• facebook
  • whatsapp
  • telegram

క్షిప‌ణి రంగంలో భార‌త్ స్వయంస‌మృద్ధి

  శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ విజయాలకు తార్కాణం క్షిపణులు. భారతదేశం శత్రు దుర్భేద్యంగా తయారు కావడానికి.. రక్షణ రంగంలో స్వయంసమృద్ధిని పొందే దిశగా క్షిపణి తయారీ కార్యక్రమాన్ని 1982లో అబ్దుల్ కలాం నేతృత్వంలో చేపట్టారు. ఆ కార్యక్రమమే - ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఐజీఎండీపీ). 2022 నాటికి ఏ దేశం నుంచి కూడా క్షిపణి లేదా వాటి విడిభాగాలను దిగుమతి చేసుకోకూడదన్నది లక్ష్యం. ఈ రంగంలో ఏపీజే అబ్దుల్ కలాం చేసిన కృషికి గాను ఆయనను 'మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా కీర్తిస్తున్నారు.

  రామాయణ, మహాభారత కాలాల్లో రకరకాల అస్త్రాలు ప్రయోగించారని పుస్తకాల్లో చదవడమేతప్ప చూసిందిలేదు. కానీ ఆధునిక కాలంలో మన అస్త్రాలను చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఆధునిక అస్త్రాలు క్షిపణులు. ఇవి సిగ్నల్ వ్యవస్థతో పనిచేస్తాయి. ప్రపంచ తొలి క్షిపణులను టిప్పు సుల్తాన్ సైన్యం మైసూర్ యుద్ధాల్లో ఉపయోగించింది. 2008 జనవరి 8 వరకు కొనసాగిన ఐజీఎండీపీలో భాగంగా.. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్(డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ)లో అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్ క్షిపణులను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ క్షిపణి రంగంలో శాస్త్రవేత్తల్లో ఆత్మస్త్థెర్యాన్ని నింపడమే కాకుండా ప్రాచ్య దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించే సత్తాను కూడా ఇచ్చింది.

 

క్షిపణుల్లో రకాలు

అణ్వస్త్రాన్ని లేదా సంప్రదాయ పేలుడు పదార్థాన్ని సుదూర శత్రు స్థావరాలపై ప్రయోగించే, మార్గదర్శక (గైడెడ్) రాకెట్ వ్యవస్థను క్షిపణి (మిస్సైల్) అంటారు. క్షిపణులు రెండు రకాలు. అవి..
1) బాలిస్టిక్ మిస్సైల్        2) క్రూయిజ్ మిస్సైల్
 

 

బాలిస్టిక్ మిస్సైల్

  దీన్ని ఒక బాణంతో పోల్చవచ్చు. తొలిదశలోనే దీనిపై బలాన్ని ప్రయోగిస్తారు. దీంతో అది ప్రక్షేపక మార్గంలో.. భూ గురుత్వాకర్షణ(గ్రావిటీ)కి అనుగుణంగా ప్రయాణించి లక్ష్య ప్రదేశాన్ని చేరుతుంది. తొలిదశలో నిర్ణీత ఎత్తువరకు ప్రయాణించిన రాకెట్ నుంచి వార్‌హెడ్ విడిపోయి కొంత దూరంలో పడిపోతుంది. క్షిపణి ప్రయాణించే గరిష్ఠ దూరం (వ్యాప్తి) ఆధారంగా వీటిని ఐసీబీఎం, ఐఆర్‌బీఎం, ఎంఆర్‌బీఎం, ఎస్ఆర్‌బీఎంలుగా విభజించవచ్చు.

1. ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్): దీని వ్యాప్తి కనిష్ఠంగా 5500 కి.మీ.లు. అగ్ని-5, సూర్య క్షిపణులు భారత ఖండాంతర క్షిపణులు.

2. ఐఆర్‌బీఎం (ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్): దీని వ్యాప్తి 3000 నుంచి 5500 కి.మీ.లు. అగ్ని-3 ఈ తరహా క్షిపణి.

3. ఎంఆర్‌బీఎం (మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్): దీని వ్యాప్తి 1000 నుంచి 3000 కి.మీ.లు. అగ్ని-2 దీనికి ఉదాహరణ.

4. ఎస్ఆర్‌బీఎం (షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్): దీని వ్యాప్తి 1000 కి.మీ.ల కంటే తక్కువ. పృథ్వి-1, 2, 3; ప్రహార్, అగ్ని-1, శౌర్య క్షిపణులు ఈ రకానికి చెందినవి.

 

క్రూయిజ్ మిస్సైల్

  వీటిని విమానాలతో పోల్చవచ్చు. ఇవి నిర్ణీత లక్ష్యాన్ని, కచ్చితత్వంతో ఛేదించే వరకు, భూమికి సమాంతరంగా గాలిలో ప్రయాణిస్తాయి. క్షిపణి లక్ష్యాన్ని చేరేవరకూ అందులోని చోదక వ్యవస్థలు పనిచేస్తాయి. వేగం ఆధారంగా వీటిని సబ్‌సోనిక్, సూపర్‌సోనిక్, హైపర్ సోనిక్ రకాలుగా విభజించవచ్చు. గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తే అది సబ్‌సోనిక్ క్షిపణి. నిర్భయ్ క్షిపణి లాంగ్‌రేంజ్ సబ్‌సోనిక్ క్షిపణి.
* గాలిలో ధ్వని వేగానికి 2 నుంచి 3 రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణులు సూపర్‌సోనిక్ క్షిపణులు. 'బ్రహ్మోస్' సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
* గాలిలో ధ్వని వేగానికి 5 రెట్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే క్షిపణులు హైపర్‌సోనిక్ క్షిపణులు. అభివృద్ధి దశలోని బ్రహ్మోస్-2 ఈతరహా క్షిపణి.

 

క్షిపణి ప్రయోగ విధానాలు (క్షిపణి, లక్ష్యాలు ఉండే ప్రదేశాల ఆధారంగా)
1. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు (ఎస్ఎస్ఎం)
2. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు (ఎస్ఏఎం)
3. గగనతలం నుంచి గగనతలానికి క్షిపణులు (ఏఏఎం)
4. యుద్ధ ట్యాంకులపై ప్రయోగించే యాంటీ ట్యాంకు మిస్సైల్స్ (ఏటీఎం)

 

అగ్ని క్షిపణులు

  మధ్యంతర నుంచి ఖండాంతర వ్యాప్తి ఉన్న ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల అగ్ని శ్రేణి క్షిపణులు 5 రకాలు.

అగ్ని-I, అగ్ని-II, అగ్ని–III క్షిపణులను 2008 నాటికి అభివృద్ధి చేశారు. అగ్ని IV, V, VI రకం క్షిపణులు అభివృద్ధి, పరిశోధన దశలో ఉన్నాయి.

 

పృథ్వీ: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల షార్ట్‌రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. ఐజీఎండీపీలో భాగంగా డీఆర్‌డీవో పృథ్వీ క్షిపణులను అభివృద్ధి చేసింది.

ఆకాశ్: ఉపరితలనం నుంచి గగన తలానికి(ఎస్ఏఎం) ప్రయోగించగల సూపర్‌సోనిక్ మధ్యంతర క్షిపణి. సుమారు 25 కి.మీ.ల ఎత్తులోని యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ఇది కూల్చివేయగలదు. దీన్నే ఇంటర్‌సెప్టార్ మిస్సైల్‌గా ఉపయోగించవచ్చు.

* సైనిక బలగాల కోసం అభివృద్ధి చేసిన ఆకాశ్ మిస్సైల్‌ని జనవరి 26, 2015 రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించారు. వీటిని మేలో సైన్యంలోకి తీసుకున్నారు. వైమానిక దళం ఇంతకు ముందే వీటిని చేర్చుకుంది. ఆకాశ్ తొలి బహుళ లక్ష్య (మల్టీపుల్ టార్గెట్) క్షిపణి.

త్రిశూల్: ఉపరితలం నుంచి గగన తలానికి (ఎస్ఏఎం) ప్రయోగించే సత్వర ప్రతిచర్య (క్విక్ రియాక్షన్) రకానికి చెందిన క్షిపణి. దీని వ్యాప్తి 9 కి.మీ.లు ఇది తక్కువ ఎత్తులో ఎగిరే వస్తువులను (ఫ్త్లెయింగ్) కూల్చివేయగలదు. త్రివిధ దళాలు ఉపయోగించవచ్చు.

నాగ్: ఇది మూడో తరానికి చెందింది. కాల్చు - మరచిపో (ఫైర్ అండ్ ఫర్‌గెట్) రకానికి చెందిన యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి (ఏటీఎం - యాంటీ ట్యాంకు మిస్సైల్). ఇది సుమారు 4-5 కి.మీ.ల దూరంలోని ట్యాంకులను ధ్వంసం చేస్తుంది. ఫైబర్‌గ్లాస్‌తో నిర్మితమైన మొదటి ఏటీఎం.

నాగ్ క్షిపణిని రెండు ర‌కాలుగా అభివృద్ధి ప‌రిచారు. అవి..
1) ప‌దాతి ద‌ళం కోసం నాగ్ మిస్సైల్ కారియ‌ర్ (ఎస్ఏఎంఐసీఏ) పై ఉప‌యోగించే క్షిప‌ణి.
2) వైమానిక ద‌ళం కోసం హెలికాప్టర్ నుంచి ప్రయోగించ‌గ‌ల హెలీనా (హెచ్ఈఎల్ఐఎస్ఏ) రకం క్షిప‌ణి. (HELINA = Helicopter + Nag)
హెలీనా వ్యాప్తి 7-8 కి.మీ.లు. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసిన ధ్రువ్ లేదా లైట్ కంబాట్ హెలికాప్టర్(ఎల్‌సీహెచ్)లలో అమర్చవచ్చు.
అస్త్ర: యాక్టివ్ రాడార్ రోమింగ్ వ్యవస్థను కలిగిన, బియాండ్ విజిబుల్ రేంజ్ - గగనతలం నుంచి గగనతలానికి (బీవీఆర్ఏఏఎం) ప్రయోగించగల క్షిపణి అస్త్ర. దీన్ని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. మొత్తం 8 సార్లు దీన్ని పరీక్షించారు. ఇది వేర్వేరు దూరాలు, ఎత్తుల్లో ఉండే లక్ష్యాలను ఛేదిస్తుంది. 20 కి.మీ.ల లోపు ఉండే స్వల్ప అవధి లక్ష్యాల నుంచి 80 కి.మీ.ల వరకు ఉండే దీర్ఘ అవధి లక్ష్యాలను ఛేదిస్తుంది. దీన్ని చివరిసారిగా మార్చి 18, 2015న సుఖోయి-30 యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. దీన్ని హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన తేజస్, ఏఎంసీఏ, ఎఫ్‌జీఎఫ్ఏ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా కూడా ప్రయోగించే అవకాశం ఉంది.

 

ముఖ్యాంశాలు

* మ్యాక్ (Mach) - క్షిప‌ణి వేగానికి ప్రమాణం. మ్యాక్ = క్షిప‌ణి వేగం / గాలిలో ధ్వని వేగం

* 2015, జనవరి 31న ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) సెంటర్ నుంచి అత్యాధునిక అగ్ని- V మిస్సైల్‌ను మూడోసారి విజయవంతంగా ప్రయోగించారు.

* పృథ్వీ-IIIనే 'ధనుష్' అని పిలుస్తారు. దీన్ని నౌకల నుంచి ప్రయోగించవచ్చు.

* 2015, ఫిబ్రవరి 19న చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి 350 కి.మీ.ల దూరం ప్రయాణించే అణ్వాస్త్రాన్ని తీసుకుని వెళ్లే పృథ్వీ-IIని విజయవంతంగా పరీక్షించారు.

* హెలికాప్టర్ ఆధారిత నాగ్ క్షిపణిని 2015 జులైలో జైసల్మీర్, రాజస్థాన్‌లో పరీక్షించారు.

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌