• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ఐసీటీ

భారతదేశ జీడీపీలో సమాచార భావప్రసార సాంకేతిక రంగం వాటా 13%. మనదేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ జీడీపీకి 200 బిలియన్‌ డాలర్లను సమకూరుస్తోంది (వివిధ రకాలైన  ITBPM, ఈ కామర్స్, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ద్వార్శా. భారతదేశంలో ఐసీటీ సేవలను  NICNET అనే వ్యవస్థ దేశమంతటా అందిస్తోంది. ఈ సంస్థ అన్ని మంత్రిత్వశాఖలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంత శాఖలు, జిల్లా అధికార యంత్రాంగాలను ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ ద్వారా అనుసంధానిస్తుంది. భారతదేశ ఈ - గవర్నెన్స్‌ వ్యవస్థలో NICNET కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం దీనికి డా.నీతావర్మ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. కొవిడ్‌ సమయంలో ‘ఆరోగ్యసేతు’, “RT-PCR”  మొబైల్‌ యాప్‌లను NICNET సమగ్రంగా నిర్వహించింది. 170 మిలియన్ల డౌన్‌లోడ్లు సాధించిన ప్రభుత్వ యాప్‌గా ‘ఆర్యోగసేతు’ రికార్డు నెలకొల్పింది. “RT-PCR”  మొబైల్‌ యాప్‌  టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్‌ డేటాలను నిక్షిప్తం చేసి కొవిడ్‌ నిర్వహణను సులభతరం చేసింది.


డిజిటల్‌ ఇండియా

డిజిటల్‌ ఇండియా ప్రోగ్రాం ద్వారా భారత ప్రభుత్వం పౌరులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ హైవేలను (Broadband highways) సృష్టించి అన్ని ప్రాంతాలను హై స్పీడ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తారు. ప్రజలకు మొబైల్, ఆన్‌లైన్, పారదర్శకమైన డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తేవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఎలక్ట్రానిక్స్, తయారీ రంగం, ఉత్పత్తి, ఉద్యోగ కల్పన మొదలైన రంగాల్లో మెరుగైన డిజిటల్‌ సౌకర్యాలను ఏర్పర్చి, వాటి అభివృద్ధిలో ఇది ముఖ్య భూమిక పోషిస్తోంది.


భారత్‌ నెట్‌

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రూరల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌ వర్కింగ్‌ ప్రాజెక్ట్‌. దీని ద్వారా దేశంలోని 2.5 లక్షల గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తారు. 
* ఈ ప్రాజెక్ట్‌ను భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌  (Bharat Broadband Network Limited - BBNL) అమలు చేస్తోంది.


నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ (NOFN) 

నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను 2011, అక్టోబరులో ప్రారంభించారు. దీని ద్వారా గ్రామపంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ను అనుసంధానం చేస్తారు. 2015లో NOFN వ్యవస్థ భారత్‌ నెట్‌గా మారింది. భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను  మూడు దశల్లో అమలు చేస్తున్నారు.
* 2017, డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా లక్ష గ్రామపంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని కల్పించారు. దీనిద్వారా మొదటిదశ పూర్తయ్యింది. 
* రెండో దశలో రేడియో, ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అన్ని గ్రామపంచాయతీలకు కావాల్సిన విద్యుత్‌ కనెక్టివిటీ, అండర్‌గ్రౌండ్‌ ఫైబర్ల అనుసంధానాన్ని 2019, మార్చి నాటికి పూర్తిచేశారు.
* 2019 నుంచి 2023 వరకు మూడో దశ కొనసాగుతుంది. ఈ దశలో ఫైబర్‌ టెక్నాలజీ ద్వారా ప్రతీ జిల్లాకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందిస్తారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలన్నింటికీ డిజిటల్‌ సౌకర్యాలను కల్పించవచ్చు.

 

డిజిటల్‌ ఇండియా పథకం - ప్రభుత్వ కార్యక్రమాలు

స్వయం  (SWAYAM  n -The Study Webs of Active Learning for Young Aspiring Minds): ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ విద్యా వేదిక. ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు 1.02 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. వీరిలో విద్యార్థులే కాకుండా అధ్యాపకులు, వివిధ రంగాలకు చెందిన ఔత్సాహికులు ఉన్నారు. swayam.gov.in వెబ్‌సైట్‌ ద్వారా 12 సబ్జెక్టుల్లో వివిధ రకాల కోర్సులను అందిస్తున్నారు.


ఈ-యంత్ర (e-Yantra): రోబోటిక్స్, అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ విద్య, నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఉపాధ్యాయులకు కూడా మెరుగైన, నవీన సాంకేతిక విద్యలో శిక్షణను అందిస్తారు.


నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా (NDLI): ఇది ఒక వర్చువల్‌ గ్రంథాలయం. ఇందులో 3 కోట్ల డిజిటల్‌ గ్రంథాలు వివిధ స్థాయుల్లో ఉన్న వినియోగదారులకు లభిస్తాయి. నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాలో ఇప్పటివరకు 50 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు. 20 లక్షల మంది యాక్టివ్‌ యూజర్స్‌గా ఉన్నారు. NDL మొబైల్‌ యాప్‌గా కూడా అందుబాటులో ఉంది.


నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ (National Academic Depository - NAD): అన్ని అకడమిక్‌ అవార్డులను (సర్టిఫికెట్లు, డిప్లొమా, మార్క్స్‌లిస్ట్‌) డిజిటలైజ్‌ చేసి భద్రపరచడం దీని ముఖ్య ఉద్దేశం. వివిధ సంస్థలు దీంతో అనుసంధానమై ఆయా అవార్డులను ఇందులో ఉంచుతాయి. సంబంధిత అభ్యర్థి ఈ సైట్‌ నుంచి వాటిని పొందొచ్చు. 


వర్చువల్‌ ప్రయోగశాల (Virtual Labs):  కొవిడ్‌ కారణంగా అనేక మంది విద్యార్థులు భౌతిక ప్రయోగశాలలకు దూరమయ్యారు. ఇలాంటి సమయంలో విద్యార్థులు సాంకేతిక విద్యలో నష్టపోకుండా వర్చువల్‌ ల్యాబొరేటరీలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా 225 కళాశాల ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు 1800 ప్రయోగాలు నిర్వహించారు. దీనివల్ల 15 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.


డిజి లాకర్‌: కాగితరహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడం దీని ముఖ్యఉద్దేశం. ఆధార్‌ సంఖ్యను ఉపయోగించి భౌతిక డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను ఎవరికి వారు వ్యక్తిగతంగా భద్రపరచుకునేందుకు డిజి లాకర్‌ ఉపయోగపడుతుంది. ఇందులో ఎలక్ట్రానిక్‌ కాపీలను, డ్రైవింగ్‌ లైసెన్స్, వోటర్‌ ఐ.డి., స్కూల్‌ సర్టిఫికెట్లు, ఆస్తి పత్రాలు, ఎలక్ట్రానిక్‌ సంతకాలను భద్రపరచొచ్చు. 


భీమ్‌ యాప్‌ (Bharat Interface for Money):  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి ఈ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా సులభతరమైన, వేగవంతమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు. UPI (Unified Payment Interface)  వ్యవస్థ ద్వారా దీన్ని రూపొందించారు. భారతపౌరులు వారి స్మార్ట్‌ఫోన్లను ఇంటర్నెట్‌తో అనుసంధానించి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ యాప్‌ల ద్వారా అవినీతి రహిత, పారదర్శకమైన, వేగవంతమైన ద్రవ్య వినిమయం చేయొచ్చు. భీమ్‌ యాప్‌ను National Payments Corporation of India (NPCI), Unified Payment Interface (UPI) సంయుక్తంగా రూపొందించాయి. ప్రస్తుతం ఇది 20 భాషల్లో అందుబాటులో ఉంది. భారత్‌లో ఖాతా ఉన్న వ్యక్తి ఇతర దేశాల నుంచి కూడా ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.


స్వయం ప్రభ  (Swayam Prabha): ఈ పథకం ద్వారా కేంద్రం 32 హైక్వాలిటీ విద్యా ఛానళ్లను 24 x 7 ప్రసారం చేస్తోంది. GSAT-15 ఉపగ్రహ అనుసంధానం ద్వారా ఈ ఛానెళ్లు ప్రసారం అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘మన విద్య’; తెలంగాణలో T-SAT నిపుణ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. 
* ఈ ఛానెళ్లకు కావాల్సిన సమాచారాన్ని ప్రముఖ  IITలు, UGC, IGNOU, NCERT మొదలైన సంస్థలు సమకూరుస్తాయి.


భారత్‌ క్యూఆర్‌ కోడ్‌: క్యూఆర్‌ కోడ్‌ అంటే క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌. ఈ భారత్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా వినియోగదారులు సులభంగా చెల్లింపులు చేయడమే కాకుండా, కార్డు రహిత సేవలు పొందొచ్చు. ఇది వీసా, మాస్టర్‌కార్డులకు మద్దతుఇచ్చే పరస్పర చెల్లింపుల వ్యవస్థ. రూపే, అమెక్స్‌ కార్డులు, భీమ్‌ - యూపీఐ ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించవచ్చు. 
* భారత్‌ క్యూ ఆర్‌ కోడ్‌ రెండు డైమెన్షన్‌లను (2D Code) కలిగి ఉంటుంది. దీని ద్వారా వ్యాపారస్తులు వినియోగదారుల నుంచి నగదును నేరుగా తమ ఖాతాలోకి జమ చేసుకోవచ్చు. భారత్‌ క్యూఆర్‌ కోడ్‌ను ఆర్‌బీఐ మార్గదర్శకాలతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్, ఇంటర్నేషనల్‌ కార్డు వ్యవస్థ (ICS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 
* ఇవే కాకుండా ఈ - పాఠశాల, స్పోకెన్‌ ట్యుటోరియల్, నేషనల్‌ రిపోజిటరీ, సారాంశ్‌ మొదలైన ఆన్‌లైన్‌ పోర్టళ్లు వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి.

 

భారత్‌లో సమాచార సాంకేతికత - పరిమాణం - చట్టాలు - విధి విధానాలు

భారత్‌లో 1986లో మొదటిసారిగా అంతర్జాల సేవలు (Internet Services) ప్రారంభమయ్యాయి. 1995, ఆగస్టు 15న విదేశీ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (VSNL) ద్వారా తొలిసారి ప్రజలకు అంతర్జాల సేవలను అందించారు.  మొదట్లో ఈ సేవలు విద్యా, పరిశోధనా సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి. తర్వాత రైల్వే రిజర్వేషన్లకు అంతర్జాల సేవలను వినియోగించారు. 1999లో భారతదేశమంతటా ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థను అనుసంధానించారు. దీంతో రైల్వే ప్రయాణికులకు మరిన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయి.

* భారత్‌లో కేబుల్‌ ఇంటర్నెట్‌ సేవలు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు అయిన ఈ-బే (enbay), యాహూ(yahoo), ఎంఎస్‌ఎన్‌ (MSN)లను 2000లో ఆవిష్కరించారు. అందుకే ఈ సంవత్సరాన్ని భారత సమాచార సాంకేతికత చరిత్రలో మైలురాయిగా పేర్కొంటారు.
* దేశంలో తొలిసారిగా సమాచార సాంకేతికత విధివిధానాల్లో భాగంగా ఐటీ యాక్ట్‌ (ITA)ను రూపొందించారు. 2005 నుంచి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల విప్లవం మొదలైంది.
* 2005లో ఆర్కుట్‌ (Orkut); 2006లో ఫేస్‌బుక్‌ (Facebook) లాంటి సామాజిక మాధ్యమాలు; 2008 నాటికి ప్రజలందరికీ అధునాతన 2జీ (GPRS), 3జీ సేవలు ప్రారంభమయ్యాయి. 
* 2010 నుంచి స్మార్ట్‌ ఫోన్ల వినియోగం ఎక్కువైంది. 2014 నాటికి 4జీ సేవలు దేశమంతటా విస్తరించాయి. 2016 నుంచి రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 2019 నాటికి భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 500 మిలియన్లకు చేరింది.
* అంతర్జాల సేవలు ఎంత వేగంగా సమాచారాన్ని చేరవేసి, సమాచార సేవల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయో, అంతే వేగంగా అసాంఘిక, అశ్లీల విషయాలను ప్రజల ముందుంచాయి. దీన్ని గమనించిన భారత ప్రభుత్వం ఐటీ చట్టం - 2000ను తీసుకొచ్చి, సమాచార సాంకేతిక వినియోగానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించింది.


ఐటీ చట్టం (IT Act) -  2000
* ఈ చట్టం 2000లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో  ఆమోదం పొంది, అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ ఆమోద ముద్రతో చట్టరూపం దాల్చింది. అప్పటి  సమాచార సాంకేతిక శాఖ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌   ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఈ చట్టం అమలుకు కావాల్సిన విధి విధానాలను ప్రవేశపెట్టింది. 
* ఈ ఐటీ చట్టం ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు (etransactions), ఎలక్ట్రానిక్‌ వ్యాపార వ్యవహారాలు (ecommerce), ఎలక్ట్రానిక్‌ పాలన (e-governance)లకు అవసరమైన చట్టబద్ధమైన గుర్తింపునకు కావాల్సిన విధివిధానాలను రూపొందించింది. ఐటీ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. 


లక్ష్యాలు:
* ఎలక్ట్రానిక్‌ డేటా బదిలీ (Exchange), ఎలక్ట్రానిక్‌ సాంకేతికత ద్వారా దస్త్రాల్లో ఉన్న సమాచారాన్ని  కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి, వాటికి అవసరమైన చట్టబద్ధతను కల్పించడం.
* డిజిటల్‌ సంతకాలకు కావాల్సిన ప్రామాణిక సమాచారాన్ని, చట్టబద్ధమైన గుర్తింపును కల్పించడం.
* ఆయా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు చేసే ఈ-ఫైలింగ్‌ (e-filing)కు అవసరమైన సౌకర్యాలను కల్పించడం.
* డేటాను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో నిక్షిప్తం (Electronic storage of data) చేసేందుకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం.
* బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు, వాటికి చేయాల్సిన ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ సౌకర్యాలను అందించడం.
* ఎవిడెన్స్‌ చట్టం - 1894 (Evidence Act 1894), రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం - 1934 (RBI Act - 1934) ద్వారా బ్యాంకర్లకు, వారి అకౌంట్‌ పుస్తకాలకు చట్టబద్ధతను కల్పించడం.
* సైబర్‌ లా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసి, ఐటీ సంబంధ నేరాలను పరిష్కరించడం. ఇంటర్నెట్‌ ద్వారా భారత భూభాగంలో లేదా భారత సమాచారానికి సంబంధించి ఇతర దేశాల్లో ఈ - సమాచార నేరాలకు (Information breach)  పాల్పడేవారు లేదా ఉల్లంఘించేవారు ఈ చట్టం కింద శిక్షార్హులు అవుతారు. 

 

సవరణలు: 2008లో డేటా పరిరక్షణ (Data Protection)  కోసం చట్టంలోని 43A, 72A సెక్షన్లను సవరించారు.
సెక్షన్‌  43A: Compensation for failure to protection Data. సమాచారాన్ని పరిరక్షించడంలో విఫలమైతే, చెల్లించాల్సిన పరిహారం మొదలైన అంశాలు ఉంటాయి. 
సెక్షన్‌  72A: Punishment for disclosure of information in breach of unlawful content. చట్టవిరుద్ధమైన విషయాలను ప్రస్తావించినా,  ఇతరుల సమాచారాన్ని బహిర్గతం చేసినా విధించాల్సిన శిక్షల గురించి ఉంటుంది.
* సమాచార పరిరక్షణకు సెక్షన్‌ 67(C)ని సవరించారు. దీనిప్రకారం ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని సేకరించినా లేదా నిక్షిప్తం చేసినా మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.
* సెక్షన్‌ 69 ద్వారా ప్రభుత్వ సంస్థలు సమాచారాన్ని సేకరించి దాని ట్రాఫిక్‌ను, డేటాను గమనిస్తాయి. సైబర్‌ సెక్యూరిటీలో భాగంగా దీన్ని చేస్తాయి.
* 2011లో ఐటీ చట్టాన్ని సవరించారు. సోషల్‌ మీడియా, ఐటీ కంపెనీలను జవాబుదారీతనంతో వ్యవహరించాలని  పేర్కొన్నారు. 50 లక్షల కంటే ఎక్కువ యూజర్లు ఉన్న వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్‌ లాంటి సంస్థలను అందులో చేర్చింది. న్యాయ వ్యతిరేక సమాచారాన్ని  (Unlawful content) రూపుమాపే దిశగా ఈ ప్రయత్నాలు చేసింది. సోషల్‌ మీడియా వేదికల్లో అధికంగా పంపించే సందేశాలను ట్రాక్‌ చేయటం, వాటి ఆవిర్భావాన్ని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం.
* 2018లో ఐటీ చట్టం - 2000ను మరోసారి సవరించారు. చిన్నారులపై అత్యాచారాలకు కారణమయ్యే (Pedophilia),  అశ్లీల (Pornographic), ద్వేష భావాన్ని నింపే (Hateful), కులమత జాతులకు సంబంధించిన అభ్యంతరకరమైన (Racially ethnically objectionable), పైరసీలను పెంచే (invasive of piracy) సమాచారాన్ని పంపే యూజర్లను సోషల్‌ మీడియా ఇంటర్‌మీడియరీస్‌ ఆపాలి. ఇందుకోసం కేంద్రం లేదా సంస్థలు అడిగే సమాచారాన్ని 72 గంటల్లో అందించాలి. ఆవిర్భావ వ్యక్తిని(Originator) గుర్తించి సైబర్‌ సెక్యూరిటీలో భాగంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు.
* ఐటీ చట్టం - 2000కి అనుబంధంగా కేంద్రప్రభుత్వం 2021లో మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ఈ చట్టంలోని 3 సెక్షన్లలను సవరించింది. అవి సెక్షన్‌ 69A(2), 792(C), 87 ఇందులో భాగంగా సోషల్‌ మీడియా ఇంటర్‌ మీడియరీస్, OTT (Over The Top) ఫ్లాట్‌ఫామ్‌లకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించింది. 
* వీటిని ‘ఇంటర్‌ మీడియరీ గైడ్‌లైన్స్, డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌’గా విడుదల చేశారు. యూజర్‌ ప్రచురించే పోస్టులపై అత్యంత జాగ్రత్త వహించాలని, తగిన శ్రద్ధతో పోస్టులు సర్క్యులేట్‌ అయ్యేలా చూడాలని (Due diligence), లేని పక్షంలోSafe Harbour Provisions Under 79 of IT ACT-2000 కింద దేశంలోని ఆయా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు తమ ఉనికిని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ తరహాలో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు ఒక గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ని నియమించాలని సూచించింది. యూజర్ల ఆన్‌లైన్‌ సేఫ్టీ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంది.
* OTT ఫ్లాట్‌ఫామ్‌లను U, U/A 7+, U/A 13+, U/A 16+, A  కేటగిరీలుగా విభజించి,  U/A 13+ వరకు పేరెంటల్‌ లాక్‌ సౌలభ్యం కల్పించాలని సూచించింది. ఫిర్యాదులను 5 రోజుల్లో పరిష్కరించేలా గ్రీవెన్స్‌ రిడ్రస్సల్‌ మెకానిజం(Grievance Redressal Mechanism)ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 


జాతీయ సమాచార సాంకేతిక విధానం (National Policy on Information Technology) - 2012

లక్ష్యాలు:
* దేశంలోని ప్రతీ కుటుంబంలో ఒక సభ్యుడినైనా ఈ-అక్షరాస్యుడిగా (e-literate)గా మార్చడం.
* 2020 నాటికి ఐటీ, ఐటీ ఆధారిత సేవలను 300 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు, ఐటీ ఆధారిత ఎగుమతులను 200 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు పెంచడం.
* ఐటీ సేవలతో మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన, వేగవంతమైన, వికేంద్రీకరణ కలిగిన ప్రభుత్వ సేవలను అందించడం.

 

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్‌/ ఐటీ పాలసీ  2014-20
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలను అభివృద్ధిని పెంచే గ్రోత్‌ ఇంజిన్లుగా భావించింది. వీటిని వేగంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నైపుణ్య శిక్షణ, భవిష్యత్‌ సాంకేతికతలో శిక్షణకు అవసరమైన మౌలిక వసతులను కల్పించింది.
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 201420 ఐటీ పాలసీకి మరిన్ని అంశాలను జోడిస్తూ ఏపీ ఐటీ పాలసీ 2021 24ను రూపొందించింది. 2021, జూన్‌ 30న ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
* ఈ పాలసీ ద్వారా వచ్చే మూడేళ్లలో 55,000 ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 
* ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ - కమ్యూనికేషన్‌ విభాగాల ద్వారా మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం వాటిని ‘రెవెన్యూ సెంటర్స్‌  (Revenue Centres)గా మార్చింది.

 

తెలంగాణ ఐసీటీ పాలసీ - 2016
* 2016, ఏప్రిల్‌ 4న నాటి గవర్నర్‌ నరసింహన్‌; ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఐటీ శాఖామంత్రి కేటీ రామారావు, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి విడుదల చేశారు.
* ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలని ప్రభుత్వం ఆకాంక్షించింది.
* తెలంగాణను డిజిటల్‌ తెలంగాణ రాష్ట్రంగా మార్చాలని, ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు అందించాలని, ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులను రూ.1.20 లక్షల కోట్లకు పెంచాలని తీర్మానించారు.
* తెలంగాణ (హైదరాబాద్‌)ను దేశంలో అగ్రగామి ఐటీ గమ్యస్థానంగా (IT Destination)  మార్చాలని, దీనికి అవసరమైన మౌలిక వసతులను సమకూర్చాలని ప్రతిపాదించారు. టెక్నాలజీ రంగంలో తెలంగాణ గ్లోబల్‌ హబ్‌గా ఉండాలని పేర్కొంది.

 

మాదిరి ప్రశ్నలు

1. భారత ప్రభుత్వం పౌరుల భాగస్వామ్యాన్ని పెంచి; ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలను అత్యంత పారదర్శకంగా అందించడానికి ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం ఏది?
1) Bharat Net            2) MyGov.in            3) SWAYAM              4) Know your Government 


2. కరోనా కవచ్‌ అంటే ఏమిటి?
1) ఇది స్థల ఆధారిత యాప్‌.
2) దీన్ని ఎలక్ట్రానిక్‌-ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించింది.
3) స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా కరోనా సోకిన వారిని గుర్తించి ట్రాక్‌ చేస్తుంది.
4) పైవన్నీ


3. సాధారణంగా ఇంటర్నెట్‌ కనెక్షన్లను దేనిద్వారా అనుసంధానం చేస్తారు?
1) ఎలక్ట్రోమాగ్నెటిక్‌ స్పెక్ట్రమ్‌లోని తెల్లని కాంతి 
2) రేడియో తరంగాలు
3) లేజర్‌ తరంగాలు 
4) X-ray తరంగాలు


4. ఫైబర్‌ ఆప్టిక్‌ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
1) నరేంద్రసింగ్‌ కంపానీ             2) శ్యామ్‌ పిట్రోడా 
3) నందన్‌ నీలేకని           4) ఆల్ఫోన్స్‌ బ్రెట్టిలియోన్‌


5. మనదేశంలో ఐసీటీ సేవలను అన్ని ప్రాంతాలకు విస్తరించిన సంస్థ?
1) SAPNET        2) EDUNET         3) AGRONET           4) NICNET 


6.  BHIM యాప్‌ ప్రస్తుతం ఎన్ని ప్రాంతీయ భాషల్లో తన సేవలను అందిస్తోంది?
1) 13           2) 17           3) 20           4) 25


7. బయోమెట్రిక్‌ వ్యవస్థ వేటి ఆధారంగా పనిచేస్తుంది?
1) వేలిముద్రలు  (fingerprints)
2) ముఖ కవళికలు  (facial recognition) 
3) ఐరిస్, గొంతు  (iris, voice recognition) 
4) పైవన్నీ


8. బయోమెట్రిక్‌ పదాన్ని మొదటగా ఉపయోగించింది?
1) నరేంద్రసింగ్‌ కంపానీ           2) శ్యామ్‌ పిట్రోడా 
3) నందన్‌ నీలేకని        4) ఆల్ఫోన్స్‌ బ్రెట్టిలియోన్‌


9. ఫైబర్‌ ఆప్టిక్‌ విధానం ఏ పద్ధతి ద్వారా పనిచేస్తుంది?
1) Radiation           2) Resolution         
3) Refraction          4) Total internal reflection of light

 

10. IOT (Internet Of Things) పదాన్ని మొదటగా ఉపయోగించింది?
1) కెల్విన్‌ ఆస్ట్రన్‌         2) ఆల్ఫోన్స్‌ బ్రెట్టిలియోన్‌ 
3) జెఫ్‌ లిసోజ్‌         4) జుకర్‌ బర్గ్‌


11. NICNET ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు?
1) ఎన్‌ శ్రీధరన్‌      2) నీతా వర్మ 
3) ఎన్‌ శేషగిరి      4) అజయ్‌ సాహ్ని


సమాధానాలు: 1-2; 2-4; 3-1; 4-1;  5-4; 6-3; 7-4; 8-4;  9-4; 10-1;  11-2.  

Posted Date : 17-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌