• facebook
  • whatsapp
  • telegram

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు

నీటి పంపిణీలో నిరంతర జగడాలు!

నదుల రూపంలో జలవనరులు సమృద్ధిగా ఉన్న దేశం మనది. అందులోనూ పెద్ద నదులన్నీ రెండు, అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నాయి. వీటి నీటి వినియోగం, పంపిణీ, నియంత్రణపై రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలే అంతర్రాష్ట్ర జలవివాదాలు. సంబంధిత రాష్ట్రాలు చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోలేనప్పుడు కేంద్రం జలవివాదాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. మన దేశంలో సున్నిత అంశంగా, సమాఖ్య వ్యవస్థకు పరీక్షగా మారిన ముఖ్యమైన నదీ జలాల వివాదాలు, వాటిపై ఏర్పాటైన ట్రైబ్యునళ్లు, సంబంధిత చట్టాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

 

 

నీరు మానవ మనుగడకు జీవనాధారం. గృహావసరాలకు, వ్యవసాయానికి, పారిశ్రామిక అవసరాలకు నీరే అత్యంత ముఖ్యమైన, విలువైన వనరు. మన దేశంలో ప్రధాన  నీటి వనరులు నదులు. నది మన అవసరాలు తీరుస్తుంది అనడం కంటే నది మనకు ‘నిధి’ లాంటిదని చెప్పవచ్చు. మన దేశంలో ప్రధాన నదులన్నీ ఒకటి  కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నాయి. పరీవాహక ప్రాంతంలోని ప్రతి రాష్ట్రం ఆ నది నీటిని గరిష్ఠంగా పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే నదీజలాల వివాదాలు తలెత్తుతున్నాయి.


భారత రాజ్యాంగంలో నీరు రాష్ట్ర జాబితాలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వాలకు తమ భూభాగాల్లో ప్రవహించే నదుల నీటి ప్రణాళిక, అభివృద్ధి,  పంపిణీలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఆర్టికల్‌ 262 ప్రకారం ఏదైనా అంతర్రాష్ట్ర నదిపై తీర్పు లేదా నీటివాటాల నియంత్రణకు పార్లమెంటుకు అధికారం ఉంది. 2002లో సవరించిన ‘జలవివాదాల చట్టం-1956’ ప్రకారం అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు తలెత్తినప్పుడు, వాటి పరిష్కారానికి సుప్రీంకోర్టు నుంచి ముగ్గురు సిట్టింగ్‌ జడ్జిలతో కూడిన ట్రైబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1968 ప్రకారం ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంతర్రాష్ట్ర నదులు, నదీ లోయలు, పరీవాహక ప్రాంతాల అభివృద్ధి, నియంత్రణ అధికారం కేంద్రానికి ఉంటుంది.

అంతర్రాష్ట్ర నదిపై ఒక రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించి, అభివృద్ధి చేయడం వల్ల అదే నది పరీవాహకంలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడి వివాదాలు తలెత్తుతాయి. వీటి పరిష్కారానికి పరస్పర చర్చలే తొలి అడుగు. సంబంధిత రాష్ట్రాలు, పార్టీలు చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. చర్చలు ఫలించని సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘నదీ జలాల వివాదాల చట్టం-1956’ ద్వారా పరిష్కారానికి చొరవ తీసుకుంటుంది. ఆయా రాష్ట్రాల మధ్య ఒప్పందాలు, పరిష్కారాలను సరళతరం చేయడానికి కొన్నేళ్లుగా అనేక సవరణలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాల సవరణ చట్టం-2019ను జులై 25, 2019లో ప్రవేశపెట్టారు. వివాదాల పరిష్కారాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుత సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ఠం చేయడానికి ఈ బిల్లు దోహదపడుతుంది.

భారతదేశంలోని నదుల్లో 85% అంతర్రాష్ట్ర విభాగానికి చెందినవే. నదీజలాల పంపకంపై అనేక వివాదాలు తలెత్తాయి. ప్రపంచ జనాభాలో 18% వాటా ఉన్న భారత్‌లో ప్రపంచ భూభాగంలో 2.4%, పునరుత్పాదక నీటివనరుల్లో 4% మాత్రమే ఉన్నాయి. తగిన చర్యలు తీసుకోకపోతే అసమాన నీటి పంపిణీ వల్ల నీటి వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యలు మన దేశ సమాఖ్య విధానానికి ఆటంకాలు కలిగిస్తాయి. ఈ ప్రాంతీయ సమస్యలను జాతీయ సమస్యలకంటే పెద్దవిగా చేసి చూపించే అవకాశం ఉంది.


ట్రైబ్యునళ్ల చరిత్ర: దేశంలో తొలి అంతర్రాష్ట్ర జలవివాదాల ట్రైబ్యునల్‌ 1969లో ఆర్‌.ఎస్‌.బచావత్‌ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్‌. దీని పరిధిలోని రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. 1973లో బచావత్‌ తీర్పు ఇచ్చారు. దశాబ్దాల తర్వాత సంబంధిత రాష్ట్రాలు పునఃసమీక్ష కోరడంతో 2004లో రెండో కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. 2010లో ఇచ్చిన తీర్పును నాటి ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తి మేరకు పునఃపరిశీలించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాలుగో పార్టీగా చేరింది. 


సాగదీతతో సమస్య: జలవివాదాల ట్రైబ్యునళ్ల విచారణలు సుదీర్ఘ కాలం సాగుతున్నాయి. దాంతో వివాదాల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదాహరణకు గోదావరి జలాల వివాదం పరిష్కారానికి 1962లో అభ్యర్థిస్తే, 1969లో ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. 1979లో తీర్పు వెలువరించింది. 1980లో గెజిట్‌లో ప్రచురితమైంది. కావేరి జలవివాదంలో 1990లో ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తే, 2007లో తుది తీర్పు వచ్చింది. ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులు అంతిమం. అవి కోర్టుల పరిధిలోకి రావు.  అయినప్పటికీ సంబంధిత రాష్ట్రాలు తమకు అన్యాయం జరిగిందని భావిస్తే ఆర్టికల్‌ 136, ఆర్టికల్‌ 32, ఆర్టికల్‌ 21 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.ఈ ట్రైబ్యునళ్లలో కేవలం న్యాయవ్యవస్థ నుంచే సభ్యులు ఉంటారు.నీళ్లకు, రాజకీయాలకు పెరుగుతున్న బంధం వల్ల వివాదాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు ట్రైబ్యునళ్లు వేదికలవుతున్నాయి. ఇవన్నీ గమనిస్తే భవిష్యత్తు యుద్ధాలన్నీ నీటి కోసమే జరుగుతాయని ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ బౌత్రోస్‌ బౌత్రోస్‌ ఘలీ చేసిన హెచ్చరిక నిజ మయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల పరిష్కారానికి ఒకే శాశ్వత ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని క్రమబద్ధీకరించే దిశగా ఈ చర్య కీలకం. అయితే కేంద్రం ఒక్కటే ఒంటరిగా ఈ అంశాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు. చట్టపరమైన, పరిపాలనాపరమైన, రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన అవాంతరాలెన్నో ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదన ప్రకారం ట్రైబ్యునల్‌తో పాటు ఒక ఏజెన్సీని ఏర్పాటుచేసి నదీజలాలపై గణాంకాలను సేకరించి, క్రోడీకరిస్తుంది. ఈ నదీజలాల వివాదాల పరిష్కారానికి పటిష్ఠమైన,  పారదర్శకమైన విధానంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

 

Posted Date : 26-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌