• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - వ్యవసాయం

        భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. దేశ జీడీపీలో (స్థూల దేశీయోత్పత్తి) సుమారు 13.7 శాతం ఆదాయం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతోంది. దేశ శ్రామిక శక్తిలో అధిక భాగం ఈ రంగంలోనే ఉన్నారు. వ్యవసాయాధార పరిశ్రమలైన నూలు-వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ లాంటి పరిశ్రమల అభివృద్ధి వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంది.


       ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలోని వ్యవసాయం ఆ ప్రాంతంలోని నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణస్థితి, నేలల స్వభావం, సామాజిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని వ్యవసాయ ప్రాంతాలను శీతోష్ణస్థితి, నీటి లభ్యత, నేలల స్వభావం మొదలైన అంశాల ఆధారంగా అయిదు వ్యవసాయ ప్రాంతాలుగా విభజించారు. అవి ....
1) సమశీతోష్ణ హిమాలయ వ్యవసాయ ప్రాంతం: దీన్ని తిరిగి రెండు ఉపభాగాలుగా విభజించారు. అవి:
i) తూర్పు హిమాలయ ప్రాంతం: ఇందులో ప్రధానంగా ఈశాన్య భారత రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ సాగు చేసే ప్రధాన పంటలు వరి, తేయాకు.
ii) పశ్చిమ హిమాలయ ప్రాంతం: ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ & కశ్మీర్ రాష్ట్రాల్లోని ప్రాంతాలు ఇందులో ప్రధానమైనవి. ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలు, బంగాళదుంపలు, వరి, గోధుమ అధికంగా సాగు చేస్తారు.
2) ఉత్తర మెట్ట ప్రాంతం: పంజాబ్, హరియాణా, బిహార్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తర గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇందులో ప్రధానమైనవి. ఈ ప్రాంతంలో పండే ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, మొక్కజొన్న, పత్తి.
3) తూర్పు మాగాణి ప్రాంతం: తూర్పు బిహార్, పశ్చిమ్ బంగ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు తమిళనాడు, దక్షిణ తెలంగాణ రాష్ట్రాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో వరి, చెరకు, జనుము లాంటి పంటలు ప్రధానమైనవి.
4) పశ్చిమ మాగాణి ప్రాంతం: ఇందులో పశ్చిమ తీర మైదాన ప్రాంతంలోని మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పండే ప్రధాన పంటలు వరి, కాఫీ, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు.
5) ఉత్తర-దక్షిణ మధ్యస్థ వర్షపాత ప్రాంతం: ఇందులో దక్షిణ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ తమిళనాడు, తూర్పు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పండే ప్రధాన పంటలు జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ, ఆముదాలు, పత్తి మొదలైనవి.


సాగయ్యే పంటలు - విస్తీర్ణం 
       దేశంలో సాగయ్యే పంటలను వాటి లక్షణాల ఆధారంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి.. ఆహార పంటలు- ఉదా: వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బార్లీ మొదలైనవి. వాణిజ్య పంటలు- ఉదా: పత్తి, చెరకు, జనుము, పొగాకు మొదలైనవి. తోట పంటలు- ఉదా: కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి, పండ్ల తోటలు.
* ఈ పంటల వర్గీకరణలో సహేతుకమైన విభజన ఏదీలేదు. అయితే సాధారణంగా రైతులు వారి ఆహార అవసరాలకు అధిక ప్రాధాన్యమిస్తూ సాగుచేసే వాటిని ఆహార పంటలని, వాణిజ్యపరమైన అంశాలకు ప్రాధాన్యమిస్తూ పండించే వాటిని వాణిజ్య పంటలు అనీ, తోటల రూపంలో సాగుచేసే పంటలను తోట పంటలని పేర్కొంటారు.
* ఈ పంటల విస్తీర్ణంలో ఇటీవలి కాలంలో గణనీయమైన మార్పు వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆహార పంటలను అధికంగా సాగుచేసేవారు. హరిత విప్లవం వల్ల వరి, గోధుమ పంటల దిగుబడి పెరగటమే కాకుండా, ఎక్కువ మంది రైతులు వరి, గోధుమ పంటలను మాత్రమే పండించడం మొదలుపెట్టారు. దీంతో మిగిలిన పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ముతక ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
* వాణిజ్య పంటల సాగు వల్ల అధిక మొత్తంలో లాభాలు వస్తుండటంతో ఇటీవల కాలంలో వాణిజ్య పంటల సాగు పెరిగిపోయింది. తద్వారా ఆహార, పప్పు ధాన్యాలు, నూనె గింజల ధరలు అధికమవుతున్నాయి.
* 2014 - 15లో డైరక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంచనాల ప్రకారం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 252.02 మిలియన్ టన్నులు. 2015 - 16 ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తి 253.16 మిలియన్ టన్నులు 1950 - 51లో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 54.92 మిలియన్ టన్నులు మాత్రమే. తలసరి ఆహార ధాన్యాల లభ్యత 1950వ దశకంలో 395 గ్రాములు ఉండగా ప్రస్తుతం అది 528.77 గ్రాములుగా ఉంది.


వరి 
     ఉష్ణ మండలంలో పండే ప్రధాన ఆహార పంట వరి. దేశంలో అత్యధిక ప్రాంతంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట కూడా ఇదే. ప్రపంచంలో వరి సాగులో భారతదేశం ప్రథమ స్థానంలో ఉండగా, ఉత్పత్తిలో మాత్రం చైనా తొలి స్థానంలో ఉంది. 1950 - 51 లో దేశంలో వరి సాగు చేసే ప్రాంతం కేవలం 30.81 మిలియన్ హెక్టార్లుమాత్రమే. ఇది 2014 - 15 నాటికి 43.9 మిలియన్ హెక్టార్లకు చేరింది. 1950 - 51లో 20.6 మి.ట. ఉత్పత్తి చేయగా, 2014 - 15 నాటికి అది 104.8 మి.ట. లకు చేరింది. దేశంలో వరి ఉత్పత్తిలో ప్రముఖ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు పశ్చిమ్ బంగ, ఉత్తర్ ప్రదేశ్.
* పశ్చిమ్ బంగ రాష్ట్రంలో వరిని మూడు కాలాల్లో సాగు చేస్తారు. స్థానికంగా వాటిని అస్/కర్, అమన్/ సాళ్వా/ అవగని, బోరా/ దాళ్వా అని పిలుస్తారు. వరి సాగుని 'హో' కల్చర్ అని అంటారు. హరిత విప్లవం వల్ల అధికంగా లబ్ధిపొందిన పంటల్లో వరి రెండో స్థానంలో ఉంది. వరి సాగులో వచ్చిన నూతన సాగు విధానం 'శ్రీవరి' సాగు (SRI). ఈ విధానంలో తక్కువ నీటిని ఉపయోగించి వరిని సాగు చేయొచ్చు. ఇటీవల 'వరి'లో వచ్చిన నూతన వంగడాల్లో లూనిశ్రీ, IR-20, IR-8, జయ, హంస, రత్న, కావేరి, కృష్ణ, పంకజ్, అన్నపూర్ణ మొదలైనవి ప్రధానమైనవి.


గోధుమ
     సమశీతోష్ణ మండలంలో పండే ప్రధాన ఆహార పంట. దేశంలో వరి తర్వాత అత్యధిక ప్రాంతాల్లో పండిస్తున్న పంట ఇది. ప్రపంచంలో గోధుమ ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో, చైనా మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. 2014 - 15లో దేశంలో సుమారు 31.0 మిలియన్ హెక్టార్లలో గోధుమ సాగు చేయగా, 88.9 మిలియన్ టన్నుల ఉత్పత్తి లభించింది. గోధుమలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు కళ్యాణ్, సోనా, సోనాలిక, హీరా, చంపారన్, సోనారా 63, భాట్టిలెర్మ మొదలైనవి.
జొన్నలు: వర్షపాతం తక్కువగా ఉండి, నీటిపారుదల వసతులు అంతగా లేని ప్రాంతాల్లో, సాధారణంగా వరి, గోధుమ పంటలకు ప్రత్యామ్నాయంగా జొన్నలను సాగు చేస్తారు. ఖరీఫ్, రబీ పంట కాలాల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. ప్రపంచంలో జొన్నల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రముఖ స్థానాల్లో జొన్నలను సాగు చేస్తున్నాయి.
మొక్కజొన్న: మొక్కజొన్న కూడా ఖరీఫ్, రబీ కాలాల్లో పండించే ప్రధాన పంట. వీటిని తక్కువ వర్షపాతం, ఎర్ర నేలలు ఉన్న ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తారు. ఇవి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికంగా పండిస్తున్నారు. వీటిని ప్రధానంగా కోళ్ల మేతకు వినియోగిస్తున్నారు.


రాగులు
      ఇవి ఖరీఫ్ కాలంలో సాగయ్యే ప్రధాన గింజధాన్యపు పంట. వీటికి 'ఆహారపు విలువ' అధికం. వీటిని 'పేదవారి ఆహారంగా' (Poor man's food), "Buck wheat" గా కూడా పేర్కొంటారు. ప్రపంచంలో రాగుల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో కర్ణాటక ప్రథమ స్థానంలో ఉంది.
సజ్జలు (బాజ్రా): ఖరీఫ్ కాలంలో సాగయ్యే మరో గింజధాన్యపు పంట సజ్జలు. ప్రపంచంలో సజ్జల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది. దీంతోపాటు మధ్యప్రదేశ్, హరియాణా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సజ్జపంట సాగవుతోంది.
బార్లీ: రబీ కాలంలో సాగయ్యే గింజధాన్యపు పంట ఇది. వర్షపాతం, నీటిపారుదల వసతులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ పంటకు ప్రత్యామ్నాయంగా వీటిని సాగు చేస్తున్నారు. బార్లీ ఉత్పత్తిలో ఉత్తర్ ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. దీంతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా బార్లీ సాగవుతోంది.
పప్పుధాన్యాలు: ప్రోటీన్లు అధికంగా ఉండే లెగ్యుమినస్ కుటుంబానికి చెందిన పంటలు పప్పుధాన్యాల కిందికి వస్తాయి. పప్పుధాన్యాల్లో మాంసకృతులనిచ్చే ఆహార పదార్థాలు అధికంగా ఉంటాయి. శెనగలు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు లాంటివి ఈ విభాగంలోకి వస్తాయి. ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమస్థానంలో ఉంది. భారతదేశంలో అన్ని రకాల పప్పుధాన్యాల ఉత్పత్తుల్లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. అత్యధిక ప్రాంతంలో పండిస్తున్న పప్పుధాన్యపు పంట శెనగ. దీని తర్వాతి స్థానంలో కందులు సాగవుతున్నాయి.


నూనె గింజలు
    ప్రపంచంలో నూనెగింజల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నూనెగింజలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో సాగయ్యే ప్రధాన నూనెగింజలు వేరుశెనగ, నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, సోయా చిక్కుడు, ఆవాలు మొదలైనవి.
పత్తి: ఉష్ణమండలంలో సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట పత్తి. దీన్ని 'తెల్ల బంగారం' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో పత్తి సాగులో భారతదేశం ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పత్తిలో మాత్రం అమెరికా, చైనా ముందంజలో ఉన్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ప్రముఖ స్థానాల్లో నిలుస్తున్నాయి.
చెరకు: ఉష్ణమండలంలో సాగయ్యే మరో ప్రధాన వాణిజ్య పంట చెరకు. ప్రపంచంలో చెరకు ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో, బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. దేశంలో చెరకు అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో చెరకును సాగు చేస్తున్నప్పటికీ, దక్షిణ భారత రాష్ట్రాల్లో చెరకు దిగుబడి అధికంగా ఉంటుంది. చెరకు పంటను ఆశించే ప్రసిద్ధ తెగులు 'ఎర్రకుళ్లు' తెగులు. దేశంలో సాగుచేసే ప్రధాన పంటల్లో అత్యధిక కాలానికి ఫలసాయాన్ని ఇచ్చే పంట చెరకు. దీనికి దాదాపు 9 నుంచి11 నెలల సమయం పడుతుంది.


పంట కాలాలు 
     దేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ పంట కాలాలుగా విభజించవచ్చు. అవి ఖరీఫ్, రబీ, జయాద్. ఒక్కొక్క పంట కాలంలో ఒక్కొక్క పంటను ప్రధానంగా సాగు చేస్తారు.
ఖరీఫ్: ఇది దేశంలో అత్యంత ప్రధానమైన పంట కాలం. దేశంలో సాగయ్యే భూమిలో సుమారు 60 శాతం వ్యవసాయ భూమి ఈ కాలంలోనే సాగవుతుంది. జూన్‌లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో ఈ కాలం ప్రారంభమై సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో ముగుస్తుంది. (అయితే కొన్ని పంటలు నవంబరు లేదా డిసెంబరు వరకు కొనసాగుతాయి). ఈ కాలంలో సాగయ్యే ప్రధాన పంటలు వరి, పత్తి, జనుము, చెరకు, మొక్కజొన్న.
రబీ: ఖరీఫ్ పంట కాలం తర్వాత ప్రారంభమయ్యే పంట కాలం 'రబీ'. ఇది సాధారణంగా ఈశాన్య రుతుపవనాలతో అక్టోబరు నెలలో ప్రారంభమై మార్చి, ఏప్రిల్ వరకూ కొనసాగుతుంది. దీన్ని శీతాకాలపు పంట కాలమని కూడా అంటారు. ఈ కాలంలో పండే ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, శెనగలు, పప్పు ధాన్యాలు, పొగాకు, మొక్కజొన్న, జొన్న.
జయాద్: ఇది వేసవి కాలంలో మార్చి నుంచి మే వరకు సాగయ్యే పంట కాలం. సాధారణంగా నీటిపారుదల వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ పంట కాలం ఉంటుంది. ఈ కాలంలో సాగయ్యే ప్రధాన పంటలు వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ, కూరగాయలు, పుచ్చకాయలు.


జనుము:
ఖరీఫ్ కాలంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో జనుము ముఖ్యమైంది. ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. జనుము ఉత్పత్తుల ఎగుమతుల్లో మాత్రం బంగ్లాదేశ్ తొలిస్థానంలో, భారత్ రెండోస్థానంలో ఉన్నాయి. జనుము పంటకి కావాల్సిన అనుకూల పరిస్థితులు: 24ºC నుంచి 35ºC ఉష్రోగత, 125 సెం.మీ. నుంచి 150 సెం.మీ వర్షపాతం, ఒండ్రు నేలలు, మురుగు నీటి వసతులు.

* దేశంలో జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ్ బంగ. దీంతో పాటు బిహార్, ఒడిశా, అసోం, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా జనుమును పండిస్తున్నారు. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు జనుము పంటకి అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ్ బంగ రాజధాని 'కోల్‌కతా' నగరాన్ని "ప్రపంచ జనపనార రాజధాని"గా పేర్కొంటారు. జనపనారను 'బంగారు పీచు' అని కూడా అంటారు. జనపనారతో గోనె సంచులు, పురికొస, గోనె పట్టలు లాంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. సాధారణంగా జనప నారను బేళ్లలో కొలుస్తారు. 1 బేలు జనుము 170 కేజీలకి సమానం.
పొగాకు: ఇది రబీ కాలంలో సాగుచేసే వాణిజ్య పంట. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. చైనా, బ్రెజిల్ ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. పొగాకు పంటకు అనుకూల పరిస్థితులు: 20ºC - 40ºC ఉష్ణోగ్రత, 75 సెం.మీ - 100 సెం.మీ. వర్షపాతం, తేలికపాటి ఎర్రనేలలు, ఒండ్రు నేలలు. ఈ పంటకి మంచు హానికరమైంది. మంచు కురిస్తే పొగాకు నాణ్యత తగ్గుతుంది.
* దేశంలో పొగాకు ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ మొదలైనవి. పొగాకులో ప్రసిద్ధి చెందిన రకాలు నికోటినా టుబాకం, నొకోనారస్టికా, వర్జీనియా రకం పొగాకు ఉత్పత్తిలో భారతదేశం ప్రసిద్ధి చెందింది.


తోట పంటలు

తేయాకు: సమశీతోష్ణ మండలంలో సాగు చేసే ప్రధాన తోటపంట తేయాకు. తేయాకు ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. వినియోగంలో మాత్రం మనదేశమే మొదటి స్థానంలో ఉంది. తేయాకు పంటకు కావాల్సిన అనుకూల పరిస్థితులు: 150 సెం.మీ - 300 సెం.మీ వర్షపాతం, 20ºC - 25ºC ఉష్ణోగ్రత, నీరునిల్వ ఉండని పర్వత లోయ ప్రాంతాలు, లాటరైట్ నేలలు.
* దేశంలో తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అసోం. తర్వాతి స్థానం పశ్చిమ్ బంగ. ఈ రాష్ట్రంలోని డార్జిలింగ్ పర్వతప్రాంతాలు తేయాకు తోటలకి ప్రసిద్ధి. తేయాకులో ప్రసిద్ధి చెందిన రకాలు బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, ఊలాంగ్‌టీ. భారతదేశం బ్లాక్‌టీకి, చైనా గ్రీన్‌టీకి ప్రసిద్ధి.


కాఫీ: ఉష్ణమండలంలో సాగు చేసే ప్రధాన తోట పంట కాఫీ. కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రథమస్థానంలో ఉంది. కాఫీ పంటకి కావాల్సిన అనుకూల పరిస్థితులు: 15ºC - 25ºC ఉష్ణాగ్రతలు, 150 సెం.మీ - 225 సెం.మీ వర్షపాతం, నీరు నిల్వ ఉండని పర్వత లోయ ప్రాంతాలు, సంవత్సరం పొడవునా వర్షపాతం, లాటరైట్ నేలలు.
* దేశంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం - కర్ణాటక. ఈ రాష్ట్రంలోని కూర్గ్, చిక్‌మగళూర్, హసన్, కొడగు జిల్లాల్లో విస్తరించి ఉన్న బాబు బుడాన్ కొండల ప్రాంతం కాఫీ తోటలకి ప్రసిద్ధి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా కాఫీ తోటలను సాగుచేస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని ఉత్తర మలబార్, ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ ప్రాంతాలు కాఫీ తోటలకి ప్రసిద్ధి. కాఫీలో ప్రధాన రకాలు అరాబికా, రొబస్టా, అకాబికాలో కూర్గ్స్, చిక్స్, కెన్ట్సే, మార్గోగైప్, బోర్బన్, బ్లూమౌంటైన్ రకాలు.


రబ్బరు: ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రబ్బరు బెరడుపై పదునైన ఆయుధంతో గంటు ఏర్పడేలా చేసి ఒక రకమైన స్రావాన్ని సేకరిస్తారు. దాన్ని నిల్వ చేస్తే అది ఘనీభవిస్తుంది. ఈ పదార్థాన్ని 'లేటెక్స్' అంటారు. దానికి అనేక మిశ్రమాలను కలిపి సహజ రబ్బరును తయారు చేస్తారు.
* రబ్బరు పంటకు కావాల్సిన అనుకూల పరిస్థితులు: 25ºC - 35ºC ఉష్ణోగ్రతలు, 200 సెం.మీ. - 300 సెం.మీ. వర్షపాతం, సంవత్సరం పొడవునా వర్షపాతం, లేటరైట్ నేలలు. దేశంలో మొట్టమొదట రబ్బరు పంటసాగు 1902 లో కేరళ రాష్ట్రంలోని పెరియార్ నది పరీవాహాక ప్రాంతంలో ప్రారంభమైంది. దేశంలో రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం - కేరళ. దేశంలో ఉత్పత్తి అయ్యే రబ్బరులో 90 శాతం కంటే అధికంగా ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. దీంతోపాటు తమిళనాడులోని కన్యాకుమారి, కోయంబత్తూరు, సేలం, నీలగిరి, మదురై ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో రబ్బరు సాగు చేస్తున్నారు.


సుగంధ ద్రవ్యాలు: దేశంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు సాగుచేస్తున్నారు. అధిక భాగం సాగయ్యేది కేరళలోనే. దేశంలో పండిస్తున్న ప్రధాన సుగంధ ద్రవ్యాలు:
     పసుపు - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు
     మిరియాలు - కేరళ, కర్ణాటక
     లవంగాలు - కేరళ, కర్ణాటక
     అల్లం - కేరళ, మేఘాలయ
     యాలకులు - కేరళ, తమిళనాడు
     కుంకుమ పువ్వు - జమ్మూ కశ్మీర్
     ఉల్లిపాయలు - మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
     మిరప - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక
* కేరళలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు సాగు చేస్తుండటంతో ఈ రాష్ట్రాన్ని 'సుగంధ ద్రవ్యాల ఉద్యానవనంగా' పిలుస్తారు.


పండ్ల తోటలు
     ప్రపంచంలో పండ్ల ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్న పండ్లలో ప్రధానమైనవి:
* జీడిమామిడి - కేరళ, కర్ణాటక, గోవా
* యాపిల్ - హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్
* ద్రాక్ష - పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
* అరటి - తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
* జామ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు
* సీతాఫలాలు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్
* మామిడి - ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ్ బంగ
* బొప్పాయి - ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు
* నారింజ - మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్


పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారతదేశం

* మొద‌టి స్థానం: పాలు, పప్పుధాన్యాలు, జనుము, పసుపు, అల్లం, మిరియాలు, అరటికాయలు, సపోటా, మామిడి, దానిమ్మ, ద్రాక్ష, నిమ్మ, క్లాలీఫ్లవర్.
* రెండో స్థానం: వరి, గోధుమ, చెరకు, వేరుశనగ, పండ్లు, కూరగాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, తేయాకు, బంగాళాదుంపలు, టమాటా.
* మూడో స్థానం: పొగాకు, కోడిగుడ్లు, క్యాబేజి, కొబ్బరికాయలు, పత్తి, నారింజ.
* దేశం మొత్తంలో పండ్ల ఉత్పత్తిలో తమిళనాడు, మహారాష్ట్ర ప్రముఖ స్థానంలో ఉన్నాయి. అయితే మొదటి స్థానంలో మాత్రం పై రాష్ట్రాల వరుస క్రమం తరచూ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రం, ఆ రాష్ట్రంలోని వాతావరణం, మార్కెట్ అంశాలపై ఆధారపడి ఉత్పత్తి ఉండటం వల్ల ఉత్పత్తిలో నిలకడ లోపిస్తుంటుంది.
* వ్యవసాయ రంగం అంటే ఒక్క పంటల సాగే కాకుండా పంటలతోపాటు పశుపోషణ, చేపల పెంపకం, పట్టు పురుగుల పెంపకం కూడా వస్తాయి.


పట్టు ఉత్పత్తి
    ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. కృత్రిమ పట్టు ఉత్పత్తిలో జపాన్ దేశం ప్రథమ స్థానంలో ఉంది. పట్టు పురుగుల పెంపకాన్ని 'సెరికల్చర్' అంటారు. భారతదేశంలో ప్రధానంగా నాలుగు రకాల పట్టు ఉత్పత్తి అవుతుంది.
  పట్టు పేరు - ప్రధానంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు...
    i) మల్బరీ - కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
    ii) టస్సర్ - ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్
    iii) ఇరి - అసోం, మేఘాలయ
    iv) ముగ - అసోం, మేఘాలయ
* దేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, అసోం, మేఘాలయ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కూడా పట్టు ఉత్పత్తి చేస్తున్నారు.


మత్స్య పరిశ్రమ
     చేపల పెంపకాన్ని 'పిసికల్చర్' అంటారు. దేశంలో లభించే చేపలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి మంచినీటిలో లభించే చేపలు, ఉప్పునీటిలో లభించే చేపలు. దేశంలో చేపల ఉత్పత్తిని పెంపొందించడానికి ప్రారంభించింది 'నీలి విప్లవం'. దేశంలో విస్తరించి ఉన్న సుమారు 7516 కి.మీ. పొడవైన సముద్రతీర ప్రాంతంలో సముద్ర చేపలు లభిస్తుండగా, భూభాగంలో విస్తరించి ఉన్న నదులు, కాలువలు, వాగులు, చెరువులు మొదలైన వాటిలో మంచినీటి చేపలు లభిస్తున్నాయి.
* దేశంలో లభించే మొత్తం చేపల్లో ఉప్పునీటి చేపలే అధికం. ఉప్పునీటి చేపల ఉత్పత్తిలో కేరళ, మంచినీటి చేపల ఉత్పత్తిలో పశ్చిమ్ బంగ, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. దేశంలో చేపల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ్ బంగ.


వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులను పెంపొందించడానికి దేశంలో ప్రారంభించిన వివిధ విప్లవాలు...
* ఆహారధాన్యాల ఉత్పత్తులు - హరిత విప్లవం (దేశంలో ఆద్యుడు - ఎం.ఎస్. స్వామినాథన్)
* పాల ఉత్పత్తులు - శ్వేత విప్లవం (దేశంలో ఆద్యుడు - వర్గీస్ కురియన్)
* చేపల ఉత్పత్తి - నీలి విప్లవం
* రొయ్యల ఉత్పత్తులు - పింక్ రివల్యూషన్
* కోడిగుడ్ల ఉత్పత్తులు - సిల్వర్ రివల్యూషన్
* పండ్ల ఉత్పత్తులు - గోల్డెన్ రివల్యూషన్
* టమాటా ఉత్పత్తులు/ మాంసపు ఉత్పత్తులు - ఎరుపు విప్లవం
* ఉన్ని ఉత్పత్తులు - గ్రే రివల్యూషన్
* సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు - బ్రౌన్ రివల్యూషన్
* బంగాళాదుంపల ఉత్పత్తులు - రౌండ్ రివల్యూషన్
* ఉద్యానవన పంటల ఉత్పత్తులు - ఆరెంజ్ రివల్యూషన్
* నూనెగింజల ఉత్పత్తులు - ఎల్లో రివల్యూషన్


వ్యవసాయ పంటలు - జాతీయ పరిశోధనా కేంద్రాలు ఉన్న ప్రాంతాలు
* వరి - కటక్ (ఒడిశా)
* జనుము - భారక్‌పూర్ (పశ్చిమ్ బంగ)
* పత్తి - నాగ్‌పుర్ (మహారాష్ట్ర)
* తేయాకు - జోర్హాట్ (అసోం)
* కాఫీ - చిక్‌మగళూర్ (కర్ణాటక)
* పట్టు - మైసూర్ (కర్ణాటక)
* వేరుశెనగ - జునాఘడ్ (గుజరాత్)
* ఉద్యానవనాలు - బెంగళూరు (కర్ణాటక)
* ఉప్పునీటి చేపలు - కొచ్చి (కేరళ)
* తోట పంటలు - కాసర్‌గడ్ (కేరళ)
* సుగంధ ద్రవ్యాలు - కాలికట్ (కేరళ)
* బంగాళదుంపలు - సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్)
* ఉల్లిపాయలు - నాసిక్ (మహారాష్ట్ర)

Posted Date : 09-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌