• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ సంస్ధలు - సదస్సులు   

ఆపదల్లో అండగా ఉండే వ్యవస్థలు!
 


ఆధునిక యుగంలో అభివృద్ధితో పాటు విపత్తులూ పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల తీవ్రత, సృష్టించే విధ్వంసం అంతకంతకూ అధికమవుతున్నాయి. మానవ ప్రగతిని వెనక్కిలాగి, సుస్థిరాభివృద్ధికి ఆటంకంగా నిలిచే ఈ విపత్తులను సాధ్యమైనంత వరకు ముందస్తుగా గుర్తించి, జాగ్రత్తలు తీసుకోవడానికి  దాదాపు అన్ని దేశాల్లో నిర్వహణ వ్యవస్థలు, హెచ్చరికల కేంద్రాలు  ఏర్పాటయ్యాయి. నివారణకు పాటించాల్సిన విధానాలపై  ఒప్పందాలు రూపొందాయి. వీటిపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. విపత్తులను కుదించడానికి భారతదేశంతోపాటు ప్రపంచం విధించుకున్న లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. 


ఏటా అక్టోబరు 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు దినంగా పాటిస్తారు.1990-1999ను ‘అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం’గా పేర్కొన్నారు. 


పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌: దీన్నే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు. ప్రధాన కార్యాలయం అమెరికాలోని హవాయి రాష్ట్రం ఇవా బీచ్‌లో ఉంది. దీన్ని అమెరికాకు చెందిన ‘నేషనల్‌   ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’   నిర్వహిస్తోంది. 1948లో ఏర్పాటు చేశారు. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం,  కరేబియన్‌ చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించారు.


ఇంటర్నేషనల్‌ సునామీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌: యునెస్కోకు చెందిన ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఓషనోగ్రాఫిక్‌ కమిషన్‌ (ఐఓసీ) ఆధ్వర్యంలో 1956లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్న హోనోలులు.


పసిఫిక్‌ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూపు: 1968లో ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న యునెస్కో ప్రధాన కార్యాలయంలో ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఓషనోగ్రాఫిక్‌ కమిషన్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.


ఆసియన్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ సెంటర్‌: 1998లో జపాన్‌లోని కోబ్‌ నగరంలో దీన్ని ఏర్పాటు చేశారు. 


ఆసియా డిజాస్టర్‌ ప్రిపేర్డ్‌నెస్‌ సెంటర్‌: దీన్ని 1986, జనవరిలో థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు.


ప్రపంచ వాతావరణ సంస్థ: ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. భూగోళ వాతావరణాన్ని పర్యవేక్షించే ఈ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. ఏటా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.


సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌: దీన్ని 2006,   అక్టోబరులో న్యూదిల్లీలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌   డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌’ ఆవరణలో ఏర్పాటు చేశారు.


సౌత్‌ ఆసియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌: ఇది సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నడిచే ఒక వెబ్‌పోర్టల్‌.


ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1999, డిసెంబరులో ఏర్పాటు చేశారు. ప్రధానకార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.


ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌: 1988లో ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్యసమితి కలిసి ఏర్పాటు చేశాయి. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.


అవేర్‌నెస్‌ అండ్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఫర్‌ ఎమర్జెన్సీస్‌ ఎట్‌ లోకల్‌ లెవల్‌ (ఏపీఈఎల్‌ఎల్‌): ఐక్యరాజ్యసమితి పర్యావరణ  కార్యక్రమం... ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలతో కలిసి సాంకేతిక ప్రమాదాలు, పర్యావరణ అత్యవసర పరిస్థితులు సంభవించకుండా తగ్గించడానికి, వాటివల్ల జరిగే హానికర ప్రభావాలను కుదించడానికి ఈ సంస్థను రూపొందించింది.


అకాడమీ ఫర్‌ డిజాస్టర్‌ ప్లానింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌: ఇది చెన్నైలో ఉన్న ప్రభుత్వేతర సంస్థ. విపత్తు నిర్వహణ రంగంలో శిక్షణ కోర్సులు అందించడంతోపాటు ప్రణాళికలను రూపొందిస్తుంది.


రీజినల్‌ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ హజార్డ్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ ఆఫ్రికా అండ్‌ ఆసియా: 2004లో సునామీ తర్వాత, సీమాంతర వైపరీత్యాలకు సంబంధించిన విపత్తుల ముందస్తు హెచ్చరికలు, విపత్తు నిర్వహణ వలయంలోని అన్ని చర్యలకు సంబంధించి ఒక ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని 2009, ఏప్రిల్‌ 30న ఏర్పాటు చేశారు. 2009, జులై 1న ఐక్యరాజ్యసమితిలో నమోదైంది. దీని ప్రధాన కార్యాలయం థాయ్‌లాండ్‌లోని పాతుంథానిలో ఉన్న ‘ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ క్యాంపస్‌లో ఉంది. 

అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం: ఏటా అక్టోబరు 13న ‘అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం’ నిర్వహిస్తారు. 2013లో ఈ దినోత్సవాన్ని విపత్తులు, అంగవైకల్యంతో పోరాడుతున్నవారికి అంకితం చేశారు. 2009 వరకు ఏటా అక్టోబరు రెండో బుధవారాన్ని ‘అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దినోత్సవం’గా పాటించేవారు. 2009, డిసెంబరు 21న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2010 నుంచి ఏటా అక్టోబరు 13న అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది.


జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం: భారత్‌లో ఏటా అక్టోబరు 29న ‘జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు.


ఇండియా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ మొదటి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ 2006, నవంబరు 29, 30 తేదీల్లో న్యూదిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగింది. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభించారు. రెండో ఇండియా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ 2009, నవంబరు 4 నుంచి 6వ వరకు న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లోనే జరిగింది.


విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద 2006, జనవరి 19న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఏర్పాటు చేశారు.ఏటా జనవరి 19న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వ్యవస్థాగత దినోత్సవంగా నిర్వహిస్తారు. 


విపత్తు ముప్పు కుదింపునకు సెండాయ్‌ చట్రం (2015-2030) 

దేశాలు, కమ్యూనిటీలు విపత్తులను ఎదుర్కొనే విధంగా సంసిద్ధం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘హ్యూగో ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ యాక్షన్‌ 2005-2015’ గడువు 2015తో ముగిసింది. హ్యూగో ఫ్రేమ్‌వర్క్‌కు కొనసాగింపుగా ఈ సదస్సులో విపత్తు ముప్పు కుదింపునకు సెండాయ్‌ చట్రం 2015 - 2030ని ప్రపంచ దేశాలు 2015, మార్చి 18న అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి విపత్తు ముప్పు కుదింపు మూడో ప్రపంచ సదస్సు జపాన్‌లోని సెండాయ్‌లో 2015, మార్చి 14 నుంచి 18 వరకు జరిగింది. 2005-2015 మధ్య 15 ఏళ్లలో సంభవించిన విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.3 ట్రిలియన్‌ (1.3 లక్షల కోట్ల) అమెరికన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. దీంతోపాటు 2008, 2012 మధ్య విపత్తుల కారణంగా 144 మిలియన్ల (14.4 కోట్ల) మంది  నిరాశ్రయులయ్యారు. ప్రస్తుత సెండాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫలితాన్ని, లక్ష్యాన్ని సాధించడం కోసం 7 ప్రపంచవ్యాప్త లక్ష్యాలను నిర్దేశించారు.  

అవి:

* 2030 నాటికి విపత్తు మరణాలను  గణనీయంగా తగ్గించాలి.


* 2030 నాటికి విపత్తు ప్రభావానికి గురయ్యే ప్రజల సంఖ్యను గణనీయంగా తగ్గించాలి.


* 2030 నాటికి జీడీపీ పరంగా విపత్తుల వల్ల ఆర్థిక నష్టాన్ని కుదించాలి.


* 2030 నాటికి కీలక మౌలిక వసతులు, మౌలిక సేవలకు విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని  గణనీయంగా తగ్గించాలి.


* జాతీయ, స్థానిక విపత్తు ముప్పు నివారణ వ్యూహాలు రూపొందించుకునే దేశాల సంఖ్యను 2020 నాటికి గణనీయంగా పెంచాలి.


* 2030 నాటికి సెండాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ అమలుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికలకు నిరంతర మద్దతు అందించాలి. 


* 2030 నాటికి ప్రజలకు బహుళ వైపరీత్య హెచ్చరిక వ్యవస్థలు, విపత్తు ముప్పు సమాచారం, మదింపు నివేదికలను గణనీయంగా అందుబాటులోకి తీసుకురావాలి. 


సెండాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ నిర్దేశకత్వంలో భారత ప్రభుత్వం 2016, జూన్‌ 1న జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక విడుదల చేసింది. భారత్‌లో సెండాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇందుకు యునిసెఫ్, యూఎన్‌ఐఎస్‌డీఆర్‌ సహకారం అందించాయి. 

 


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌

 

Posted Date : 02-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు