• facebook
  • whatsapp
  • telegram

అక్షాంశాలు - రేఖాంశాలు  

సమయాలకు.. దూరాలకు కచ్చిత కొలమానాలు
 


 

హిమాలయాల విస్తరణ, హిందూ మహాసముద్రం వైశాల్యాలను సరిగ్గా లెక్కగట్టేస్తున్నారు. పగలు సూర్యుడు నడినెత్తికి రాగానే గడియారం పన్నెండు గంటలు కొట్టే విధంగా ఏర్పాట్లు చేశారు.  వేడి ప్రాంతాలు, చల్లటి ప్రదేశాలను తేలిగ్గా గుర్తించేస్తున్నారు.  దేశాలకు సరిహద్దులు నిర్ణయించేస్తున్నారు. ఆ దూరాలను, హద్దులను, ఈ సమయాలను, ఉష్ణోగ్రతలను, కొలవడానికి ప్రామాణికమైన రేఖలు ఉన్నాయి. అవి ఊహాజనితమే అయినప్పటికీ కొలమానం కచ్చితంగా ఉంటుంది. అవే అక్షాంశాలు, రేఖాంశాలు. వీటి గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  దాంతోపాటు  స్థానిక సమయం, ప్రామాణిక సమయం, గ్రీనిచ్‌ మీన్‌టైమ్‌లపై కూడా అవగాహన పెంచుకోవాలి. 

అక్షాంశాలు, రేఖాంశాలను మొదటిసారిగా ఉపయోగించింది హిప్పార్కస్‌. ఇతడు క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రజ్ఞుడు. రోడ్స్‌ నగరం నుంచి 00 రేఖాంశాలను గీయడానికి హిప్పార్కస్‌ యత్నించాడు. ఆ తర్వాత టాలమీతో సహా అనేక మంది ప్రయత్నించారు. ప్రస్తుతం ఉన్న రీతిలో వీటిని రూపొందించడానికి దాదాపు రెండు వేల సంవత్సరాలు పట్టింది.

అక్షాంశాలు (Latitudes) : లాటిట్యుడో అనే లాటిన్‌ పదానికి వెడల్పు అని అర్ధం భూమికి అడ్డుగా గీసిన ఊహా రేఖలను అక్షాంశాలు అంటారు. భూనాభి నుంచి భూ ఉపరితలానికి కోణీయ విలువలను గుర్తిస్తే, ఆ గుర్తించిన విలువను ఆ ప్రదేశపు అక్షాంశం విలువగా నిర్ధారిస్తారు.

లక్షణాలు:

‣ అక్షాంశాలు పూర్తి వృత్తాలు.

‣ అక్షాంశాల పొడవులు అసమానం.

‣ భూమధ్యరేఖ అన్నింటి కంటే పొడవైంది (40,000 కి.మీ.). అందుకే దీన్ని మహావృత్తం (గ్రేట్‌ సర్కిల్‌) అంటారు.

‣ 900ల అక్షాంశం అనేది అతి చిన్న అక్షాంశం. ఇది కేవలం ఒక బిందువు. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపునకు వెళ్లే కొద్దీ అక్షాంశాల పొడవులు తగ్గుతాయి. భూ భ్రమణ వేగం ఇక్కడ శూన్యంగా ఉంటుంది.

‣  అక్షాంశాల మధ్య దూరం సమానంగా ఉంటుంది (111 కి.మీ.). అందుకే వీటిని సమాంతర రేఖలు అంటారు. కానీ భూమధ్యరేఖ వద్ద 111.7 కి.మీ., ధ్రువాల వద్ద 110.6 కి.మీ. దూరం ఉంటుంది.

‣ ఉత్తరార్ధ గోళంలో 90, దక్షిణార్ధ గోళంలో 90, భూమధ్యరేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి.

సాధారణంగా అక్షాంశాలను ధ్రువ నక్షత్రŸం లేదా సూర్యుడి ఉన్నతి ఆధారంగా గుర్తిస్తారు.

అక్షాంశాల విలువలు, వాటి పేర్లు, గీసిన ఖండాలు, మహా సముద్రాలు:

సున్నా డిగ్రీ (00) అక్షాంశాన్ని భూమధ్యరేఖ అంటారు. ఇది ఆసియా, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ఖండాల ద్వారా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల ద్వారా వెళుతుంది.

23 ½డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కటరేఖ అంటారు. ఇది ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఖండాల ద్వారా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళుతుంది.

‣  23 ½ 0డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. ఇది ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల ద్వారా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల నుంచి వెళుతుంది.

‣ 66 ½0 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్‌ వలయం అంటారు. ఇది ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ద్వారా పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్‌ మహాసముద్రాల మీద నుంచి వెళుతుంది.

66 ½0 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్‌ వలయం అంటారు. ఇది అంటార్కిటికా ఖండం ద్వారా అంటార్కిటిక్‌ మహాసముద్రం మీదుగా వెళుతుంది.

90ఉత్తర అక్షాంశం. ఇది ఉత్తర ధ్రువం. ఏ ఖండం నుంచి వెళ్లదు. పూర్తిగా ఆర్కిటిక్‌ మహాసముద్రం మీదుగా వెళుతుంది.

900 దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని పిలుస్తారు. అంటార్కిటికా ఖండం ద్వారా వెళుతుంది. ఏ మహాసముద్రం మీద ఉండదు. 

‣ కర్కట, మకర రేఖలను అయన రేఖలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సూర్యుడి నిట్టనిలువు కిరణాలకు అవి సరిహద్దులు. ఈ రేఖలను దాటి సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడవు

రేఖాంశాలు (Longitudes): ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ, అక్షాంశాలను ఖండిస్తూ నిలువుగా గీసిన ఊహా రేఖలనే ‘రేఖాంశాలు’ అంటారు. ‘లాంగిట్యుడో’ అనే లాటిన్‌ పదానికి ‘పొడవు’ అని అర్థం.

లక్షణాలు:

రేఖాంశాల పొడవులు సమానం (19,996 కి.మీ.).

‣ వీటి మధ్య దూరం అసమానం. 

రెండు రేఖాంశాల మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద గరిష్ఠంగా, ధ్రువాల వైపునకు వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. రెండు రేఖాంశాల మధ్యదూరం భూమధ్య రేఖ వద్ద 111.3 కి.మీ.లు కాగా, 450 ల వద్ద 79 కి.మీ. ఉంటుంది. 

రేఖాంశాలపై ఉండే ప్రదేశాలన్నింటిలో సూర్యుడు ఒకేసారి నడి నెత్తి మీదకు వస్తాడు. అందుకనే వీటిని మధ్యాహ్న రేఖలు (మెరీడియన్స్‌) అంటారు. 

మొత్తం రేఖాంశాల సంఖ్య 360. 

‣ ఇవన్నీ ధ్రువాల వద్ద అంతమవుతాయి.

ఉపయోగాలు: 

‣ అక్షాంశాలు, రేఖాంశాలను ఒక ప్రదేశపు ఉనికిని తెలుసుకోవడానికి వినియోగిస్తారు. 

‣  అక్షాంశాలను శీతోష్ణస్థితిని అధ్యయనం చేయడం కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. 

‣  రేఖాంశాలను సమయాన్ని లెక్కించడానికి వాడతారు.

సమయాన్ని లెక్కించడం: 

సమయ భావనలు 3 రకాలు

1) స్థానిక సమయం (లోకల్‌ టైమ్‌): సూర్యుడు ఒక రేఖాంశం నడినెత్తి మీదకు (Zenit) వచ్చినప్పుడు ఆ రేఖాంశంపై ఉండే ప్రదేశపు సమయాన్ని 12.00 పీఎమ్‌ గా గుర్తించినట్లయితే, దాన్ని ఆ ప్రాంతపు స్థానిక సమయం అంటారు.

2) ప్రామాణిక సమయం (స్టాండర్డ్‌ టైమ్‌): ఒక దేశం లేదా ఒక ప్రాంతంలోని అనేక స్థానిక సమయాలకు బదులుగా ఒక స్థానిక సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని సమయాన్ని అనుసరించడం. 

* భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా  82 ½0 ల తూర్పు రేఖాంశాన్ని తీసుకున్నారు.      

* ఫ్రాన్స్‌ అత్యధికంగా 12 ప్రామాణిక సమయాలను కలిగి ఉండగా, రష్యాలో 11 ప్రామాణిక సమయాలున్నాయి. 2004లో రష్యా వాటిని 9కి తగ్గించింది. కానీ 2014 లో తిరిగి 11 ప్రామాణిక సమయాలను ఉపయోగించడం ప్రారంభించింది. 

* మన దేశంలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మరొక ప్రామాణిక సమయం కోసం డిమాండ్‌ చేస్తున్నారు.

3) సార్వత్రిక సమన్వయ సమయం లేదా గ్రీనిచ్‌ మీన్‌ టైమ్‌:  ఈ భూగోళానికి మొత్తం ఒక సమయాన్ని చెప్పడానికి 0 రేఖాంశం సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అందుకే 0 రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం అంటారు.

* 00 రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా 1884లో వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ  మెరీడియన్‌ సదస్సులో నిర్ణయించారు.

డే లైట్‌ సేవింగ్‌ టైమ్‌ (డీఎస్టీ):  ప్రత్యేకించి యూరప్‌ దేశాల్లో సహజ వెలుతురును ఉపయోగించుకోవడానికి సమయాన్ని ముందుకు జరుపుతారు. ముఖ్యంగా శరత్కాలం, శీతాకాలాల్లో ఈ సర్దుబాటు చేసుకుంటారు. 

* మొదట ఈ డీఎస్టీ సమయ భావనను ప్రవేశపెట్టింది జర్మనీ.

* ఒక రేఖాంశం తిరగడానికి భూమికి పట్టే సమయం 4 నిమిషాలు.

* ఉన్న రేఖాంశం నుంచి తూర్పునకు వెళితే రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున సమయం పెరుగుతుంది. పశ్చిమానికి వెళితే రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున సమయం తగ్గుతుంది. మొత్తం ప్రపంచాన్ని 24 కాల మండలాలు (Time Zones) గా విభజించారు.

* 0 రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా గుర్తించడానికి కారణం ఆనాడు ఇంగ్లండ్‌ అగ్రరాజ్యంగా ఉండటమే.

* 0 రేఖాంశానికి, భారతదేశం ప్రామాణిక రేఖాంశానికి మధ్య 5 ½ గంటల సమయ వ్యత్యాసం ఉంటుంది.

* 00 రేఖాంశానికి, 180 ల రేఖాంశానికి మధ్య 12 గంటల సమయ వ్యత్యాసం ఉంటుంది.

* 1790 ల తూర్పు రేఖాంశానికి, 1790 పశ్చిమ రేఖాంశానికి మధ్య 23 గంటల 52 నిమిషాల సమయ వ్యత్యాసం ఉంటుంది.

ప్రధాన రేఖాంశాలు:

1) 00 రేఖాంశం: దీన్ని ప్రధాన రేఖాంశం (Prime Meridian) అంటారు. లండన్‌ నగరంలోని గ్రీనిచ్‌ ఖగోళ పరిశోధనా కేంద్రం మీద నుంచి వెళుతుండటంతో దీన్ని గ్రీనిచ్‌ రేఖాంశం (Greenwich Meridian)  అంటారు. 

‣   ఈ రేఖాంశం ఐరోపా, ఆఫ్రికా, అంటార్కిటికా ఖండాల మీదుగా, ఆర్కిటిక్, అట్లాంటిక్, అంటార్కిటికా మహా సముద్రాల మీదుగా వెళుతుంది. 

2) 1800ల రేఖాంశం: దీన్నే 1800ల తూర్పు, పశ్చిమ రేఖాంశం; ‘అంతర్జాతీయ దినరేఖ’ (ఇంటర్నేషనల్‌ డేట్‌ లైన్‌), ‘లైన్‌ ఆఫ్‌ డెమార్కేషన్‌’ అని కూడా పిలుస్తారు.

‣  అంతర్జాతీయ దినరేఖ ఇతర రేఖాంశాల మాదిరి తిన్నగా ఉండకుండా ద్వీపాలు, దేశాల మధ్య తేది సర్దుబాటు కోసం అనేక వంకరలు తిరుగుతుంది.  

‣ ఈ రేఖాంశం ఆర్కిటిక్, పసిఫిక్, అంటార్కిటిక్‌ సముద్రాల ద్వారా, అంటార్కిటికా ఖండం నుంచి, బేరింగ్‌ జలసంధి మీదుగా వెళుతుంది. 

‣  ఈ రేఖను తూర్పు నుంచి పశ్చిమానికి దాటితే ఒక రోజును తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాగే పశ్చిమం నుంచి తూర్పునకు వస్తే ఒక రోజును కలపాలి. 

‣  ఉదాహరణకు తూర్పు అర్ధ గోళంలోని హైదరాబాద్‌ నుంచి అక్టోబరు 15న బయలుదేరి పశ్చిమార్ధ గోళంలోని కాలిఫోర్నియాకు చేరుకుంటే తేదీని అక్టోబరు 14గా మార్చుకోవాలి.

‣  అక్షాంశాలు, రేఖాంశాలను అధ్యయనం చేస్తున్నపుడు డిగ్రీలు (00), నిమిషాలు (0'), సెకనులు (0'')గా విభజిస్తారు. 

‣  అత్యధికంగా భూభాగం ఉత్తరార్ధ గోళంలో ఉంటే, అత్యధికంగా జలభాగం దక్షిణార్ధ గోళంలో ఉంది. 

‣  హిందూ మహాసముద్రం తూర్పు అర్ధ గోళంలో మాత్రమే ఉంది. 

‣ ఆఫ్రికా ఖండం నాలుగు అర్ధ గోళాల్లో విస్తరించి ఉంది. 

‣ పసిఫిక్, అట్లాంటిక్‌ మహాసముద్రాలు కూడా నాలుగు అర్ధ గోళాల్లో విస్తరించి ఉన్నాయి. 

‣  కేవలం భూభాగం మీదనే ఉండే ప్రధాన అక్షాంశం 900ల దక్షిణ ధ్రువం. జలభాగం మీద మాత్రమే గుర్తించిన ప్రధాన అక్షాంశం 900ల ఉత్తర ధ్రువం.

 

 

రచయిత: సక్కరి జయకర్‌ 

Posted Date : 24-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌