• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ భౌగోళిక నిర్మాణం

 (నిమ్నోన్నత స్వరూపాలు)

పురాతన ద్వీపకల్పంలో నవీన పర్వతాలు!

విశిష్ట, వైవిధ్య స్వరూపాలున్న భారత భౌగోళిక మండలాల్లో మొదటిది హిమాలయాలు. అవి దేశ ఉత్తర సరిహద్దులో సహజ కోటగా నిలిచి, వ్యవసాయ, వాతావరణ, పర్యావరణ సానుకూలతలను కలిగించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. భూపలకల కదలికలతో నేటికీ ఆవిర్భావ దశలోనే ఉన్న హిమాలయాల స్వరూప స్వభావాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అంచలంచెలుగా ఉన్న ఆ పర్వతశ్రేణుల్లోని ముఖ్యమైన శిఖరాలు, లోయలు, హిమానీనదాలు తదితరాలతో పాటు అక్కడి నగరాలు, పట్టణాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి.


భారతదేశ భూభాగ నిర్మాణాన్ని పరిశీలిస్తే కార్బోనిఫెరస్‌ యుగంలో (సుమారు 30 కోట్ల ఏళ్ల క్రితం) గోండ్వానా భూమి భూ అంతర్జనిత శక్తుల కారణంగా అనేక బీటలు, భ్రంశాలకు గురైంది. దాంతో భ్రంశీకరణ వల్ల భూప్రాంతం అక్కడక్కడా కుంగి పగులు లోయలు, పర్వతాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పెరిగిన వృక్ష సంపదను నీటి ప్రవాహాలు తీసుకొచ్చిన ఒండ్రుమట్టి కప్పేసింది. పీడన శక్తి వల్ల ఒండ్రుమట్టి స్తరాల మందం ఎక్కువ కావడంతో అవి శిలలుగా మారాయి. వీటినే అవక్షేప శిలలు, గోండ్వానా శిలలు అంటారు. ఈ శిలల ఒత్తిడి వల్ల వాటి కింద కూరుకుపోయిన వృక్షాలు బొగ్గుగా మారాయి. వీటి మందం 6 నుంచి 24 మీటర్ల వరకు ఉంటుంది. ఆ విధంగా బొగ్గు ఏర్పడిన యుగాన్నే కార్బోనిఫెరస్‌ యుగం అంటారు. సాత్పురా శ్రేణులకు చెందిన ‘మహదేవ్‌’ కొండలు ఈ కాలంలోనే ఏర్పడ్డాయి.


భారత ద్వీపకల్ప శిలల ఆధారంగా ఈ ప్రాంతం 150 కోట్ల ఏళ్ల కంటే పురాతనమైనదని చెప్పవచ్చు. ఇక్కడి శిలలు చాలా కఠినమైనవి. 1951 లెక్కల ప్రకారం దేశం మొత్తం భూభాగంలో 10.7% ఎత్తయిన పర్వత ప్రాంతం, 18.6% కొండ ప్రాంతం, 27.7% పీఠభూమి, 43.3% మైదాన ప్రాంతంగా గుర్తించారు. మొత్తం భారత భూభాగం విస్తరణ 329 మిలియన్‌ హెక్టార్లు. 


ఉపరితల స్వరూపం ఆధారంగా భారత భూభాగాన్ని అయిదు రకాలుగా విభజించవచ్చు.  

1) ఉన్నత హిమాలయ పర్వతాలు

2) గంగా - సింధూ మైదానం

3) ద్వీపకల్ప పీఠభూమి

4) తీరమైదానాలు

5) ద్వీపాలు


హిమాలయ పర్వతాలు: భారత భూపలక, యురేషియా భూపలక వైపు కదులుతూ ఉండటంతో మధ్యలోని టెథిస్‌ సముద్రంలోని శిథిలాలు సంపీడన బలాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ హిమాలయాలు సుమారు 30-50 మిలియన్ల (టెర్షియరీ భౌమ కాలంలో) ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. ఇవి నవీన ముడత పర్వతాలు. దేశానికి ఉత్తర భాగాన పెట్టని కోట మాదిరి ఉండి, అతిశీతల గాలుల నుంచి రక్షిస్తాయి. హిమాలయాల ఆవిర్భావం నేటికీ కొనసాగుతూ ఉంది. భారత భూభాగ పలక యురేషియా పలక వైపు ఏటా సుమారు 5 సెంటీ మీటర్లు కదులుతోంది. భూ అభినతి (జియో సింక్లైన్‌) వల్ల ఏర్పడిన నిక్షేపాలు ఖండ చలనం వల్ల ముడతలు పడి, ఎత్తు పెరగడం ప్రారంభమైంది. దక్షిణం వైపు ఉన్న ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరం వైపు కదలడమే ఈ ముడతలకు కారణం. హిమాలయాల్లో తొలుత ఎత్తయిన శ్రేణులు ఏర్పడ్డాయి. తర్వాత మధ్య భాగం, చివరగా వాటి దక్షిణంగా ఉన్న పర్వతశ్రేణులు ఏర్పడ్డాయి. హిమాలయాలు ఏర్పడిన కాలంలోనే దక్షిణ ద్వీపకల్ప భూభాగంలో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల శిలాద్రవం పైకి వచ్చి ఎత్తయిన భూభాగాలు ఏర్పడ్డాయి. ఈ భూభాగం క్రమంగా కోతకు గురై నున్నగా ఉన్న పడమటి కనుమలు రూపుదిద్దుకున్నాయి.


మన దేశ ఉత్తరం వైపు పడమర నుంచి తూర్పునకు సుమారు 5 లక్షల చదరపు కి.మీ. మేర విస్తరించిన హిమాలయాల పొడవు 3000 కి.మీ, వెడల్పు 300-350 కి.మీ. ప్రపంచ పర్వత శ్రేణుల్లో హిమాలయాలే నూతన పర్వతాలు. హిమాలయాల్లో ఎగువ భాగాల నదుల క్రమక్షయం, హిమానీనదాల ప్రవాహం వల్ల ఇక్కడ ఎక్కువ లోతులో ‘V’ ఆకారపు లోయలు ఏర్పడినట్లు కనిపిస్తాయి. మొదటి దశలో భారత ద్వీపకల్ప పలక, యురేషియా భూపలక వైపు కదలడం వల్ల ట్రాన్స్‌ హిమాలయాలు ఏర్పడ్డాయి (50-60 మిలియన్‌ ఏళ్ల క్రితం). రెండో దశలో ట్రాన్స్‌ హిమాలయాల దక్షిణ భాగంలో ప్రధాన కేంద్రక అతిక్షిప్త భ్రంశం (25-30 మిలియన్ల ఏళ్ల క్రితం) ఏర్పడింది. దీనినే రెండో హిమాలయ పర్వతోద్భవ దశ అనవచ్చు. ఇక్కడే హిమాద్రి, ఉన్నత హిమాలయాలు ఏర్పడ్డాయి. మూడో పర్వతోద్భవ దశ (8-10 మిలియన్ల సంవత్సరాల క్రితం) హిమాద్రికి దక్షిణంగా ఏర్పడిన ఒత్తిడి వల్ల ప్రధాన సరిహద్దు అతిక్షిప్త భ్రంశం వల్ల ఏర్పడింది. వీటినే హిమాచల్‌ నిమ్న హిమాలయాలు అంటారు. నాలుగో పర్వతోద్భవ దశ నిమ్న హిమాలయాల దక్షిణ భాగంలో నదుల వల్ల వచ్చే గులకరాళ్లు, ఇసుక, మట్టి లాంటి శిథిలాల వల్ల నిక్షేపితమైంది. ఇది 2-5 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇవే శివాలిక్‌ కొండలు.


ఉన్నత హిమాలయాలు: వీటినే ఉత్తర హిమాలయాలు, హిమాద్రి శ్రేణులు, ఇన్నర్‌ హిమాలయాలు అంటారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎవరెస్ట్‌ (8,848 మీ.), కె2- గాడ్విన్‌  ఆస్టిన్‌ (8,611 మీ.), కాంచన్‌ జంగా (8,598 మీ.), ధవళగిరి (8,172 మీ.), నంగప్రభాత్‌ (8,126 మీ.), అన్నపూర్ణ (8,078 మీ.) ఈ శ్రేణిలోనే ఉన్నాయి. వీటినే గ్రేటర్‌ హిమాలయాలు అంటారు. వీటి సగటు ఎత్తు 6,100 మీ., వెడల్పు 120 నుంచి 190 కి.మీ. భారతదేశంలో ఎత్తయిన శిఖరం కాంచన జంగా. ఎవరెస్ట్‌ను టిబెట్‌లో చోమోలుంగ్మా (ఆకాశ దేవత), చైనాలో కొమోలాంగ్మా (ప్రపంచ మాత), నేపాల్‌లో సాగర మాత అని పిలుస్తారు. ఎవరెస్ట్‌ను 1841-52 మధ్య జార్జ్‌ ఎవరెస్ట్‌ అనే ఆంగ్లేయుడు కనుక్కున్నారు. అందుకే దీనికి 1865లో ఎవరెస్ట్‌ అని పేరు పెట్టారు. ఎవరెస్ట్‌ పాత పేరు P-XV(P-15).


మధ్య హిమాలయాలు: వీటినే హిమాచల్‌ శ్రేణులు అంటారు. వీటి సరాసరి ఎత్తు 3,300 మీ.లు. ఇవి 75 కి.మీ.మేర వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఇక్కడి శిఖరాల ఎత్తు చాలా వరకు 5,000 మీ. కంటే ఎక్కువ. ఈ శ్రేణిలోనే ముస్సోరీ, సిమ్లా, డార్జిలింగ్‌ ఉన్నాయి. మధ్య హిమాలయాల దక్షిణపు వాలు ఎక్కువగా, ఉత్తరం వైపు వాలు తక్కువగా ఉంది. ఇక్కడ సతతహరిత, శృంగాకార అడవులు ఉన్నాయి. పిర్‌పంజాల్‌ శ్రేణి, ధౌలధర్‌ శ్రేణి, మహాభారత శ్రేణి, కశ్మీర్‌ లోయ దీనిలో భాగమే.


బాహ్య హిమాలయాలు (శివాలిక్‌ కొండలు): వీటినే హిమాల పాదగిరులు, పర్వత పాద హిమాలయాలు అంటారు. ప్రధాన హిమాలయాల ఒండ్రుమట్టి క్రమక్షయం వల్ల ఇవి ఏర్పడ్డాయి. సరాసరి ఎత్తు 600 మీ. నుంచి 1200 మీ. వరకు ఉంటుంది. పొడవు 2,400 కి.మీ. విస్తరించి ఉన్నాయి. వెడల్పు 8 నుంచి 48 కి.మీ. మధ్య ఉంది. ఈ శ్రేణిలో అనేక లోయలున్నాయి. వీటినే ‘డూన్‌’లు అంటారు. డెహ్రాడూన్‌ ఇక్కడే ఉంది.


ట్రాన్స్‌ హిమాలయాలు (టిబెట్‌ హిమాలయాలు): హిమాద్రికి ఉత్తరాన జమ్ము, కశ్మీర్‌ (లద్దాఖ్‌), టిబెట్‌ భూభాగాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో కారకోరం, లద్దాఖ్‌ (రాకపోషి), జస్కర్‌ పర్వతశ్రేణులున్నాయి.


కశ్మీర్‌ లోయ: ఇది అభినతి లోయ. గతంలో సరస్సుగా ఉండి, ఒండ్రుమట్టితో పూడుకుపోయింది. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన పిర్‌పంజల్‌ శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. కశ్మీరు లోయ 150 కి.మీ. పొడవు, 80 కి.మీ. వెడల్పుతో ఆగ్నేయ దిశ నుంచి వాయవ్య దిశగా వ్యాపించి ఉంది. దీని సరాసరి ఎత్తు 1700 కి.మీ.


హిమాలయాల్లో వివిధ పర్వత శ్రేణులు:


పిర్‌పంజాల్‌ శ్రేణి: జమ్ము- కశ్మీర్‌లో ఉంది. హిమాచల్‌ పర్వత శ్రేణిలో ఇది పొడవైనది. దీనిని ‘గేట్‌ వే ఆఫ్‌ శ్రీనగర్‌’ అని పిలుస్తారు.


ధౌలధర్‌ శ్రేణి: హిమాచల్‌ప్రదేశ్‌ (సిమ్లా)లో ఉంది.


నాగటిబ్బా శ్రేణి, ముస్సోరీ శ్రేణి, మహాభారత్‌ శ్రేణి: ఉత్తరాఖండ్‌లో ఉంది.


కారకోరం శ్రేణి: వాయవ్య కశ్మీర్‌లో ఉంది. వీటినే కృష్ణగిరి పర్వతాలు అంటారు. ఆసియా భూభాగ వెన్నెముక (బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ ఏషియా) గానూ పిలుస్తారు.


లద్దాఖ్‌ శ్రేణి: సింధూ, సియాక్‌ నదుల మధ్యలో, జస్కర్‌ శ్రేణికి సమాంతరంగా ఉంది.


జస్కర్‌ శ్రేణి: హిమాద్రి పర్వతాల నుంచి 80 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వాయవ్య దిశగా విడిపోయిన పర్వతశ్రేణి.

 


 


రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

 

Posted Date : 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌