• facebook
  • whatsapp
  • telegram

పశుసంపద, పౌల్ట్రీ

ఆహారం.. ఆదాయం.. ఆర్థికవృద్ధి

  గ్రామీణాభివృద్ధిలో తద్వారా దేశ ప్రగతిలో పంటలతోపాటు పశువులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే నిర్ణీత కాల వ్యవధుల్లో వాటి గణాంకాలను ప్రభుత్వం సేకరిస్తుంటుంది. ఈ పశుసంపద ప్రజలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఉపాధిని కల్పించి ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఆర్థిక వృద్ధికీ దోహదపడుతుంది. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న జంతువుల వివరాలను పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, మత్స్య పరిశ్రమ, డెయిరీ అభివృద్ధి రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. పోషకాహారంగా, పెద్ద ఎత్తున  రైతులు, కార్మికులకు ఉపాధి కల్పనకు సాయపడుతున్నాయి. వ్యవసాయాధారిత రాష్ట్రమైన తెలంగాణలోనూ వీటికి ప్రాధాన్యం ఉంది. తెలంగాణ రాష్ట్రం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5 శాతంతో 11వ స్థానంలో, 2.9 శాతం జనాభాతో 12వ స్థానంలో ఉంది. అలాగే జంతుసంపదలో 8వ స్థానంలో ఉంది.

  భారతదేశంలో జంతుసంపద గణన మొదట 1919లో బ్రిటిష్‌ హయాంలో జరిగింది. ప్రతి అయిదేళ్లకోసారి ఈ విధంగా లెక్కిస్తారు. 20వ జంతుగణనను తెలంగాణలో 2018, అక్టోబరు 1న ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 92.40 లక్షల గృహాల్లో జంతుగణన జరిగింది. ఈ వివరాలతో కేంద్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ 2019, అక్టోబరు 16న దిల్లీలో తుది నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 29 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక రంగంలో జీవనోపాధి పొందుతున్నాయి.

  రాష్ట్ర జంతు సంపదలో పశువులు, గొర్రెలు, కోళ్లు గణనీయంగా (దేశ గణాంకాల్లో 6.57%) ఉన్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ శ్రామికశక్తిలో 9 శాతం కంటే ఎక్కువ మంది పశుసంవర్ధక రంగంలోనే ఉన్నారు. 2018 - 19 ముందస్తు అంచనాల ప్రకారం పశుసంపద రంగం రాష్ట్ర జీఎస్‌డీపీకి 7% వాటా సమకూరుస్తోంది. ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ - 2001 కింద తెలంగాణ స్టేట్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీని (టీఎస్‌ఎల్‌డీఏ) ప్రత్యేకంగా స్థాపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని పదో షెడ్యూల్‌లో ఈ సంస్థను చేర్చారు.

  2019 జంతుసంపద గణన ప్రకారం దేశంలో తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో మొదటి స్థానం; పౌల్ట్రీ, గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో అయిదో స్థానం, పెరటి కోళ్ల పెంపకంలో ఏడో స్థానంలో ఉంది. గేదెల పెంపకంలో తొమ్మిదో స్థానం, గాడిదలు పదకొండో స్థానం, మేకల పెంపకంలో పన్నెండో స్థానంలో ఉంది. పాల ఉత్పత్తి, ఒంటెల పెంపకంలో పదమూడో స్థానం, పందుల పెంపకంలో పద్నాలుగో స్థానం; పశువులు, గుర్రాల పెంపకంలో పదిహేనో స్థానంలో ఉంది. 

 

2019 జంతుసంపద, పౌల్ట్రీ గణన ప్రకారం

గొర్రెలు 190.63 లక్షలు
మేకలు 49.35 లక్షలు
గేదెలు 42.26 లక్షలు
పందులు  1.78 లక్షలు
మొత్తం 326.26 ల‌క్ష‌లు 
పౌల్ట్రీ 799.99 లక్షలు

 

జిల్లాల వారీగా..!

క్యాటిల్‌: అత్యధికంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌; అత్యల్పంగా నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి.

 

గేదెలు: అత్యధికంగా ఆదిలాబాద్, నల్గొండ; అత్యల్పంగా సిరిసిల్ల, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి.

 

గొర్రెలు: అత్యధికంగా నల్గొండ, వనపర్తిలో ఉండగా అత్యల్పంగా హైదరాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి. 

 

మేకలు: అత్యధికంగా సంగారెడ్డి, నల్గొండలో ఉండగా అత్యల్పంగా మేడ్చల్, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి.

 

కోళ్లు: అత్యధికంగా సిద్దిపేట, రంగారెడ్డి; అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి.

 

ఇతరాలు: అత్యధికంగా మేడ్చల్, హైదరాబాద్‌; అత్యల్పంగా ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి.


* మొత్తం జంతుసంపద అత్యధికంగా మహబూబ్‌నగర్, నల్గొండ; అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాల్లో ఉంది.

 

పాల ఉత్పత్తి: అత్యధికంగా రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ; అత్యల్పంగా ఆసిఫాబాద్‌ సిరిసిల్ల, గద్వాల జిల్లాల్లో ఉంది. 

 

గుడ్ల ఉత్పత్తి: అత్యధికంగా రంగారెడ్డి, సిద్దిపేటలో ఉండగా అత్యల్పంగా ఆసిఫాబాద్, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉంది. 

 

మటన్‌ ఉత్పత్తి: అత్యధికంగా సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఉండగా అత్యల్పంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉంది.

 

చికెన్‌ ఉత్పత్తి: అత్యధికంగా సిద్దిపేట, రంగారెడ్డి; అత్యల్పంగా హైదరాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉంది.

 

మొత్తం మాంసం ఉత్పత్తి (మటన్‌, చికెన్‌): అత్యధికంగా - రంగారెడ్డి, సంగారెడ్డి; అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉంది.

 

ఉన్ని ఉత్పత్తి: అత్యధికంగా నల్గొండ, నాగర్‌కర్నూల్‌; అత్యల్పంగా హైదరాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉంది.

* 2017 నాటికి తెలంగాణలో 100 సంచార పశువైద్య కేంద్రాలను (మొబైల్‌ వెటర్నరీలు) ఏర్పాటుచేశారు. దేశంలో తెలంగాణను తొలి ‘ఫుట్ అండ్‌ మౌత్‌ డిసీజ్‌’ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. 

 

మత్స్య సంపద

  తెలంగాణలో రిజర్వాయర్లు, నదులు, చెరువులు, సరస్సులు, కాల్వలు లాంటి విభిన్నమైన, విస్తారమైన జలవనరుల్లో మత్స్య సంపద ఉంది. 2018 - 19 రాష్ట్ర జీడీపీలో మత్స్య సంపద వాటా 0.5 శాతం. తెలంగాణ రాష్ట్రం దేశంలో అంతఃస్థలీయ జల వనరుల్లో మూడో అతిపెద్ద రాష్ట్రంగా, అంతఃస్థలీయ/లోతట్టు నీటి చేపల పెంపకంలో 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 21,825 నీటివనరు జలాశయాలు (వాటర్‌ బాడీస్‌) ఉండగా అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 1,636, మెదక్‌లో 1,609 ఉన్నాయి. అత్యల్పంగా హైదరాబాద్‌లో 01, యాదాద్రిలో 228, ఆసిఫాబాద్‌లో 242 నీటివనరు జలాశయాలున్నాయి.

  ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం - రాజేంద్రనగర్‌ (రంగారెడ్డి), కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం - ములుగు (సిద్దిపేట), పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం - రాజేంద్రగనర్‌లో (రంగారెడ్డి) ఉన్నాయి. 

 

మాదిరి ప్రశ్నలు

1. 2019 జంతుసంపద గణన ప్రకారం దేశంలోని మొత్తం జంతుసంపదలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది?

1) 6వ స్థానం   2) 8వ స్థానం   3) 10వ స్థానం   4) 12వ స్థానం

 

2. తెలంగాణ రాష్ట్రంలో పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?

1) ములుగు   2) దూల్‌పేట   3) రాజేంద్రనగర్‌   4) పోలాస్‌

 

3. 2018-19 భారత ప్రభుత్వం సమీకృత స్థానిక జాతి పశువుల అభివృద్ధి కోసం కింది ఏ కేంద్రాన్ని స్థాపించింది?

1) గోకుల్‌ గ్రామ్‌  2) గోకుల్‌ మిత్ర   3) కామధేను   4) అన్నీ

 

4. దేశంలో పాల ఉత్పత్తిలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది?

1) 13వ స్థానం 2) 9వ స్థానం 3) 15వ స్థానం 4) 11వ స్థానం

 

5. 2019 జంతుసంపద గణన ప్రకారం జంతుసంపద పెంచిన రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం?

1) ప్రథమ స్థానం 2) ద్వితీయ స్థానం 3) తృతీయ స్థానం 4) అయిదో స్థానం

 

సమాధానాలు: 1-2; 2-3; 3-1; 4-1 5-2.

 

Posted Date : 25-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌