• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో - మ‌న ధ్రువ‌తార‌

* అంతరిక్షంలో...భారత్ కీర్తిపతాక
* సొంత నావిగేషన్ వ్యవస్థ

  విశ్వవేదికపై భారత ఖ్యాతిని ఘనంగా చాటిచెప్పిన ప్రతిష్ఠాత్మక సంస్థ ఇస్రో. అంతరిక్షంలో పైచేయి సాధిస్తూ.. అతికొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే సాధ్యమయ్యే అత్యద్భుత విజయాలను సాధించి తారాపథాన సగర్వంగా దూసుకు పోతోంది. దీనివెనుక ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది.. ఈమేరకు ఇస్రో ఎలా ఏర్పడింది? లక్ష్యాలేమిటి? సాధించిన విజయాలేమిటి? ఇస్రో ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థలేమిటి? తదితర అంశాలతో కూడిన విజ్ఞాన సమాచారాన్ని టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అందిస్తోంది 'ఈనాడు ప్రతిభ'.
ఇస్రో - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organisation).. ప్రపంచ స్థాయిలో భారత కీర్తి ప్రతిష్ఠలను గణనీయంగా పెంచింది.
* మొదటి ప్రయత్నంలోనే కుజగ్రహాన్ని విజయవంతంగా చేరడం (మంగళ్‌యాన్).
* ఒకే ప్రయత్నంలో 10 ఉపగ్రహాలను ప్రయోగించడం.
* దేశీయ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ రాకెట్ యంత్రాల సహాయంతో భారీ భూస్థావర ఉపగ్రహాలను ప్రయోగించడం.
* చంద్రయాన్ పేరుతో మానవ రహిత అంతరిక్షయాత్రను నిర్వహించడం..
ఇలాంటి ఎన్నో ఘన విజయాలను ఇస్రో సాధించింది. విదేశీ ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ప్రవేశపెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తోంది.
బహుళార్థ సాధక లక్ష్యాలు

అంతరిక్ష పరిశోధనలు చేస్తూనే అంతరిక్ష విజ్ఞానాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగించడమే లక్ష్యంగా 1969లో ఇస్రో ఏర్పాటైంది. సమాచార, భూపరిశీలన, ప్రయోగాత్మక, శాస్త్రీయ శోధన అవసరాలకు.. అలాగే విద్యార్థుల భాగస్వామ్యంతో ఉపగ్రహాల తయారీ, విమానయానానికి.. తోడ్పడే ఎన్నో ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించింది. వీటితోపాటు మానవ సహిత అంతరిక్ష యాత్రలు, మరిన్ని గ్రహాంతర యాత్రలను చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఇస్రోకు సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకుందాం.
ఉపగ్రహం

భూమి లాంటి గ్రహాల చుట్టూ పరిభ్రమించే వస్తువే ఉపగ్రహం. ఇవి రెండు రకాలు. 1. సహజ ఉపగ్రహాలు 2. కృత్రిమ ఉపగ్రహాలు. మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. ఇవి భూమి పరిశీలన, సమాచార ప్రసారం లాంటి విషయాల్లో మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉండేవి సహజసిద్ధ ఉపగ్రహాలు. ఉదా: భూమికి సహజసిద్ధ ఉపగ్రహం చంద్రుడు.
రాకెట్

ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లే వాహనమే రాకెట్. రాకెట్‌లో ఘన, ద్రవ లేదా రెండింటి కలయికతో ఉండే హైబ్రీడ్ రకం ఇంధనాలను ఉపయోగిస్తారు. అతిశీతల స్థితిలో ద్రవరూప హైడ్రోజన్, ఆక్సిజన్‌లను కలిగి ఉండే రాకెట్ యంత్రాలను క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్లు అంటారు. ఇవి రాకెట్ పరిమాణాన్ని తగ్గించి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. రాకెట్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యకు బదిలీ కూడా చేయగలదు.
కక్ష్య

ఉపగ్రహం భూమి చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష్య (ఆర్బిట్) అంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలు.
1. భూస్థావర కక్ష్య 2. ధ్రువీయ (పోలార్) కక్ష్య.
భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు సమాంతరంగా ఉండేది భూస్థావర కక్ష్య. ఇందులో 24 గంటల కక్ష్యావర్తన కాలంలో తిరిగే ఉపగ్రహాన్ని 'భూస్థావర ఉపగ్రహం' అంటారు. దీన్ని భూమి నుంచి చూస్తే నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇన్సాట్(ఇండియన్ నేషనల్ శాటిలైట్), జీశాట్ పేర్లతో భారత్ ఈ తరహా ఉపగ్రహాలను జీఎస్ఎల్వీ రాకెట్లతో ప్రయోగిస్తుంది.
* భూస్థావర ఉపగ్రహాలను ప్రధానంగా కమ్యూనికేషన్స్ రంగంలోనూ, వాతావరణ ముందస్తు హెచ్చరికల కోసం ఉపయోగిస్తారు.
* భూమి ధ్రువాలను ఆవృతం చేసేవిధంగా సుమారు 600-800 కి.మీ.ల ఎత్తులో ఉండే కక్ష్యలను పోలార్ (ధ్రువీయ) కక్ష్యలని అంటారు.
* పోలార్ ఉపగ్రహాలు ధ్రువాల చుట్టూ ఒకసారి తిరిగివచ్చేందుకు పట్టేకాలం సుమారు 90-100 నిమిషాలు.
* ఇవి భూగోళంపై ఉండే అన్ని ప్రదేశాలను రోజులోని ఏదో ఒక సమయంలో చుట్టివస్తాయి.
* వీటిని ప్రధానంగా భూపరిశీలన కోసం ఉపయోగిస్తారు. ఐఆర్ఎస్ (ఇండియన్ రిమోట్‌సెన్సింగ్ శాటిలైట్) రకం ధ్రువీయ ఉపగ్రహాలను భారత్ పీఎస్ఎల్వీ రాకెట్ల సహాయంతో ప్రయోగిస్తోంది.
తొలి అడుగులు

1962లో ప్రారంభించిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (INCOSPAR) 1969లో ఇస్రోగా రూపాంతరం చెందింది. భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహింగీర్ బాబా, భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ కాస్మిక్ కిరణాలపై చేసిన పరిశోధనలు భారతదేశం అంతరిక్ష విజ్ఞానాభివృధ్ధికి తొలి అడుగులు వేయడానికి తోడ్పడ్డాయి. ఇందులో భాగంగా ఐఎన్‌సీవోఎస్‌పీఏఆర్ 1962లో భూ అయస్కాంత భూమధ్యరేఖకు సమీపంలోని తుంబా నగరంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని ఏర్పాటు చేసింది. దీన్నే తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS) గా పిలుస్తారు. తుంబా నుంచి తొలిసారి 1963, నవంబరు 21న రెండంచెల సౌండింగ్ రాకెట్ 'నైకి అపాచి'ని ప్రయోగించారు. భూఅయస్కాంత భూమధ్యరేఖకు సమీపంలో ఉండటం వల్ల దీన్ని 1968లో ఐక్య రాజ్య సమితికి అంకితం చేశారు. దీంతో ఎన్నో దేశాలు ప్రయోగాలు చేసుకునే వీలుని కల్పించారు. విక్రమ్ సారాభాయ్ మరణానంతరం టీఈఆర్ఎల్ఎస్‌కి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్‌సీ)గా నామకరణం చేశారు. మారిన పరిస్థితుల దృష్ట్యా శ్రీహరికోటలో రెండో రాకెట్ లాచింగ్ స్టేషన్‌ను 1971లో ప్రారంభించారు. 2002లో దీని పేరును సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌హెచ్ఏఆర్)గా మార్చారు.
ఇస్రో విజయాలు

ఆస్ట్రోశాట్ (Astrosat)

ఇస్రో 2015, సెప్టెంబరు 28న పీఎస్ఎల్వీ-సీ 30 రాకెట్ ద్వారా భారత తొలి అంతరిక్ష పరిశోధన శాల ఆస్ట్రోశాట్‌తో పాటు మరో 6 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
* ఆస్ట్రోశాట్ 150 టన్నుల, చిన్న ఖగోళ పరిశోధన శాల. ఇది భూమి నుంచి 650 కి.మీ.ల దూరంలో పరిభ్రమిస్తూ.. కృష్ణబిలాలు, నక్షత్రాల అయస్కాంత క్షేత్రాలతోపాటు ఇతర విశ్వ రహస్యాలను శోధించి.. సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. దీనిలోని ఎక్స్-కిరణ టెలిస్కోప్, అమెరికాకు చెందిన నాసా (NASA - National Aeronautics and Space Administration) ప్రయోగించిన హబుల్ టెలిస్కోప్‌ను పోలి ఉంది.
* తొలిసారి అమెరికాకు చెందిన నాలుగు LEMUR ఉపగ్రహాలను భారత్ ప్రయోగించింది. దీంతో భారత్ సహాయంతో ఉపగ్రహాలను పంపించిన విదేశాల సంఖ్య 20కి, విదేశీ ఉపగ్రహాల సంఖ్య 51కి పెరిగింది.
* ఇండోనేషియా, కెనడాలకు చెందిన మరో రెండు ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది ఇస్రో పీఎస్ఎల్‌వీకి 30వ విజయం, 31వ ప్రయాణం.
ఐఆర్ఎన్ఎస్ఎస్

* ఇతర దేశాలపై... ముఖ్యంగా ఆమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్)పై ఆధారపడకుండా, భారత్ తన అవసరాల కోసం తయారు చేస్తున్న నావిగేషన్ వ్యవస్థ - ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం).
* జీపీఎస్ 24 ఉపగ్రహాలను ఉపయోగించి మొత్తం భూగోళాన్ని పరిశీలిస్తే.. ఐఆర్ఎన్ఎస్ఎస్ కేవలం 7 ఉపగ్రహాలతో భారత భూభాగాన్ని, మన సరిహద్దుల నుంచి మరో 1500 కి.మీ.ల దూరంలోని ప్రదేశాలను కచ్చితంగా పరిశీలిస్తుంది. అమెరికా జీపీఎస్ వ్యవస్థను అన్నివేళలా నమ్మలేం. ఉదాహరణకు ఇరాక్ యుద్ధంలో ఇరాకీ యుద్ధ విమానాలకు జీపీఎస్ తప్పుడు సంకేతాలనిచ్చి ఇరాక్ ఓడిపోయే విధంగా చేసింది.
* 7 ఉపగ్రహాల్లో 3 భూస్థావర కక్ష్యల్లో, 4 సూర్య సమస్థితి (జియోసిక్రనస్) కక్ష్యల్లో పరిభ్రమిస్తాయి.
* రుబీడియం పరమాణు గడియారాల సహాయంతో (20 మీటర్ల కచ్చితత్వంతో) వస్తువుల స్థానం, సమయాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు.
* భవిష్యత్తులో మరిన్ని శాటిలైట్లతో మొత్తం భూగోళాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే నాలుగు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను ప్రయోగించారు.
గగన్

ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. పూర్తిపేరు జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ (జీఏజీఏఎన్). దీంతో భారత గగనతలంలోని విమానయానాలను దిశానిర్దేశం చేయవచ్చు. వాతావరణం సరిగా లేనప్పుడు పైలట్ విమానాన్ని నడిపేందుకు లేదా కిందికి దింపేందుకు ఈ వ్యవస్థ తోడ్పడుతుంది. భారత గగన తలానికి గగన్ ప్రాజెక్ట్ ఒక ఉపగ్రహ ఆధారిత బలోపేత వ్యవస్థ (శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టం - ఎస్‌బీఏఎస్).
* గగన్‌కి, ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ పకడ్బందీగా తోడైతే విమానయానంతోపాటు, నౌకాయానం, రహదార్ల నిర్వహణ, రైలు రవాణా, సర్వేయింగ్, భూమాపనం, రక్షణ, టెలికాం తదితర రంగాలకు కూడా ఇది తోడ్పడుతుంది.
* జీశాట్-8, జీశాట్-10, జీశాట్-15 ఉపగ్రహాల్లోని గగన్ వ్యవస్థలు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి.
* 2015, నవంబరు 11న ఏరియానా 5 వీఏ 227 వాహకనౌక ద్వారా జీశాట్-15ని విజయవంతంగా ప్రయోగించారు. దీన్లో ఎల్1, ఎల్5 బ్యాండ్లలో పనిచేసే గగన్ పేలోడ్‌ని అమర్చారు.


అంతరిక్ష పితామహుడు

భారత అంతరిక్ష రంగం విశ్వఖ్యాతిని ఆర్జించడానికి పునాది వేసిన మహనీయుడు విక్రమ్ సారాభాయ్. హోమి జహంగీర్ బాబా సహాయంతో భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమానికి ఆయన పునాది వేయకపోతే భారతదేశం అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాల సరసన చేరేది కాదు. పిన్నవయసులో తన సొంత ఖర్చులతో అహ్మదాబాద్‌లో ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (పీఆర్ఎల్)ని స్థాపించారు. రష్యా స్పుత్నిక్ ప్రయోగంతో భారత్ కూడా అంతరిక్ష రంగంలో స్వయంసమృద్ధిని సాధించాలన్న దూరదృష్టితో భారత ప్రభుత్వాన్ని ఒప్పించి ఇస్రో ఏర్పాటుకు తన వంతు సహకారం అందించారు. తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్, భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట, ఇస్రో తదితర సంస్థలు సారాభాయి మానస పుత్రికలు. సారాభాయ్ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ (మరణానంతరం) అవార్డులతో సత్కరించింది. ఆనాడు యువ శాస్త్రవేత్తలను.. ముఖ్యంగా దివంగత అబ్దుల్ కలాంను ఎంతగానో ప్రోత్సహించి ఇస్రో అభివృద్ధికి దోహదం చేశారు.

Posted Date : 23-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌