• facebook
  • whatsapp
  • telegram

పరిశ్రమలు

నూలు మొదలు.. ఔషధాల వరకు!

  ప్రాంతాల ప్రగతిలో పరిశ్రమలు ప్రధానపాత్ర పోషిస్తాయి. తెలంగాణ ఆర్థికాభివృద్ధిలోనూ ఆంగ్లేయుల కాలం నాటి నూలు పరిశ్రమ మొదలు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ సహా ఇటీవల కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందించిన భారత్‌ బయోటెక్‌ వరకు అనేక పరిశ్రమలు కీలకంగా ఉన్నాయి. జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా ఏ రకమైన పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి, ఎలాంటి ఉత్పత్తులు చేస్తున్నాయనే అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  తెలంగాణ రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయాధారిత, సిమెంట్, లెదర్, చేనేత, హార్టికల్చర్, బయోటెక్నాలజీ, ఆటోమొబైల్స్, రక్షణ రంగం తదితరాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వాటి వాటా 25 శాతం.

 

పరిశ్రమల వార్షిక సర్వే: ఈ సర్వేను, కేంద్ర ప్రభుత్వ గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల పరంగా దేశంలో ఆరో స్థానంలో, పరిశ్రమల నుంచి స్థూల ఆధారిత విలువ పరంగా 8వ స్థానంలో ఉంది. రాష్ట్ర స్థూల విలువ (జీఎస్‌వీఏ) ఆధారంగా చూస్తే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం 19 శాతం వాటా, తయారీ రంగం 9.3 శాతం వాటా కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు లాంటివి ఎస్టేట్స్‌ వరల్డ్‌ క్లాస్‌గా పారిశ్రామిక గుర్తింపునిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’ను హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేయడంతో ప్రపంచస్థాయిలో రాష్ట్రం పేరు వినిపించింది. 

 

పారిశ్రామికరంగ అభివృద్ధి: 2020-21లో రాష్ట్రంలో పారిశ్రామిక రంగ వృద్ధి సంతృప్తికరంగా ఉంది. ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక ఫ్రేంవర్క్‌ పాలసీ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి (రాష్ట్ర సగటు వృద్ధి రేటు) 7.8 శాతంగా నమోదైంది. ఎక్కువగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో అభివృద్ధి చెందింది. ఆ జిల్లాల ఆదాయంలో సగం కంటే ఎక్కువ ఈ రంగం ద్వారా లభిస్తోంది. జిల్లాల ఆదాయంలో 75 శాతం వ్యవస్థీకృత తయారీ రంగం నుంచి, 44 శాతం నిర్మాణ రంగం నుంచి సమకూరుతోంది. 

ఉదా: జీనోమ్‌ వ్యాలీ - భారతదేశంలో మొదటి వ్యవస్థీకృత లైఫ్‌సైన్సెస్‌ క్లస్టర్‌

 

వర్గీకరణ 

పరిశ్రమల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) మంత్రిత్వశాఖ కాలానుగుణంగా సవరిస్తుంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వర్గీకరణ ప్రకారం...

ఎ) మెగా అతిపెద్ద ప్రాజెక్ట్‌ పరిశ్రమలు: రూ.200 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టి కనీసం 1000 మందికి పైన ఉపాధినిచ్చే వాటిని మెగా ప్రాజెక్టు పరిశ్రమలంటారు.

 

బి) భారీ పరిశ్రమలు: రూ.10 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య పెట్టుబడి కలిగి కనీసం 500 మందికి ఉపాధినిచ్చే ప్రాజెక్టులు.

 

సి) మధ్యతరహా పరిశ్రమలు: రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య పెట్టుబడి కలిగి ఉంటాయి. 

 

డి) చిన్న తరహా పరిశ్రమలు: రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య పెట్టుబడితో నడుస్తాయి.

 

ఇ) సూక్ష్మ పరిశ్రమలు: రూ.25 లక్షల కంటే తక్కువ పెట్టుబడి కలిగినవి. ఇవి పారిశ్రామిక రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

 

ముడి పదార్థాల లభ్యత ఆధారంగా...

 

వ్యవసాయాధారిత పరిశ్రమలు: ఇందులో ముడి పదార్థాలు వ్యవసాయం ద్వారా లభిస్తాయి.  ఉదా: వస్త్ర పరిశ్రమ, జనపనార, చెరకు, నూనెగింజలు, కూరగాయలు.

 

ఎ) నూలు వస్త్ర పరిశ్రమ: దీని ముడి సరకు పత్తి. తెలంగాణలో మొదటి నూలు వస్త్ర పరిశ్రమను 1934లో ఆజంజాహి మిల్లును వరంగల్‌లో స్థాపించారు. అది 1990 మూతపడింది.

* ప్రియదర్శిని స్పిన్నింగ్‌ మిల్లు - భువనగిరి(1980)

* తెలంగాణ స్పిన్నింగ్‌ మిల్లు - నిర్మల్‌ (1972)

* గ్రోవర్స్‌ స్పిన్నింగ్‌ మిల్లు - ఆదిలాబాద్‌(1980)

* సూర్యలక్ష్మి స్పిన్నింగ్‌ మిల్లు - మహబుబ్‌నగర్‌

* సంఘి వస్త్ర పరిశ్రమ   - రంగారెడ్డి

* టస్సర్‌ సిల్కు ఉత్పత్తి   - ఆసిఫాబాద్‌ మహదేవ్‌పూర్‌

* పట్టు పరిశ్రమ       - గద్వాల్, పోచంపల్లి, సిరిసిల్లా

* పెంగ్విన్‌ టెక్స్‌టైల్‌    - ఉప్పల్‌ 

* కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ - వరంగల్‌

* రేయాన్‌ పరిశ్రమ    - కమలాపూర్‌ (ఏటూరు నాగారం)

 

బి) పంచదార పరిశ్రమ: దీని ముడి సరకు ‘సుక్రోజ్‌’. 1937లో బోధన్‌లో ‘నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ లిమిటెడ్‌’ను స్థాపించారు. ఇది ఆసియాలోకెల్లా అతిపెద్ద చక్కెర కర్మాగారం. దీనికి అనుబంధంగా జహీరాబాద్‌ - సంగారెడ్డి, ముత్యంపేట - జగిత్యాల, మిర్యాలగూడ - నల్గొండలో ఉన్నాయి. 

 

సి) సిగరెట్‌ పరిశ్రమ: పొగాకు, తునికి ఆకును ఈ పరిశ్రమలో ముడి సరకుగా వినియోగిస్తారు. సిగరెట్‌ పరిశ్రమలు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కేంద్రీకృతమయ్యాయి. వీటిలో వజీర్‌ సుల్తాన్‌ టొబాకో (వీఎస్‌టీ), ఇండియన్‌ టొబాకో కంపెనీ (ఐటీసీ) అనేవి హైదరాబాద్‌ కేంద్రంగా ముఖ్యమైన పరిశ్రమలు. 

 

ఖనిజాధారిత పరిశ్రమలు: ఇనుము - ఉక్కు, స్పాంజ్, అల్యూమినియం, సిమెంట్‌ పరిశ్రమలు ఈ వర్గంలోకి వస్తాయి. 

 

ఎ) సిమెంట్‌ పరిశ్రమ: దీని ముడి సరకు సున్నపురాయి, బంకమట్టి, జిప్సం, సిలికా, అల్యూమినియం, బొగ్గు. రాష్ట్రంలో నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌లోని కేంద్రాలు ముఖ్యమైనవి. రాష్ట్రంలో తొలి సిమెంట్‌ పరిశ్రమను 1939లో కేతేపల్లి వద్ద స్థాపించారు. 

 

ప్రధానంగా.....

* నాగార్జున సిమెంట్‌       - కేతేపల్లి (నల్గొండ)

* దక్కన్‌  సిమెంట్‌        - హుజూర్‌నగర్‌ (సూర్యాపేట)(దక్షిణ భారతదేశంలో అతి పెద్దది)

* రాశీ సిమెంట్‌            - వాడపల్లి (నల్గొండ)

* ఏసీసీ సిమెంట్‌          - మంచిర్యాల

* కేశోరామ్‌ సిమెంట్‌         - బసంత్‌ నగర్‌ (పెద్దపల్లి)

* మహా సిమెంట్‌         - మేళ్లచేరాల (సూర్యాపేట)

* అన్నపూర్ణ సిమెంట్‌     - ఆదిలాబాద్‌

 

బి) స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమ: దేశంలోనే మొదటి ఐరన్‌ పరిశ్రమ. ఇందులో తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును వినియోగిస్తారు. దీన్ని 1980లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థాపించారు. రాష్ట్ర విభజన తర్వాత బయ్యారం కేంద్రంగా స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే దీన్ని పాల్వంచలో ఏర్పాటు చేయాలని మళ్లీ కేంద్రం ప్రతిపాదించింది. 

 

సి) ఆస్బెస్టాస్‌ పరిశ్రమ: దీని ముడి సరకు ‘రాతినార’. ఈ పరిశ్రమల్లో పైపులు, పెంకులు, రేకులు తయారు చేస్తారు. 1949లో హైదరాబాద్‌ శాంతినగర్‌ వద్ద స్థాపించారు. హైదరాబాద్‌లో ‘ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ ఫ్యాక్టరీ’ ఉంది.

 

3. పాస్పొరల్‌ పరిశ్రమలు:  ఇవి పశువులు, జంతువుల ఆధారిత పరిశ్రమలు: ఇందులో ముఖ్యంగా గొర్రె చర్మ కేంద్రాలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, బూట్లు/ తోళ్ల ఉత్పత్తి కేంద్రాలుంటాయి. 

 

రాష్ట్రంలో లెదర్‌ పార్కులు 

* జమ్మికుంట, రుక్మపూర్‌ - కరీంనగర్‌ 

* హెచ్‌ఎస్‌ దర్గ - హైదరాబాద్‌

* మల్లెమడుగు - ఖమ్మం

* స్టేషన్‌ ఘన్‌పూర్‌ - జనగామ

* మందమర్రి - మంచిర్యాల

 

4. అటవీ ఆధారిత పరిశ్రమలు: ఈ తరహా పరిశ్రమల్లో ముడి సరకుగా వెదురు, యూకలిప్టస్, సుబాబుల్, కలప గుజ్జు, బొగ్గు, నీరు. సోడా యాష్, బ్లీచింగ్‌ పౌడర్‌ ఉపయోగిస్తారు. రాష్ట్రంలో తొలి కాగితపు పరిశ్రమను 1938లో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‘సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లు’ పేరుతో స్థాపించారు. దీనిలో 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. 

* చార్మినార్‌ పేపర్‌ మిల్‌ - మాతంగి (మెదక్‌)

* నాగార్జున పేపర్‌ మిల్‌ - పటాన్‌ చెరువు (రంగారెడ్డి)

* భద్రాచలం పేపర్‌ మిల్‌ - సారాపాక (భద్రాద్రి)(1982)

* హైదరాబాద్‌ ప్లైవుడ్‌ లిమిటెడ్‌ - నాచారం

* నొవాపాన్‌ ప్లైవుడ్‌ లిమిటెడ్‌ - పటాన్‌ చెరువు (హైదరాబాద్‌)

 

రచయిత: కొత్త గోవర్ధన్‌ రెడ్డి

Posted Date : 10-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌