• facebook
  • whatsapp
  • telegram

హార్మోన్లు - అడ్రినల్‌ గ్రంథులు

పోరాటానికైనా.. పలాయనానికైనా సై!

 పంతంపట్టి పోరాడినా... పోటీ పడలేక పారిపోయినా కారణం హార్మోన్లే. గుండె వేగం పెరిగినా, రక్తం పోటెత్తినా, ఒత్తిడి ఎక్కువైనా హార్మోన్ల ప్రభావమే. అందుకే శరీరంలో అనేక రకాల చర్యలకు మూలమైన వీటి గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. పరీక్షల్లో వీటిపైన‌ తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. 

 

  మనకు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కలిగే ఒత్తిడిని నియంత్రించడానికి, ఆహారం ద్వారా లభించిన గ్లూకోజును గ్లైకోజెన్‌గా మార్చి నిల్వ చేయడానికి శరీరంలో హార్మోన్లుంటాయి. వీటిని పలురకాల గ్రంథ్రులు స్రవిస్తుంటాయి.  

అడ్రినల్‌ గ్రంథులు: ఇవి మూత్రపిండాలపైన ఉంటాయి. వీటినే ఒత్తిడిని నియంత్రించే గ్రంథులు, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడే గ్రంథులు పోరాడటానికి, పలాయనం చిత్తగించడానికి ఉపయోగపడే గ్రంథులు (3F) గ్రంథులు (Fight, Fright, Flight) అని అంటారు. ఈ గ్రంథుల్లో రెండు భాగాలుంటాయి.

అవి 1) వల్కలం (Cortex)  

  2) దవ్వ (Medulla)

 

వల్కలం

ఇది మూడు హార్మోన్లను స్రవిస్తుంది. అవి 1) గ్లూకో కార్టికాయిడ్స్‌ 2) మినరల్‌ కార్టికాయిడ్స్‌ 3) లైంగిక కార్టికాయిడ్స్‌

గ్లూకో కార్టికాయిడ్స్‌: ఇందులో మూడు రకాల స్రావాలు ఉంటాయి. 

1) కార్టిసాల్‌: దీన్ని ఒత్తిడిని నియంత్రించే హార్మోన్‌ అంటారు 

2) కార్టిసోన్‌  

3) కార్టికోస్టీరాన్‌: ఇవి కార్బోహైడ్రేట్‌ జీవక్రియకు అవసరం. వీటి వల్ల ‘గ్లూకోనియో జెనిసిస్‌ రేటు’ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్‌ కాని పదార్థాలైన కొవ్వులు, ప్రొటీన్ల నుంచి గ్లూకోజ్‌ ఏర్పడటాన్ని గ్లూకోనియో జెనిసిస్‌ అంటారు. కార్టిసాల్‌ హార్మోన్‌ ఎక్కువగా స్రవించడం వల్ల కుషింగ్‌ సిండ్రోమ్‌ వస్తుంది. ఈ వ్యాధిలో రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం, బరువు తగ్గడం, ముఖం ఉబ్బడం లాంటివి కనిపిస్తాయి. 

మినరల్‌ కార్టికాయిడ్స్‌: ఆల్డోస్టీరాన్‌ హార్మోన్‌ దీనికి ఉదాహరణ. దీన్ని లవణాలను నియంత్రించే హార్మోన్‌ (Salt Retaining Hormone), ప్రాణాలను నిలిపే హార్మోన్‌ (Life Saving Hormone) అని అంటారు. ఇది రక్తంలోని అధిక సోడియం స్థాయులు, తక్కువ పొటాషియం స్థాయులను నియంత్రిస్తుంది. దీని లోపం వల్ల ‘అడిసన్స్‌ వ్యాధి’ వస్తుంది.

లైంగిక కార్టికాయిడ్స్‌: ఉదాహరణ ఆండ్రోస్టినిడైయోన్‌ (Androstenedione), ఆండ్రోస్టిరాన్‌. ఇవే కాకుండా కొద్దిమొత్తంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌లను విడుదల చేస్తాయి. ఇవి ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తాయి. ఇవి ఎక్కువైతే పురుషుల్లో గైనకోమాస్టియా, స్త్రీలలో అడ్రినల్‌ విరిలిజమ్‌ లాంటి ఆరోగ్య సమస్యలొస్తాయి.

 

దవ్వ 

అడ్రినల్‌ గ్రంథిలోని ఈ భాగం రెండు హార్మోన్లను స్రవిస్తుంది. 

1) అడ్రినలిన్‌: దీన్నే ఎపినెఫ్రైన్‌ (Epinephrine) అని అంటారు. 

2) నార్‌ అడ్రినలిన్‌: దీన్నే నార్‌ఎపినెఫ్రైన్‌ (Norpinephrine) అని పిలుస్తారు. దవ్వ నుంచి విడుదలయ్యే హార్మోన్లలో అడ్రినలిన్‌ 80%, నార్‌ అడ్రినలిన్‌ 20% ఉంటాయి. నార్‌ అడ్రినలిన్‌ హార్మోన్‌ అడ్రినలిన్‌లా చర్యను చూపుతుంది. అడ్రినలిన్‌ సహానుభూత నాడీవ్యవస్థ మాదిరి జీవక్రియలపై ప్రభావం చూపుతుంది. ఈ హార్మోన్ల వల్ల రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం లాంటివి జరుగుతాయి. ఇవేకాకుండా శ్వాసక్రియ పెరగడం, ప్లీహాన్ని సంకోచింపజేసి రక్తాన్ని విడుదల చేయడానికి తోడ్పడుతుంది. 

  అడ్రినలిన్‌ను పోరాడటానికి, పలాయనం చిత్తగించడానికి (Fight & Flight)  ఉపయోగపడే హార్మోన్‌ లేదా అత్యవసర హార్మోన్‌ అని అంటారు. ఈ హార్మోన్‌ శరీరంలో పై క్రియలు జరగడాన్ని ప్రేరేపిస్తుంది. 

క్లోమం: దీన్ని మిశ్రమగ్రంథి (హెటిరోక్రైన్‌ గ్రంథి) అని అంటారు. ఇది జీర్ణాశయం కింద వంపు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథిలోని అంతఃస్రావ భాగంలో లాంగర్‌హాన్స్‌ పుటికలు ఉంటాయి. ఈ పుటికల్లో ఆల్ఫా, బీటా, డెల్టా, ఎప్సిలాన్‌ కణాలుంటాయి. వీటిలో ఆల్ఫా కణాలు గ్లూకాగాన్‌ హార్మోన్‌ను, బీటా కణాలు ఇన్సులిన్‌ హార్మోన్‌ను, డెల్టా కణాలు సొమాటోస్టాటిన్‌ హార్మోన్‌ను, ఎప్సిలాన్‌ కణాలు గ్రెలిన్‌ హార్మోన్‌ను స్రవిస్తాయి. 

  వీటిలో ఇన్సులిన్‌ హార్మోన్ గ్లైకోజెనిసిస్‌ను పెంచుతుంది. గ్లూకోజ్ గ్లైకోజెన్‌గా మార‌డాన్ని గ్లైకోజెనిసిస్ అంటారు. గ్లూకోజ్‌ను శ్వాసక్రియ ఇంధనంగా ఉపయోగపడటానికి పెంచుతుంది. ఇన్సులిన్‌ లోపం వల్ల డయాబెటిస్‌ మిల్లిటస్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో రక్తంలో అధిక గ్లూకోజ్‌ ఉండటం (హైపర్‌గ్లైసేమియా), ఎక్కువ మూత్రం విసర్జించడం (డైయూరిసిస్‌), అధికంగా దాహం వేయడం, (పాలిడిప్సియా), మూత్రంలో చక్కెర (గ్లూకోజ్‌) ఉండటం (గ్లైకోసూరియా) వంటి లక్షణాలు కనిపిస్తాయి.


గ్లూకాగాన్‌ హార్మోన్‌ను హైపర్‌గ్లైసేమిక్‌ లేదా డయాబెటోజెనిక్‌ హార్మోన్‌ అని అంటారు. ఇది గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియనే గ్లైకోజినోలైసిస్‌ అంటారు. 


బీజకోశాలు (Gonads): స్త్రీ బీజకోశాలను అండాశయాలు, పురుష బీజకోశాలను ముష్కాలు అని  అంటారు. 


ముష్కాలు (Testis):  వీటిలోని ఇంటర్‌స్టీషియల్‌ కణాలు లేదా లీడిగ్‌ కణాలు పురుష లైంగిక హార్మోనులైన ఆండ్రోజెన్స్‌ను స్రవిస్తాయి. వీటికి ఉదాహరణ 1) టెస్టోస్టిరాన్‌ 2) ఆండ్రోస్టిరాన్‌ 3) ఎపీఆండ్రోస్టిరాన్‌. వీటిలో ముఖ్యమైంది టెస్టోస్టిరాన్‌. ఇది పురుష లైంగిక భాగాల పెరుగుదలను, పురుష ద్వితీయ లైంగిక లక్షణాలు రావడాన్ని ప్రేరేపిస్తుంది.. 

అండాశయాలు (Ovaries): ఇవి మూడు రకాల హార్మోన్‌లను స్రవిస్తాయి. అవి 1) ఈస్ట్రోజెన్స్‌ 2) ప్రొజెస్టిరాన్‌ 3) రిలాక్సిన్‌ 

ఈస్ట్రోజెన్స్‌: వీటికి ఉదాహరణ బీటాఈస్ట్రాడయోల్, ఈస్టిరోన్, ఈస్ట్రయోల్‌. వీటిలో బీటాఈస్ట్రాడయోల్‌ ముఖ్యమైంది. వీటి విడుదలను ప్రేరేపించేది ల్యూటినైజింగ్‌ హార్మోన్‌. ఈ హార్మోన్‌లు స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తాయి. 

ప్రొజెస్టిరాన్‌: ఈ హార్మోన్‌ అండాశయంలో ఏర్పడిన కార్పస్‌ల్యూటియం నుంచి విడుదలవుతుంది. దీన్ని యాంటీ అబార్షన్‌ హార్మోన్‌ అంటారు. గర్భాశయ గోడలకు పిండ ప్రతిస్థాపన జరగడానికి ఈ హార్మోన్‌ అవసరం. అంతేకాకుండా గర్భాశయం లోపల ఎండోమెట్రియమ్‌ పొర ఏర్పడటాన్ని ప్రేరేపిస్తుంది. గర్భధారణ సమయంలో అండోత్సర్గం జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.

రిలాక్సిన్‌: ఇది కార్పస్‌ల్యూటియం నుంచి విడుదలై శిశుజననానికి తోడ్పడుతుంది. 

అంతఃస్రావ వ్యవస్థ నుంచి కాకుండా ఇతర కణాలు, భాగాల నుంచి స్రవించే హార్మోన్లు: 

థైమస్‌ గ్రంథి: ఇది గుండెకు పై భాగంలో ఉంటుంది. చిన్నపిల్లల్లో పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. యుక్తవయస్సు వరకు పెరిగి తరువాత నెమ్మదిగా క్షీణిస్తుంది. ఈ గ్రంథి థైమిక్‌ హార్మోను అయిన థైమోసిన్‌ను స్రవిస్తుంది. ఈ హార్మోన్‌ టి-లింఫోసైట్లు ఏర్పడటానికి, వీటి చర్య పెరగడానికి అవసరం. ఈ హార్మోన్‌ను ఎక్కువగా స్రవించడం వల్ల మయోస్టీమియాగ్రేవిస్‌ అనే వ్యాధి వస్తుంది. 

పీనియల్‌గ్రంథి (పీనియల్‌ దేహం): ఈ గ్రంథి (భాగం) మెదడులో ఉంటుంది. ఇది స్రవించే హార్మోన్‌ మెలటోనిన్‌. ఈ హార్మోన్‌ జీవగడియారాన్ని లేదా జీవన లయలను (Circadian Rhythms) నియంత్రిస్తుంది. దీన్ని ‘హార్మోన్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అని అంటారు. 

జీర్ణవ్యవస్థకు సంబంధించిన హార్మోన్లు: ఈ హార్మోన్‌లు జీర్ణవ్యవస్థలోని జీర్ణాశయం, చిన్నపేగు భాగాల నుంచి స్రావితమై జీర్ణక్రియను నియంత్రిస్తాయి.

 ఇవి 1) గ్యాస్ట్రిన్‌: ఇది జఠర రసాన్ని (Gastric Juice) విడుదలను ప్రేరేపిస్తుంది.. 

2) ఎంటిరో గ్యాస్టిరాన్‌: ఇది జఠర రసం విడుదల కావడాన్ని నిలిపేస్తుంది.

3) పాంక్రియోజైమిన్‌: క్లోమం నుంచి క్లోమరస ఎంజైమ్‌లను స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది.

4) విల్లికైనిన్‌: ఇది చూషకాలను (విల్లి) ప్రేరేపిస్తుంది.

5) గ్రెలిన్‌: ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది.

6) లెప్టిన్‌: ఇది ఆకలిని తగ్గిస్తుంది.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

Posted Date : 29-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌