• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో వరుస విజయాలు 

చంద్రుడి దిశగా ఇస్రో బాహుబలి!
 

 

భారత గగన తలంలో ఇంకో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడిపైకి ఇస్రో ప్రయోగించిన బాహుబలి రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. మరికొద్ది రోజుల్లో మన రోవర్‌ నెలరాజు నేలపై అడుగుపెట్టబోతోంది. దీంతో ఆ ఘనత సాధించిన మూడు అగ్రరాజ్యాల సరసన ఇండియా చేరనుంది. ఈ ప్రయోగం మనదేశ సాంకేతిక సత్తాను మరోమారు ప్రపంచానికి చాటింది. అగ్రగామి అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా ఇస్రో నిలిచే విధంగా చేసింది. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష సంస్థ సాధిస్తున్న వరుస విజయాలు, ప్రధాన వాహక నౌకలు, ముఖ్యమైన ఉపగ్రహాల గురించి పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకెళుతోంది.ఎస్‌ఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ లాంటి రాకెట్లతో అనేక ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇటీవల చంద్రయాన్‌-3 ప్రయోగంతో ఇది మరోసారి రుజువైంది. మన రోవర్‌ చంద్రుడిపైకి అనుకున్న విధంగా అడుగుపెడితే ఆ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన నాలుగో దేశంగా భారత్‌ పేరు కూడా చేరుతుంది. 


పీఎస్‌ఎల్‌వీ-సి54/EOS-06 మిషన్‌: పీఎస్‌ఎల్‌వీ-సి54 వాహక నౌక EOS-06 ఉపగ్రహాన్ని, 8 నానో శాటిలైట్లను 2022, నవంబరు 26న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది. EOS-06 మూడో తరానికి చెందిన ఆధునిక ఉపగ్రహం. ఇది ఓషన్‌ శాట్‌ క్రమానికి చెందింది. సముద్రాలకు సంబంధించిన ఉష్ణోగ్రత, గాలి వేగం లాంటి సమాచారాన్ని అందిస్తుంది.


పీఎస్‌ఎల్‌వీ-సి55/TeLEOS-2 మిషన్‌: పీఎస్‌ఎల్‌వీ-సి55 వాహక నౌక 2023, ఏప్రిల్‌ 22న టెలియోస్‌-2, ల్యూమిలైట్‌-4 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇవి రెండూ సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలు. ఇది న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (NSIL) ద్వారా ఇస్రో చేపట్టిన వాణిజ్యపరమైన ప్రయోగం.


ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి2/EOS-07 మిషన్‌: స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (SSLV) తరగతికి చెందిన వాటిలో ఇది రెండో వాహక నౌక. 2023, ఫిబ్రవరి 10న ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి2 కింది మూడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

1) EOS-07: ఇది ఇస్రోకు చెందిన 156.3 కిలోల ఉపగ్రహం.

2) జానస్‌-1: అమెరికాలోని అంటారిస్‌ (ANTARIS) సంస్థకు చెందిన 10.2 కిలోల ఉపగ్రహం.

3) ఆజాదీ శాట్‌-2: చెన్నైకి చెందిన అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌’ ఉపగ్రహం. దీని బరువు 8.7 కిలోలు.

 

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12/NVS-01 మిషన్‌: ఇస్రో శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్‌ ద్వారా ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని 2023, మే 29న నిర్వహించారు. 

NVS-01 ఉపగ్రహం: ఇది రెండో తరానికి చెందిన నావిగేషన్‌ ఉపగ్రహం. బరువు 2,232 కిలోలు. దీనివల్ల మన దేశంలో నావిగేషన్‌ సౌకర్యాలు మెరుగవుతాయి.


ఎల్‌వీఎం3-ఎం2/వన్‌ వెబ్‌ ఇండియా-1 మిషన్‌: జీఎస్‌ఎల్‌వీ-ఎంకేIII రాకెట్‌ను ఎల్‌వీఎం3 అని కూడా అంటారు. ఈ శ్రేణిలోని ఎల్‌వీఎం3-ఎం2 ద్వారా 2022, అక్టోబరు 23న వన్‌ వెబ్‌ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ప్రత్యేకతలు:

* ఎల్‌వీఎం3ని ఉపయోగించి చేపట్టిన మొదటి వాణిజ్య మిషన్‌.

* న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఎల్‌వీఎం3ని ఉపయోగించి చేపట్టిన మొదటి మిషన్‌.

* వన్‌ వెబ్‌ సంస్థ న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)/డీఓఎస్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌) తో నిర్వహించిన మొదటి మిషన్‌.

* ఎల్‌వీఎం3ని ఉపయోగించి లోఎర్త్‌ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన మొదటి మిషన్‌.

* 6 టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లిన మొదటి రాకెట్‌ ఎల్‌వీఎం3.

 

ఎల్‌వీఎం3-ఎం3/వన్‌ వెబ్‌ ఇండియా-2 మిషన్‌: వన్‌ వెబ్‌ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను 2023, మార్చి 26న ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ విజయవంతంగా 450 కి.మీ. ఎత్తులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటి మొత్తం బరువు 5,805 కి.గ్రా.

 

ఎల్‌వీఎం3-ఎం4 - చంద్రయాన్‌-3 మిషన్‌: దీన్ని చంద్రయాన్‌-3 అంటారు. 2023, జులై 14న ఇస్రో బాహుబలి ఎల్‌వీఎం3-ఎం4 వాహక నౌక చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా ఆర్బిటర్, రోవర్, ల్యాండర్‌లను విజయవంతంగా భూ కక్ష్యలోకి తీసుకెళ్లింది. ఈ పేలోడ్‌ క్రమంగా కక్ష్యను పెంచుకుంటూ చివరకు చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. ఈ కక్ష్యలో ఆర్బిటర్‌ (ఉపగ్రహం) తిరుగుతూ ఉంటుంది. ఈ కక్ష్య నుంచి ల్యాండర్‌ క్షేమంగా చంద్రుడి మీదకు దిగాల్సి ఉంది. ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన తర్వాత దాని నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై సంచరిస్తుంది. ల్యాండర్‌ చంద్రుడి మీదకు దిగే ప్రక్రియ 2023, ఆగస్టు 23న జరగవచ్చని ఇస్రో అంచనా వేస్తోంది. 

జీఎస్‌ఎల్‌వీ-ఎంకేIII ప్రత్యేకతలు: జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ శ్రేణిలో ఇది మూడో రకం. మొదటి రెండు జీఎస్‌ఎల్‌వీ-ఎంకే-I, జీఎస్‌ఎల్‌వీ-ఎంకే-II. జీఎస్‌ఎల్‌వీ-ఎంకే-III వాహక నౌకనే ఎల్‌వీఎం3 అంటారు. దీని పొడవు 43.5 మీటర్లు. ప్రయోగ సమయంలో దీని బరువు 640 టన్నులు. ఈ వాహక నౌక 4 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను జియోసింక్రోనస్‌ కక్ష్యలోకి లేదా 8 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను 600 కి.మీ. లోఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడుతుంది. ఈ రాకెట్‌లో మూడు దశల ఇంధనం ఉంటుంది. మొదటిది ఘన ఇంధన దశ. ఈ దశలో రాకెట్‌కు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన S200 అనే ఘన ఇంధన రాకెట్‌ మోటార్‌ బూస్టర్లు ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద ఘన ఇంధన బూస్టర్‌లు. రెండోది ద్రవ ఇంధన దశ. దీన్ని L110 ద్రవ ఇంధన దశ అంటారు. దీనిలో వికాస్‌ ఇంజిన్లు అమర్చారు. మూడోది క్రయోజెనిక్‌ దశ. దీన్ని C25 అంటారు. ఈ దశలో ద్రవ హైడ్రోజన్‌ను ఇంధనంగా, ద్రవ ఆక్సిజన్‌ను ఆక్సిడైజర్‌గా వినియోగించుకునే CE-20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉంటుంది. జీఎస్‌ఎల్‌వీ వాహక నౌకల్లో జీఎస్‌ఎల్‌వీ-ఎంకే-III శక్తిమంతమైంది.

స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రత్యేకతలు: ఇస్రో ఇటీవల అభివృద్ధి చేసిన వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ. దీన్ని అవసరం దృష్ట్యా, వాణిజ్యపరమైన డిమాండ్‌ను బట్టి ప్రయోగిస్తారు. దీని పొడవు 34 మీటర్లు. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు ఉంటుంది. దీనిలో మూడు దశల ఘన ఇంధనం, చివరి దశలో ద్రవ ఇంధనం ఉంటాయి. ఈ చివరి దశనే వెలాసిటి ట్రిమ్మింగ్‌ మాడ్యూల్‌ (VTM) అంటారు. ఈ వాహక నౌక 500 కిలోల బరువును 500 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.


మాదిరి ప్రశ్నలు

1. ఓషన్‌శాట్‌ క్రమానికి చెందిన EOS-06 ఉపగ్రహాన్ని ఏ వాహకనౌక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది?

1) పీఎస్‌ఎల్‌వీ-సి54     2) జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌2     3) ఏఎస్‌ఎల్‌వీ-సి11     4) ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి2

జ: పీఎస్‌ఎల్‌వీ-సి54

 


2. భారతదేశంలో న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) సంస్థ ముఖ్య విధి?

1) రాకెట్ల తయారీ     2) ఉపగ్రహాల తయారీ     3) అంతరిక్ష వాణిజ్యాన్ని పెంచడం    4) ఉపగ్రహాలను ప్రయోగించడం

జ:అంతరిక్ష వాణిజ్యాన్ని పెంచడం

 


3. స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) కు సంబంధించి ఏ వాహకనౌక మొదటగా ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది?

1) ఎస్‌ఎస్‌ఎల్‌వీ-సి1    2) ఎస్‌ఎస్‌ఎల్‌వీ-సి2     3) ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి2      4) ఎస్‌ఎస్‌ఎల్‌వీ-బి1 

జ: ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి2 

 


4. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ద్వారా ఏ నావిగేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు?

1) EOS-07     2) NVS-01     3) జానస్‌-1      4) ఆజాదీ శాట్‌

జ:  NVS-01 

 


5. వన్‌ వెబ్‌ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను 2022, అక్టోబరు 23న ఏ వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?

1) ఎల్‌వీఎం3-ఎం1     2) ఎల్‌వీఎం-ఎం2     3) ఎల్‌వీఎం3-ఎం4     4) పీఎస్‌ఎల్‌వీ-సి55

జ:  ఎల్‌వీఎం-ఎం2

 


6. ఇస్రో ఎల్‌వీఎం-ఎం4 చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్‌?

1) చంద్రయాన్‌  1      2) చంద్రయాన్‌  2      3) చంద్రయాన్‌ - 3       4) మంగళ్‌యాన్‌ - I

జ: చంద్రయాన్‌ - 3

 


7. కింది ఏ వాహక నౌక మూడో దశలో క్రయోజెనిక్‌ దశ ఉంటుంది?

1) ఏఎస్‌ఎల్‌వీ     2) పీఎస్‌ఎల్‌వీ      3) ఎస్‌ఎస్‌ఎల్‌వీ     4) జీఎస్‌ఎల్‌వీ
 

జ:  జీఎస్‌ఎల్‌వీ

 


8. క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో దేన్ని ఇంధనంగా వాడతారు?

1) ద్రవ హైడ్రోజన్‌      2) శుద్ధి చేసిన కిరోసిన్‌     3) ద్రవ ఆక్సిజన్‌   4) ద్రవ నైట్రోజన్‌

జ:ద్రవ హైడ్రోజన్‌

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

Posted Date : 22-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌