• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో వాయు కాలుష్య నివారణ చర్యలు

ప్రమాదకర ఉద్గారాలపై నియంత్రణ!

ఆధునిక ప్రగతి సృష్టించిన అనర్థాల్లో వాయుకాలుష్యం ప్రధానమైంది. భారతదేశంలో అది రోజురోజుకూ పెరిగిపోతోంది. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలు విపరీతంగా ఎక్కువయ్యాయి. వాటినుంచి వెలువడే ఉద్గారాలతో పట్టణాలు, నగరాల్లో పీల్చే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో క్షీణించిపోయింది. ‘నిశ్శబ్ద హంతకి’గా వ్యవహరించే గాలి కాలుష్యం వల్ల రోజూ వేల మంది చనిపోతున్నారు. లక్షల మంది అనారోగ్యం పాలవుతున్నారు. వాయు కాలుష్య నియంత్రణకు, నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం శిలాజ ఇంధనాల నాణ్యతపై దృష్టిపెట్టి, వాహనాలకు ప్రమాణాలను నిర్ణయించి అమలుచేస్తోంది. వాహనభద్రత, ఇంధన సామర్థాన్ని పెంచి ఉద్గారాలను గణనీయంగా తగ్గించే ఈ నిబంధనల గురించి అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం రూపొందించిన విధానాలపై అవగాహన ఉండాలి.


భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్టాండర్డ్స్‌: వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి వాటి పొగగొట్టాల నుంచి వచ్చే వాయు కాలుష్య కారకాలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు రూపొందించింది. వీటినే ‘భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్టాండర్డ్స్‌’ అంటారు. ఈ ప్రమాణాలను యూరోపియన్‌ ఎమిషన్‌ స్టాండర్ట్స్‌ ఆధారంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ రూపొందించగా, కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ (సీపీసీబీ) అమలుపరుస్తోంది. ‘భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్లాండర్డ్స్‌’లో భాగంగా ప్రభుత్వం, వాహనాల్లో వాడే ఇంధనాలకు ప్రమాణాలను నిర్ణయించింది. దీనివల్ల వాహనాల నుంచి తక్కువ మొత్తంలో వాయుకాలుష్య కారకాలు విడుదలవుతాయి. వాహనాల్లో వాడే ఈ స్వచ్ఛ ఇంధనాలకు అనుగుణంగా వాహనాల తయారీ సంస్థలు తమ వాహనాల ఇంజిన్లలో మార్పు చేసుకోవాలి.


ఈ ప్రమాణాలను మొదటగా 2000 సంవత్సరంలో ‘ఇండియా-2000’ పేరుతో ప్రవేశపెట్టారు. భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్టాండర్స్‌ (BS)ను తిరిగి BS-I,BS-II,BS-III, BS-IV,BS-V,BS-VI లాంటి రకాలుగా విభజించారు.  BS-I నుంచి BS-IV వరకు వెళ్తున్న కొద్దీ వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాలు తగ్గుతాయి. 


నియంత్రించదగిన కాలుష్య కారకాలు:  బి.ఎస్‌. ప్రమాణాల్లో భాగంగా వాహనాల నుంచి వెలువడే కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, ఘనరూప సూక్ష్మ రేణువులను నియంత్రిస్తారు.


BS నిబంధనలను ప్రవేశపెట్టిన విధానం: 


* 2000 ఏడాదిలో BS-I నిబంధనలను భారతదేశమంతా ప్రవేశపెట్టారు.


2001లో BS-IIను మొదట నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (NCR)  ముంబయి, కోల్‌కతా, చెన్నై లాంటి నగరాల్లో ప్రవేశపెట్టారు.


2003లో BS-IIను నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, 13 మహా నగరాల్లో ప్రవేశపెట్టారు.


2005లో BS-II ను దేశమంతటా ప్రవేశపెట్టారు.


BS-III ప్రమాణాలను 2005లో నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, 13 మహానగరాల్లో ప్రవేశపెట్టారు.


2010లోBS-III ప్రమాణాలను దేశమంతటా ప్రవేశపెట్టారు.


BS-IV ప్రమాణాలను 2010లో నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, 13 మహానగరాల్లో ప్రవేశపెట్టారు.


2017లోBS-IV ప్రమాణాలను దేశమంతటా ప్రవేశపెట్టారు.


BS-V ప్రమాణాలను తప్పించి BS-IVనుంచి నేరుగా BS-VI ప్రమాణాలను 2018లో మొదట దిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో ప్రవేశపెట్టారు.


2019లో BS-IV ప్రమాణాలను 13 నగరాల్లో  ప్రవేశపెట్టారు.


2020, ఏప్రిల్‌ నుంచి BS-VI ప్రమాణాలను దేశమంతా ప్రవేశపెట్టారు. దీనిప్రకారం దేశమంతా ఇంధనాలు, వాహనాలు BS-VI  ప్రమాణాలతో ఉంటాయి.


ఆటో ఫ్యూయల్‌ పాలసీ-2003: 


వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు, వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం ఆటో ఫ్యూయల్‌ పాలసీ - 2003ని ప్రకటించింది. దీనికి భారత ప్రభుత్వం పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖవారు 2001లో కమిటీని నియమించారు. ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఎ.మషేల్కర్‌ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2002  ఆగస్టులో కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ప్రభుత్వం 2003, అక్టోబరులో ఆటో ఫ్యూయల్‌ పాలసీని ప్రకటించింది. దీనిప్రకారం కమిటీ పలు చర్యలు సూచించింది. అవి వాహనాల ఉద్గారాలను తగ్గించాలి. 

సీఎన్‌జీ, ఎల్‌పీజీ కిట్‌ల నాణ్యతను, వీటిలో వాడే ఇంధన నాణ్యతను పెంచాలి. 

భారత్‌ స్టేజ్‌ ప్రమాణాలను అమలుచేయాలి. 

ప్రత్యామ్నాయ ఇంధనాలైన మిథనాల్, ఇథనాల్, హైడ్రోజన్, కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ), లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) లాంటి వాటిని వాహనాల్లో వాడాలి.   * హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ వాహనాలను పెంచాలి. 

* పాత వాహనాల రెన్యూవల్‌కు, తిరిగి వాడటానికి ఎక్కువ పన్నులు విధించాలి. 

సీఎన్‌జీ వాహనాలకు తక్కువ పన్నులు విధించాలి. వీటితో కాలుష్యం తగ్గుతుంది. 

 పాత పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) పద్ధతి కాకుండా కొత్తగా కంప్యూటరైజ్డ్‌ పద్ధతి వాడాలి.                    


వాహనాలకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ సంబంధిత పత్రాలను అంటించాలి. ఇది వాహనాలు ఇంధనం వినియోగించుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది.


ఆటో ఫ్యూయల్‌ విజన్‌ పాలసీ-2025:  2012లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ ఆటో ఫ్యూయల్‌ పాలసీ-2025 కోసం సుమిత్ర చౌదరి కమిటీని నియమించింది. ఈ కమిటీ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన ఇంధనాల  ఉత్పత్తికి తగిన సూచనలు చేసింది. వీరి సూచనల ప్రకారం 75 పైసల అదనపు పన్ను విధించి దీన్ని స్వచ్ఛ ఇంధనాల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. BS-IV , BS-V , BS-VI ప్రమాణాలను అమలుపరచాలని సూచించింది.


పాత వాహనాలను తుక్కుగా మార్చే విధానం  (వెహికల్‌ స్క్రాప్‌ పాలసీ): 


కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2001లో పాత వాహనాలను తుక్కుగా మార్చే పాలసీని రూపొందించింది. దీన్నే వాలంటరీ వెహికల్‌ ఫ్లీట్‌ మోడర్‌నైజేషన్‌ ప్రోగ్రాం (వీవీఎంపీ) లేదా వాహనాల తుక్కు పాలసీ అంటారు.


ముఖ్యాంశాలు:  


* వాణిజ్యపరంగా ఉపయోగించే వాహనాల జీవిత కాలం 15 ఏళ్లు దాటితే దానికి సామర్థ్య పరీక్ష చేయాలి. దీనిలో విఫలమైన వాహనం తుక్కుగా మారుస్తారు. * వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తర్వాత, ప్రభుత్వ వాహనాలకు 15 సంవత్సరాల తర్వాత సామర్థ్య పరీక్ష నిర్వహించాలి. ఇందులో విఫలమైతే వాటిని తుక్కుగా మార్చడానికి అనుమతించవచ్చు. * నిర్ణీత గడువు తర్వాత వాహనాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌కు ఎక్కువ పన్ను వసూలు చేస్తారు. * తుక్కుగా మార్చిన వాహనానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. కొత్త వాహనం కొన్నప్పుడు ఈ పత్రాన్ని సమర్పిస్తే ప్రభుత్వం రహదారి పన్నును కొంతవరకు తగ్గిస్తుంది. * వాహనాల తయారీ సంస్థలకు తుక్కుగా మార్చిన వాహనం పత్రాన్ని సమర్పిస్తే కొత్త వాహనం కొనేటప్పుడు 5% ధర తగ్గించి ఇవ్వాలి. * రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వాహనం కొన్నప్పుడు దాని రిజిస్ట్రేషన్‌ రుసుంలో రాయితీ ఇవ్వాలి.* 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలకు అనుమతి పునరుద్ధరణ చేయరాదని 2023, ఆగస్టులో కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది.


ఈ కార్యక్రమం ఉపయోగాలు/లాభాలు: 


* భారతదేశంలో అమలవుతున్న ఈ పాలసీ వల్ల పాత వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తగ్గుతుంది.* కొత్త వాహనాల తయారీ పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి. ఫలితంగా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. * తక్కువ ధరకే ఇనుము, స్టీల్, ప్లాస్టిక్‌ లాంటివి లభ్యమవుతాయి. * కొత్త వాహనాలు రహదారుల మీద తిరగడం వల్ల వాహనాల భద్రత, ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. * ఈ కార్యక్రమం వల్ల దేశంలో  రూ.వేల కోట్ల పెట్టుబడులు పెరుగుతాయి.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌


 

Posted Date : 25-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌