• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణ కాలుష్యం

వేడి మోతాదు మించితే ముప్పు!


 

అప్పుడప్పుడు పరిశ్రమల సమీపంలోని జలాశయాల్లో జలచరాలు చనిపోయి నీటిపై తేలియాడటం కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో నేల గాఢతలో మార్పులు వచ్చి, సారం తగ్గిపోయి, ఉత్పత్తి దెబ్బతింటుంది. వీటికి కారణం పరిశ్రమలు విచక్షణరహితంగా వేడి నీటిని జలాశయాల్లో వదలడం, నదులు, చెరువుల ఒడ్డున ఉన్న చెట్లను మనుషులు విచ్చలవిడిగా నరికి వేయడం. ఫలితంగా వాటిల్లోని నీళ్లు వేడెక్కి, ఉష్ణ కాలుష్యం ఏర్పడి, రకరకాల అనర్థాలకు కారణమవుతున్నాయి. జనం వ్యాధులకు గురవుతున్నారు. ఇతర జీవులు నశించిపోయి పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఉష్ణకాలుష్యం కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

మనిషి కార్యకలాపాల వల్ల జలచరాలు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగే విధంగా నీటి ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవిస్తున్నాయి. ఈ రకమైన కాలుష్యాన్ని థర్మల్‌/ఉష్ణ కాలుష్యంగా భావిస్తారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా థర్మల్‌ కాలుష్యం పెరుగుతోందని, ఫలితంగా జలచరాలకు తీరని నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. థర్మల్, అణు విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఉష్ణం చాలా తక్కువగా యంత్రాలు పనిచేయడానికి ఉపయోగపడితే, ఎక్కువ భాగం వ్యర్థ ఉష్ణంగా బయటకు వెలువడుతోంది. ఇది  పరిసరాలను వేడెక్కిస్తోంది. ఈ వ్యర్థాలను చల్లబరచడానికి సమీపంలోని నదులు/జలాశయాల నీటిని ఉపయోగిస్తారు. ఆ విధంగా విడుదలైన ఉష్ణ జలాలను తిరిగి నదులు/జలాశయాల్లో వదులుతారు. అప్పుడు జలాశయాల నీటి ఉష్ణోగ్రత సుమారు 6 నుంచి 10 డిగ్రీల వరకు పెరుగుతోంది. ఫలితంగా నీటిలోని ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి జలచరాల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. మరొకవైపు నదులు, జలాశయాల వెంట విస్తరించి ఉన్న చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. దీంతో సాధారణ జలాల్లో ఉష్ణోగ్రత పెరిగి మోతాదుకు మించి వేడెక్కుతున్నాయి. చివరకు జలచరాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కొన్ని పరిశ్రమల నుంచి అతి చల్లని నీరు కూడా విడుదలై నీళ్లలోని ప్రాణులకు హానికరంగా మారుతోంది. ఈ విధంగా ఇతర కాలుష్యాలకు తీసిపోని విధంగా థర్మల్‌ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా జలచరాల జీవన స్థితిగతులను, తద్వారా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తోంది. 


ఉష్ణ కాలుష్య కారకాలు:  
 

1) పరిశ్రమలు 


2) థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు 


3) జలవిద్యుత్తు కేంద్రాలు 


4) అణువిద్యుత్తు కేంద్రాలు 


5) గృహ సంబంధిత వ్యర్థాలు 


ఉష్ణకాలుష్య ప్రభావాలు:


1) నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ తగ్గుదలs (Reduction of Dissolved Oxygenz): ఉష్ణ కాలుష్యం వల్ల నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గిపోయి జలచరాలు చనిపోతాయి. 32°F వద్ద కరిగి ఉన్న ఆక్సిజన్‌ గాఢత 14.6 ppm ఉంటే, 64°F వద్ద నీటిలో ఆక్సిజన్‌ గాఢత 6 ppmమాత్రమే ఉంటుంది. చల్లని నీటిలో చేపలు జీవించడానికి కనీసం 6 ppm ఆక్సిజన్‌ అవసరం. 


2) జీవక్రియలకు అంతరాయం: ఉష్ణ కాలుష్యం వల్ల జీవుల శరీర ధర్మాలు, జీవక్రియలు, జీవరసాయన ప్రక్రియలు ప్రభావితమవుతాయి. తద్వారా జీవరాశుల శ్వాస, జీర్ణ, విసర్జక వ్యవస్థలు ప్రభావితమై జీవుల మనుగడ కష్టమవుతుంది. 


3) నీటి ధర్మాల్లో మార్పు: సాధారణ స్థాయికి మించి నీటిలో ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి భౌతిక, రసాయన ధర్మాల్లో మార్పులు వస్తాయి. ఉష్ణకాలుష్యం వల్ల నీటి బాష్పీభవన ప్రక్రియ పెరగడమే కాకుండా, నీటి సాంద్రత తగ్గి, స్నిగ్ధతలో మార్పులు వస్తాయి. దాంతో నీటి కణాలు వేగంగా స్పందన ప్రక్రియకు గురవుతాయి. దానివల్ల జలచరాల ఆహారంపై ప్రభావం పడుతుంది.


4) జలచరాల ప్రత్యుత్పత్తికి అంతరాయం: అనుకూల ఉష్ణోగ్రతల వద్ద చేపలు తదితర జలచరాలు గుడ్లు పెట్టడం, పొదగడం వంటి ప్రత్యుత్పత్తి ప్రక్రియలు నిర్వహిస్తాయి. అలాగే వలసలు కూడా నీటి ఉష్ణోగ్రత మీద ఆధారపడతాయి. ఉష్ణ కాలుష్యం చేపలు గుడ్లు పెట్టడంపై ప్రభావం చూపుతుంది. పొదగాల్సిన గుడ్లు నాశనమవుతాయి. 


ఉదా: ట్రౌట్‌ జాతి చేపలు గుడ్లు పెట్టడానికి 8.9°C అనుకూలమైన అత్యధిక ఉష్ణోగ్రత కావాలి.


5) జలచరాల జీవితకాలం తగ్గుదల: ఉష్ణ కాలుష్యం వల్ల నీటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జలచరాల క్రియాశీలత పెరిగి క్రమంగా జీవక్రియల సామర్థ్యం, జీవితకాలం తగ్గిపోతాయి. ఉదా: క్రస్టేషియన్‌ జాతికి చెందిన డాఫ్నియా జీవి 8°C వద్ద 108 రోజులు జీవిస్తుంది..అదే జీవి 21°C వద్ద 29 రోజులు మాత్రమే బతుకుతుంది.  


6) శైవలాల వృద్ధి వల్ల ఆహారపు గొలుసులో మార్పులు: వేడి నీటిని జలాశయాల్లోకి వదిలే సమయంలో, వ్యవసాయ భూముల నుంచి వచ్చే వ్యర్థాల్లోని పోషకాలు ఆ నీటిలో కలుస్తాయి. పోషకాల వల్ల జలాశయాల్లో శైవలాలు విపరీతంగా పెరిగి యూట్రోఫికేషన్‌ జరుగుతుంది. దీంతో నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి జలచరాలు త్వరగా నశించిపోతాయి. ఫలితంగా జల ఆహారపు గొలుసుకు విఘాతం ఏర్పడుతుంది. 


7) చల్లటి నీటిలోని జీవులకు ప్రాణ సంకటం: ఒక పెద్ద విద్యుత్తు కేంద్రం రోజుకు సుమారుగా 500 మిలియన్‌ గ్యాలన్ల నీటిని కండెన్సర్ల ద్వారా నదులు/జలాశయాల నుంచి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో చల్లటి నీటిలోని చిన్న చేపలు, ప్లవకాలు (చిన్న నీటి మొక్కలు), కీటకాల లార్వాలు వంటి వాటిని కండెన్సర్‌ పీల్చుకోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారిపోతుంది. దాంతో నీటి సాంద్రత, పీడనంలో తేడాలు వచ్చి జల జీవరాశులు మరణిస్తున్నాయి.


మనిషిపై ఉష్ణకాలుష్య ప్రభావం:
 

* పరిశ్రమల నుంచి వచ్చే మలినాలు నీటిలో కలిసి ఆక్సిజన్‌ పరిమాణాన్ని తగ్గిస్తాయి. వేడి నీటిలోని పాదరసం, కాపర్, కాడ్మియం, ఆర్సెనిక్, క్లోరిన్‌ లాంటి విష మలినాలు మనుషుల్లో వ్యాధులను కలుగజేస్తాయి.


* ఉష్ణ కాలుష్యం వల్ల నీలి ఆకుపచ్చ శైవలాలు వేగంగా పెరుగుతాయి. దాంతో విష పదార్థాలు (టాక్సిన్లు) ఉత్పత్తి అయ్యి నీటి నాణ్యత తగ్గి మనుషులకు ప్రాణాంతకంగా మారుతుంది. 


* పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి కండెన్సర్ల ద్వారా విడుదలైన వేడినీటిని తట్టుకునే కొన్ని థర్మోఫైల్స్‌ సూక్ష్మజీవులు సురక్షితంగా బయటపడి వ్యాధికారకాలు అవుతాయి. 


* వేడినీరు పంట పొలాలపై ప్రవహించినప్పుడు లవణాలను కరిగించడమే కాకుండా నేల గాఢతలో మార్పు తీసుకొస్తుంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు చిన్నాభిన్నమవుతాయి.


 

ఉష్ణకాలుష్య నివారణ చర్యలు:
 

* యంత్రాలు ఎక్కువగా వేడెక్కకుండా చర్యలు తీసుకొని, వాటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఉష్ణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.  


* జలాశయాల్లోని నీటిని యంత్రాల్లోకి పంపి యంత్రభాగాలను చల్లబరచి, తిరిగి వేడి నీటిని జలాశయంలోకి పంపించేందుకు శీతలీకరణ ప్రక్రియను చేపట్టాలి.  


* కృత్రిమ సరస్సులు, చెరువులను ఏర్పాటు చేసి వ్యర్థ నీటిని గొట్టాల ద్వారా ఒకటి లేదా రెండు మీటర్ల లోతులోకి వదలాలి. అదే సరస్సులు, చెరువుల నుంచి తిరిగి 15 మీటర్ల లోతులో అమర్చిన గొట్టాల ద్వారా మళ్లీ యంత్రాల్లోకి ప్రవేశపెట్టాలి. దాంతో పైనున్న నీటిపొర బాష్పీభవనం వల్ల క్రమంగా చల్లబడుతుంది.


* వేడినీరు భూమిలో ఇంకే విధంగా చూడాలి. 


* సరైన కూలింగ్‌ టవర్స్, పాండ్స్‌ని ఏర్పాటు చేయాలి. 


* పరిశ్రమల నుంచి వెలువడిన వేడినీటిని చల్లార్చి, తిరిగి అదే పరిశ్రమలో వినియోగించాలి. 


* వ్యర్థజలాల్లోని విష రసాయనాలను వడబోసి శుద్ధజలాలను మాత్రమే జలాశయాల్లోకి పంపించాలి. 


* పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రభుత్వాలు యంత్రాల దక్షత, నాణ్యతను పరిశీలించాలి. 


* పారిశ్రామిక ఉష్ణజలాలను ఎక్కువ దూరం ప్రవహింపజేస్తే కొంత నీరు ఆవిరై, కొన్ని రసాయనాలు వడపోతకు గురవుతాయి. దాంతో కొంత నష్టాన్ని తగ్గించవచ్చు. 


   మాదిరి ప్రశ్నలు


1. కాలుష్య కారకాలు పర్యావరణంలోనికి ప్రవేశించిన తర్వాత రసాయన చర్యల ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని ఏ విధంగా పిలుస్తారు?

1) ప్రాథమిక కాలుష్యాలు    2) గుణాత్మక కాలుష్యాలు 

3) ద్వితీయ కాలుష్యాలు    4) ఏదీకాదు



2. కిందివాటిలో జీవ విచ్ఛిన్న కాలుష్య జనితాలు ఏవి?

1) గృహ విసర్జితాలు        2) ఉష్ణ కాలుష్యం

3) 1, 2                 4) ఏదీకాదు



3. మైనింగ్‌ పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాలుష్యకాలు ఏవి?

1) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌   2) ఫెర్రస్‌ సల్ఫేట్‌

3) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం   4) పైవన్నీ



4. కిందివాటిలో రుణాత్మక మృత్తికా కాలుష్య కారకాలు ఏవి?

1) మైనింగ్‌ కాలుష్యాలు   2) బ్లాస్టింగ్‌ కాలుష్యాలు 

3) అడవుల నరికివేత     4) పైవన్నీ



 

5. న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి విడుదలయ్యే రేడియోధార్మికత వ్యర్థ పదార్థాలు ఏవి?

1) స్ట్రాన్షియం - 90      2) అయోడిన్‌ - 129      3) సీజియం - 137      4) అన్నీ



 

6. నీటిలోని ఏ వ్యాధి కారకాలు మురుగు నుంచి ఉత్పత్తవుతాయి?

1) బ్యాక్టీరియా     2) ప్రోటోజోవా      3) 1, 2      4) 1 మాత్రమే




7. తాజ్‌మహల్‌ సౌందర్యానికి దేని నుంచి ప్రమాదం ఉంది?

1) యమునా నది     2) మురుగు నీరు    3) మధురై రిఫైనరీ    4) మార్బుల్స్‌పై ఉష్ణోగ్రత, వర్షం ప్రభావం



8. డిటర్జెంట్‌ పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యాలు?

1) క్షారాలు    2) అమ్మోనియా సమ్మేళనాలు

3) 1, 2      4) ఏదీకాదు



9. ఉష్ణ కాలుష్యం వల్ల ఏ నష్టాలు జరుగుతాయి?

ఎ) నీటిలోని ఆక్సిజన్‌ తగ్గుతుంది.

బి) జీవుల జీవక్రియకు అంతరాయం.

సి) నీటి ధర్మాల్లో మార్పులు. 

డి) శైవలాలు వృద్ధి చెందుతాయి.

1) ఎ, బి      2) బి, సి     3) ఎ, బి, సి     4) పైవన్నీ



10. ఉష్ణ కాలుష్యం వల్ల నీటిలో ఏ పదార్థం తగ్గితే జలరాశులకు హాని కలుగుతుంది?

1) ద్రావిత ఆక్సిజన్‌     2) ద్రావిత నైట్రోజన్‌      3) కాల్షియం      4) క్లోరిన్‌


సమాధానాలు: 1-3;     2-3;    3-4;   4-4;    5-4;    6-3;   7-3;    8-3;    9-4;   10-1.


 రచయిత: జల్లు సద్గుణరావు


 

 

Posted Date : 08-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌