• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ వార‌స‌త్వ క‌ళ‌లు

తెలంగాణ ఘన వారసత్వ సంపదలో భాగమైన అద్భుత కళలెన్నో ఇక్కడి ఖ్యాతిని చాటిచెప్పాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత.. హస్తకళల్లో అద్భుత నైపుణ్యం ఉట్టిపడుతుంది. చేనేతలు, కొయ్యబొమ్మలు, లోహ సామగ్రి, లేసుల అల్లికలు, వ్యవసాయ పరికరాలు.. తదితర పరిశ్రమలెన్నో తెలంగాణ ప్రత్యేకం. లలిత కళలు విస్తృత ప్రాచుర్యం పొందడంతోపాటు.. పూసలు, గాజులు, ముత్యాలు, వజ్రాల పరిశ్రమలు విరాజిల్లాయి. భాగ్యనగరమైన హైదరాబాద్ సహా పోచంపల్లి, నిర్మల్, దుమ్ముగూడెం తదితర ఎన్నో ప్రాంతాలు ఘన వారసత్వాన్ని చాటుతున్నాయి. ప్రాచీనకాలం నుంచి తెలంగాణ ఖ్యాతిని చాటి చెబుతున్న ఈ కళలపై ప్రత్యేక అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం..

ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వృత్తికళా నైపుణ్యం, కళా రూపాలు, వాస్తు-శిల్పకళలు లాంటి వాటితోపాటు.. స్థిర, చరాస్తులు, సిరి సంపదలు ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించడాన్నే వారసత్వం అంటున్నాం. అనాదిగా మన పూర్వీకులు విశిష్టమైన సంస్కృతిని వారసత్వ పరంపరగా తరతరాలకు అందిస్తూ వచ్చారు. మహోన్నతమైన భారతీయ సంస్కృతికి హరప్పా ప్రజలు పునాదులు వేశారు. నదుల వరదలకు గట్లు కట్టి పంటలు పండించడం నేర్పారు. ప్రపంచంలోనే తొలిసారిగా సింధు ప్రజలు పత్తిని పండించారు. కాల్చిన ఇటుకలను, ముద్రికలను తయారు చేశారు. మట్టి పాత్రలు, కంచుపాత్రలు, ఇతర సామగ్రి తయారీ.. పూసల పరిశ్రమ.. విగ్రహారాధన.. అమ్మతల్లి-శక్తి దేవతారాధన.. పుష్కరిణిలో పవిత్ర స్నానాలు.. మత, ధార్మిక సంప్రదాయాలెన్నింటినో వేల సంవత్సరాల కిందటే వారు ఆచరించి చూపించారు. మనం వాటిని అనుసరిస్తున్నామంటే అది సింధు ప్రజలు భారత జాతికి అందించిన వారసత్వమే.

ఘన వారసత్వం

తెలంగాణ సమాజానికి వారసత్వ పరంపరగా సంక్రమించిన ఘనతరమైన కళాసంపద ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కళ అభివృద్ధి చెందింది. వాటిని ఆదరిస్తూ నేటికీ ఆచరిస్తుండటం విశేషం. వృత్తిధర్మాన్ని నమ్మడం.. అంటే వృత్తినే దైవంగా భావించడం, అది దైవదత్తమనే విశ్వాసం మన భారతీయ సంస్కృతిలోని గొప్పదనం. చాలామంది కులవృత్తులను నమ్ముకుని వాటినే జీవనాధారంగా మలచుకోవడం వల్లే ఆయా కళలు, కళారూపాలు నేటికీ వర్థిల్లుతున్నాయి. అనాదిగా మనదేశంలో ఆర్థిక వ్యవస్థకు పల్లెసీమలే పట్టుగొమ్మలుగా ఉన్నాయి. వ్యవసాయంతోపాటు వృత్తి ఆధారిత కుటీర పరిశ్రమలు, హస్తకళలు ఆర్థిక వ్యవస్థలో ప్రధానపాత్ర పోషించాయి. కొన్ని వృత్తులు, కళలు కుటీర, లఘు పరిశ్రమల స్థాయికి ఎదిగాయి. కొన్ని కళలు, కళారూపాలు మౌఖిక ప్రచారమే మాధ్యమంగా.. జానపద బిక్షుక గాయకుల కృషి ఫలితంగా వికాసం పొందాయి. అలాంటి వారి జీవనానికి, మనుగడకు కూడా ప్రాణవాయువులయ్యాయి. మరికొన్ని కళలు.. సంగీతం, నృత్యం లాంటివి జమీందార్‌లను, సంస్థానాధిపతులను, సంపన్నులను రంజింపజేయడం ద్వారా అభివృద్ధి చెందాయి. వారంతా వాటిని పోషించారు.

హస్తకళా వికాసం
హస్తకళా నైపుణ్యంలో తెలంగాణ ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. ఇక్కడి వస్త్ర పరిశ్రమకు వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. లోహ సంగ్రహణం (Metallurgy), గృహోపకరణాలు, ఆటబొమ్మలు, విలాస వస్తువులు, పూసల తయారీ, చిత్రలేఖనం తదితర హస్తకళలెన్నో అభివృద్ధి చెంది, దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి.

చేనేతలు, అద్దకం
ప్రాచీన కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో నేతకళ ప్రాచుర్యం పొందింది. శాతవాహనుల కాలంలోనే ఇక్కడి నుంచి రోమ్‌కు సన్నని పట్టు సెల్లాలు ఎగుమతి అయ్యేవి. సన్నటి సాలెగూడు లాంటి వస్త్రాలంటే రోమన్ యువతులకు అత్యంత ఇష్టమని ప్లీనీ లాంటి చరిత్రకారుల రచనల వల్ల తెలుస్తోంది. రుద్రమదేవి పరిపాలన కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో కూడా ఇక్కడి చేనేత, వస్త్రకళా నైపుణ్యాన్ని ప్రశంసించాడు. పాల్కురికి సోమన తన పండితారాధ్యచరిత్రలో 50 రకాలైన వస్త్రాలను ప్రస్తావించాడు. కుతుబ్‌షాహీ, నిజాం కాలంలో కూడా తెలంగాణలో నేత పరిశ్రమ విస్తరించింది. నల్గొండ జిల్లా పోచంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల, కొత్తకోట, నారాయణపేట్‌లు నేత వస్త్రాలకు పెట్టిందిపేరుగా ఖ్యాతి పొందాయి. భూదాన్ పోచంపల్లి చీరలు, పట్టుచీరల తయారీలో కళాకారులకు తమదైన ప్రత్యేక శైలి ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు పోచంపల్లి Tie & dye పరిశ్రమకు కేంద్రాలుగా మారాయి. చౌటుప్పల్, కొయ్యలగూడెం, సిరిపురం, రామన్నపేట, పుట్టపాక, గట్టుప్పుల, తేరటుపల్లి, చండూరు ప్రాంతాల్లోని వేలాది మంది చేనేత కార్మికులు పోచంపల్లి చీరలు, పట్టు చీరలకు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. పుట్టపాక నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలను రూపొందించారు. ఇలా పోచంపల్లి పట్టు వస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. తెలుగునాట ఏ ఇంట్లో ఏ శుభకార్యమైనా గద్వాల, కొత్తకోట, నారాయణపేట్‌ల చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. తెలంగాణలో తివాచీలు, రగ్గులు, కంబళ్ల తయారీకి వరంగల్ ప్రసిద్ధి చెందింది. మఖ్‌మల్, సన్నటి వస్త్రాలకు నాటి కాలంలో గోల్కొండ ప్రాచుర్యం పొందింది. మెదక్ అద్దకం వస్త్రాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. జాతీయ, అంతర్జాతీయ విపణిలో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో ఇదొక ప్రత్యేక కళగా అభివృద్ధి చెందింది. ఒకే చిత్తరువుపై లేదా వస్త్రంపై అనేక రంగులను అద్దడం దీని ప్రత్యేకత.

లోహ పరిశ్రమ

లోహపు పాత్రలు, లోహపు సామగ్రి, పూజా పాత్రలు, కంచు-ఇత్తడి-రాగి మిశ్రమ లోహాలతో తయారైన వస్తు సామగ్రి తయారీకి తెలంగాణ పెట్టింది పేరు. నల్గొండ జిల్లాలోని పానగల్లు, చండూరు ప్రాంతాల్లో.. దేవాలయాల్లో ఉపయోగించే కంచు గంటలు, పళ్లాలు, పాత్రలు, శఠగోపం, సింహతలాటం, నాగాభరణాలు తయారయ్యేవి. వరంగల్ జిల్లా పెంబర్తి, పరకాల ప్రాంతాల్లో ఇత్తడి, కంచు లోహపు పనులు చేసే కళాకారులున్నారు. కురనపల్లి, సిద్దిపేట(మెదక్ జిల్లా)ల్లోని కళాకారులు ఇత్తడి, కంచు ఉత్పత్తుల తయారీలో సిద్ధహస్తులు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, నిజామాబాద్ జిల్లా ఇందూరులో ఇనుము, ఉక్కు, ఆయుధ పరిశ్రమలున్నాయి. కుతుబ్‌షాహీల కాలంలోనే నిర్మల్‌లో తయారైన కత్తులు డమాస్కస్‌కు ఎగుమతయ్యేవి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డమాస్కస్ కత్తుల తయారీలో గోల్కొండ ఉక్కు ఉపయోగించినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో అతి ప్రాచీనమైన, సున్నితమైన వెండి నగిషీలు చెక్కే నిపుణులైన కళాకారులున్నారు. సన్నని వెండి తీగలను అల్లడం, పోత పోయడంలో వీరు సిద్ధహస్తులు. తాంబూలం పెట్టెలు, కుంకుమ భరిణలు, పతకాలు, షీల్డులు, గుండీలు, ఫొటోఫ్రేమ్‌లు తదితర వెండి పనులకు కరీంనగర్ ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ పాతబస్తీలో సన్నటి వెండిరేకులు, మిఠాయిలపై అతికించే వెండి కాగితం తయారీ కళాకారులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. హైదరాబాద్ ప్రాంతం ప్రత్యేకమైన 'బిద్రీ' పరిశ్రమకు కేంద్రంగా ఉంది. పర్షియన్ సంప్రదాయానికి చెందిన ఈ కళ దక్కన్‌లో బహమనీ సుల్తాన్‌ల కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఈ కళ కర్ణాటక (బీదర్) నుంచి హైదరాబాద్‌కి ప్రవేశించి 'బిద్రీ' కళగా ప్రసిద్ధి గాంచింది. ఇది పూర్తిగా రెండు, మూడు రకాల మిశ్రమ లోహాలతో కలిసి ఉన్నది. తుత్తునాగం, రాగి కలిసిన మిశ్రమ లోహంతో నీటి పాత్రలు, జార్‌లు, పూలకుండీలు, భరిణలు, తాంబూలం / సుగంధ ద్రవ్యాల పెట్టెలు, హుక్కా బుడ్డీలు తదితర వస్తుసామగ్రి తయారుచేస్తారు. ఈ మిశ్రమ లోహం ప్రత్యేకత తుప్పు పట్టకుండా ఉండటమే.
 

లేసుల అల్లికలు

లేసుల అల్లిక కళ ప్రధానంగా క్రైస్తవ మతసంస్థల ప్రచారం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం లేసుల అల్లిక పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. నూలు దారాన్ని తీసుకుని నిర్ణీత ఆకృతుల(డిజైన్)లో సూది సహాయంతో అల్లుతారు. అమ్మాయిలు ధరించే పరికిణీ(వోణీ)ల అంచులు.. ఇంటి గుమ్మాలకు, కిటికీలకు తెరలు.. టేబుల్ మ్యాట్‌లు.. చిన్న తాళపు చెవిలు, వస్తువులు లాంటివి భద్రపరచుకోవడానికి గోడలకు వేలాడదీసే సంచులు.. తదితర వస్త్రాల తయారీలో ఈ కళాకారులు సిద్ధహస్తులు.

పూసలు, ముత్యాలు, వజ్రాలు

తెలంగాణలోని గోల్కొండ తొలినాళ్ల నుంచే వజ్ర పరిశ్రమకు పేరు పొందింది. కాకతీయులు, కుతుబ్‌షాహీల కాలం నుంచే విలువైన వజ్రసంపదకు గోల్కొండ ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాల గనులున్నట్లు విదేశీ యాత్రికులు మార్కోపోలో, ధీవాట్, ట్రావెర్నియర్‌లు ప్రస్తావించారు. ఇక్కడి గనుల్లో 60 వేల మందికి పైగా కార్మికులు పనిచేసినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు సాన (మెరుగు) పట్టే పరిశ్రమ కొనసాగింది. హైదరాబాద్‌లోని ముత్యాల పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. గుల్జార్‌హౌస్, చార్ కమాన్, పత్తర్‌గట్టీ ప్రాంతాలు ముత్యాల వర్తకానికి పేరొందిన ప్రాంతాలు. కుతుబ్‌షాహీ పాలకుల కాలం నుంచే భద్రాచలంలో శ్రీరామనవమినాడు అంగరంగ వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి గోల్కొండ నుంచి పాలకులు ముత్యాల తలంబ్రాలను పంపించే ఆనవాయితీ ఉంది. హైదరాబాదీ ముత్యాలు దేశ విదేశాల్లో సైతం విశేషంగా ప్రాచుర్యాన్ని పొందాయి. తెలంగాణలో స్త్రీలు ప్రత్యేకంగా ధరించే నగలు, ఆభరణాలు, నల్లపూసల గొలుసుల్లో అలంకరణకు ఉపయోగించే పూసల తయారీకీ పాపానాయుడుపేట పెట్టింది పేరు. గాజును కరిగించి పూసలను చేత్తోనే తయారు చేస్తారు. ఇందుకోసం వాడే ప్రత్యేకమైన గాజును ఫిరోజాబాద్ నుంచి దిగుమతి చేసుకోవడం విశేషం. హైదరాబాద్‌లోని లాడ్ బజార్, చార్మినార్ ప్రాంతాలు గాజుల తయారీకి ప్రసిద్ధి.

కొయ్యబొమ్మలు
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. ఇక్కడ కొయ్యబొమ్మల తయారీకీ బూరుగు, పొనుకు కర్రను ఉపయోగిస్తారు. పిల్లల ఆటబొమ్మలు, అందమైన గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు నిర్మల్ హస్తకళల కేంద్రాల్లో తయారవుతున్నాయి. ఏటికొప్పాక కొయ్యబొమ్మలు కూడా ప్రముఖమైనవి. లక్కపిడతలు, పిల్లల ఆట వస్తువులు, చదరంగపు పలకలు, పలకలు, దీపపు బుడ్లు, గృహాలంకరణ వస్తువులు ఇక్కడి పరిశ్రమల్లో వైవిధ్యభరిత రూపాల్లో తయారవుతున్నాయి. ఏటికొప్పాక లక్కబొమ్మల్లో అంకుడు, గిరిమల్లి కర్రలను ఉపయోగిస్తున్నారు.

వడ్రంగం
తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వడ్రంగి వృత్తివారు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అవసరమయ్యే పరికరాలు, సామగ్రికి ప్రతి గ్రామంలోనూ వడ్రంగి వృత్తివారు వారసత్వ పరంపరగా ఇంట్లోనే కుటీర పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. నాగళ్లు, గొర్రులు, దుక్కిదున్నే.. విత్తనాలు నాటే.. సామగ్రి కోసం కర్రను ఉపయోగించడంలో వీరు సిద్ధహస్తులు. గృహ నిర్మాణానికి కావాల్సిన కలప సామగ్రి, తలుపులు, కిటీకీలు ఫర్నిచర్ మాత్రమే కాకుండా నేత పరిశ్రమలో వినియోగించే వస్తు సామగ్రిని అందిచడంలోనూ వడ్రంగి పనివారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అలాగే వ్యవసాయం, రైతులకు కావాల్సిన ఇనుప పరికరాల తయారీలో కమ్మరి పనివారిది ప్రధానపాత్ర. వ్యవసాయానికే కాకుండా దేవాలయాల్లో వివిధ సేవలకు ఉపయోగించే పల్లకీలు, రథాల తయారీ, కర్రపై నగిషీలు చెక్కిన పల్లకీలు ప్రాచీన కాలంలో నుంచే ప్రసిద్ధి చెందాయి. వీటిని కూడా వడ్రంగి వృత్తివారు చేస్తుంటారు. ఇలాంటి హస్తకళలు, తెలంగాణ కళా రంగ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించాయి. బుట్టల అల్లిక, కుండల తయారీ, మట్టి పాత్రల తయారీ, ఇటుకల తయారీ వంటి ఎన్నో హస్తకళలు, చేతి వృత్తులు తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నాయి. ప్రత్యేకంగా పరిశ్రమ రూపంలో ఎదగకపోయినా ఎన్నో చేతివృత్తులు పరస్పర పోషకంగా, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి.

కళలు
మన ప్రాచీన ఆలంకారికులు చతుస్సష్టి (64) కళల గురించి ప్రస్తావించారు. లలిత కళల్లో సంగీతం - రాగ, తాళ, లయాన్వితమై మనసుకు హాయినిస్తుంది. అందుకే ఇది ఆపాత మధురమైన కళగా ప్రసిద్ధి చెందింది. కవిత్వం ఆలోచనామృతం.. కవిత్వ ప్రయోజనం కూడా ఆనందం కలిగించడం, ఉపదేశించడమే. శిల్పం సజీవ సౌందర్యాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తుంది. చలనం, జీవం లేకున్నా సజీవంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. వర్ణ రంజితమైంది చిత్రకళ.. చిత్రకారుడి మనోఫలకంపై రూపుదాల్చిన అద్భుత భావన ప్రపంచాన్ని, చిత్తరువులను చూసేవారికి కళ్లకు కట్టినట్లు చిత్రంచేది చిత్రకళ. నృత్యం సమాహార కళ. రాగం, తాళం, లయబద్ధతకు తోడుగా అభినయం కూడా మేళవించిన కళారూపం. ఇందులో ఆంగికం, వాచికం, ఆహార్యం అన్నీ ప్రధానమే. నవరసాలొలికించే వీలున్న ఏకైక లలితకళ నృత్యమే. ఈ సంప్రదాయ నృత్యకళ నుంచే అనేక నృత్యరీతులు అభివృద్ధి చెందాయి.

 

సాంస్కృతిక వారసత్వం

క్రమానుగత పరంపరగా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తున్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి..

1. భౌతిక / వస్తు సంస్కృతి (Physical & Material Culture)

2. సాంఘిక సంస్కృతి (Social Culture)

3. సహజ / ప్రకృతి సిద్ధ సంస్కృతి (Natural Culture) భవన నిర్మాణాలు, వస్తు సామగ్రి, వాస్తు శిల్పం, స్మారక చిహ్నాలు, కట్టడాలు లాంటివి భౌతిక / వస్తు సంస్కృతి విభాగం కిందకు వస్తాయి. ఇవి భౌతికంగా ఒక రూపాన్ని సంతరించుకుని, తరతరాలుగా గత వైభవానికి తార్కాణాలుగా నిలిచే ఉంటాయి. అందువల్ల వీటిని దృగ్గోచర సాంస్కృతికాంశాలు (Tangible Culture)గా కూడా పేర్కొంటారు. సాంఘికాచారాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, తిట్లు, ఒట్లు లాంటి వాటికి ఒక నిర్దిష్ట (వస్తు)రూపమంటూ ఉండదు. కంటికి కనిపించకుండా పరంపరగా ప్రజలు ఆచరిస్తూ, అనుసరిస్తూ ఒక తరం నుంచి మరో తరం వారు అందిపుచ్చుకుంటారు. అందుకే వీటిని అదృశ్య సాంస్కృతికాంశాలు (Intangible Culture)గా పేర్కొంటారు. సహజసిద్ధమైన నదీలోయలు, పర్వత పంక్తులు, అరణ్యాలు, సరోవరాలు, జలపాతాలు లాంటివి సహజ / ప్రకృతి సిద్ధమైన సాంస్కృతిక అంశాలుగా పరిగణిస్తున్నారు.

Posted Date : 23-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌