• facebook
  • whatsapp
  • telegram

సూక్ష్మజీవులు - ప్రాముఖ్యం  

            మానవుడి కంటికి కనిపించకుండా సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగే జీవులను సూక్ష్మజీవులు అంటారు. వీటి ఉనికిని మొదట గుర్తించింది ఆంటోవాని ల్యూవెన్‌హుక్. సూక్ష్మజీవుల్లో జన్యుపదార్థం డి.ఎన్.ఎ. లేదా ఆర్.ఎన్.ఎ.గా ఉంటుంది. వీటిలో నిర్దిష్ట కేంద్రకం ఉండని జీవులను కేంద్రక పూర్వ జీవులు (ప్రోకారియాట్స్) అని, కేంద్రకం ఉన్న వాటిని నిజ కేంద్రక జీవులు (యూకారియాట్స్) అని అంటారు. సూక్ష్మజీవుల్లో కొన్ని స్వయంపోషకాలు ఉంటాయి. చాలావరకు పరపోషితంగా ఇతర జీవులపై ఆధారపడి బతుకుతాయి. సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అంటారు. సూక్ష్మజీవుల్లో నిర్మాణాన్ని బట్టి వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, శిలీంధ్రాలు అనే రకాలు ఉంటాయి.
 

వైరస్‌లు 
            ఇవి అతి చిన్న సూక్ష్మజీవులు. వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. వైరస్‌లలో జన్యుపదార్థం చుట్టూ ప్రొటీన్‌తో కప్పిన కవచం ఉంటుంది. ఆతిథేయి బయట వైరస్‌లు నిర్జీవంగా ఉంటాయి. ఇవి ఆతిథేయిలోకి లేదా కణంలోకి వెళ్లినప్పుడు వాటిలో ప్రత్యుత్పత్తి జరుపుకొని తమ సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి.

వైరస్‌లు బ్యాక్టీరియాలపై కూడా దాడి జరిపి వాటిని నాశనం చేయగలవు. ఇటువంటి వైరస్‌లను బ్యాక్టీరియోఫాజ్‌లు అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను సజీవులకు, నిర్జీవులకు వంతెనలాంటి జీవులంటారు. వైరస్‌లు మొక్కలు, జంతువుల్లో అనేక వ్యాధులను కలిగిస్తాయి. మొక్కల్లో ఇవి కీటకాలు, కలుపుమొక్కలు, పనిముట్ల ద్వారా వ్యాపిస్తాయి. మొక్కలపై వైరస్‌లు మొజాయిక్, కణజాల క్షయం (నెక్రోసిస్) వంటి తెగుళ్లను కలిగిస్తాయి. మానవుడిలో పోలియో, ఫ్లూజ్వరం, ఎయిడ్స్, జలుబు వంటి వ్యాధులను కలిగిస్తాయి. వైరస్ వల్ల నష్టాలతో పాటు ఒక లాభం కూడా ఉంది. ట్యూలిప్ పుష్పాలకు వైరస్‌లు సంక్రమించినప్పుడు వాటిలో ఆకర్షణ పత్రావళి చీలినట్లుగా ఉండి, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీన్ని ట్యూలిప్ బ్రేకింగ్ అంటారు.
 

బ్యాక్టీరియమ్‌లు 
            బ్యాక్టీరియమ్‌లను మొదట ల్యూవెన్‌హుక్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. వీటిలో దృఢమైన కణకవచం, దీని కింద కణత్వచం ఉంటాయి. కణంలో కేంద్రకం, హరితరేణువుల వంటి భాగాలు ఉండవు. బ్యాక్టీరియమ్‌లలో కనిపించే సన్నని పోగులవంటి నిర్మాణాలను కశాభాలు అంటారు. ఇవి ఈదడానికి సహకరిస్తాయి. బ్యాక్టీరియమ్‌లు గుండ్రంగా, కడ్డీ, కామా వంటి ఆకారాల్లో ఒంటరిగా లేదా గుంపులుగా ఉంటాయి. ఈ గుంపును సహనివేశం (కాలనీ) అంటారు.

బ్యాక్టీరియమ్‌లు అతిశీతల, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో, సరస్సుల్లో, మొక్కలు, జంతువుల్లో, అన్ని ప్రదేశాల్లో నివశిస్తాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు బ్యాక్టీరియమ్‌లు స్పోర్స్ అనే నిర్మాణాలుగా మారతాయి. దీనివల్ల ఇవి వేడి, శీతలం, రసాయనాలను తట్టుకుంటాయి. బ్యాక్టీరియమ్‌ల అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. బ్యాక్టీరియమ్‌లు మానవుడిలో, మొక్కల్లో వివిధ వ్యాధులను కలిగిస్తాయి.
 

శైవలాలు 
            శైవలాలు ఎక్కువగా నీటిలో, తడినేలల్లో, ఇతర ప్రదేశాలపై ఉంటాయి. వీటిని ఆకుపచ్చ శైవలాలు, గోధుమ రంగు శైవలాలు, నీలిఆకుపచ్చ శైవలాలు వంటి అనేక రకాలుగా విభజించవచ్చు. నీలిఆకుపచ్చ శైవలాల్లో కేంద్రకం, ఇతర కణాంగాలు ఉండవు. బ్యాక్టీరియమ్‌లా ఉంటాయి. ఇతర శైవలాల్లో నిర్దిష్ట కేంద్రకం, హరితరేణువులు వంటి కణాంగాలుంటాయి. శైవలాలన్నీ స్వయంపోషకాలు. డయాటంలు అనే శైవలాలు సముద్రాల్లో తేలుతూ ఉంటాయి. ఇవి వివిధ జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఆకుపచ్చ శైవలమైన క్లామిడోమోనాస్‌కు రెండు పొడవైన కశాభాలుండి, ఈదడానికి ఉపయోగపడతాయి.
 

ప్రోటోజోవా జీవులు 
            ఈ జీవులు ఎక్కువగా నీటిలో రాళ్లకు లేదా మొక్కలకు అంటిపెట్టుకొని ఉంటాయి. మరికొన్ని తేలుతూ, స్వేచ్ఛగా ఉంటాయి. ఇవి కుళ్లుతున్న మొక్కలు, జంతుపదార్థాలను ఆహారంగా తీసుకుంటూ బుడగల వంటి రిక్తికలో జీర్ణం చేసుకుంటాయి. ప్రోటోజోవా జీవులు కొన్ని మిథ్యాపాదం సహాయంతో కదులుతాయి. మరికొన్ని శైలికలు, కశాభాల సహాయంతో కదులుతాయి.

ఈ జీవులు సాధారణంగా ద్విదావిచ్ఛిత్తి అనే పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సిస్టులు, కోశాలు అనే నిర్మాణాలను ఏర్పరుస్తాయి. అమీబా, పేరామీషియం, వర్టిసెల్లా అనే జీవులు ప్రోటోజోవా జీవులకు ఉదాహరణ. మానవుడికి ఎంటమీబా హిస్టాలిటికా అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల అమీబియాసిస్; ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల మలేరియా వస్తాయి.
 

శిలీంద్రాలు 
            శిలీంద్రాలు నీటిలో, తేమ ప్రదేశాల్లో, ఆహార పదార్థాలపై కుళ్లుతున్న జీవులపై పెరుగుతాయి. ఇవి వృక్ష రాజ్యానికి చెందినవి. శిలీంద్రాలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. ఆహారం కోసం ఎక్కువగా నిర్జీవ పదార్థాలపై ఆధారపడతాయి. శిలీంద్రాల్లో దారపు పోగుల్లా పెరిగేవాటిని బూజులు అంటారు. ఇవి కుళ్లుతున్న వృక్ష, జంతు కణాల్లోకి ఎంజైమ్‌లను స్రవించి సంక్లిష్టమైన సెల్యులోజ్ వంటి పదార్థాలను సరళ చక్కెరలుగా మారుస్తాయి. ఇలాంటి ఆహార సంపాదన చేసే జీవులను పూతికాహారులు అంటారు. శిలీంద్రాల్లో కొన్ని పెద్దవిగా, సాధారణ కంటికి కనిపించేలా ఉంటాయి. దీనికి ఉదాహరణ పుట్టగొడుగు. శిలీంద్రాల్లో పోగుల వంటి జీవులను తంతువులు లేదా హైఫే అంటారు. తంతువుల మధ్య అడ్డుగోడలు ఉండి, అనేక కేంద్రకాలుంటాయి. శిలీంద్రాలతో ఏకకణయుతంగా స్వేచ్ఛగా ఉండే జీవి ఈస్ట్. శిలీంద్రాల వల్ల మానవుడికి కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇవి మానవుడిలో తామర, అథ్లెట్‌ఫూట్ వంటి వ్యాధులను కలిగిస్తాయి. ఆహార పదార్థాలు, ఊరగాయలు, పండ్లు, కాగితం వంటి వాటిపై శిలీంద్రాలు పెరిగి వాటి నాణ్యతను దెబ్బ తీస్తాయి.
 

సూక్ష్మజీవులు - ఉపయోగాలు 
            సూక్ష్మజీవుల వల్ల మానవుడికి నష్టాలతో పాటు అనేక లాభాలు ఉన్నాయి. శిలీంద్రాలు చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలపై పెరిగి వాటిని నేలలో కలిపి నేల సారాన్ని పెంచుతాయి. పరిసరాలను శుభ్రపరుస్తాయి. పెనిసిల్లియం నొటేటమ్ అనే శిలీంద్రం పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశకాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి బ్యాక్టీరియమ్‌లను చంపే శక్తి ఉంది. పెన్సిలిన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈస్ట్ అనే శిలీంద్రాన్ని ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తారు. చక్కెర పరిశ్రమలో ఉత్పత్తయ్యే మొలాసిస్‌పై లేదా ద్రాక్షరసం, స్టార్చ్ ద్రావణంపై ఈస్ట్ చర్య వల్ల అవాయుశ్వాసక్రియ ద్వారా ఆల్కహాల్, కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతాయి. ఆల్కహాల్‌ను మత్తు పానీయాలు, ఔషధాల తయారీకి వాడతారు. ఇడ్లీ, దోసెల పిండి పులియడానికి, కేక్ తయారు చేయడానికి కూడా ఈస్ట్ ఉపయోగపడుతుంది. శాకాహార జంతువుల జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియమ్‌లు, చెదపురుగుల ఆహార నాళంలో ఉండే ప్రొటోజోవన్లు సెల్యులోజ్ జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. మానవుడి జీర్ణనాళంలో ఉండే బ్యాక్టీరియమ్‌లు ఆహారం జీర్ణం కావడానికి, విటమిన్ల తయారీకి ఉపయోగపడతాయి. పాలను పెరుగుగా మార్చేందుకు లాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఇవి పాలలోని ప్రొటీన్లను, కొవ్వులను దగ్గరగా చేర్చి పాలను పెరుగుగా మారుస్తాయి. జన్ను తయారీకి కూడా బ్యాక్టీరియమ్‌లు ఉపయోగపడతాయి. బ్యాక్టీరియమ్‌లు పాలలోని కెసిన్ అనే ప్రొటీన్‌ను స్కంధనం చేసి జున్నును తయారుచేస్తాయి. దీన్ని కాటేజ్ జున్ను లేదా క్రీమ్ జున్ను అంటారు. బ్యాక్టీరియమ్‌లు వాతావరణంలోని నత్రజనిని భూమిలో స్థాపిస్తాయి. వాతావరణంలోని అణు నత్రజనిని మొక్కలు నేరుగా వినియోగించుకోలేవు. ఈ నత్రజనిని సూక్ష్మ జీవులు నైట్రేట్లుగా మారుస్తాయి.

దీన్ని మొక్కలు వినియోగించుకుంటాయి. ఈ ప్రక్రియను నత్రీకరణ అంటారు. సూక్ష్మజీవులు రెండు రకాల నత్రజని స్థాపన చేస్తాయి. నీలిఆకుపచ్చ శైవలాలు, నేలలో స్వేచ్ఛగా నివసించే అజటోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా నేరుగా నత్రజని స్థాపన చేస్తాయి. ఇలాంటి దాన్ని అసహజీవన నత్రజని స్థాపన అంటారు. చిక్కుడు జాతికి చెందిన మొక్కల వేరుబుడిపెలో ఉండే రైజోబియం జాతి బ్యాక్టీరియమ్‌లు మొక్కతో సహజీవనం చేస్తూ నత్రజనిని స్థాపిస్తాయి. దీన్ని సహజీవన నత్రజని స్థాపన అంటారు. దీనిలో మొక్క బ్యాక్టీరియమ్‌కు ఆహారం, రక్షణ కల్పిస్తే బ్యాక్టీరియమ్ మొక్కకు నత్రజనిని అందిస్తుంది. నేరుగా నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియమ్‌లను, నీలి ఆకుపచ్చ శైవలాలను జీవ ఎరువులుగా వాడుతున్నారు. సూక్ష్మజీవులు మొక్కల, జంతు భాగాలను కుళ్లేలా చేసి వాటిని కంపోస్టుగా మారుస్తున్నాయి, మరికొన్ని వీటిని బయోగ్యాస్‌గా మారుస్తున్నాయి. బ్యాక్టీరియమ్‌లు ఇతర సూక్ష్మజీవులను చంపి, వ్యాధులను నియంత్రించే స్ట్రెప్టోమైసిన్, క్లోరోమైసిటిన్, ఎరిత్రోమైసిన్ వంటి సూక్ష్మజీవ నాశకాలను ఉత్పత్తి చేస్తున్నాయి.
 

అసంక్రామ్యత (Immunity) 
         మానవ శరీరం క్రమ రీతిలో వ్యాధి సంక్రమణను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసుకున్న సంరక్షణ విధానాన్ని అసంక్రామ్యత లేదా వ్యాధి నిరోధకశక్తి అంటారు. అసంక్రామ్యత రెండురకాలు. అవి
1) స్వాభావిక లేదా సహజ అసంక్రామ్యత
2) ఆర్జిత లేదా కృత్రిమ అసంక్రామ్యత. 
            సహజ అసంక్రామ్యత జీవి పుట్టుక నుంచి ఉంటుంది. ఇది వివిధ జీవుల్లో, జాతుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జంతువులకు సోకే కొన్ని వ్యాధులు మానవుడికి సోకవు. అలాగే మానవుడికి వచ్చే అన్ని వ్యాధులూ జంతువుల్లో కనిపించవు. భారతీయులకంటే ఆఫ్రికన్లు ఎల్లోఫీవర్, జిగట విరోచనాలకు ఎక్కువ అసంక్రామ్యతను కలిగి ఉంటారు. మానవుడు పుట్టినప్పటి నుంచి జీవితకాలమంతా సంపాదించే అసంక్రామ్యతను ఆర్జిత అసంక్రామ్యత అంటారు. ఇది రెండురకాలు.
1) సక్రియా ఆర్జిత అసంక్రామత్య
2) నిష్క్రియాత్మక ఆర్జిత అసంక్రామ్యత.
         సక్రియా ఆర్జిత అసంక్రామ్యత శరీరంలోకి సహజంగా లేదా కృత్రిమంగా సూక్ష్మజీవులు లేదా వాటి భాగాలు ప్రవేశించడంవల్ల కలుగుతుంది. సూక్ష్మజీవులపై ఉండే యాంటిజన్స్ అనే ప్రొటీన్లను మన శరీరం గుర్తించి వాటి విరుగుడుగా యాంటీబాడీస్ అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి సూక్ష్మజీవులను ఎదుర్కొంటాయి, బలహీనపరుస్తాయి. ఒకసారి అమ్మవారు వచ్చిన వ్యక్తులకు జీవితకాలంలో తిరిగి ఈ వ్యాధి రాకపోవడానికి కారణం సక్రియ ఆర్జిత అసంక్రామ్యత వల్ల తగిన యాంటీబాడీలు ఏర్పడి వ్యాధికి నిరోధకత కలగడమే. వ్యాక్సిన్ల ద్వారా కూడా మనం ఈ రకమైన అసంక్రామ్యతను కలిగిస్తున్నాం. వ్యాక్సిన్ ద్వారా ఇస్తున్న దానిలో సూక్ష్మజీవికి సంబంధించిన యాంటిజన్స్ లేదా హానికరం కాని పూర్తి సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిని మనశరీరం గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఆ వ్యాధికి నిరోధకత కలుగుతుంది. ఒక వ్యాధికి సంబంధించిన యాంటీబాడీలు ఆ నిర్దిష్ట వ్యాధికి మాత్రమే పనిచేస్తాయి.

        నిష్క్రియాత్మక ఆర్జిత అసంక్రామ్యతలో గుర్రం వంటి జంతువుల నుంచి తీసిన సీరంను మానవుడికి ఇస్తారు. సీరంలో ఉండే యాంటీబాడీలు వ్యాధికారక సూక్ష్మజీవులను ఎదుర్కొంటాయి. ఈ పద్ధతి ద్వారా కలిగిన అసంక్రామ్యత కొద్దికాలం మాత్రమే ఉంటుంది. దీన్ని వ్యాధి వచ్చిన వారికే ఇస్తారు.
 

వ్యాక్సిన్లు (టీకాలు) 
        వ్యాక్సిన్లు ఇవ్వడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. వీటి ద్వారా వ్యాధి నిరోధకత కలుగుతుంది. వ్యాక్సిన్ల ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులను లేదా వాటి భాగాలను హాని కలిగించకుండా చేసి శరీరంలోకి పంపుతారు. మనశరీరం వీటిని నిజమైన సూక్ష్మజీవులుగా భ్రమించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి వ్యక్తిలో జీవితాంతం ఉంటూ పూర్తి రక్షణ కలిగిస్తాయి. వ్యాక్సిన్‌ను మొదట కనిపెట్టింది ఎడ్వర్డ్ జన్నర్. ఇతడిని ఇమ్యునాలజీ పితగా పిలుస్తారు. జన్నర్ మశూచి (స్మాల్‌పాక్స్) టీకాను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం అనేక వ్యాధులకు టీకాలను ఇస్తున్నారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌