• facebook
  • whatsapp
  • telegram

పరిశ్రమలు

తియ్యని.. పారదర్శక.. నిర్మాణ కర్మాగారాలు!

 


  ఉదయం నిద్ర లేవగానే తగినంత చక్కెర కలిపిన టీ లేదా కాఫీ తాగేస్తే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. తలుచుకోగానే నోరూరే స్వీట్లు తయారయ్యేది ఆ చక్కెరతోనే. ఇక కిటీకీలు, కెమెరా లెన్స్‌లు, కార్ల అద్దాలు మొదలు, ఇంటీరియర్లు సహా అనేక పనుల్లో వాడే వస్తువు గాజు. నిర్మాణం ఏదైనా ముందుగా గుర్తుకొచ్చేది సిమెంటు. వినియోగం అంతకంతకు పెరుగుతున్న విలాస వస్తువుల్లో ఆల్కహాల్‌ ఉత్పత్తులు, సౌందర్య లేపనాలు ఉన్నాయి. ఇవన్నీ పారిశ్రామిక ఉత్పత్తుల్లో ప్రధానమైనవి, అందరూ నిత్యం వినియోగించేవి. జన జీవితాల్లోనూ, ఆర్థిక వ్యవస్థల్లోనూ అతి కీలకంగా ఉన్న ఆ పరిశ్రమల గురించి పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక అవగాహన ఉండాలి.  

 


  ప్రతి ఒక్కరికీ అవసరమైనవి, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో అత్యంత కీలకమైనవి పరిశ్రమలు. అందులోనూ చక్కెర, గాజు, సిమెంటు, ఆల్కహాల్‌ పరిశ్రమలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి.అందరి జీవితాల్లో భాగమైపోయాయి.రసాయన శాస్త్రంలోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 

 


చక్కెర పరిశ్రమ: చెరకు గడలను క్రషింగ్‌ చేసినప్పుడు చెరకు రసం వస్తుంది. తర్వాత ఏర్పడిన పిప్పిని బగాసే అంటారు. దీన్ని కాగితం తయారీలో, విద్యుత్తు ఉత్పత్తిలో ఇంధనంగా ఉపయోగిస్తారు.చెరకు రసంలోని ఆమ్లత్వాన్ని తొలగించేందుకు సున్నం [Ca(OH)2] కలుపుతారు. ఈ ప్రక్రియనే డిఫకేషన్‌ అంటారు. తర్వాత ద్రావణంలో ఎక్కువైన సున్నాన్ని తొలగించడానికి CO2  వాయువును పంపుతారు. ఈ ప్రక్రియను కార్బొనేషన్‌ అంటారు. ఇంకా మిగిలి ఉన్న సున్నం అవశేషాలను తొలగించడానికి SO2 వాయువును పంపుతారు. దీన్నే సల్ఫిటేషన్‌ అంటారు. ఈ విధంగా డిఫకేషన్, కార్బొనేషన్, సల్ఫిటేషన్‌ వల్ల ఏర్పడిన అవక్షేపాలను ప్రెస్‌మడ్‌ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియల్లో ఏర్పడిన పారదర్శక ద్రావణాన్ని బాష్పీకరణ యంత్రాల్లో ఇగిర్చినప్పుడు చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి.

 


గాజు పరిశ్రమ: పారదర్శకమైన పెళుసుదనం ఉన్న అస్ఫటిక పదార్థమే గాజు. ఇది ఘనరూపంలో కనిపించినప్పటికీ దాని నిజమైన రూపం అది కాదు. దీనికి కచ్చితమైన ద్రవీభవన స్థానం లేదు. వేడి చేసినప్పుడు మెల్లగా ద్రవంగా మారుతుంది. అందువల్ల గాజును అతిశీతల ద్రవం అంటారు. రసాయనికంగా గాజు అనేది సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికాల మిశ్రమ పదార్థం. వేడి చేసి, మెత్తగా మారిన తర్వాత దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతిలో వస్తువును తయారు చేయడాన్ని గ్లాస్‌ బ్లోయింగ్‌ అంటారు. ఈ ధర్మమే గాజు ఎన్నోరకాలుగా ఉపయోగపడే విధంగా చేసింది. గాజుపై అక్షరాలు రాయడాన్ని ఎచ్చింగ్‌ అంటారు. దీనికోసం హైడ్రోఫ్లోరిక్‌ (HF) ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. గాజుపై మొదట మైనంపూత పూసిన అనంతరం అక్షరాల రూపంలో మైనాన్ని తీసేసి హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లాన్ని పూస్తారు.  HF ఆమ్లం గాజుతో చర్య పొందిన తర్వాత మైనాన్ని తొలగించినప్పుడు గాజుపై అక్షరాలు కనిపిస్తాయి.ఈ గాజులో పలు రకాలు ఉన్నాయి. 

 


1) సోడా గాజు: సోడాయాష్‌ (Na2CO3), సున్నపురాయి (CaCO3), ఇసుక (SiO2) ల మిశ్రమం. దీన్ని చూర్ణం చేస్తే ఏర్పడే పదార్థాన్ని ‘బాచ్‌’ అంటారు. బాచ్‌కు గాజు ముక్కలు కలిపితే దాన్ని ‘కల్లెట్‌’ అంటారు. బాచ్‌ను 1000°C వరకు నెమ్మదిగా వేడి చేస్తే ద్రవగాజు ఏర్పడుతుంది. దానిపై తేలియాడే మలినాలను గాజుగాల్‌ అంటారు. ద్రవగాజును దశలవారీగా నెమ్మదిగా చల్లార్చడాన్ని మంద శీతలీకరణం అంటారు. ఇది చవకైన గాజు. కాబట్టి దీన్ని కిటికీ అద్దాలు, సీసాలు, ట్యూబ్‌లైట్ల తయారీలో ఉపయోగిస్తారు.

 


2) పొటాష్‌ గాజు: దీనిలో కాస్టిక్‌ పొటాష్‌ (KOH)ను ఉపయోగిస్తారు. ప్రధానంగా కోనికల్‌ ఫ్లాస్కు, బీకరు, గరాటులు మొదలైన వాటి తయారీలో వినియోగిస్తారు 

 


3) ప్లింట్‌ గాజు: పొటాషియం కార్బొనేట్, లెడ్‌ ఆక్సైడ్, సిలికా మిశ్రమాలతో దీన్ని తయారుచేస్తారు. ఎలక్ట్రిక్‌ బల్బులు, కెమెరా లెన్స్‌లు, టెలీస్కోప్‌ల్లో వాడతారు.

 


4) పైరెక్స్‌ గాజు: దీనినే బోరో సిలికేట్‌ గాజు అని పిలుస్తారు. ఇది థర్మల్‌ షాక్‌ను కూడా తట్టుకునేంత నాణ్యమైన గాజు. అకస్మాత్తుగా వేడి చేసినా, చల్లార్చినా తట్టుకుంటుంది. రసాయన పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.

 


5) వాటర్‌ గాజు: సోడియం సిలికేట్‌ (Na2SiO2) ను వాటర్‌ గ్లాస్‌ అంటారు. కొన్ని లోహ ఆక్సైడ్‌లు కలపడంతో దీనికి వివిధ రంగులు ఏర్పడతాయి. 


* క్వార్ట్జ్‌ గాజును అల్ట్రావయలెట్‌ (UV) కిరణాలను నిరోధించే అద్దాల తయారీలో ఉపయోగిస్తారు.


* క్రౌన్‌ గాజును కంటి అద్దాల ఉత్పత్తిలో వినియోగిస్తారు. 


* గాజుకు ఊదా రంగు రావడానికి మాంగనీస్‌ డయాక్సైడ్‌ను, నీలం రంగుకు కాపర్‌ సల్ఫేట్‌ను, ఆకుపచ్చ రంగు తెప్పించడానికి ఫెర్రస్‌ ఆక్సైడ్‌ను, కెంపు రంగు కోసం ఆరిక్‌ క్లోరైడ్‌ను కలుపుతారు.

 


సిమెంట్‌ పరిశ్రమ: సిమెంటును మొదటిసారిగా ఇంగ్లండ్‌లో 1824లో జోసఫ్‌ ఆస్పడిన్‌ ప్రవేశపెట్టాడు. ఇది ఇంగ్లండ్‌లోని ఐల్‌ ఆఫ్‌ పోర్ట్‌ ల్యాండ్‌ గనుల్లో తవ్విన సహజ సున్నపురాయిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని పోర్ట్‌ ల్యాండ్‌ సిమెంట్‌ అని కూడా అంటారు.


* సున్నం (CaO) ఎక్కువగా ఉండే పదార్థాన్ని సిలికా (SiO2) ఎక్కువగా ఉండే బంక మట్టితో, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్‌లతో కలపగా ఏర్పడే మిశ్రమ పదార్థమే సిమెంట్‌. ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ వల్ల అది బూడిద రంగులో కనిపిస్తుంది. 


* సిమెంట్‌ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు సున్నపురాయి, బంకమట్టి. 


* బంకమట్టిని సున్నంతో బాగా కలిపి వేడి చేస్తే అది ద్రవీభవించి చర్య జరిపి సిమెంట్‌ క్లింకర్‌ను ఏర్పరుస్తుంది. ఈ క్లింకర్‌ను 2 - 3% జిప్సంతో కలిపితే సిమెంట్‌ ఏర్పడుతుంది. 


* పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌లోని ఘటక పదార్థాలు డై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం అల్యూమినేట్‌.

 


  సిమెంట్‌కు నీరు కలిపితే గట్టి పదార్థంగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను సెట్టింగ్‌ ఆఫ్‌ సిమెంట్‌ అంటారు. సెట్టింగ్‌ ఆఫ్‌ సిమెంట్‌ నెమ్మదిగా జరగడం కోసం జిప్సంను వాడతారు. దాంతో అది తగినంత గట్టి పడుతుంది. సిమెంటు, ఇసుక, నీరు మిశ్రమ పదార్థాన్ని గోడలకు పూతగా వేస్తారు. దాన్ని మోర్టార్‌ సిమెంట్‌ అంటారు. కంకర, సిమెంట్, ఇసుకల మిశ్రమాన్ని కాంక్రీట్‌ అంటారు. దీన్ని రోడ్లు వేయడానికి, ఫ్లోరింగ్‌ చేేయడానికి ఉపయోగిస్తారు. దగ్గరగా ఉంచిన ఇనుము అచ్చుల చట్రంలో కాంక్రీట్‌ను వేయడాన్ని ప్రబలిత కాంక్రీట్‌ (RCC) అంటారు. దీన్ని పిల్లర్లు, వంతెనల నిర్మాణంలో ఉపయోగిస్తారు.

 


ఆల్కహాల్‌ పరిశ్రమ: ఇథైల్‌ ఆల్కహాల్‌ను సాధారణంగా ఆల్కహాల్‌ అని, ‘స్పిరిట్‌ ఆఫ్‌ వైన్‌’ అని పిలుస్తారు. చెరకు రసం నుంచి చక్కెరను వేరుచేసినప్పుడు ఏర్పడే ద్రావణాన్ని మొలాసిస్‌ అంటారు. మొలాసిస్‌లో 50% చక్కెర ఉంటుంది. దీనికి ఈస్ట్‌ను కలిపి కిణ్వన ప్రక్రియ జరిపినప్పుడు ఇథైల్‌ ఆల్కహాల్‌ ఏర్పడుతుంది. శుద్ధ ఆల్కహాల్‌ తాగడానికి వినియోగించకుండా దానిలో మిథైల్‌ ఆల్కహాల్, పిరిడిన్‌/ఎసిటోన్‌లను కలుపుతారు. అప్పుడు దాన్ని అసహజ స్పిరిట్‌ అంటారు. కల్తీ సారాలో మిథైల్‌ ఆల్కహాల్‌ ఉండటం వల్ల దాన్ని తాగినప్పుడు కంటిచూపు తగ్గుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది.* మిథైల్‌ ఆల్కహాల్‌ను ‘ఉడ్‌ స్పిరిట్‌’ అంటారు.


* ఇథైల్‌ ఆల్కహాల్‌ను ‘గ్రెయిన్‌ ఆల్కహాల్‌’ అంటారు.


* వంద శాతం శుద్ధ ఆల్కహాల్‌ను ‘పరమ ఆల్కహాల్‌’ అంటారు.


* తాగడానికి ఉపయోగపడని ఆల్కహాల్‌ను ‘మిథైల్‌ ఆల్కహాల్‌’ అంటారు.

 


శరీర సౌందర్య సాధనాలు:  వ్యక్తి అందం, రూపు, ముఖ శుభ్రతను పెంచడానికి వాడే పదార్థాలను సౌందర్య సాధనాలు అంటారు.

 


పౌడర్‌: ముఖంపై నూనె, చెమటను తొలగించి చర్మానికి నునుపుదనం ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పౌడర్‌లో ఉన్న ముఖ్యమైన అనుఘటకం - ఆర్ద్ర మెగ్నీషియం సిలికేట్‌ (టాల్క్‌)

 


శీతల లేపనాలు: సూర్యకాంతి, చలిగాలులు, దుమ్ము, ధూళి నుంచి చర్మాన్ని రక్షించే ఎమల్షన్‌లు ఇవి. ఇందులోని ముఖ్య అనుఘటకాలు - బాదం నూనె, తేనెతుట్టె నుంచి లభించే మైనం, గులాబీ నూనె మొదలైనవి.

 


గోళ్లరంగు: గోళ్ల ఆకర్షణకు పూతగా వేసే రంగు పదార్థమిది. ఈ రంగులో పాలిమర్‌ రెజిన్, ప్లాస్టిసైజర్, సువాసన ద్రవ్యాలు అన్నీ ఒక బాష్పశీలి ద్రావణిలో కరిగి ఉంటాయి.


 


ప్రాక్టీస్‌ బిట్స్‌

 


1. చెరకు రసంలోని ఆమ్లత్వాన్ని తొలగించడానికి ఉపయోగించే పదార్థం ఏమిటి?

1) కాల్షియం హైడ్రాక్సైడ్‌  2) పొటాషియం హైడ్రాక్సైడ్‌

3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌  4) అల్యూమినియం హైడ్రాక్సైడ్‌

 


2. గాజు తయారీకి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు?

1) సోడియం సిలికేట్‌ 2) కాల్షియం సిలికేట్‌ 3) సిలికా 4) పైవన్నీ

 


3. గాజుపై అక్షరాలను రాయడానికి ఉపయోగించే ఆమ్లం?

1) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం 2) హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం

3) సల్ఫ్యూరస్‌ ఆమ్లం 4) నైట్రస్‌ ఆమ్లం 

 


4. ఎలక్ట్రిక్‌ బల్బులు, కెమెరా లెన్స్‌లు, టెలిస్కోపు తయారీకి ఉపయోగించే గాజు రకం?

1) సోడా గాజు 2) పొటాష్‌ గాజు

3) ప్లింట్‌ గాజు 4) బోరోసిలికేట్‌ గాజు

 


5. గాజుకు కెంపు రంగు రావడానికి కలిపే పదార్థం?

1) ఆరిక్‌ క్లోరైడ్‌          2) కాఫర్‌ సల్ఫేట్‌

3) మాంగనీస్‌ డయాక్సైడ్‌  4) ఫెర్రస్‌ ఆక్సైడ్‌

 


6. మోర్టార్‌ ఏ పదార్థాల మిశ్రమం?

1) సిమెంట్, కంకర, ఇసుక 2) సిమెంట్, సున్నం, ఇసుక

3) సిమెంట్, ఇసుక, నీరు 4) సిమెంట్, ఇసుక, ఇటుకలు

 


7. సిమెంట్‌ బూడిద రంగులో కనిపించడానికి కారణమైన దాన్ని గుర్తించండి.

1) సోడియం హైడ్రాక్సైడ్‌ 2) మెర్క్యూరిక్‌ ఆక్సైడ్‌

3) లెడ్‌ ఆక్సైడ్‌ 4) ఫెర్రిక్‌ ఆక్సైడ్‌

 


8. వైన్‌లో ఉండాల్సిన ఆల్కహాల్‌ శాతం?

1) 3 - 6%     2) 12 - 16% 

3) 35 - 60%   4) 40 - 50% 

 


9. శీతల లేపనాల్లోని ముఖ్యమైన అనుఘటకాలు గుర్తించండి.

1) బాదంనూనె   2) తేనెతుట్టె నుంచి లభించే మైనం 3) గులాబీ నూనె 4) పైవన్నీ

 


10. నూలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సంబంధించిన జబ్బును గుర్తించండి.

1) సిలికోసిస్‌ 2) వైట్‌లంగ్స్‌ 3) బ్రౌన్‌లంగ్స్‌ 4) ఫాసీజా

 


సమాధానాలు

1-1; 2-4; 3-2; 4-3; 5-1; 6-3; 7-4; 8-2; 9-4; 10-2.

 


రచయిత: చంటి రాజుపాలెం
 

Posted Date : 13-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌