• facebook
  • whatsapp
  • telegram

పశుసంపద

పల్లె ప్రగతిలో మూగజీవులు!

  పశువులు లేని గ్రామీణ భారతాన్ని ఊహించడం కష్టం. పల్లె జీవనంలో అవి ప్రధాన భాగంగా మారిపోయాయి. ఒక జంతువును ఆధారం చేసుకొని ఒక కుటుంబం బతకగలిగిన పరిస్థితి ఉంది. ఆ మూగజీవులు పొలంలో రైతు కష్టాన్ని పంచుకుంటాయి. పంటలకు ఎరువును, పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తాయి. గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని అందిస్తూ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకపాత్రను పోషిస్తున్నాయి. అందుకే ప్రతి పోటీ పరీక్షలో వాటికి సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. 

 

  భారతదేశంలో పశుసంపద వ్యవసాయంలో ఒక భాగం. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది ప్రముఖపాత్ర పోషిస్తోంది. సాంకేతికంగా మనం ఎంత ప్రగతి సాధించినప్పటికీ నేటికీ దేశంలో పశువులను వ్యవసాయానికి, రవాణాకు ఉపయోగిస్తున్నారు. వీటి నుంచి పాలు, మాంసం, ఉన్ని, చర్మాలు మొదలైన ఉత్పత్తులు లభిస్తున్నాయి. ప్రపంచ పశుసంపదలో  11 శాతం మన దేశంలో ఉంది. నేడు భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద పశుసంపద కలిగిన దేశంగా ఉంది (20వ పశు గణాంకాల ప్రకారం).

  ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నప్పటికీ పశుసంపదలో మన దేశం గణనీయంగా వృద్ధిని సాధించింది.  గ్రామీణ ఆర్థికవ్యవస్థలో పశువులు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. భూమి దున్నడం, రవాణా లాంటి వాటి కోసం నేటికీ కొంత మేరకు పశుసంపదపైనే రైతులు ఆధారపడుతున్నారు. పశువుల వ్యర్థాలను ఎరువుగా, శక్తి వనరులుగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో అనేక రకాల పశు జాతులున్నాయి. వీటిలో 26 జాతులు ప్రధానమైనవి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, గాడిదలు, ఒంటెలు వంటివి పెంపుడు జంతువులు.

 

 1919 నుంచి దేశవ్యాప్తంగా పశుగణన క్రమంగా (ప్రతి అయిదేళ్లకోసారి) నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 20 సార్లు నిర్వహించారు. 20వ పశుగణన 2018-19 సంవత్సరంలో ముగిసింది. 1951లో దేశంలో 292 మిలియన్ల పశువులుండగా, 1981-82లో 419 మిలియన్లు ఉన్నాయి. 20వ పశుగణాంకాల ప్రకారం 2012- 2019 మధ్యకాలంలో పశువులు 4.6% వృద్ధితో 536 మిలియన్లకు చేరాయి. దేశంలో పశుసంపద ఎక్కువగా ఉన్నప్పటికీ భౌగోళిక విస్తరణ పరంగా వ్యత్యాసం కనిపిస్తుంది. మొత్తం పశుసంపద పరంగా ఉత్తర్‌ప్రదేశ్‌ మొదటి స్థానంలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఏపీ 6, తెలంగాణ 8వ స్థానాల్లో నిలిచాయి.

 

పాడిపశువులు: వ్యవసాయంలో భాగంగా ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను పెంచుతారు. వీటి ద్వారా వ్యవసాయ అవసరాలు తీరడంతో పాటు పాలు, పాల ఉత్పత్తులు లభిస్తాయి. 1951లో వీటి సంఖ్య 198 మిలియన్లు కాగా, 1981-82లో 262 మిలియన్లు, 2019 నాటికి 302 మిలియన్లకు చేరింది.

 

గొర్రెలు: వీటి పెంపకంలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా (42%), రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. 2012తో పోల్చుకుంటే 14.13% వృద్ధితో ప్రస్తుతం (2019 లెక్కల ప్రకారం) భారత్‌లో 74.26 మిలియన్ల గొర్రెలున్నాయి. ఇది దేశ పశుసంపదలో 13.8% వాటాకు సమానం. భారత వాతావరణం గొర్రెల పెంపకానికి అనుకూలం. ప్రధానంగా పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జమ్ము-కశ్మీర్‌లలో వీటిని పెంచుతున్నారు. కొంతకాలంగా గొర్రెల పెంపకంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉంది.

 

మేకలు: పేదవాడి ఆవుగా వీటికి పేరు. తక్కువ ఖర్చుతో పెంచవచ్చు. వీటి నుంచి మాంసం, పాలు, ఉన్ని, చర్మం లభిస్తాయి. దేశంలో మేకల సంఖ్య 2012లో 135.17 మిలియన్లు ఉండగా, 2019 లెక్కల ప్రకారం 148.88 మిలియన్లుగా ఉంది. మేకల పెంపకంలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం చైనాది. దేశంలో మేకలను ఎక్కువగా పెంచే రాష్ట్రాలు వరుసగా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌.

 

పందులు: వీటి పెంపకానికి ఖర్చు తక్కువ. మాంసం ఉత్పత్తి ఎక్కువ. ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి నుంచి పందుల పెంపకం అధికం. ఇక్కడ సాధారణంగా ప్రతి కుటుంబంలో పందుల్ని పెంచుతారు. 2012లో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 10.29 మిలియన్లు ఉండగా, 2019 గణాంకాల ప్రకారం 9.06 మిలియన్లకు త‌గ్గింది. దేశ పశుసంపదలో పందుల వాటా 1.7 శాతం. వీటి పెంపకంలో అస్సాం, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ముందున్నాయి.

దేశంలో ఒంటెల సంఖ్య 2012లో 0.4 మిలియన్లు ఉండగా 2019 నాటికి 0.25 మిలియన్లకు (-37.05%) తగ్గింది. 2012లో 0.62 మిలియన్లు ఉన్న గుర్రాలు 2019లో 0.34 మిలియన్లకు (-45.58%) తగ్గాయి. కంచర గాడిదలు 2012లో 0.20 మిలియన్ల నుంచి 2019 నాటికి 0.08 మిలియన్లకు పరిమితమయ్యాయి. అడవి దున్నలు (మిథున్‌) 2012లో 3 మిలియన్లు ఉండగా 2019 నాటికి 3.8 మిలియన్లుగా నమోదయ్యాయి. జడల బర్రె (యాక్‌)ల సంఖ్య 2012లో 77 వేలు కాగా 2019లో 58 వేలకు తగ్గింది.

 

కోళ్ల పెంపకం: కోళ్ల పెంపకం అదనపు ఉత్పత్తి, రాబడి ఇస్తుంది. వీటి మాంసంతో పాటు, గుడ్లకూ గిరాకీ ఎక్కువ. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఇవ్వడం వల్ల ఎక్కువ మంది రైతులు కోళ్ల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. మనదేశంలో పెరటి కోళ్ల పెంపకం, ఫారం కోళ్ల పెంపకం అని రెండు విధాలున్నాయి. పెరటి కోళ్ల సంఖ్య 2012లో 217.5 మిలియన్ల నుంచి 2019లో 317.1 మిలియన్లకు (46%) పెరిగింది. ఫారం కోళ్ల సంఖ్య 2012లో 511.72 మిలియన్లు ఉండగా 2019 సంవత్సరానికి 534.7 మిలియన్లకు (4.5%) పెరిగింది. మొత్తం కోళ్ల సంఖ్య 729 మిలియన్ల నుంచి 851.8 మిలియన్లకు (16.8%) పెరిగింది. కోళ్ల పెంపకంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు వరుసగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర. మనదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తి 2014-15లో 78.48 బిలియన్లు కాగా 2019-20కి 114.38 బిలియన్లుగా నమోదై ప్రపంచంలో మూడో స్థానాన్ని ఆక్రమించింది. మొదటి రెండు స్థానాల్లో చైనా, అమెరికా ఉన్నాయి.

 

చేపల పెంపకం: దేశ మొత్తం తీరప్రాంతం 8118 కి.మీ.లలో 3,11,680 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. 14.73 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తితో భారత్‌ (2021 లెక్కల ప్రకారం) ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. చైనా, ఇండోనేషియా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్‌ వాటా 7.96 శాతం. చేపల వేట తమిళనాడు, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్, మున్నార్‌ సింధు శాఖలో ఎక్కువ. హ్యాండ్‌బుక్‌ ఆన్‌ ఫిషరీస్‌ గణాంకాలు - 2018 ప్రకారం అంతస్థలీయ జలవనరుల చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ (34.5 లక్షల టన్నులతో) అగ్రస్థానంలో ఉండగా, సముద్ర జలవనరుల (మెరైన్‌ ఫిష్‌) చేపల ఉత్పత్తిలో గుజరాత్‌ (7.01 లక్షల టన్నులతో) మొదటి స్థానంలో ఉంది.

 

దేశంలో ముఖ్యమైన పశు పరిశోధనా కేంద్రాలు

* నేషనల్‌ డైరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - కర్నాల్‌ (హరియాణ)

* ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - ఇజాత్‌నగర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)

* సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ బఫెలోస్‌ - హిస్సార్‌ (హరియాణ)

* సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ కాటిల్‌ - మీరట్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)

* సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ గోట్స్‌ - మఖ్‌దూమ్, మధుర (ఉత్తర్‌ప్రదేశ్‌)

* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫిజియాలజీ - బెంగళూరు (కర్ణాటక)

* ఐసీఏఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ - భోపాల్‌

* నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌ - ఉప్పల్‌ (హైదరాబాద్‌)

* డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌ - రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌)

* శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ - తిరుపతి 

* నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనెటిక్‌ రిసోర్సెస్‌ - కర్నాల్, (హరియాణ)

 

 

మాదిరి ప్రశ్నలు


1. గొర్రెల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం?

1) కర్ణాటక   2) ఆంధ్రప్రదేశ్‌   3) తెలంగాణ  4) కేరళ


2. కిందివాటిలో ‘పేదవాడి ఆవు’ అని దేన్ని అంటారు?

1) గొర్రె   2) గాడిద  3) ఏనుగు   4) మేక


3. కోడిగుడ్ల ఉత్పత్తిలో మనదేశం ఏ స్థానంలో ఉంది?

1) 5వ   2) 3వ   3) 1వ   4) 8వ


4. అంతస్థలీయ జలవనరుల్లో చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్‌   2) కర్ణాటక   3) కేరళ  4) గుజరాత్‌


5. ఆపరేషన్‌ ఫ్లడ్‌ దేనికి సంబంధించింది?

1) వరద నివారణ   2) వాక్సిన్‌ల ఉత్పత్తి  3) తేనె ఉత్పత్తి  4) పాల ఉత్పత్తి


6. మన దేశంలో క్రమానుగతంగా పశుగణన ఎప్పటి నుంచి మొదలైంది?

1) 1947  2) 1951  3) 1919   4) 2010

 

స‌మాధానాలు

1-3, 2-4, 3-2, 4-1, 5-4, 6-3.

 

 

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌


 

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌