• facebook
  • whatsapp
  • telegram

మందులు - ఔషధాలు

ఆరోగ్య రక్షణకు.. ఆహార నిల్వకు!

  
తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, కళ్లు తిరగడం, కడుపులో బాగోకపోవడం ఇవన్నీ తరచూ అందరికీ ఎదురయ్యే సమస్యలే. వీటి నివారణకు వివిధ మందులు, ఔషధాలను వినియోగిస్తుంటారు. ఆహారాన్ని నిల్వ చేయడానికి, ఆరోగ్య రక్షణకు ఇంకా అనేక అవసరాలకు రకరకాల రసాయనాలను వాడుతుంటారు. నిత్యజీవిత రసాయనశాస్త్రం అధ్యయనంలో భాగంగా ఏయే రసాయనాలను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో అభ్యర్థులు తెలుసుకోవాలి. 


జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యానికి, ఆహారం నిల్వకు, వ్యాధుల చికిత్సలో, కృత్రిమ తీపి కారకాల తయారీలో కొన్ని రకాల రసాయనాలను వినియోగిస్తారు. అవసరాల మేరకు వాటి నిర్మాణాల్లో మార్పులు చేస్తారు. 

కీమోథెరపి: వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో భాగంగా రసాయనాలను ఉపయోగించే విధానాన్నే కీమోథెరపీ అంటారు.


మందులు: 100U నుంచి 500U వరకు తక్కువ అణుభారాలు ఉన్న రసాయనాలను మందులు (డ్రగ్స్‌) అంటారు.పెద్ద పెద్ద అణుభారాలున్న లక్ష్యాలపై చర్య జరిపి జీవన ప్రక్రియలో మార్పు తెచ్చేందుకు వీటిని ఉపయోగిస్తారు.


ఉదా: మార్ఫిన్, కోడైన్‌


మందులు అంటే వ్యాధులను నయం చేసే రసాయనాలు. కానీ కొన్ని వ్యసనంగా మారే ధర్మాన్ని కలిగి ఉంటాయి.శరీరంపై విపరీతమైన దుష్ఫలితాలను చూపిస్తాయి.


ఔషధాలు: వైద్యపరంగా వ్యాధి నిర్ధారణకు, నిరోధించడానికి, నయం చేయడానికి వాడే మందులను ఔషధాలు (మెడిసిన్‌) అంటారు.


ఉదా: యాంటీపైరెటిక్‌లు, యాంటాసిడ్‌లు, యాంటిబయాటిక్‌లు. ఇవి వ్యసనంగా మారే లక్షణాన్ని కలిగి ఉండవు. అతి తక్కువ దుష్ఫలితాలు లేదా దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి. మందులన్నీ ఔషధాలవుతాయి కానీ ఔషధాలన్నీ మందులు కావు. 

అనాల్జిసిక్‌లు: శారీరక నొప్పులను తగ్గించడానికి ఉపయోగించే రసాయనాలకే అనాల్జిసిక్‌లని పేరు. ఇవి రెండు రకాలు.


నార్కోటిక్‌ అనాల్జిసిక్‌లు: ఇవి కేంద్రీయ నాడీవ్యవస్థను నిరుత్తేజపరిచే మందులు. ఇవి సుఖంగా ఉన్నామనే భ్రమ (అశంస-యూఫోరియా)ను కలుగజేస్తాయి. అందుకే వాటిని వశపరచుకునే (ఎడిక్డివ్‌) మందులుగా వ్యవహరిస్తున్నారు. నార్కోటిక్‌ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. దీనికి ‘మగత కలిగించేది’ అని అర్థం.


ఉదా: ఆల్కలాయిడ్‌లు - మార్ఫిన్, కోడైన్, పపావరైన్, థేబైన్, మార్ఫిన్‌ సంబంధిత మందులను ఓపియాడ్‌ లేదా ఓపియేట్‌లుగా పేర్కొంటున్నారు. కారణం వీటిని ఓపియం మొక్క నుంచి పొందడమే. వీటిని అధిక డోసుల్లో తీసుకుంటే మూర్ఛ వస్తుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. 


* అతిసార వ్యాధి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన దగ్గు లాంటి వాటిని తగ్గించడం, నొప్పి ఉన్నప్పుడు నిద్రరావడానికి నార్కోటిక్‌ అనాల్జిసిక్‌లను ఉపయోగిస్తారు. ఈ మందులను వేసుకుంటే నొప్పి ఉన్నప్పటికీ తెలియదు. మత్తును కలిగించే గుణం మార్ఫిన్‌ కంటే కోడైన్‌కు తక్కువ.


నాన్‌-నార్కోటిక్‌ అనాల్జిసిక్‌లు: తలనొప్పి, చిన్న చిన్న శారీరక నొప్పులు, బాధలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వీటికి వ్యక్తులను వశపరచుకునే శక్తి లేదు. వీటి తయారీలో సాలిసిలేట్స్, అమైనో ఫినోల్స్, ఎనిలిన్స్, క్వినోలిన్‌ ఉత్పన్నాల రసాయనాలను వినియోగిస్తారు. ఎనిలిన్, ఎసిటానిలైడ్‌లు అనేవి కోల్‌తార్‌ అనాల్జిసిక్‌లు అంటారు. కారణం వీటిని కోల్‌తార్‌ నుంచి సంగ్రహించడమే.


ఉదా: ఆస్పిరిన్‌ - ఎసిటైల్‌ సాలిసిలిక్‌ ఆమ్లం (ASA), నాప్రోగ్జిన్, అనాల్జిన్, నోవాల్జిన్, డైక్లోఫినాక్‌

ఆస్పిరిన్‌ను ఖాళీ కడుపుతో (ఏమీ తినకుండా) ఉపయోగించకూడదు. ఒకవేళ వాడితే అది అల్సర్‌కి దారితీస్తుంది. 

యాంటీ పైరెటిక్‌లు: అధిక శరీర ఉష్ణోగ్రత స్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చి ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే మందులను యాంటీ పైౖరెటిక్‌లు అంటారు.  


ఉదా: పారాసిటామాల్, ఆస్పిరిన్, ఐబూప్రొపేన్‌ (ప్రొపనోయిక్‌ ఆమ్లానికి చెందిన ఆల్కైల్‌ లేదా ఎరైల్‌ ఉత్పన్నాలు)


* సాధారణంగా ఆస్పిరిన్, పారాసిటామాల్‌ లాంటి ఔషధాలు అనాల్జిసిక్‌లు, యాంటీ పైరెటిక్‌లుగా పనిచేస్తాయి.

యాంటీసెప్టిక్‌లు: సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించి, నాశనం చేసే రసాయనాలు. సాధారణంగా వీటిని పైపూతగా ఉపయోగిస్తారు. చర్మ ఉపరితలాలు, గాయాలు, పుండ్లను సూక్ష్మజీవరహితం చేసే ప్రక్రియలో అల్పగాఢతలో ఉపయోగిస్తారు. వీటిని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్‌ రూపంలో శరీరం లోపలికి పంపకూడదు.


ఉదా: అన్ని రకాల శానిటైజర్‌లు, (ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్, బెంజాల్కోనియం క్లోరైడ్‌), టింక్చర్‌ అయోడిన్‌ (అయోడిన్‌ + ఆల్కహాల్‌), 0.1 శాతం ఫినోల్, డెటాల్‌ (క్లోరోగ్జైలినోల్‌ + - టెర్‌ఫినోల్‌), బోరిక్‌ ఆమ్లం (బలహీన యాంటీసెప్టిక్‌ కాబట్టి కళ్లకు ఉపయోగిస్తారు), అయోడోఫామ్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ (H2O2) బిథియోనోల్‌ (యాంటీసెప్టిక్‌ సబ్బుల తయారీలో), ప్యూరాసిన్, సోఫ్రామైసిన్‌


క్రిమిసంహారిణులు: కిచెన్‌ ఫ్లోర్, బాత్‌రూం ఫ్లాట్‌ఫామ్స్‌ను సూక్ష్మజీవరహితం చేసే ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలనే క్రిమిసంహారిణులు (డిస్‌ఇన్‌ఫెక్ట్‌ంట్స్) అంటారు. సాధారణంగా వీటిని అధిక గాఢతల్లో ఉపయోగిస్తారు. లైజాల్, డొమెక్స్, హార్పిక్‌ లాంటివి.


ఉదా: 1% ఫినోల్, సోడియం హైపో క్లోరైట్‌ (కరోనా సమయంలో విరివిగా ఉపయోగించారు.), 0.2 నుంచి 0.4 పి.పి.ఎమ్‌ క్లోరిన్‌ ద్రవం, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ ద్రావణం, 4% ఫార్మలిన్‌ ద్రావణం (ఫార్మాల్డిహైడ్‌ 60% + నీరు 40%).

యాంటీ బయాటిక్‌లు: బ్యాక్టీరియాలను నిర్మూలించడానికి, వాటి వృద్ధిని ఆపడానికి రోగనిరోధక వ్యవస్థకు తోడ్పాటునందించే రసాయన ఔషధాలను యాంటీబయాటిక్‌లు అంటారు. 

లాలాజలం, చెమటతోపాటు విడుదలయ్యే లాక్టిక్‌ ఆమ్లం, ఉదరంలోని హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, కన్నీరు, ముక్కు నుంచి స్రవించే ద్రవాల్లో ఉండే లైసోజోమ్‌ లాంటి రసాయనాలు శరీరంలో విడుదలై సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి. ఈ రక్షణ విధానం నిదానంగా జరిగితే పాథోజన్‌లు శరీరంలో కణజాలాల్లోకి ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి. 


* యాంటీబయాటిక్‌లు రెండు రకాలు. 


బ్యాక్టీరియోస్టాటిక్‌: బ్యాక్టీరియాల పెరుగుదలను నిరోధించే మందులు.


ఉదా: యాంఫిసిలిన్, ఆమాగ్జిసిలిన్‌ (పెన్సిలిన్‌ మందు పడని వారికి ఉపయోగిస్తారు), ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫినైకోల్‌ 


బ్యాక్టరీసైడల్‌: బ్యాక్టీరియాలను నాశనం చేసే రసాయనాలు. 


ఉదా: పెన్సిలిన్, ఓప్లాగ్జసీన్, అమైనో గ్లైకోసైడ్స్‌ 


* సల్ఫాడయాజిన్, స్ట్రెప్టోమైసిన్, అజిత్రోమైసిన్‌లను కూడా యాంటీబయాటిక్‌లుగా చెప్పవచ్చు. 


యాంటాసిడ్‌లు: గ్యాస్ట్రిక్‌ సమస్యల చికిత్సలో ఉపయోగించే రసాయనాలను యాంటాసిడ్‌లు అంటారు. జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లత్వాన్ని సాధారణంగా బలహీన క్షారాలను సేవించి తటస్థీకరణ చర్య ద్వారా తగ్గిస్తారు (pH > 7).

ఉదా: సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం, అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ల మిశ్రమం. 


లోహ హైడ్రాక్సైడ్‌లు నీటిలో తక్కువగా కరగడం వల్ల pH విలువ 7 కంటే పెరగదు. అందుకే వాటిని గ్యాస్ట్రిక్‌ సమస్యల చికిత్సలో విరివిగా ఉపయోగిస్తారు.


జీర్ణాశయంలో ఆమ్ల, పెప్సిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించే హిస్టమైన్‌ను సిమెటిడైన్, రెనెటిడైన్‌ నిర్మిత ఔషధాల ద్వారా నియంత్రిస్తారు. తద్వారా జీర్ణాశయంలో అధిక ఆమ్ల ఉత్పత్తి జరగదు. అల్సర్‌ల నుంచి రక్షణ ఏర్పడుతుంది.


గర్భనిరోధక మాత్రలు: పునరుత్పత్తిని నిరోధించే మాత్రలు.

ఉదా: నార్తిస్టెరోన్, ఇథైనల్‌ ఈస్ట్రడయోల్‌

 

ఆహార పదార్థ నిల్వకారిణులు: ఎక్కువ కాలం ఆహార పదార్థాలు పాడైపోకుండా నిల్వ ఉంచడానికి, వాటి ఆకర్షణను పెంచడానికి కలిపే రసాయన పదార్థాలను ఆహార పదార్థ నిల్వ కారిణులు అంటారు. ఆహార పదార్థాలు పాడైపోవడం అనేది ఒక ఆక్సీకరణ చర్య.

 

ఆహార పదార్థం నిల్వకారిణి
పొటాటో చిప్స్‌ నైట్రోజన్‌ వాయువు
పండ్ల రసాలు పొటాషియం మెటా బైసల్ఫేట్‌
కూరగాయలు సల్ఫర్‌ డై ఆక్సైడ్‌
పచ్చళ్లు, సాస్‌లు, జామ్‌లు సోడియం బెంజోయేట్, వెనిగర్‌ ఎసిటికామ్లం

      

సార్టిక్‌ ఆమ్లం, ప్రొపనోయిక్‌ ఆమ్లాల లవణాలను కూడా ఆహార పదార్థాల నిల్వకారిణులుగా ఉపయోగిస్తారు. 


* సోడియం బెంజోయేట్‌ అనేది ఆహార పదార్థ నిల్వకారిణి. ఇది శరీరంలో హిప్యూరిక్‌ ఆమ్లంగా మారి మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. బ్యుటైలేటెడ్‌ హైడ్రాక్సీ టోలిన్, బ్యుటైలేటెడ్‌ హైడ్రాక్సీ ఎనిసోల్‌లను యాంటీఆక్సిడెంట్‌లుగా ఆహార పదార్థాలకు కలుపుతారు.  

* సల్ఫర్‌ డైఆక్సైడ్, సల్ఫైట్‌లను యాంటీఆక్సిడెంట్‌లుగా బీర్, వైన్‌ల తయారీలో ఉపయోగిస్తారు. అత్యల్ప తియ్యనైన సహజసిద్ధ చక్కెర లాక్టోజ్‌. రక్తంలో గ్లూకోజ్‌ ఉండటాన్ని గ్లైసీమియా అంటారు.

 

హైపో గ్లైసీమియా: రక్తంలో ఉండాల్సిన పరిమాణంలో కంటే తక్కువ పరిమాణంలో గ్లూకోజ్‌ ఉండటం. శరీరంలో అధిక పరిమాణంలో ఇన్సులిన్‌ స్రవించడమే దీనికి కారణం. 


హైపర్‌ గ్లైసీమియా: రక్తంలో ఉండాల్సిన పరిమాణంలో కంటే అధిక పరిమాణంలో గ్లూకోజ్‌ ఉండటం. ఈ స్థితిని మధుమేహ వ్యాధి/చక్కెర వ్యాధి అంటారు. శరీరంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపం ఏర్పడటంతో ఈ స్థితి తలెత్తుతుంది.

 

కృత్రిమ తీపికారిణులు: అదనపు కెలోరిఫిక్‌ విలువలను జోడించకుండా తియ్యదనం కోసం మాత్రమే ఆహార పదార్థాలకు కలిపే రసాయన పదార్థాలను కృత్రిమ తీపికారిణులు అంటారు. వీటిని మధుమేహ రోగులకు వరంగా భావిస్తారు. 


ట్రాంక్విలైజర్‌లు: మానసిక ఆందోళన, ఒత్తిడి, వ్యాకులత లాంటి సమస్యల చికిత్సలో ఉపయోగించే రసాయనాలను ట్రాంక్విలైజర్‌లుఅంటారు. ఇవి కింది మెదడు భాగంలో పనిచేసి ప్రశాంతత, విశ్రాంతిని కలుగజేస్తాయి. వాటిని మోతాదుకు మించి వాడితే నిద్రకు దారితీస్తాయి. వీటిని హిప్నాటిక్‌ మందులని కూడా పిలుస్తారు. అల్ప గాఢతలో ఉపయోగించే ట్రాంక్విలైజర్‌లను సెడెటివ్‌లుగా వ్యవహరిస్తారు. పొటాషియం బ్రోమైడ్‌ అనేది మంచి సెడెటివ్‌ కానీ హిప్నాటిక్‌ కాదు. థయోపెంటోన్‌ బలమైన హిప్నాటిక్‌ కానీ సెడెటివ్‌ కాదు. సాధారణంగా ఇవి తక్కువ మోతాదుల్లో సెడెటివ్‌గా, ఎక్కువ మోతాదుల్లో హిప్నాటిక్‌గా పని చేస్తాయి. 

 

* ఈక్వానిల్, వేలియం, డయజీపమ్, బెంజోడయజోఫిన్‌ ఉత్పన్నాలు, సెరటోనిన్‌లు అనే ఔషధాలను ట్రాంక్విలైజర్‌లుగా ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించడానికి ఉపయోగిస్తారు.

* సెరటోనిన్, డోపమైన్‌లు మెదడులో న్యూరోట్రాన్స్‌ మీటర్‌లుగా పనిచేస్తాయి. డోపమైన్‌ అధిక పరిమాణంలో ఉంటే అనేక మానసిక సమస్యలు ఏర్పడతాయి. దీని ప్రభావం వల్ల పార్కిన్‌సన్‌ జబ్బు కూడా రావచ్చు. ఇది మానసిక ఆలోచనలను అదుపుచేస్తుంది.

* సెకానాల్, లుమినాల్, అమైటాల్, వరానిల్‌ అనేవి బార్‌బ్యుటరిక్‌ ఆమ్లం ఉత్పన్నాలు. ఇవి బ్యుటిరేట్‌లుగా ప్రసిద్ధి.

 

యాంటీహిస్టమైన్‌లు: సాధారణంగా ఎలర్జీ సమస్యల చికిత్సలో ఈ రసాయనాలను ఉపయోగిస్తారు.

ఉదా: బ్రోమ్‌ఫినరమైన్, టెర్‌ఫెనడైన్‌

 

* అజడోథైమిడిన్‌ అనే రసాయనం హెచ్‌ఐవీ వైరస్‌ను నిర్మూలించే సామర్థ్యం ఉన్న ఔషధంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

* క్లోరోక్విన్‌ అనేది యాంటీమలేరియా ఔషధం.

* 2, 4 - D (డైక్లోరోఫినాక్సీ ఎసిటికామ్లం), సోడియం హైపోక్లోరేట్‌ అనే రసాయనాలను కలుపు మొక్కల నాశనిగా (హెర్బిసైడ్‌లు) ఉపయోగిస్తారు.

* ఎండ్రిన్, ఆల్డ్రిన్, గమాక్సీన్‌ (బెంజిన్‌ హెక్సాక్లోరైడ్‌) లండేన్‌ అనే రసాయనాలను కీటక నాశనులుగా ఉపయోగిస్తారు. 

రచయిత: దామ ధర్మరాజు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣   ద్రావణాలు

‣  కార్బన్ - దాని సమ్మేళనాలు

  క్షారాలు, లవణాలు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 07-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌