోయ ఉండేది. వింధ్య, హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించే నదులు ఒండ్రుమట్టిని తీసుకువచ్చి ఇక్కడ నిక్షేపించాయి. దీనివల్ల ఈ లోయ క్రమేణా పూడి మైదానంగా ఏర్పడింది. ఇదే గంగా, సింధూ మైదానం. దీని పొడవు 2,414 కి.మీ., వెడల్పు 241 నుంచి 321 కి.మీ. ఇది సుమారు 7.5 లక్షల చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. గంగా మైదానం 3.7 లక్షల చ.కి.మీ., బ్రహ్మపుత్ర మైదానం 1.5 లక్షల చ.కి.మీ.లు గా విస్తరించి ఉన్నాయి. ఈ మైదానాలకు ఉత్తరాన హిమాలయ  పర్వతాలు; దక్షిణాన వింధ్య, కైమూర్‌ పర్వత పంక్తులు, తూర్పున అస్సాం కొండలు, పశ్చిమాన సులేమాన్, కీర్తార్‌ పర్వత పంక్తులు సరిహద్దులుగా ఉన్నాయి.


గంగా, సింధు మైదానాలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల నుంచి వచ్చిన ఒండ్రుమట్టి నిక్షేపాల వల్ల ఏర్పడ్డాయి కాబట్టి వీటిని డస్ట్‌ ఆఫ్‌ మౌంటేన్స్‌ అని కూడా అంటారు. గంగా, సింధూ మైదానాలను వాటి స్వభావాన్ని బట్టి భాబర్, టెరాయి, భంగర్, ఖాదర్, లవణీయ నేలలు, కొన్‌పుట్‌ ప్లెయిన్స్‌ మైదానాలుగా వర్గీకరించారు. ఈ మైదానాలు సుమారు 25 లక్షల సంవత్సరాలకు పూర్వం ఏర్పడినట్లు తెలుస్తుంది.


భాబర్‌ మైదానం: ఇది శివాలిక్‌ పర్వత పాదాల వద్ద విసనకర్ర ఆకారంలో గులకరాళ్ల అవక్షేపాలు నిక్షేపించడం వల్ల ఏర్పడిన సచిద్ర మైదానం. దీని వెడల్పు 8 నుంచి 16 కి.మీ. వరకు ఉంటుంది. గులకరాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల నదులు ఇక్కడికి రాగానే ఇంకినట్లు అనిపిస్తాయి. ఈ ప్రాంతం వ్యవసాయానికి పనికిరాదు.


టెరాయి: భాబర్‌ ప్రాతంలో ఇంకిపోయినట్లుగా అనిపించే నదులు ఇక్కడ ప్రత్యక్షమవుతాయి. నదీ ప్రవాహాలు విస్తరించడం వల్ల 15 నుంచి 30 కి.మీ. వెడల్పుతో దట్టమైన అరణ్యాలు కలిగిన చిత్తడి నేల. ఇక్కడ వరి, గోధుమ, చెరకును విరివిగా పండిస్తారు. సాగుభూమి విస్తరించే క్రమంలో టెరాయి అడవులను చాలా వరకు నిర్మూలించి వ్యవసాయ భూములుగా మార్చారు.

 

భంగర్‌: పురాతన ఒండ్రు మైదానాలే నేటి భంగర్‌ మైదానాలు. ఉత్తర భారతదేశ మైదానాల్లో ఇవి అధిక భాగం విస్తరించి ఉన్నాయి. ఇవి ముదురు రంగులో ఉండే సారవంతమైన నేలలు. వీటిని పంజాబ్‌లో దయా, పశ్చిమ్‌ బంగాలో బరింద్, గంగా - యమున అంతర్వేదిలో బుర్‌ నిక్షేపాలు అంటారు.

 

ఖాదర్‌: ఇవి నదీ తీరాలకు దగ్గరగా ఉండి, కొత్తగా వచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడిన మైదానాలు. వీటిలో ఇసుక, బురద ఎక్కువగా ఉండి బంకమన్ను తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి భంగర్‌ కంటే సారవంతమైన మైదానాలు. వీటిని పంజాబ్‌ ప్రాంతంలో బెట్‌ల్యాండ్స్‌ అంటారు.

 

లవణీయ నేలలు: ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో క్షార లక్షణాలతో ఎండిపోయిన నేలలను ప్రాంతీయంగా కల్లార్, ఉషర్, రకర్‌ నేలలు అంటారు. ఎక్కువ నీటి సౌకర్యం కల్పించడం వల్ల కొన్ని ప్రాంతాలు క్షార నేలలుగా మారాయి. వీటిని ‘రే’ నేలలు అంటారు. ఇవి నిస్సారమైనవి.

 

కొన్‌ - పుట్‌ ప్లెయిన్స్‌: ఇవి నదులు మైదానంలో ప్రవేశించిన కొండల పాదల వద్ద విసనకర్ర ఆకారంలో ఏర్పడిన ఒండ్రుమట్టి ప్రాంతాలు.

 

ద్వీపకల్ప పీఠభూమి

  ఇది అతిపురాతనమైంది, అగ్నిమయ శిలలతో ఏర్పడింది. ఈ పీఠభూమి త్రిభుజాకారంలో ఉంటుంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల్లో సముద్రంతో ఆవరించి 300 నుంచి 2000 మీ. ఎత్తు కలిగి ఉంటుంది. ఇది కేంబ్రియన్‌ యుగం నుంచి సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉంది. ఈ పీఠభూమిలో ఉన్న పర్వతాలను పరిశిష్ట పర్వతాలు అంటారు. ఈ శిలలు కఠినమైనవి. ఈ పీఠభూమి భ్రంశాలకు గురై పగులోయ ఏర్పడింది. ఈ లోయ ద్వారా నర్మదా, తపతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ పీఠభూమి పడమర నుంచి తూర్పుకు వాలి ఉంది. నర్మదా నది ప్రవహించే పగులు లోయ పీఠభూమిని రెండు త్రిభుజాకారపు ప్రాంతాలుగా విభజిస్తుంది. ఈ పగులు లోయకు ఉత్తరంగా ఉన్న పీఠభూమిని మాల్వా పీఠభూమి అంటారు. మాల్వా పీఠభూమిలో ఎక్కువగా నదీ క్రమక్షయానికి గురైన ప్రాంతాలను కందర భూములు అంటారు. మాల్వా పీఠభూమికి దక్షిణాన వింధ్య పర్వతాలు ఉన్నాయి. దీని వాలు గంగానది లోయ వైపుకు ఉంటుంది.

  నర్మదా నదికి దక్షిణం వైపున ఉన్న పీఠభూమిని దక్కన్‌ పీఠభూమి అంటారు. ఇది త్రిభుజాకా రంలో ఉంటుంది. ఈ పీఠభూమికి ఉత్తరాన సాత్పురా కొండలు, తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు ఉన్నాయి. చోటానాగ్‌పుర్, మైసూర్‌ పీఠభూములు దీనిలో ఉన్నాయి. పీఠభూముల ద్వారా ప్రవహించే నదుల లోయలు లోతుగా, వెడల్పుగా ఉంటాయి. నదులు పీఠభూమి నుంచి కిందికి ప్రవహించడం వల్ల నదీ జలపాతాలు ఏర్పడ్డాయి.

  ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తయిన ప్రదేశాలు ఆరావళి, వింధ్య, సాత్పురా పర్వతాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు. 

 

ఆరావళి పర్వతాలు: ఇవి అతిపురాతనమైన ముడుత పర్వతాలు. ఇవి గుజరాత్‌ నుంచి దిల్లీ వరకు సుమారు 700 కి.మీ. పొడవుతో విస్తరించి ఉన్నాయి. ఈ కొండల నుంచి బనాస్, మహి, లూనీ నదులు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ కొండల్లో ఎత్తయినది మౌంట్‌ అబు గురుశిఖరం. దీని ఎత్తు 1722 మీ. సుప్రసిద్ధ ఖేత్రి రాగి గనులు, దిల్వారా జైన దేవాలయాలు; నక్కీ, సాంభర్, రామ్‌నగర్‌ సరస్సులు ఇక్కడ ఉన్నాయి.

 

వింధ్య పర్వతాలు: ఇవి నర్మదా నదికి కుడివైపుగా, మాల్వా పీఠభూమికి దక్షిణంగా ఉన్నాయి. ఈ పర్వతాలు తూర్పు నుంచి పడమరకు వ్యాపించి సోన్‌ నదీలోయ పక్కన నిలువుగా ఉన్న కైమూర్‌ పర్వతాల్లో కలుస్తాయి. ఇవి హోషంగాబాద్‌ సమీపంలో నర్మదా నదిని ఆనుకొని ఉన్నాయి. వీటిని తూర్పు కైమూర్‌ శ్రేణులని అంటారు. ఈ శ్రేణుల్లో  ఇసుకరాయి, సున్నపురాయి శాతం ఎక్కువ. వీటి ఎత్తు 800 నుంచి 1400 మీ. వరకు ఉంటుంది. బింబెట్క గుహలు ఈ పర్వతాల్లోనే ఉన్నాయి. ఇవి మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.

 

సాత్పురా పర్వతాలు: ఇవి దక్కన్‌ పీఠభూమికి ఉత్తరాన ఉన్నాయి. వీటిలో ఎత్తయిన శిఖరం దుప్‌ఘర్‌ (1350 మీ.). ఇది మహదేవ్‌ కొండల్లో పంచమరీ దగ్గర ఉంది. ఈ పర్వతాలకు ఉత్తరాన నర్మద, దక్షిణాన తపతీ నదులు ప్రవహిస్తున్నాయి. ఇవేకాకుండా సోన్, వార్ధా, పెన్‌గంగా, బ్రహ్మణ నదులు జన్మించాయి. పగులు లోయలో ప్రవహించడం వల్ల నర్మద, తపతి నదులు తూర్పు నుంచి పరడమరకు ప్రవహిస్తున్నాయి. వింధ్య, సాత్పురా పర్వతాలు భారత్‌ను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తున్నాయి.

 

పడమటి కనుమలు: ఇవి దక్కన్‌ పీఠభూమికి పడమరన అంచులా ఉన్నాయి. ఇవి తపతీ నది నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి, వాలు నిటారుగా ఉంది. ఈ పర్వతాల్లో జన్మించి తూర్పు వైపు ప్రవహించే నదుల్లో ముఖ్యమైనవి  గోదావరి, కృష్ణా, కావేరి. పడమటి కనుమలను సహ్యాద్రి కొండలు అని కూడా అంటారు. భారతదేశంలో ఎత్తయిన  జలపాతం జోగ్‌. ఇది రత్నగిరి, కూర్గ్‌ కొండల మధ్య శరావతి నదిపైన ఉంది. దీన్నే మహాత్మా గాంధీ జలపాతం అంటారు. ఈ కనుమల్లో ఎత్తయిన శిఖరం అనైముడి (2695 మీ.). ఇది దక్షిణ భారతదేశం, ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తయిన శిఖరం. ఈ శ్రేణిలోనే కేరళలో సైలెంట్‌ వ్యాలీ ఉంది. 

 

తూర్పు కనుమలు: ఈ కనుమలు దక్కన్‌ పీఠభూమికి తూర్పు వైపున సరిహద్దుగా వ్యాపించి ఉన్నాయి. ఇవి పడమటి కనుమల కంటే ఎత్తయినవి. వీటి సరాసరి ఎత్తు 750 మీ. వీటినే పూర్వం మహేంద్రగిరులు అని పిలిచేవారు. లాంగుల్యా, సీలేరు, వంశధార, మాచ్‌ఖండ్‌ లాంటి నదులు ఈ కొండల్లో జన్మించాయి. లాంగుల్యా, సీలేరు పడమర వైపు; వంశధార, మాచ్‌ఖండ్‌ తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. దక్షిణాన వీటికి అడ్డంగా కృష్ణా, పెన్నా నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల మధ్య వ్యాపించి ఉన్న కొండలే నల్లమల కొండలు. వీటికి  దక్షిణాన పాలకొండలు ఉన్నాయి.

 

నీలగిరి కొండలు: తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతాన్నే నీలగిరి కొండలు అంటారు. ఈ కొండల్లో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2652 మీ.). అన్నామలై కొండలకు దక్షిణంగా నీలగిరి కొండలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉండే 32 కి.మీ. ప్రాంతాన్ని పాల్‌ఘాట్‌ కనుమ అంటారు. అన్నామలై కొండల్లో ఈశాన్య దిశలో ఉన్న శాఖను పళని, దక్షిణాన ఉన్న శాఖను కార్డిమమ్‌ కొండలు అంటారు. ఈ కొండలు కన్యాకుమారి అగ్రం వరకు వ్యాపించి ఉన్నాయి. అనైముడి శిఖరం ఈ కొండల్లోని భాగమే.

 

దక్కన్‌ పీఠభూమి 

  ఇది నర్మదా నదికి దక్షిణాన ఉంది. ఉత్తరాన సాత్పురా పర్వతాలు, తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పడమటి కనుమలతో సరిహద్దులుగా త్రిభుజాకారంలో విస్తరించి ఉంది. ఇది భారత్‌లో అతిపెద్ద, అతి పురాతన పీఠభూమి. దీని సరాసరి ఎత్తు 300 - 600 మీ. హైదరాబాద్‌ 600 మీ. ఎత్తులో ఉంది. కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, తమిళనాడులోని ఎత్తయిన ప్రాంతం ఈ పీఠభూమిలో భాగం. 

  కోలార్‌ గోల్డ్‌ఫీల్డ్‌ కర్ణాటక పీఠభూమిలో ఉంది. ఈ పీఠభూమిలో వేసవి విడిది కేంద్రం కెమ్మెన్‌ గండి (1433 మీ.). దేశంలో మాసిన్‌రాం, చిరపుంజిల తర్వాత అత్యధిక వర్షపాతం గల అగుంబే (షిమోగా జిల్లా, కర్ణాటక) ఇక్కడే ఉంది. దక్షిణ భారతదేశంలో అధికంగా కరవులు సంభవించే మైదాన పీఠభూమి (ఉత్తర కర్ణాటక ప్రాంతం) కూడా ఉంది. 

  తెలంగాణ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు కూడా ఉన్నాయి. దీనికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణా, పెన్నా నదులు ప్రవహిస్తున్నాయి. ఉత్తరాన గోదావరి నది పరీవాహక ప్రాంతంలో గోండ్వానా శిలల ప్రాంతం బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉంది. హైదరాబాద్‌ నగరం ఈ ప్రాంతంలోనే ఉంది. కడప శిలలు ఉన్న ప్రదేశంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. తమిళనాడు పీఠభూమిని తమిళనాడు కొండలు; కోయంబత్తూర్, మధురై మెట్టభూములుగా విభజించారు. 

 

మార్వార్‌ పీఠభూమి: ఇది ఆరావళి పర్వతాలకు తూర్పున, రాజస్థాన్‌ తూర్పు భాగంలో విస్తరించి ఉంది. దీనిలోని  పశ్చిమ భాగాన్నే బొరాట్, మేవార్‌ పీఠభూములుగా పిలుస్తారు. 

 

కేంద్ర ఉన్నత పాంతం: దీన్నే మధ్య భారత్‌ పఠాన్‌ అంటారు. ఇది మార్వార్‌ పీఠభూమికి తూర్పున విస్తరించి ఉంది.బుందేల్‌ ఖండ్‌ పీఠభూమి: ఇది యమునా నదికి దక్షిణంగా, వింధ్య, సాత్పురా పర్వతాలకు తూర్పు భాగంలో విస్తరించి ఉంది. దీనికి ఉత్తరాన గ్వాలియర్‌ పీఠభూమి ఉంది.

 

మాల్వా పీఠభూమి: వింధ్య పర్వతాల్లో త్రిభుజాకారంగా విస్తరించి ఉంది. దీనికి తూర్పు దిక్కున బుందేల్‌ ఖండ్‌ పీఠభూమి ఉంది.భాగల్‌ ఖండ్‌ పీఠభూమి: ఇది చత్తీస్‌గఢ్‌లోని మైకాల్‌ శ్రేణులకు తూర్పున సున్నపురాయి, ఇసుకరాయిలతో విస్తరించి ఉంది. 

 

బస్తర్‌/దండకారణ్య పీఠభూమి: బస్తర్‌ పాంత్రం చత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉంది. ఈ పీఠభూమి ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి.

 

చోటానాగ్‌పుర్‌ పీఠభూమి: ఇది ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య భాగం. భాగల్‌ ఖండ్‌ పీఠభూమికి తూర్పున విస్తరించి ఉంది. ఇది ఝార్ఖండ్‌లో ఎక్కువగా, చత్తీస్‌గఢ్‌ ఉత్తరభాగంలో, పశ్చిమ్‌ బంగాలోని పురూలియా జిల్లాలో విస్తరించి ఉంది. ఈ పీఠభూమిని రూర్‌ ఆఫ్‌ ఇండియా (భారతదేశ ఖనిజ హృదయ భూమి) అంటారు. 

 

మేఘాలయ పీఠభూమి: ఇది రాజమహల్‌ కొండలకు ఈశాన్య భాగాన మేఘాలయ, షిల్లాంగ్‌ పీఠభూమిగా విస్తరించి ఉంది. ఇది గారో, కాశీ, జయంతియా కొండలకు తూర్పున ఉంది. 

 

రచయిత: డాక్టర్‌  గోపగోని ఆనంద్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

  భారతదేశ శీతోష్ణస్థితి

  జీవ సంపద

  భారతదేశంలో రవాణా వ్యవస్థ

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 09-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌