• facebook
  • whatsapp
  • telegram

మానవసహిత అంతరిక్ష యాత్రలు 

ఘన విజ్ఞాన ప్రయాణం

అంతరిక్ష సాంకేతిక రంగంలో ఇప్పటికే అగ్రరాజ్యాల సరసన నిలిచిన భారత్, తన సత్తాను మరోమారు చాటేందుకు సిద్ధమవుతోంది. గగన్‌యాన్‌ పేరిట మానవసహిత అంతరిక్ష యాత్రకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నో సంక్షిష్టతలు, మరెన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీర్తి మరింతగా వెలిగిపోవడం ఖాయం.ఆ వివరాలను అభ్యర్థులు పరీక్షల కోసం తెలుసుకోవాలి. 

 

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధితో అంతరిక్షంలోకి మనిషి వెళుతున్నాడు. భారతదేశం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా ఎదిగి ప్రపంచ దేశాలకు తన సత్తా చాటడానికి సిద్ధమైంది. అందులో భాగంగా గగన్‌యాన్‌ను చేపట్టనుంది.

 

గగన్‌యాన్‌

  శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధితో అంతరిక్షంలోకి మనిషి వెళుతున్నాడు. భారతదేశం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా ఎదిగి ప్రపంచ దేశాలకు తన సత్తా చాటడానికి గగన్‌యాన్‌ను నిర్వహించబోతోంది. మన దేశం చేపట్టే మానవసహిత అంతరిక్ష యాత్రను గగన్‌యాన్‌గా పిలుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవం రోజు గగన్‌యాన్‌ను ప్రకటించారు. 2022 చివరి నాటికి ఈ ప్రయోగం జరపాలని సూచించినప్పటికీ కరోనా కారణంగా 2023 చివరికి సాధ్యం చేయాలని నిర్ణయించారు. గగన్‌యాన్‌ను విజయవంతం చేయడానికి ఇస్రో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. స్పేస్‌సూట్‌ తయారీ, వ్యోమగాముల శిక్షణకు రష్యా సహకారం తీసుకోనుంది. ఈ యాత్రలో భాగంగా ముగ్గురు భారత వ్యోమగాములు భూమి దిగువ భూకక్ష్యలో (లో ఎర్త్‌ ఆర్బిట్‌) 300 - 400 కి.మీ. ఎత్తున 5 - 7 రోజులు ఉండి తిరిగి భూమిపైకి చేరుకుంటారు. కక్ష్యలో తిరుగుతున్న సమయంలో వ్యోమగాములు అనేక ప్రయోగాలు చేస్తారు.

  భారత వ్యోమగాములను వ్యోమనాట్‌లు లేదా గగనాట్‌లు అని పిలుస్తారు. ముగ్గురు వ్యోమగాముల్లో ఒక మహిళ ఉంటుంది. ఈ ప్రయోగానికి రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడానికి జీఎస్‌ఎల్వీ-ఎమ్‌కే-3ని మార్పు చేసి హెచ్‌ఆర్‌ఎల్వీ (హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికల్‌)ని రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగంలో పాల్గొనే వ్యోమగాములను ఇస్రో, భారత వాయుసేనలు కలిసి వివిధ పరీక్షలు నిర్వహించి ఎంపికచేశాయి. ప్రస్తుతం వీరికి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు.

 

గగన్‌యాన్‌లో భాగస్వాములైన సంస్థలు: 

* డీఆర్‌డీవో

 * కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ సంస్థలు (CSIR-Labs) 

* భారత వాతావరణ పరిశోధన సంస్థ 

 * నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ 

* నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియానోగ్రఫీ

 * భారత నౌకాదళం * ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌

 * షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

 

ప్రయోగానికి అవసరమైన సాంకేతికత:   

* వ్యోమగాములను తీసుకెళ్లే వాహక నౌక

 * ప్రమాదం జరిగినప్పుడు వ్యోమగాములు బయటపడే వ్యవస్థ  

 * వ్యోమగాములు ఉండే గది 

* స్పేస్‌సూట్‌లు

 * లైఫ్‌ సపోర్ట్‌ సిస్టం 

* వ్యోమగాముల ఎంపిక, శిక్షణ 

* వ్యోమగాములను క్షేమంగా భూమిపై తీసుకువచ్చే సాంకేతికత. దీని కోసం ఇస్రో క్రూమాడ్యూల్‌ అట్మాస్ఫియరిక్‌ రీ ఎంట్రీ ఎక్స్‌పరిమెంట్‌ - CARE ను నిర్వహించింది.

 

ప్రయోగ వివరాలు: ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహిస్తోంది. దీనిలో మొత్తం మూడు ప్రయోగాలు ఉంటాయి. మొదటి రెండు మానవరహిత యాత్రలు కాగా మిగిలింది మానవసహిత యాత్ర. మానవసహిత యాత్ర చేసే దాన్ని గగన్‌యాన్‌ సిస్టం మాడ్యూల్‌ లేదా ఆర్బిటర్‌ మాడ్యూల్‌ అంటారు. ఇది భూమి చుట్టూ తిరుగుతుంది. దీనిలో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగంలో వ్యోమగాములు ఉంటారు. దీన్ని క్రూమాడ్యూల్‌ అంటారు. రెండో భాగంలో ద్రవ ప్రొపల్లెంట్‌ను వాడే ఇంజిన్లు ఉంటాయి. దీన్ని సర్వీస్‌ మాడ్యూల్‌ అంటారు.

 

లాభాలు: ఈ ప్రయోగంతో దేశానికి, శాస్త్రవేత్తలకు, పరిశోధనలు, పరిశ్రమలకు అనేక లాభాలు చేకూరుతాయి. 

* సౌరకుటుంబం, దాని ఆవల జరిపే యాత్రలకు మానవులు, రోబోలను ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది.

* మన దేశ ఆధునిక సాంకేతికతను నిరూపించుకోవచ్చు.

* భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఇతర దేశాలతో కలిసి పనిచేయవచ్చు.

* దేశ అభివృద్ధిలో పాలుపంచుకునేలా విద్యాసంస్థలు, పరిశ్రమలను భాగస్వామ్యం చేయవచ్చు.

* అంతరిక్ష రంగంలో పరిశోధన అభివృద్ధి, మానవ వనరులను పెంపొందించుకోవడం; ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది.

* శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధన చేయాలనుకునే యువతకు ఇది ప్రోత్సాహకంగా ఉంటుంది. సరికొత్త సాంకేతికత అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

* శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి, సాంకేతికతను శాంతి కోసం ఉపయోగించుకోవడానికి దోహదపడుతుంది.

 

వ్యోమమిత్ర

 ఇది లేడి రోబో, హాఫ్‌ హ్యుమనాయిడ్‌ రోబో. మొదటి రెండు మానవరహిత యాత్రల్లో ఈ రోబో ఉంటుంది. ప్రయోగ సమయంలో వివిధ పరికరాలను నియంత్రిస్తుంది. వాతావరణ నియంత్రణతో పాటు లైఫ్‌ సపోర్ట్‌ సిస్టంను నిర్వహిస్తుంది.

 

ఇస్రో భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలుచంద్రయాన్‌ - 3: ఇది చంద్రయాన్‌ - 2 తరహాలో ఉంటుంది. చంద్రయాన్‌ - 2లో ల్యాండర్‌ను చంద్రుడిపై సురక్షితంగా దించడం సాధ్యం కాలేదు. దీన్ని చంద్రయాన్‌ - 3లో విజయవంతం చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని 2022 చివరి నాటికి జరపాలనుకున్నప్పటికీ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.

 

ఆదిత్య-ఎల్‌-మిషన్‌: ఇది సూర్యుడి కరోనాను, అక్కడి వాతావరణాన్ని పరిశోధించడానికి పంపే ఉపగ్రహం. దీన్ని 2022 - 23 మధ్య ప్రయోగిస్తారు.

 

అంతరిక్ష కేంద్రం: అంతరిక్షంలో వ్యోమగాములు కనీసం 15 - 20 రోజులు ఉండి వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇది లోఎర్త్‌ ఆర్బిట్‌లో తిరుగుతూ ఉంటుంది. ఇస్రో 2030 నాటికి దీన్ని సిద్ధం చేయాలని భావిస్తోంది.

 

శుక్రయాన్‌: శుక్ర గ్రహ కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని (ఆర్బిటర్‌) పంపే ప్రయోగమే శుక్రయాన్‌. దీన్ని 2023 - 25 మధ్య ప్రయోగించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

 

మంగళ్‌యాన్‌ - 2: దీన్ని మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ - 2గా పిలుస్తారు. 2022 - 23 మధ్య ఒక ఉపగ్రహాన్ని (ఆర్బిటర్‌) అంగారక గ్రహ కక్ష్యలోకి పంపనున్నారు. 

 

నిసార్‌ (NISAR): దీని పూర్తి పేరు నాసా - ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌. ఇది ఇస్రో, నాసాల సంయుక్త ఉపగ్రహం. దీని సహాయంతో భూమిపైన సంభవించే ఆవరణ వ్యవస్థలోని మార్పులు, మంచు పలకలు నశించడం, సహజ విపత్తులైన భూకంపం, సునామీ, కొండచరియలు విరిగిపడటం లాంటివి గమనిస్తారు.

 

క్రయోజెనిక్‌ ఇంజిన్‌ టెక్నాలజీ

  క్రయోజెనిక్స్‌ను ఉపయోగించుకునే వాహక నౌకల చివరిదశలో ఉండే ఇంజిన్‌ను క్రయోజెనిక్‌ ఇంజిన్‌ లేదా క్రయోజెనిక్‌ దశ అంటారు. అతి శీతల ఉష్ణోగ్రతలో పదార్థాల స్వభావం, ఉత్పత్తిని క్రయోజెనిక్స్‌ అంటారు. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఇస్రో జీఎస్‌ఎల్వీ-3వ దశలో ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్‌ ద్రవ హైడ్రోజన్‌ను ఇంధనంగా, ద్రవ ఆక్సిజన్‌ను ఆక్సిడైజర్‌గా వాడుకుంటుంది. ద్రవ హైడ్రోజన్‌ ఉష్ణోగ్రత -253*, ద్రవ ఆక్సిజన్‌ ఉష్ణోగ్రత -183* ఉంటుంది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ సాంకేతికత అత్యంత సంక్లిష్టం. ఇందులో ఇంధనం నిల్వ, సరఫరా లాంటివి కష్టతరం. ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడానికి భారత్‌ 1988లో ప్రయత్నాలు ప్రారంభించింది. 1991లో రష్యా నుంచి క్రయోజెనిక్‌ ఇంజిన్, సాంకేతికతను తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. కానీ దీనికి అమెరికా అడ్డుపడటంతో రష్యా 1994లో 7 క్రయోజెనిక్‌ ఇంజిన్లను మాత్రమే సరఫరా చేసింది. వీటిని ఇస్రో తన జీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో వినియోగించింది.

 

స్వదేశీ క్రయోజెనిక్‌ టెక్నాలజీ

* 1998లో ఒక నిమిషం క్రయోజెనిక్‌ పరీక్ష నిర్వహణ

* 2002లో 3000 సెకన్ల క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరీక్ష

* 2007లో క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌ పరీక్ష

* 2010 ఏప్రిల్‌ 15న ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ-డి3లో స్వదేశీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఉంచారు. ఇది విఫలమైంది.

* స్వదేశీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఉంచి విజయవంతంగా ప్రయోగించిన వాహకనౌక జీఎస్‌ఎల్వీ-డి5. దీన్ని 2014, జనవరి 5న ప్రయోగించారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారతదేశ గగన్‌యాన్‌కు సంబంధించిన కింది వాక్యాల్లో సరైంది? 

1) ఇది ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్ర.

2) దీనిలో భాగంగా వ్యోమగాములు భూమి చుట్టూ తిరుగుతారు.

3) దీనికి సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

4) పైవన్నీ

 

2. ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్రకు ఉపయోగిస్తున్న వాహక నౌక?

1) జీఎస్‌ఎల్వీ-ఎంకే-3   2) పీఎస్‌ఎల్వీ-సి48   3) జీఎస్‌ఎల్వీ-డి1  4) పీఎస్‌ఎల్వీ-3

 

3. భారతదేశంలో అంతరిక్ష యాత్రలో భాగంగా పంపనున్న రోబో ఏది?

1) గగన్‌మిత్ర 2) వ్యోమమిత్ర 3) అంతరిక్షమిత్ర 4) ఆకాశమిత్ర

 

4. సూర్యుడి కరోనా, వాతావరణాన్ని పరిశోధించడానికి ఇస్రో ప్రయోగించనున్న ఉపగ్రహం?

1) భాస్కర-2  2) ఆదిత్య-1  3) ఆదిత్య-ఎల్‌-మిషన్‌  4) సోలార్‌ ప్రోబ్‌

 

5. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఏ వాహక నౌకలో ఉంటుంది? 

1) ఎస్‌ఎల్వీ   2) ఏఎస్‌ఎల్వీ  3) పీఎస్‌ఎల్వీ  4) జీఎస్‌ఎల్వీ 

 

సమాధానాలు

1 - 4, 2 - 1, 3 - 2, 4 - 3, 5 - 4.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

Posted Date : 12-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌