• facebook
  • whatsapp
  • telegram

నీటిపారుదల

ఒడిసిపట్టు.. ప్రతి నీటి బొట్టు!

  అందరికీ ఆహారం అందాలంటే పంటలు సమృద్ధిగా పండాలి. అందుకు సరిపడినంత నీరు ఉండాలి. కానీ మనదేశంలో వర్షాలు రుతుపవనాల కాలంలోనే కురుస్తాయి. లేదంటే కరవు పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో ప్రాచీన కాలం నుంచి నీటిపారుదల సౌకర్యాలపై మనవాళ్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి వ్యవసాయానికి, ఇతర అవసరాలకు వినియోగించుకోడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా అనేక ఆనకట్టలు నిర్మించారు. జాగ్రఫీ అధ్యయనంలో ఈ అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. సేద్యానికి నీరు ముఖ్యమైన వనరు. ఇక్కడి వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు కొన్నిసార్లు అధికంగా, మరికొన్నిసార్లు అతితక్కువగా కురుస్తాయి. కాబట్టి వర్షం ఎక్కువగా కురిసినప్పుడు దాన్ని ఆనకట్టల ద్వారా నిల్వ చేసుకొని కావాల్సినప్పుడు కాలువలు, గొట్టపు పైపుల ద్వారా వ్యవసాయానికి కృత్రిమ నీటి సరఫరాను కలిగించడమే నీటిపారుదల. 

  భారతదేశంలో పంటలకు నీటిపారుదల వసతి కల్పించడం పురాతన కాలం నుంచి జరుగుతోంది. సింధూ నాగరికత కాలం, క్రీ.శ.రెండో శతాబ్దంలో కావేరి నదిపై ఆనకట్ట కట్టినట్లు, నీటి పారుదల వసతులు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1934లో మెట్టూరు వద్ద కావేరి నదిపై ఆసియా ఖండంలోనే మొదటి ఆనకట్ట నిర్మించారు. మొగలుల కాలంలో (14వ శతాబ్దంలో ఫిరోజ్‌షా) పశ్చిమ యమున కాలువను, 1529లో శ్రీకృష్ణదేవరాయలు తుంగభద్ర కాలువను తవ్వించినట్లు చరిత్ర చెబుతోంది. స్వాతంత్య్రానికి పూర్వమే సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మించారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అవసరమైన అధిక ఆహారోత్పత్తి కోసం ఆధునిక వంగడాలు, శాస్త్రీయ పద్ధతులతోపాటు క్రమం తప్పని నీటిపారుదల వసతులు కూడా అవసరం.

స్వాతంత్య్రానంతరం నీటిపారుదల అభివృద్ధి గణనీయంగా పెరిగింది. దేశంలో బావులు, కాలువలు, చెరువులు ప్రధాన నీటిపారుదల వసతులుగా ఉన్నాయి. 

 

బావులు: వీటి ద్వారా అత్యధికంగా 62% నీటిపారుదల వసతులు ఉన్నాయి.అవి రెండు రకాలుగా ఉంటాయి. గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్‌ ఉన్నాయి. ఇతర బావుల ద్వారా అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో, తర్వాత గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో ఉన్నాయి. 

 

కాలువలు: వీటి ద్వారా 24% నీటిపారుదల జరుగుతోంది. వరద కాలువల్లో ఆనకట్టలు లేకుండా నీటిని నేరుగా నది నుంచి తీసుకుంటారు. వీటి ద్వారా వర్షాకాలంలో ఎక్కువ నీరు లభిస్తుంది. జీవ కాలువల్లో ఆనకట్టల ద్వారా వరద నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి సరఫరా చేస్తారు. వర్షాలు లేనప్పుడు కూడా వ్యవసాయానికి నీటి అవసరాలు తీర్చడం వీటి ఉద్దేశం. కాలువల ద్వారా నీటి వసతి అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి.

 

చెరువులు: వీటి ద్వారా 2.6% నీటిపారుదల వసతులు ఉన్నాయి. చెరువుల కింద నీటిపారుదలఅత్యధికంగా తమిళనాడులో ఉండగా తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. 

 

ఇతర నీటిపారుదల వసతులు: వీటి ద్వారా 11% నీటిపారుదల వసతులు ఉన్నాయి. అధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. నికర నీటిపారుదల వసతులు విస్తీర్ణపరంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో, శాతం పరంగా పంజాబ్‌ అత్యధికంగా ఉన్నాయి.

 

మూడు రకాలు

దేశంలో నీటిపారుదల ఆయకట్టును అనుసరించి విస్తీర్ణం ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు. 

1) భారీ నీటిపారుదల ప్రాజెక్టులు: ఇవి 10,000 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ ఆయకట్టు విస్తీర్ణం కలిగిన ప్రాజెక్టులు.

2) మధ్య తరహా ప్రాజెక్టులు: 2000 నుంచి 10,000 హెక్టార్ల మధ్య ఆయకట్టు విస్తీర్ణం ఉన్న ప్రాజెక్టులు.

3) చిన్న తరహా ప్రాజెక్టులు: 2000 హెక్టార్లు అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాజెక్టులు.

* బిందు సేద్యం, తుంపర సేద్యం మైక్రో ఇరిగేషన్‌లో భాగం.

 

నిర్మాణం, నమూనా ఆధారంగా ఆనకట్టలు

 

గ్రావిటీ డ్యామ్‌: పూర్వపు రాతి నిర్మాణాల మాదిరి ప్రస్తుతం సిమెంటు, కాంక్రీటును ఉపయోగించి ఎత్తయిన కట్టడాలు నిర్మిస్తున్నారు. వీటి పునాదులు లోతుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఇరుకైన లోయలు, గార్జ్‌లు, రెండు ఎత్తయిన కొండల మధ్య నిర్మిస్తారు. 

ఉదా: సర్దార్‌ సరోవర్, భాక్రానంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ 

 

రాక్‌ఫిల్‌ డ్యామ్‌: దీన్ని మట్టి, కాంక్రీటుకు ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న రాళ్లతో నిర్మిస్తారు. భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. భూకంపాలు వచ్చినప్పుడు ఆ చిన్న రాళ్ల కదలికలతో సర్దుబాటు చేసుకొని తట్టుకుంటుంది. వీటిని తక్కువ వ్యయంతో నిర్మిస్తారు. 

ఉదా: కర్ణాటకలోని చక్ర డ్యామ్, భద్రా డ్యామ్‌; జమ్మూ-కశ్మీర్‌లోని కిషన్‌ గంగ, సలాల్‌ డ్యామ్‌

 

ఆర్చ్‌ డ్యామ్‌: నదీ క్రమక్షయంలో భాగంగా ఏర్పడిన జు ఆకారంలో ఉండే గార్జ్‌ల దగ్గర వీటిని నిర్మిస్తారు. ఈ డ్యామ్‌లు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. 

ఉదా: హీరాకుడ్, ఇడుక్కి (కేరళ)

 

ఎర్త్‌ఫిల్‌ డ్యామ్‌లు: ఇవి వెడల్పుగా ఉండే నదీలోయకు అడ్డంగా నిర్మించే అతిపెద్ద ఆనకట్టలు. వీటి ఎత్తు తక్కువగా ఉంటుంది. వీటిని మట్టి లేదా కాంక్రీటుతో నిర్మిస్తారు. పునాది మాత్రం రాతి లేదా కాంక్రీటుతో ఉంటుంది. దేశంలోని సుమారు 80% ఆనకట్టలు ఈ రకంగా నిర్మించినవే.

ఉదా: హిప్పార్గి, నెయ్యర్, తేనుఘాట్, హేమావతి, బలిమెల, లక్య

 

చెక్‌డ్యామ్‌లు: చిన్న చిన్న నీటి ప్రవాహాలకు అడ్డంగా నిర్మించే కట్టడాలు. వీటి వల్ల వర్షపు నీరు నిలిచి భూమిలోకి ఇంకడం ద్వారా భూగర్భ జల మట్టం పెరుగుతుంది.

 

సాడిల్‌ డ్యామ్‌లు: ప్రధాన ఆనకట్టల వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా వీటిని అడ్డుకట్టలుగా నిర్మిస్తారు. 

 

డ్రై డ్యామ్‌లు: వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేల/మృత్తికా సంరక్షణ కోసం ప్రవాహ దిశను మళ్లిస్తూ నిర్మించే ఆనకట్టలు.

 

డైక్‌ డ్యామ్‌: ప్రధాన ఆనకట్టలను పోలి సాడిల్‌ డ్యామ్‌ లక్షణాలు కలిగి ఉండే నిర్మాణం.

 

కాఫర్‌ డ్యామ్‌లు: నీటిలో మునిగి ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు చేయడానికి, అక్కడి నీటిని తాత్కాలికంగా తొలగించడం కోసం నిర్మించే ఆనకట్టలు.

 

ఓవర్‌ ఫ్లో డ్యామ్‌: నది లేదా ఆనకట్ట నుంచి ప్రవహిస్తున్న నీటిని శాస్త్రీయంగా లెక్కించడానికి దీన్ని నిర్మిస్తారు. 

 

మాసోనరి డ్యామ్‌: ఇటుకలు, రాళ్లతో నిర్మించే ఆనకట్టలను మాసోనరి డ్యామ్‌లు అంటారు. వీటిని గ్రావిటీ లేదా ఆర్చ్‌ డ్యామ్‌లుగా పేర్కొంటారు. 

ఉదా: ఒడిశాలోని రెంగాలి, కర్ణాటకలోని వాణి విలాస సాగర్‌ 

 

భారతదేశ జల విధానం 

నేషనల్‌ వాటర్‌ పాలసీ (జాతీయ జల విధానం) ప్రకారం భూ ఉపరితలంపై, భూగర్భంలో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. మానవాభివృద్ధి, పర్యావరణ సమతౌల్యాన్ని సమాజంలో అభివృద్ధికి నోచుకోని ప్రజలను దృష్టిలో ఉంచుకొని జలవనరుల సమీకరణకు అనువైన ప్రణాళికను రూపొందించాలి. జల వనరుల సమీకరణ ద్వారా బహుళ ప్రయోజనాలను పొందగలగాలి. జల వనరుల పంపిణీలో తొలి ప్రాధాన్యం తాగునీటికి లభించాలి. ఆ తర్వాత నీటిపారుదల, విద్యుదుత్పత్తి, పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించాలి. ఏ ప్రాజెక్టుకు అయినా ప్లానింగ్‌ దశ నుంచి నీటి వినియోగం వరకు అత్యంత జాగ్రత్త పాటించాలి. వరద ఉద్ధృతిని అదుపు చేయాల్సి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ ఉంచేలా తగిన వాటర్‌ షెడ్‌ నిర్వహణ ఉండాలి.

 

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన: ఈ పథకాన్ని 2014 - 15లో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం రైతులకు సాగునీటిని అందించి సాగు విస్తీర్ణం పెంచడం, వ్యవసాయరంగంలో పెట్టుబడులను పెంచడం, నీటి నిర్వహణ, వాటర్‌షెడ్‌ విధానం అమలు చేయడం. ‘ప్రతి ఎకరాకు సమృద్ధిగా నీరు, ప్రతి నీటిబొట్టుకు అధిక పంట’ అనేది ఈ పథకం నినాదం. ఇది అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. దీని జాతీయ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రధానమంత్రి.

 

ముఖ్యాంశాలు

* కేంద్ర జల సంఘాన్ని 1945లో ఏర్పాటుచేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థ దేశంలో వరద హెచ్చరికలను జారీచేస్తుంది.

* దేశంలో మొత్తం భూగర్భ జలాల్లో 92% నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.

* నీటి వనరుల సôరక్షణ, పునరుద్ధరణ, సక్రమమైన వినియోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇండియా వాటర్‌ వీక్‌ అనే కార్యక్రమాన్ని  చేపట్టింది.

* దేశంలో ప్రస్తుతం అతిపెద్ద డ్యామ్‌లు సుమారు 5700 పైగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో ఉండగా, తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, గుజరాత్‌ ఉన్నాయి. మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, హరియాణా రాష్ట్రాల్లో అతి తక్కువ డ్యామ్‌లు ఉన్నాయి.

* భారతదేశంలో అతిపురాతనమైంది ‘కళ్లనై’ ఆనకట్ట. దీన్ని తమిళనాడులో కావేరి నదిపై నిర్మించారు. దీన్ని గ్రాండ్‌ ఆనకట్ట అని కూడా అంటారు.

* జాతీయ వాటర్‌షెడ్‌ నిర్వహణ పథకం నీరాంచల్‌. దీని ముఖ్య ఉద్దేశం వాటర్‌ షెడ్‌ అభివృద్ధికి అదనపు ప్రేరణ ఇవ్వడం. ఇది ఎనిమిది రాష్ట్రాల్లో అమల్లో ఉంది.

* దేశంలోని కరవు పీడిత ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నిధులతో అటల్‌ భూజల్‌ యోజనను రూపొందించారు.

* దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నీటి సంరక్షణ, పునర్‌ వినియోగం కోసం వాన నీటిని ఒడిసి పట్టేందుకు, ప్రజలను చైతన్య పరిచేందుకు జలశక్తి అభియాన్‌ పథకాన్ని రూపొందించారు.

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 08-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌