• facebook
  • whatsapp
  • telegram

మానవ కారక విపత్తులు

స్వీయ విధ్వంసక సంక్షోభాలు!

  భూకంపాలు, సునామీలు, తుపాన్ల వంటి సహజ విపత్తులను ఆపడం, అడ్డుకోవడం అసాధ్యం. కానీ అదుపు చేయగలిగిన మానవ కారక ప్రమాదాలు కూడా ఇప్పుడు ప్రపంచానికి పెను విపత్తులుగా పరిణమిస్తున్నాయి. మనిషి చేసే నిర్లక్ష్యం, తప్పులు, సరైన శిక్షణ లేకుండా చేసే పొరపాట్ల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలు అధికమవుతున్నాయి. అధిపత్య ధోరణులతో ఆధునిక సాంకేతికతను వినాశనాలకు వినియోగించడమూ మానవుల వల్ల ఏర్పడుతున్న స్వీయ విధ్వంసక సంక్షోభాలే. ఇలాంటి విపత్తుల రకాలు, వాటి ప్రభావాల గురించి కాబోయే ప్రభుత్వోద్యోగులకు సరైన అవగాహన ఉండాలి. 

 

  మానవ అభివృద్ధిని అడ్డుకునే విపత్తుల్లో భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు లాంటి సహజ విపత్తులతోపాటు అనేక మానవ ప్రేరిత విపత్తులు కూడా అభివృద్ధి నిరోధకాలుగా పరిణమిస్తున్నాయి. మానవ ప్రమేయం, తప్పిదాలు, నిర్లక్ష్యం, మానవ నిర్మిత వ్యవస్థలు దెబ్బతినడం లాంటి కారణాలతో ఏర్పడే విపత్తులను మానవ కారక విపత్తులు అంటారు. అవి రెండు రకాలుగా ఉంటాయి.

1) సామాజికపరమైన మానవ కారక విపత్తులు: పౌర యుద్ధాలు, పౌర తిరుగుబాట్లు, తీవ్రవాదం, తొక్కిసలాటలు, ఆస్తులు తగలబెట్టడం లాంటి వాటితో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ హాని జరగడాన్ని సామాజికపరమైన మానవకారక విపత్తులు అంటారు.

2) సాంకేతికపరమైన మానవ కారక విపత్తులు: వివిధ ప్రయోగాలు, నిర్మాణాలు, పారిశ్రామికీకరణ, రవాణా లాంటి వాటిలో మానవ నిర్లక్ష్యం, తప్పిదాలు, యాంత్రిక వైఫల్యం వల్ల ఏర్పడే విపత్తులను సాంకేతికపరమైన విపత్తులుగా పరిగణిస్తారు. పారిశ్రామిక విపత్తులు, నిర్మాణాలు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రేడియేషన్‌ విపత్తులు, అంతరిక్ష ప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు ఇందులో ప్రధానమైనవి.

 

సామూహిక విధ్వంసక ఆయుధాలు

ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పర్యావరణానికి భారీ నష్టం తెచ్చే ఆయుధాలివి. అణు, రసాయన, బయోలాజికల్, రేడియోలాజికల్‌ ఆయుధాలు ఇందుకు ఉదాహరణ. 2003లో యూఎస్‌ఏ సారథ్యంలో మిత్రరాజ్యాలు ఇరాక్‌పై దాడి చేసిన సందర్భంగా ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది.

 

అణ్వాయుధాలు: విధ్వంసకర శక్తిని విడుదల చేసే విస్ఫోటక ఆయుధాలే అణ్వాయుధాలు. ఇవి రెండు రకాలు. 1) కేంద్రక విచ్ఛిత్తి ద్వారా పెను విధ్వంసం సృష్టించే అణుబాంబులు లేదా వి - బాంబులు లేదా ఫిజన్‌ బాంబులు. 2) కేంద్రక సంలీన చర్య ద్వారా పెద్ద మొత్తంలో శక్తి విడుదల చేసే హైడ్రోజన్‌ బాంబులు లేదా బీ - బాంబులు లేదా ఫ్యూజన్‌ బాంబులు లేదా థర్మోన్యూక్లియర్‌ బాంబులు. హైడ్రోజన్‌ బాంబులు వి - బాంబుల కంటే వెయ్యి రెట్ల అధిక శక్తిని ఇస్తాయి.

  రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌పై అమెరికా అణుబాంబులు ప్రయోగించింది. ‘బి-29 బాంబర్‌ ఎనోలా గే’ అనే యుద్ధ విమానం నుంచి మొదటిసారి ‘లిటిల్‌బాయ్‌’ అణుబాంబుని 1945, ఆగస్టు 6న హిరోషిమాపై వేసింది. రెండోసారి 1945, ఆగస్టు 9న అదే యుద్ధ విమానంతో ‘ఫ్యాట్‌మాన్‌’ అణుబాంబుని నాగసాకి నగరంపై విడిచిపెట్టింది. ఈ చర్య మానవ జాతి చరిత్రలో అత్యంత హేయమైన చర్యగా నిలిచిపోయింది.

 

రసాయన ఆయుధాలు: శరీర వ్యవస్థపై దాడి చేసే రసాయన పదార్థాలు లేదా విష పదార్థాలను ఉపయోగించి ప్రజల ప్రాణానికి భారీ నష్టం కలగజేయడాన్ని రసాయన ఆయుధాల దాడిగా భావిస్తారు. సాధారణ రసాయనాలతోనే వీటిని తయారుచేయవచ్చు. వీటిలో అనేక రకాలున్నాయి. ఫాస్జిన్‌ లాంటి ఊపిరాడకుండా చేసే వాయువులు మనుషుల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసి ప్రాణాలు హరిస్తాయి. 

  మస్టర్డ్‌ గ్యాస్‌ లాంటి వాటితో శరీరంపై పొక్కులు వస్తాయి. శరీరం కాలిపోవడంతోపాటు చూపు పోతుంది. వీటన్నింటి కంటే ప్రాణాంతకమైంది నెర్వ్‌ ఏజెంట్‌. ఇది శరీరంలోని కండరాలకు మెదడు పంపే సంకేతాలను అడ్డుకుంటుంది. చిన్న బిందువు కూడా ప్రాణాంతకం అవుతుంది. ఉదా: 0.5 మిల్లీగ్రాముల వీఎక్స్‌ నెర్వ్‌ ఏజెంట్‌ ఒక వ్యక్తి ప్రాణం తీస్తుంది. రసాయన కారకాన్ని వ్యాప్తి చేయడానికి ముందు దాన్ని లక్ష్యంపైన లేదా దాని పక్కనే చల్లి తేలికగా వ్యాపింపజేయవచ్చు. అందువల్ల ఈ రసాయన పదార్థాన్ని అత్యంత సమర్థంగా ఉపయోగించాలి. యుద్ధ సమయంలో ఫిరంగి గుండ్లు, బాంబులు, క్షిపణుల్లో రసాయన పదార్థాన్ని నింపి ప్రయోగించవచ్చు. దీన్ని తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సేనలు ఫ్లోరిన్‌ సిలిండర్‌ను తెరచి శత్రువులపైకి పంపాయి. 1980లో ఇరాన్‌ - ఇరాక్‌ యుద్ధంలో; 2013, ఆగస్టు 21న సిరియా రాజధాని డమాస్కస్‌ శివార్లలో సారిన్‌ అనే నెర్వ్‌ ఏజెంట్‌ను ప్రయోగించారు.

 

పారిశ్రామిక విపత్తులు: రసాయన విపత్తులను, పారిశ్రామిక విపత్తులను ఒకదానికొకటి ప్రత్యామ్నాయ పదాలుగా వాడతారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌’ (యూసీఐఎల్‌)’ అనే క్రిమిసంహారక మందుల తయారీ పరిశ్రమ నుంచి 30 - 40 టన్నులకు పైగా మిథైల్‌ ఐసోసైనేట్‌ అనే విషవాయువు లీకవడంతో 3 వేల మందికి పైగా మరణించారు. సుమారు 5 లక్షల మంది అనేక విధాలుగా అనారోగ్యాలకు గురయ్యారు. ఈ సంఘటన 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి తర్వాత జరిగింది.

* 1976, జులై 10న ఇటలీలోని సెవేసోలో రసాయనాల తయారీ పరిశ్రమ నుంచి ‘డియోక్సిన్‌’ వాయువు లీకై 3,300 పశువులు చనిపోయాయి. ఆ తర్వాత 80 వేల పశువులను చంపేయాల్సి వచ్చింది.

* 2020, మే 7న తెల్లవారుజామున విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి ‘స్టైరీన్‌’ వాయువు లీకై 12 మంది చనిపోయారు. ఇలా రసాయన పారిశ్రామిక విపత్తులు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి.

 

రేడియోధార్మిక ఆయుధాలు: ఏదైనా ప్రదేశంలో రేడియోధార్మికత కలిగిన పదార్థం కారణంగా తీవ్రనష్టం జరిగితే రేడియోధార్మిక విపత్తు అంటారు. సంప్రదాయ పేలుడు పదార్థాలతో రేడియోధార్మిక పదార్థాలను కలిపి ప్రయోగించడం వల్ల సాధారణం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల వీటిని ‘డర్టీబాంబులు’ లేదా ‘బ్యాక్‌ప్యాక్‌ బాంబులు’ అంటారు. వీటిని తయారు చేయడానికి సీజియం-137, స్ట్రాన్షియం-90, కోబాల్ట్‌-60, రేడియో అయోడిన్‌-131 లాంటి రేడియోధార్మిక ఐసోటోప్‌ పదార్థాలను వాడతారు. వీటిని సాధారణంగా ఉగ్రవాదులు వినియోగిస్తుంటారు.

 

జీవాయుధాలు: హానికర వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలను ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి చేసి, విడుదల చేయడం ద్వారా భారీస్థాయిలో ప్రాణాలను హరించే సూక్ష్మజీవులను జీవాయుధాలు అంటారు. ఇలాంటి జైవిక దాడిని ఉగ్రవాదులు, తీవ్రవాదులు జరిపితే అది బయోటెర్రరిజం అవుతుంది. వీటిని విడిచిపెట్టడానికి అధునాతన సాధనాలు పెద్దగా అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో చెట్లు, జంతువుల టాక్సిన్ల నుంచీ తయారు చేయవచ్చు. 1 చ.కి.మీ. పరిధిలోని ప్రజలపై దాడి చేయడానికి సంప్రదాయ బాంబుకి 2 వేల డాలర్లు వ్యయమైతే, అణ్వాయుధాలకు 800 డాలర్లు, నెర్వ్‌ గ్యాస్‌ ఆయుధాలకు 600 డాలర్లు ఖర్చవుతుంది. అదే జీవాయుధాలకు ఒక్క డాలరు మాత్రమే వ్యయమవుతుంది. అందువల్ల జీవాయుధాలను ‘పేదవాడి అణుబాంబులు’ అంటారు. ఆంత్రాక్స్, రెసిన్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందని జీవాయుధాలు. మశూచిని కలిగించే వేరియోలా వైరస్, ప్లేగును కలిగించే యెర్సీనియా పెస్టిస్‌ బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందే జీవాయుధాలకు ఉదాహరణ.

 

ఆంత్రాక్స్‌: ఈ వ్యాధి బాసిల్లస్‌ ఆంథ్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. శ్వాస పీల్చినప్పుడు అది మనిషి శరీరంలోకి ప్రవేశించి వాంతులు, చర్మంపై పుండ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది ప్రాణాపాయం కలిగించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి.

 

రైసిన్‌ టాక్సిన్‌: ఇది కొంత తక్కువ హానికర రసాయనం. దీన్ని క్యాస్టర్‌ బీన్స్‌ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. ఇది మతిభ్రమించి స్పృహ కోల్పోయే విధంగా చేస్తుంది.

 

మశూచి: ఇది ఆర్ధ్రోపాక్స్‌ వైరస్‌ జాతికి చెందింది. భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా సహజసిద్ధ మశూచి (స్మాల్‌ పాక్స్‌) వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. అయితే దీన్ని జీవాయుధంగా ప్రయోగించే వీలుంది. తుంపర్ల రూపంలో ప్రయోగించే వీలున్న మశూచి ఆయుధాన్ని 1980లో సోవియట్‌ యూనియన్‌ అభివృద్ధి చేసినట్లు చెబుతారు. దీనివల్ల శరీరంపై దద్లుర్లు, జ్వరం, తలనొప్పితో పాటు కంటిచూపు కూడా పోతుంది.

 

ప్లేగు: ఈ వ్యాధి యెర్సీనియా పెస్టిస్‌ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఈ సూక్ష్మజీవులను నీటి తుంపర్ల ద్వారా ప్రయోగించవచ్చు. దీనివల్ల తీవ్రజ్వరం, చలి, తలనొప్పి, వాంతులు, తల తిరగడం సంభవించి ప్రాణం పోతుంది. ఇందులో నిమోనిక్‌ ప్లేగు ప్రమాదకరమైంది.

 

కబళిస్తున్న రోడ్డు ప్రమాదాలు: మానవ కారక విపత్తుల్లో రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు లాంటి రవాణా ప్రమాదాలతో పాటు, అగ్ని, గని ప్రమాదాలు, ఆహార పదార్థాల పంపకంలో తొక్కిసలాటలు, దేవాలయాల్లో తొక్కిసలాటలు వంటి అనేక మానవ కారక విపత్తులు అనునిత్యం మనిషికి ఎదురవుతున్న మరికొన్ని మానవ కారక విపత్తులుగా చెప్పవచ్చు. అయితే మానవ కారక విపత్తుల్లో రోడ్డు ప్రమాదాలు అత్యధిక ప్రాణనష్టం కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రపంచ రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 12 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచ వాహనాల్లో 46% అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఉంటే, రోడ్డు ప్రమాద మృతుల్లో మాత్రం 90% ఈ దేశాల్లోనే ఉంటున్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై మరణించినవారు(డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక):

1) రోడ్డు ప్రమాదాలు - 22.8%

2) ఆత్మహత్యలు - 16.9% 

3) హింస - 10.8% 

4) నిర్మాణాలు కూలిపోయి - 7.5% 

5) విషప్రయోగాలు - 6.7% 

6) అగ్నిప్రమాదాలు - 6.2% 

 

నమూనా ప్రశ్నలు

 

1. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పర్యావరణానికి భారీగా నష్టం కలిగించే ఆయుధాలను ఏమంటారు? 

1) రసాయన ఆయుధాలు 2) సామూహిక విధ్వంసక ఆయుధాలు

3) పారిశ్రామిక విపత్తులు 4) భౌగోళిక విపత్తులు

 

2. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 

1) 1984, డిసెంబరు 2

2) 1986, డిసెంబరు 2

3) 1979, మార్చి 28

4) 1976, జులై 10

 

3. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా అణుబాంబులు ఎప్పుడు వేసింది? 

1) 1945, అక్టోబరు 2) 1945, జనవరి 3) 1945, ఆగస్టు 4) 1945, జులై

 

4. శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి, రోగాన్ని కలిగించే ఆంత్రాక్స్‌ ఏ రకమైంది? 

1) వైరస్‌ 2) బ్యాక్టీరియా 3) ఫంగస్‌ 4) ప్రోటోజోవా

 

5. గాలి/తాకడం వల్ల ఇతరులకు వ్యాపించే మశూచి వ్యాధికి కారణం?

1) వేరియోలా వైరస్‌ 2) యెర్సీనియా పెస్టిస్‌ 3) బోట్సులియం బ్యాక్టీరియా 4) ఏదీకాదు

 

6. కింది ఏ ఆయుధాలను డర్టీబాంబులు అంటారు? 

1) రేడియోధార్మిక బాంబులు 2) జైవిక్‌ ఆయుధాలు

3) రసాయన ఆయుధాలు 4) అణ్వాయుధాలు

 

7. మానవ కారక విపత్తుల్లో అధిక ప్రాణనష్టానికి గురిచేసే విపత్తు ఏది? 

1) అగ్ని ప్రమాదాలు 2) ఇల్లు కూలిపోవడం 3) రైలు ప్రమాదాలు 4) రోడ్డు ప్రమాదాలు 

 

8. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో లీకైన విషవాయువు ఏది? 

1) మిథైల్‌ ఐసోసైనేట్‌ 2) మిథైల్‌ ఐసోసైనైట్‌ 3) డియోక్సిన్‌ 4) స్టైరిన్‌ వాయువు

 

9. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల వల్ల సంవత్సరానికి సరాసరిగా ఎంతమంది చనిపోతున్నారు?

1) 12 లక్షలు 2) 5 లక్షలు 3) 20 లక్షలు 4) 50 లక్షలు

 

10. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ దురంతంగా పిలిచే అణువిపత్తు ఎప్పుడు జరిగింది? 

1) 1984 2) 1986 3) 1996 4) 1982

 

సమాధానాలు: 1-2, 2-1, 3-3, 4-2, 5-1, 6-1, 7-4, 8-1, 9-1, 10-2

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 28-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌