• facebook
  • whatsapp
  • telegram

 జనరల్ సైన్స్ - పరిచయం

సైన్స్ అనే పదం లాటిన్ పదమైన Scientia (సైన్షియా) నుంచి వచ్చింది. '(సైన్షియా)' అంటే To Learn (తెలుసుకోవడం) అని అర్థం.
 సంస్కృతంలో విజ్ఞాన్ (VIGNAN), అరబిక్ భాషలో ఇల్మ్ (ILM) అనే పదాలు జ్ఞానసంచయం (KNOWLEDGE) ను తెలియజేస్తాయి.
* విజ్ఞాన శాస్త్రం అంటే 'ప్రకృతి సహజమైన విషయాలను సాధ్యమైనంత లోతుగా, వివరంగా అవగాహన చేసుకునేందుకు మనం చేసే వ్యవస్థిత ప్రయత్నం'.


విజ్ఞానశాస్త్రం రెండు విభాగాలు
              1) భౌతిక రసాయన శాస్త్రం
              2) జీవశాస్త్రం
 * భౌతిక శాస్త్రం 'ప్రకృతి' అనే అర్థం కలిగిన గ్రీకు పదం నుంచి వచ్చింది.
 * సంస్కృతంలో భౌతిక ప్రపంచ అధ్యయనానికి వాడే తుల్య పదం 'భౌతిక్'.
 * ప్రకృతి మూలనియమాలు, ప్రకృతి సహజమైన విభిన్న దృగ్విషయాల్లో వాటి స్వయం వ్యక్తీకరణల అధ్యయాన్నే 'భౌతిక శాస్త్రం' అంటారు.
 * క్రమానుగత పరిశీలన వల్ల నిర్ధారితమైన నిజాల సమాహారమే సైన్స్.
 * సైన్స్‌ను మానవ అంశాలకు అనువర్తించి మానవ జీవితాన్ని సుఖమయం చేసేదే సాంకేతికత (Technology). సైన్స్ 'కారణం' అయితే సాంకేతికత 'ఫలితం' అవుతుంది.
ఉదా: పలాయన వేగం (11.2 km/sec) సూత్రం ఆధారంగా రాకెట్ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళుతుంది.
             ఇక్కడ పలాయనవేగం - కారణం (Science)
             రాకెట్, కృత్రిమ ఉపగ్రహం - ఫలితం (Technology)
దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో రెండు విభాగాలు సమర్థంగా పనిచేస్తాయి. అవి:
1) విజ్ఞానశాస్త్ర అభివృద్ధి: దీని వల్ల వర్తమానంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య పరిరక్షణ, శుద్ధమైన తాగునీరు లాంటివి లభిస్తున్నాయి.
2) సాంకేతికశాస్త్ర అభివృద్ధి: దీని వల్ల కొత్త ఆవిష్కరణలు కనుక్కొని వాటిని ప్రజల అవసరార్థం ఉపయోగించవచ్చు.
* శాస్త్ర - సాంకేతిక పాలసీలను సాధారణంగా ప్రధానమంత్రి ప్రకటిస్తారు.
* మొదటి సైన్స్ పాలసీని భారతదేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1958లో పార్లమెంటులో ప్రకటించారు.


ముఖ్య భావనలు
* నూతన ఆవిష్కరణలు చేసి వాటిని సాధారణ ప్రజలకు చేరువ చేయడం
* రక్షణ రంగంలో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించడం.
* శాస్త్ర సాంకేతిక విద్యాలయాలను ఏర్పాటు చేయడం.
* రెండో సైన్స్ పాలసీని ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రకటించారు.
*1993లో పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నూతన సాంకేతిక పాలసీని ప్రకటించారు.
* వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో శాస్త్ర సాంకేతికతపై సరికొత్త పాలసీని 2003, జనవరి 3న ప్రకటించారు.
* 2013 జనవరిలో ప్రధానమంత్రి డాక్టర్. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 'సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్' పాలసీని ప్రకటించారు.
* పంచవర్ష ప్రణాళికలో కూడా శాస్త్ర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.


పదో ప్రణాళిక లక్ష్యాలు
1) శాస్త్ర సాంకేతిక అంశాలపై పరిశోధనను విస్తృతం చేయడం
2) మానవ వనరులను అభివృద్ధి చేయడం, విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విషయాల్లో ఆసక్తి కలిగేలా ప్రోత్సహించడం.
3) ప్రకృతి వైపరీత్యాలను నివారించడం, వాటి తీవ్రతను తగ్గించడం.
4) పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలను పెంచడం.
పై లక్ష్యాలను 11వ పంచవర్ష ప్రణాళికలో కూడా చేర్చారు.
*  పశువులపై పరిశోధన, మహిళా శాస్త్రవేత్తలు, సైబర్ విభాగం; శాస్త్ర సాంకేతిక అంశాల్లో సమూల అభివృద్ధి, వాటిపై తీర్మానాలు చేశారు.
* 11వ పంచవర్ష ప్రణాళిక సమయంలో జాతీయ శాస్త్ర సాంకేతిక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోని శాస్త్ర సాంకేతిక విభాగంలోని అన్ని అంశాల పరిశీలనలకు బాధ్యత వహిస్తుంది.

జాతీయ శాస్త్ర సాంకేతిక కమిషన్ విధులు
 *  దేశంలో శాస్త్ర సాంకేతిక పాలసీని ప్రకటించడం.
 * శాస్త్ర సాంకేతిక సంస్థల నిర్మాణం, విధులను పర్యవేక్షించడం.
 * శాస్త్ర సాంకేతిక నిధులకు బాధ్యత వహించడం.
 * ప్రపంచ విజ్ఞాన శాస్త్ర విభాగంలో భారతదేశ అభివృద్ధిని పర్యవేక్షించడం.

భారత దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ
 *  సైన్స్ అండ్ టెక్నాలజీ భారత సంస్కృతిలో భాగంగా వస్తోంది. ఈ విషయంలో భారత శాస్త్రవేత్తలు అయిన ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్తుడు, ధన్వంతరి, ఆచార్య నాగార్జునుడు లాంటి వారు గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం; వైద్యం, రసాయన శాస్త్ర విభాగాల్లో ఎన్నో పరిశోధనలు చేశారు.
*   వీరి పరిశోధనల్లో కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా సకల మానవకోటికి అవసరమైన విషయాలను వివరించారు.
 *  జయపుర, న్యూదిల్లీలో ఉన్న ఖగోళ పరిశోధనా కేంద్రాలు, దిల్లీలోని 'అశోక స్తంభం' లాంటివి భారతదేశ సాంకేతికతకు అద్దం పడుతున్నాయి.

*  క్రీస్తు పూర్వంలో ఇనుమును మొదట గంగాలోయలో కనుక్కున్నారు. పురావస్తు పరిశోధనల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది.
*  ఆ సహస్రాబ్ది ప్రథమార్థంలో భారతదేశ ఉక్కును యుద్ధంలో ఆయుధాలను తయారు చేసేందుకు ఉపయోగించేవారు.
*  తుప్పు పట్టని ఉక్కు లేదా స్టీలును భారతదేశం ఆవిష్కరించింది.
*  ప్రఖ్యాత 'డమాస్కస్ కత్తులు', దిల్లీ ఇనుప స్తంభాన్ని తుప్పు పట్టని ఉక్కుతో తయారుచేశారు. (డమాస్కస్ కత్తులను భారతదేశ ఉక్కును దిగుమతి చేసుకుని తయారుచేశారు.)
జింక్ (యశదం)
                సాధారణంగా ఇత్తడిలో జింక్ గరిష్ఠంగా 28% ఉంటుంది. 'జింక్ డిస్టిలేషన్‌'ను భారతీయులు కనుక్కున్నారు. లోహాన్ని శుద్ధ లోహంగా తయారు చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
 *  హరప్పా పట్టణం, దిల్లీలోని కుతుబ్‌మినార్ నిర్మాణం భారత ఇంజినీరింగ్ విలువలను తెలియజేస్తాయి.
 * హరప్పా నాగరికత ప్రాచీన, ఆధునిక సాంకేతికతతో నగర నిర్మాణం, పౌర నీటి సరఫరా, హైడ్రాలిక్ ఇంజినీరింగ్ భారత శాస్త్ర సాంకేతికతకు అద్దం పడతాయి.

* నీటి నిర్వహణ వినియోగంలో హరప్పా నాగరికత నుంచి నూతన ఆవిష్కరణలు జరిగాయి. గుజరాత్‌లో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో సుదర్శన తటాకాన్ని తవ్వించారు. అనంతరం క్రీస్తు పూర్వం 150లో దానికి మరమ్మతులు చేయించారు.
* 1014 - 1053 మధ్య కాలంలో భోపాల్ రాజు 'భోజ్ సరస్సు'ను నిర్మించారు. దీని ఆనవాళ్లు ఇప్పటికీ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
*  ప్రాచీన కాలంలో భారత వస్త్రరంగం అభివృద్ధి చెందింది. గ్రీకులు, రోమన్‌లు భారత వస్త్రాలను దిగుమతి చేసుకునేవారు.
*  బ్రిటన్‌లో ఏర్పాటు చేసిన వస్త్ర పరిశ్రమ భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నదే. తర్వాత కాలంలో బ్రిటన్ ప్రపంచ వస్త్ర ఎగుమతుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
*  అహ్మదాబాద్‌లోని ముడి పత్తికి, టెక్స్‌టైల్ మ్యూజియం ప్రధానవనరు.
*  దిక్సూచి, ఇతర పరికరాలు యూరప్ కంటే ముందే హిందూ మహాసముద్రంలో ఉపయోగించారు. (నౌకాయాన రంగంలో).
* క్రీ.పూ.5వ శతాబ్దం, వేదాల కాలం నుంచే ఆయుర్వేదం ఒక దివ్యమైన విభాగంగా వర్ధిల్లింది.
* 'సాంఖ్య, న్యాయ, వైశేషిక లాంటి గ్రంథ్రాలు మానవ నిత్యజీవితంపై ప్రభావితం చూపాయి.
* ఆయుర్వేదంలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అయిన చరకుడు, సుశృతుడు వైద్య విజ్ఞానాన్ని, శస్త్రచికిత్స విధానాన్ని వివరించారు.
* ఈ విధానాల నుంచే అనేక నూతన వైద్య పద్ధతులను ఆవిష్కరించారు.
* భారత గణిత శాస్త్ర మూలాలు వేదాల్లో ఉన్నాయి. గణితంలో 'సులభసూత్ర' అనేది అనేక రకాల ఇటుకల నిర్మాణంలో ఉపయోగపడింది.
 * గణితంలో రుణసంఖ్యల వర్గమూలాలు, త్రికోణమితీయ విలవలు లాంటివి కేరళ గణిత విశ్వవిద్యాలయానికి చెందిన 'మాదవ' మొదలైనవారు వివరించారు.
* దశాంశ పద్ధతిని భారతీయులు రూపొందించారు. దీన్ని అరబ్‌లు అభివృద్ధిపరచి గణితంలో విస్తృతంగా ఉపయోగించారు.
* 20వ శతాబ్దంలో శ్రీనివాస రామానుజన్, జె.సి. బోస్, పి.సి. రే, మేఘనాథ్‌సాహ, సి.వి. రామన్, సత్యేంద్రనాథ్ బోస్, బీర్బల్ సహాని, పి.సి. మహలనోబిస్, ఎం. విశ్వేశ్వరయ్య లాంటి వారు ప్రపంచ శాస్త్ర సాంకేతికతలో తమ ఉనికిని చాటుకున్నారు.

శాస్త్ర సాంకేతికతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు
1. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ)
2. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (డీఎస్ఐఆర్)
3. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)
4 డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ)
5. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంవోఈఎస్)
* డీఎస్‌టీ  శాస్త్ర సాంకేతిక విధాన ప్రకటన రూపకల్పన, వాటి అధ్యయనం లాంటివి పరిశీలిస్తుంది.
* డీఎస్ఐఆర్ ఆర్ అండ్ డీ పారిశ్రామిక విధానం, స్వయం అన్వేషణ, సాంకేతిక బదిలీ సామర్థ్యం, నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో (NISSAT) అధికారం చలాయిస్తుంది.
* శాస్త్ర, సాంకేతికతలో సూపర్ కంప్యూటర్స్ సామర్థ్యం కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి.

ఇన్‌స్టిట్యూష‌నల్ స్ట్రక్చర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)
 * సీఎస్ఐఆర్‌ను 1942లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు.
* ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ చట్టం 1860 ప్రకారం ఏర్పడింది.
*  దీని మొదటి డైరెక్టర్ 'శాంతి స్వరూప్ భట్నాగర్'.
 * సీఎస్ఐఆర్ పారిశ్రామిక, సామాజిక, ఆర్థిక రంగాలకు కావలసిన శాస్త్ర సాంకేతికతను అందిస్తుంది.
  * దీని ప్రధాన  కార్యాలయాన్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు.
  * ప్రస్తుతం సీఎస్ఐఆర్‌లో 38 ప్రయోగశాలలు, 100 ఫీల్డ్ సెంటర్లు ఉన్నాయి.
  * 10,000 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.

సీఎస్ఐఆర్ సహకారాలు, విజయాలు
* 'అమూల్ బేబి' ఆహారం.
*నూటన్ స్టవ్.
* ఆస్తమాకు ఆస్మాన్ మందును కనుక్కున్నారు.
* మల్టీరోల్ సరస్ (Aircraft SARAS).
 * భారత మొదటి సమాంతర కంప్యూటర్ ఫ్లోసాల్వర్.
* స్వరాజ్ సోనారిక ట్రాక్టర్
 * బోటింగ్‌లో ఉపయోగించే చెరగని ఇంక్
* సీఎస్ఐఆర్ సంస్థ 'అల్ట్రా ఫిల్టరేషన్' ప్రక్రియ ద్వారా విద్యుత్తు, రసాయనాలను ఉపయోగించకుండా వ్యర్థాలను వడగట్టే పద్ధతిని అభివృద్ధి పరిచింది.
 * స్వచ్ఛమైన సోడియం క్లోరైడ్ నుంచి తక్కువ పరిమాణంలో సోడియం ఉండే ఉప్పును తయారు చేశారు.
* అధిక సామర్థ్యం ఉన్న అంతరిక్ష టీడబ్ల్యూటీ లను అభివృద్ధి పరిచారు.
* కృత్రిమ ఉపగ్రహాల్లో ఉపయోగించే పరావర్తనాలను, వివిధ రకాల దర్పణాలను తయారు చేయడానికి మొదట గాజు తయారీ యూనిట్‌న్లు సీజీసీఆర్ఐలో అభివృద్ధి చేశారు.

*  లేజర్‌ను ఉపయోగించే పవర్ సెమీకండక్టర్ పంప్‌లో ఆప్టికల్ ఆంప్లిఫయర్ (దృశా వృద్ధికరిణి)ని అభివృద్ధి చేశారు.
*  సీఈఈఆర్ఐ సంస్థ గ్లూకోజ్ ఆధారిత బయోసెన్సర్‌ను అభివృద్ధి చేసింది.
*  మలేరియా నిరోధకంగా పనిచేసే ఎంజైమ్ - ఆమ్లాల హైడ్రోలైజింగ్ ప్రక్రియను సీఎస్ఐఆర్ అభివృద్ధి చేసింది.
* బయోఆక్టిల్ ప్రోగ్రాంలో సీఎస్ఐఆర్ క్యాన్సర్, క్షయ, పైలేరియా, మలేరియా, అల్సర్, పార్కిన్‌సన్, అల్జీమర్స్ లాంటి 14 రకాల వ్యాధులకు ఆయుర్వేద, అల్లోపతి మందులను అభివృద్ధి చేసింది.
* మలేరియా వ్యాధి నిరోధకతను పెంచేందుకు ఇ-మాల్‌ మందును సీఎస్ఐఆర్ అభివృద్ధి చేసింది.
* ప్రపంచంలో మొదటి సంప్రదాయ గ్రంథాలయాలను సీఎస్ఐఆర్ సంస్థ అభివృద్ధి చేసింది.
*  డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ (జన్యు సంబంధిత వేలిముద్రల విశ్లేషణ)
*  మొదటి సింథటిక్ మందు మిథాక్యులోన్‌ను సీఎస్ఐఆర్ అభివృద్ధి పరచింది.
*  అండమాన్ వ్యక్తుల జన్యు ప్రక్రియను విశ్లేషించింది.
*  సీఎస్ఐఆర్ ప్రస్తుత ఛైర్మన్ గిరీష్ సహాని.

CSIR సంస్థ.....
           i) రసాయన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం
           ii) బొగ్గు
           iii) ఎలక్ట్రానిక్స్
           iv) ఆహారం
           v) లెదర్
           vi) లోహాలు, లోహ సంగ్రహణం
           vii) మినరల్స్
మొదలైన విభాగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు తోడ్పాటును అందజేస్తుంది.
  సీఎస్ఐఆర్ ఇప్పటి వరకు 3000కు పైగా సాంకేతికాలను, 1500 వరకు లైసెన్స్‌లను పొందింది.
* వార్షిక పారిశ్రామిక ప్రగతి అంచనా 2 బిలియన్‌ల అమెరికన్ డాలర్లు.
* సీఎస్ఐఆర్‌లో నేషనల్ ఏరో స్పేస్ ల్యాబొరేటరీ (NAL) బెంగళూరు విమానయాన రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
*  ఆయుర్వేద రంగంలో AVS, CCRUNతో కలిసి పని చేస్తుంది.
*  బయోఇన్ఫర్మాటిక్స్‌లో సోరియాసిస్, టీబీ లాంటి జబ్బులకు బయోసూట్‌ను అభివృద్ధి పరిచారు.
* ట్రెడిష్నల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ(TKDL). ఇది ఎన్ఐఎస్‌సీఏఐఆర్ ఆయుష్ విభాగం, వైద్య ఆరోగ్య శాఖ మధ్య సమన్వయం చేస్తుంది.


సరస్ (SARAS)
       దీన్ని 2004, ఆగస్టు 22న ప్రారంభించారు. ఇది భారతదేశ మొదటి మల్టీరోల్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిలో 14 సీట్లు, రెండు ఇంజిన్‌లు ఉంటాయి. ఇది టర్బ్‌ష్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్.
*  దీని కనిష్ఠ వేగం 600 కి.మీ./గం., గరిష్ఠ వేగం 1200 కి.మీ./గం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR)
*  స్వాతంత్య్రం అనంతరం వివిధ విప్లవాలు చోటుచేసుకున్నాయి.
     i) ఆహారం, ఆహార పదార్థాల అభివృద్ధి హరిత విప్లవం (Green Revolution)
     ii) నూనెగింజల అభివృద్ధి - పసుపు విప్లవం (Yellow Revolution)
     iii) పాలు (పాడి రంగం) - తెలుపు విప్లవం (White Revolution)
     iv) చేపల పెంపకం నీలి - విప్లవం (Blue Revolution)
     v) పండ్లు, కూరగాయలు - బంగారు విప్లవం (Golden Revolution)
ఈ వ్యవసాయ రంగ అభివృద్ధికి ఐసీఏఆర్ అనేది ప్రధాన విభాగం.  ఐసీఏఆర్ సెక్రటరీ పై  విభాగాలకు నోడల్ అధికారిగా పనిచేస్తారు.
*  ఐసీఏఆర్‌ను మొదట ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్‌గా, స్వతంత్ర సంస్థగా 1929లో ఏర్పాటు చేశారు.
*   ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు ఖాన్ బహుదూర్ హబీబుల్లా.
*   వ్యవసాయ మంత్రి (కేంద్ర) ఐసీఏఆర్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
*    దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ప్రస్తుత ఛైర్మన్ రాధామోహన్ సింగ్
*   వ్యవసాయ రంగంలో ఐసీఏఆర్ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌లా వ్యవహరిస్తుంది.
ఐసీఏఆర్ పాత్ర: దీని నినాదం 'అగ్రి సెర్చ్ విత్ ఏ హ్యూమన్ టచ్'.
*    వ్యవసాయ సంబంధ, పశు పాడిపరిశ్రమ, మత్స్య సంపద లాంటి విభాగాల్లో పరిశోధన చేస్తారు.
*   1976 సంవత్సరంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్ రిసోర్సెస్(NBPGR)ను ఐసీఏఆర్ దిల్లీలోని 'పూసా'లో ఏర్పాటు చేసింది.
*   ఎన్‌బీపీజీఆర్ అనేది జన్యుపరమైన విత్తనాలను భద్రపరుస్తుంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ICMR)
*  బయోమెడికల్ విభాగంలో ఈ సంస్థ పని చేస్తుంది.
*  1911 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇండియన్ రిసెర్చ్ ఫండ్ అసోసియేషన్(IRFA)ను ఏర్పాటు చేసింది. దీని సెక్రటరీ సౌమ్య స్వామినాథన్.
*  స్వాతంత్ర్యం అనంతరం 1949న IRFA ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌గా రూపాంతరం చెందింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ.
*  క్షయ, కుష్టు, కలరా లాంటి వైరస్ వ్యాధులు, ఎయిడ్స్, మలేరియా, ఆహారం, మందుల పరిశ్రమ వంటి వాటిపై అజమాయిషీ కలిగి ఉంటుంది.
*  దేశంలో ప్రబలుతున్న కొత్త వ్యాధుల గురించి ఈ సంస్థ అధ్యయనం చేస్తుంది.
ఉదా: 1986లో ఎయిడ్స్ నిర్మూలనా కేంద్రాలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ISCA)
*   దీన్ని 1914న కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీలో స్థాపించారు.
*   జె.ఎల్. సైమన్‌సన్, పి.ఎస్. మెక్‌మోహన్ శాస్త్రవేత్తల కృషి కారణంగా ఐఎస్‌సీఏను ఏర్పాటు చేశారు.
*   దీని కేంద్ర కార్యాలయం కలకత్తాలో ఉంది.
*   దాదాపు 30,000 మంది శాస్త్రవేత్తలకు దీనిలో సభ్యత్వం ఉంది.
*   భారతదేశంలో సైన్స్ అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ సమావేశాలు జరుగుతాయి.
*   మొదటి సమావేశం 1914, జనవరి 15 నుంచి 17 వరకు కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీలో జరిగాయి. దీని అధ్యక్షుడు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ.
*   రెండో సమావేశాలు 1915లో చెన్నైలో జరిగాయి. దీని అధ్యక్షుడు డబ్ల్యూ.బి. బేనర్‌మేన్.
*   రజతోత్సవ సమావేశాలు (Silver Jubilee) 1938లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు లార్డ్ రూథర్‌ఫార్డ్. ఇతడి ఆకస్మిక మరణం వల్ల హోప్ఉడ్ జీన్స్ అధ్యక్షత వహించారు.
*     34వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 1947లో న్యూదిల్లీలో జరిగాయి. అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ.
*     స్వర్ణోత్సవాలు 1963 జనవరిలో న్యూదిల్లీలో జరిగాయి. దీనికి అధ్యక్షుడు డి.ఎస్. కొఠారి.
*     వజ్రోత్సవాలు 1973 జనవరిలో చండీగఢ్‌లో జరిగాయి. దీనికి అధ్యక్షుడు ఎస్. భగవంతం.
*     63వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 1976లో వాల్తేర్‌లో జరిగాయి. దీనికి అధ్యక్షుడు ఎం.ఎస్. స్వామినాథన్. ఈ సమావేశంలో ఫోకల్ థీమ్ ను ప్రవేశపెట్టారు.
*     ప్లాటినం జూబ్లీ సమావేశాలు 1988లో పుణెలో జరిగాయి. దీనికి అధ్యక్షుడు సి.ఎన్.ఆర్. రావు.
*     98వ సమావేశాలు 2011 జనవరిలో జరిగాయి. అధ్యక్షుడు కె.సి పాండే. నోబెల్ గ్రహీతలు అమర్త్యసేన్, వెంకట్రామన్ రామకృష్ణన్ ప్రసంగించారు.
*     100వ సమావేశాలు యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో 2013, జనవరి 3 నుంచి 7 వరకు జరిగాయి. అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్ సింగ్.
*     దీని అంశం షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సైన్స్..
*     102వ సమావేశాలు 2015 ముంబయిలో జరిగాయి. అధ్యక్షుడు సర్‌జీరావు భౌరావు నిమ్సే. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైన మొదటి సమావేశం.
*     దీని అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ హ్యూమన్ డెవలప్‌మెంట్.*  104వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 2017, జనవరి 3 నుంచి 7 మధ్య తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగాయి.
*  ఈ సమావేశాల ఇతివృత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్ (జాతీయ అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం)
*  ఈ సదస్సును భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 2030 నాటికి సాంకేతిక రంగాల్లో మొదటి మూడు దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు.
*  ఎస్వీ విశ్వవిద్యాలయంలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగడం ఇది రెండోసారి. మొదటిసారిగా 1983లో 70వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి.
*  104వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఆరుగురు నోబెల్ గ్రహీతలు హాజరయ్యారు.
     i) మహ్మద్ యూనస్ (2006 సంవత్సరపు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత - బంగ్లాదేశ్)
     ii) అదా ఈ యోనత్ (2009 రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీత - ఇజ్రాయెల్)
     iii) సెర్జ్ హరోజీ (2012 భౌతికశాస్త్ర నోబెల్ గ్రహీత - ఫ్రాన్స్)
     iv) జీన్ ట్రివోల్ (2014 ఆర్థికశాస్త్ర నోబెల్ గ్రహీత - ఫ్రాన్స్)
     v) మోర్నియర్ విలియం ఎస్కో (2014 రసాయనశాస్త్ర నోబెల్ గ్రహీత - అమెరికా)
     vi) తకాకి కజిత (2015 భౌతికశాస్త్ర నోబెల్ గ్రహీత - జపాన్)
*  ప్రపంచ వ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు, 18000 మంది యువ శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
*  ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన వారు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం పరిశోధక విభాగ డైరెక్టర్
డి. నారాయణరావు.

మహిళా సైన్స్ కాంగ్రెస్
* మహిళా సైన్స్ కాంగ్రెస్‌ను 2012 నుంచి నిర్వహిస్తున్నారు.
* 6వ మహిళా సైన్స్ కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2017, జనవరి *4న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు.
* 104వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా 6వ మహిళా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు.
 *'జాతీయాభివృద్ధిలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు' అనే ఉప ఇతివృత్తంతో నిర్వహించారు.

బాలల సైన్స్ కాంగ్రెస్
* 104వ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా బాలల సైన్స్ కాంగ్రెస్‌ను 2017, జనవరి 4, 5, 6 తేదీల్లో తిరుపతిలోని స్రి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో నిర్వహించారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించారు.
*'రాష్ట్రీయ కిషోర్ వైజ్ఞానిక సమ్మేళన్‌'గా బాలల సైన్స్ కాంగ్రెస్‌ను పిలుస్తారు.
*దీనిలో 10 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు పాల్గొంటారు.
* ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ప్రతి సంవత్సరం 'బాలల సైన్స్ కాంగ్రెస్‌'ను నిర్వహిస్తారు.
* బాలల సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను 1993లో ప్రారంభించారు.
* ఈ సమావేశాల్లో అయిదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అయిదుగురు భారతీయ శాస్త్రవేత్తలకు అందజేశారు.
     1. అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు - డాక్టర్ అశోక్‌కుమార్ సక్సేనా
     2. జవహర్‌లాల్ నెహ్రూ స్మారక పురస్కారం - డాక్టర్ బలదేవరాజ్
     3. విలియం ప్లేక్స్ ఆఫ్ హానర్ అవార్డు - అచార్య పొదిలి అప్పారావు
     4. బి.సి గుహ మెమోరియల్ లెక్చర్ అవార్డు - డాక్టర్ బి.బి. కలివాల్
     5. ఎస్.ఎస్. కలియార్ ఎండోమెంట్ లెక్చర్ అవార్డు - డాక్టర్ వెంకటేశ్వర్లు
* ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి నోబెల్ బహుమతి సాధించేవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు బహుమతిగా అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
* సదస్సుకు వచ్చిన నోబెల్ బహుమతి విజేతలను 'జాతీయ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష పతకం'తో సత్కరిస్తారు.

105వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు
*   2018, జనవరి 3 నుంచి 7 వరకు ఉస్మానియ యూనివర్సిటీలో  జరుగనుంది.
*   2017 - 18 సంవత్సరానికి ఐసీఏఐ అధ్యక్షులుగా 'అచ్యుత సమంత' వ్యవహరిస్తారు.
*   2018 - 19 సంవత్సరానికి ICAI అధ్యక్షుడిగా కలకత్తాకు చెందిన డాక్టర్ 'మనోజ్ చక్రవర్తి' వ్యవహరించనున్నారు.
*  ఐసీఏఐ ప్రస్తుత కార్యదర్శి విజయభాస్కర్‌రావు.
*  103వ సమావేశాలు 2016 జనవరిలో కర్ణాటకలోని మైసూరులో జరిగాయి. దీనికి అధ్యక్షుడు అశోక్‌కుమార్ సక్సేనా.
*   దీని అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఇండీజినియస్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా.
*   మనదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి * 28న సైన్స్ దినోత్సవాన్ని, మే 11న సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
*   ఫిబ్రవరి 28 సి.వి. రామన్ 'రామన్ ఫలితం' కనుక్కున్నరోజు.
*  మే 11న రాజస్థాన్‌లో పోఖ్రాన్ వద్ద 1998, మే 11న అణుపరీక్షలను విజయవంతంగా జరిపారు.
* మొదటి భారత ఎయిర్‌క్రాఫ్ట్ హస్నా - 3ని విజయవంతంగా బెంగళూరులో ప్రయోగించారు.
* దేశంలోని విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధన, ప్రోత్సాహం పెంపొందించేందుకు ఇన్‌స్టైర్‌ ప్రోగ్రాంను ప్రారంభించారు.
* ఇన్‌స్టైర్‌ (ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ ప్రిస్విట్ ఫర్ ఇన్స్‌పైర్డ్ రీసెర్చ్) - దేశంలోని మహిళల్లో శాస్త్రవిజ్ఞానం పెంపొందించేందుకు 'ఉమెన్ సైంటిస్ట్ స్కీమ్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* సీఎస్ఐఆర్ ప్రతి సంవత్సరం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి 'శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు'ను ప్రకటిస్తుంది.
* శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును 7 విభాగాల్లో ప్రకటిస్తారు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్.
* ఈ అవార్డు పారితోషికం 2009 నుంచి రూ.5 లక్షలు లేదా 7400 డాలర్లు.
* ఎస్ఎస్‌బీపీఎస్ అండ్ టీ అవార్డును సీఎస్ఐఆర్ 1958 నుంచి ప్రకటిస్తుంది.

2015లో ఎస్ఎస్‌బీపీఎస్ అండ్ టీ అవార్డు పొందినవారు.
            బయాలజీ - బాలసుబ్రమణ్యన్ గోపాల్, రాజీవ్ కుమార్
           కెమిస్ట్రీ - ప్రద్యుత్ ఘోష్
           ఫిజిక్స్ - బి. మొహంతి, మధుకర్ దేశ్‌ముఖ్
           మెడిసిన్ - విదిత అశోక్ వైద్య
           మ్యాథమేటిక్స్ - కె.సందీప్, రితబ్రత మున్షీ
           ఇంజినీరింగ్ - యోగేష్ మోరేశ్వర్ జోషి
           ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ - జ్యోతిరంజన్ శ్రీచందన్‌రే


ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతులు పొందినవారు
*  1901 - 2015 మధ్య కాలంలో 109 సార్లు 201 మందికి ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతి లభించింది.
*  జాన్ బర్డీన్ అనే శాస్త్రవేత్త 1956, 1972లో భౌతిక శాస్త్ర విభాగంలో రెండుసార్లు నోబెల్ బహుమతిని పొందారు.
*  మొదటి నోబెల్ బహుమతిని రాంట్‌జెన్ 1901లో పొందారు. (1895లో X - కిరణాలు కనుక్కున్నందుకు) రెండో నోబెల్ బహుమతి పొందినవారు లోరెంజ్ జీమన్ (1902).

* మూడో నోబెల్ బహుమతి పొందిన వారు మేరీక్యూరి, ప్రియరీ క్యూరి (1903).
* చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వారు లారెన్స్ బ్యాగ్ (1915) (25 ఏళ్ల వయసులో).
* పెద్ద వయసులో నోబెల్ బహుమతిని పొందినవారు రేమండ్ డేవిస్ (2002) (88 ఏళ్ల వయసులో).
*ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి పొందిన పొందిన మహిళలు
       1. మేరీక్యూరి (1903)
       2. మేరియా గోపర్ట్ మేయర్ (1963)
* మేరీక్యూరి రెండు సార్లు నోబెల్ బహుమతిని పొందారు.
*నోబెల్ బహుమతిని పొందిన దంపతులు మేరీక్యూరి, ప్రియరీక్యూరి.
* నోబెల్ బహుమతిని పొందిన తండ్రి కొడుకులు
       1) విలియం బ్రాగ్ - లార్సెన్స్ బ్రాగ్ (1915)
       2) నీల్స్‌బోర్ (1922) - ఏజ్‌బోర్ (1975)
       3) జె.జె. థామ్సన్ (1918) - జె.పి. థామ్సన్ (1937)
       4) మనె సెగ్‌బాన్ (1924) - కాయ్‌సెగ్‌బాన్ (1981)
*  భారత సంతతికి చెందిన సి.వి. రామన్ 1930లో అతడి మేనల్లుడు ఎస్. చంద్రశేఖర్ 1983లో నోబెల్ బహుమతిని పొందారు.
* 2015లో నోబెల్ బహుమతి పొందినవారు
    1) తకాకి కజిత
    2) ఆర్థర్ బి. మెక్‌డొనాల్డ్ పరమాణువులోని న్యూట్రినో కంపనాలు వర్ణించారు.
* అతి చిన్న కంప్యూటర్ల ఆవిష్కరణకు దారితీసే పదార్థం, అసాధారణ దశలపై జరిపిన పరిశోధనలకు గాను బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 'డేవిడ్ థేలిస్, 'డంకెన్ హోల్డేన్, 'మైఖేల్, 'కోస్టర్లిట్జ్ 2016లో నోబెల్ బహుమతిని పొందారు.
*  వీరు గణితంలో అత్యంత ప్రత్యేక విభాగమైన 'టోపాలజీ'లో కృషి చేస్తూ పదార్థం అసాధారణ దశలపై అధ్యయనం చేశారు.
2016 కుగానూ శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును పొందినవారు
             బయాలజీ - సురేంద్రనాథ్ భట్టాచార్య
             కెమిస్ట్రీ - పార్థసారధి ముఖర్జీ
             ఫిజిక్స్ - సుబ్రమణ్యన్ అనంతరామకృష్ణ
             మెడిసిన్ - నియాద్ అహ్మద్
             మ్యాథమేటిక్స్ - నవీన్ గార్గ్, అమిరేందు కృష్ణ
             ఇంజినీరింగ్ - అవినాష్ కుమార్ అగర్వాల్, వెంకట నారాయణ పద్మనాభన్
             ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ - సునీల్ కుమార్ సింగ్
*  డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని 1971లో స్థాపించారు.
*  కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్. హర్షవర్థన్.
*  శాస్త్ర సాంకేతిక శాఖ సహాయక మంత్రి వై. సుజనా చౌదరి.
*  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.
*  స్వాతంత్య్రం అనంతరం అనేక సంస్థలు, ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి అనేక రకాలుగా తోడ్పాటును అందించాయి.
*  హిందీలో ప్రఖ్యాతి గాంచిన 'విజ్ఞాన్ ప్రగతి' అనే సైన్స్ జర్నల్‌ను 1952లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ * సైన్స్ కమ్యూనికేషన్ (NISCOM) ప్రారంభించింది.
*  1989లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 'విజ్ఞాన్ ప్రసార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
*   ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ 1985లో ఏర్పడింది.
*  సైన్స్ మీడియాలో వివిధ విభాగాలు ఉన్నాయి.
    1) ఆడియో విజువల్ మీడియా
    2) ఫోక్ మీడియా
    3) ఇంటరాక్టివ్ మీడియా.
*  కేరళలో జరిగిన ప్రజల సైన్స్ ఉద్యమం 'కేరళ శాస్త్రసాహిత్య పరిషత్'.

 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌