• facebook
  • whatsapp
  • telegram

మధ్యధరారీతి ప్రకృతిసిద్ధ మండలం

ఆహ్లాదానికి.. అభివృద్ధికి!


అక్కడి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో వర్షంతో, వేసవిలో చల్లదనంతో సమశీతోష్ణ వాతావరణం అంతటా విస్తరించి హాయిని అందిస్తుంది. ఇక్కడి దేశాలన్నీ నందనవనాలను తలపించే నైసర్గిక పరిస్థితులకు, సువాసనలు వెదజల్లే పొదలకు, నోరూరించే పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందాయి. జీవనానికి అనువుగా, అభివృద్ధికి అనుకూల ప్రాంతంగా ఉన్న ఈ మధ్యధరారీతి ప్రకృతిసిద్ధ మండలం విశేషాలు, విశిష్టతల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

 

ఆహ్లాదకరమైన శీతోష్ణస్థితి, అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగం, ఘనమైన చరిత్ర, సంస్కృతి, నాగరికతలకు పుట్టినిల్లులాంటి ప్రాంతాలే మధ్యధరా ప్రాంతాలు. మానవ జీవనానికి ఇవి అత్యంత అనుకూలమైనవి.


ఉనికి: మధ్యధరా ప్రకృతిసిద్ధ మండలాలు ఖండాల పశ్చిమ తీరంలో 30 నుంచి 40 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య కింది ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

* మధ్యధరా సముద్ర ఉత్తరతీర ప్రాంతాలను ఆనుకొని ఉన్న ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రొయేషియా, బోస్నియా హెర్జెగోవినా (యుగోస్లేవియా), ఆల్బేనియా, గ్రీస్, క్రిమియా (ఉక్రెయిన్‌). 

* ఆసియా ఖండంలోని తుర్కియే (టర్కీ), సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌ దేశాలు.

* ఆఫ్రికా ఖండంలోని ట్యునీషియా, అల్జీరియా, మొరాకో దేశాల తీర ప్రాంతాలు, మధ్యధరా సముద్రంలోని కార్సికా, సార్టీనియా, క్రీట్, సిసిలీ, సైప్రస్‌ మొదలైన ద్వీపాలు.

* ఉత్తర అమెరికా ఖండంలోని కాలిఫోర్నియా తూర్పు ప్రాంతం.

* దక్షిణ అమెరికాలోని చిలీ మధ్య ప్రాంతం.

* దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రావిన్స్‌ రాష్ట్ర నైరుతి అగ్రం.

* ఆస్ట్రేలియాలోని దక్షిణ నైరుతి తీర ప్రాంతాల్లో ఈ మధ్యధరారీతి ప్రకృతి సిద్ధమండలం విస్తరించి ఉంది.


శీతోష్ణస్థితి

పొడి వేసవి కాలాలు, తడి శీతాకాలాలు ఈ ప్రాంత ప్రత్యేక లక్షణం. అందువల్ల మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలను ‘శుష్క వేసవి ఉపఅయన రేఖా ప్రాంతాలు’ అని కూడా పిలుస్తారు.

* మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాల్లో పొడి వేసవి, తడి శీతాకాలాలు ఏర్పడడానికి కారణం ‘పవన మేఖల స్థానచలనం’. అంటే వేసవిలో పవన మేఖలలు ధ్రువాల దిశగా స్థానభ్రంశం చెందడంతో ఈ ప్రాంతం అపతీర వ్యాపార పవనాల ప్రభావానికి గురవుతుంది.  ఫలితంగా వాతావరణం పొడిగా ఉండి, వర్షాలు పడవు.

* అదేవిధంగా శీతాకాలంలో పవన మేఖలలు భూమధ్యరేఖ వైపు స్థానచలనం చెందడంతో ఈ ప్రాంతం అభితీర పశ్చిమ పవనాల ప్రభావానికి గురవుతుంది. దాంతో వాతావరణం తడిగా ఉండి వర్షాలు కురుస్తాయి.

 

వృక్షసంపద

ఈ ప్రాంతాల్లో మిశ్రమ అరణ్యాలు ఉంటాయి.

* ఉత్తర అంచుల్లో సిల్వర్‌ ఫర్, పైన్‌ లాంటి వృక్షాలతో కూడిన  శృంగాకార అరణ్యాలు, దక్షిణ అంచుల్లో చిట్టడవులు ఉంటాయి. 

* మధ్యప్రాంతంలో అలిన్, కార్క్, ఓక్, మిర్చిల్, రోస్‌మేరీ, చెస్ట్‌నట్‌ లాంటి విశాల పత్రాలతో కూడిన సతతహరిత అరణ్యాలు ఉంటాయి.

ఈ ప్రాంతాల్లో పెరిగే ఇతర రకాల వృక్షసంపద

* సువాసనలు వెదజల్లే లావెండర్, మర్క్విస్‌ లాంటి పొదల పుష్పజాతులు.

* ఫ్రాన్స్‌లోని గ్రాసే ప్రాంతం సుగంధతైలాల పరిశ్రమకు ప్రసిద్ధి.

* కార్సికా దీవులను ‘అత్తరు దీవులు’ అంటారు.

* ఆస్ట్రేలియాలో యూకలిప్టస్, జర్రా, కర్రా వృక్షాలు పెరుగుతాయి. వీటి కలపను పడవల తయారీలో ఉపయోగిస్తారు.

* యూకలిప్టస్‌ తైలం నొప్పి నివారణకు పనిచేస్తుంది.


వ్యవసాయ రంగం

ఈ ప్రాంతాల్లో సాంద్ర వ్యవసాయ విధానం అమలులో ఉంది. ఈ శీతోష్ణస్థితి ప్రాంతాల్లో ఆలివ్, ద్రాక్ష, నారింజ లాంటి సిట్రస్‌ జాతి పండ్ల తోటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతాలను ‘ప్రపంచ పండ్ల తోటల ప్రాంతాలు’ అంటారు.

* చిలీ దేశంలో పెద్దపెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తారు. వీటిని ‘హోషియాండాలు’ అంటారు. 

* ఈ శీతోష్ణస్థితి ప్రాంతంలో ఆస్ట్రేలియాలో ‘వాణిజ్య పశుచారణం’ అమల్లో ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసే మాంసం, దక్షిణ అమెరికాలో ఉత్పత్తి చేసే మాంసం కంటే నాణ్యమైంది.

ఈ శీతోష్ణస్థితిలో వరి సాగు చేసే ప్రాంతాలు:

* ఇటలీలోని ‘పో’ నదీ లోయ ప్రాంతం

* కాలిఫోర్నియాలోని మధ్యధరా ప్రాంతం

* ఆలివ్‌ ఉత్పత్తిలో మొదటి స్థానం - స్పెయిన్‌

* ద్రాక్ష ఉత్పత్తిలో ప్రథమ స్థానం - ఇటలీ

* శ్రేష్ఠమైన నారింజ ఉత్పత్తిలో ప్రథమ స్థానం - కాలిఫోర్నియా  

* ఉత్తర అమెరికాలోని పండ్ల తోటలను ‘మార్కెట్‌ తోటలు’ అని, ఫ్రాన్స్‌లో వీటిని ‘లై ప్రేమియర్స్‌’ అని పిలుస్తారు.

* ఇజ్రాయెల్‌లో కమలా ఫలాలను ‘జాఫా’ అని, అమెరికాలో వీటిని ‘సంకిష్ట్‌’ అని, చైనాలో ‘మాండరిన్‌ ఆరెంజస్‌’ అంటారు.

* మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లను పండించే పద్ధతిని ‘ట్రక్‌ వ్యవసాయం’ అంటారు.

 

మత్స్య పరిశ్రమ

కాలిఫోర్నియాలోని మాంటెరె ప్రాంతంలో సార్డెన్‌ చేపలు ఎక్కువగా దొరకడం వల్ల మాంటెరెను ప్రపంచ సార్డెన్‌ చేపల రాజధానిగా పిలుస్తారు.

* ఈ మండలంలో లభించే ప్రధాన చేపలు - సార్డెన్, ట్యూనా


వాణిజ్యం

ఈ ప్రాంతాల్లో ప్రధాన వాణిజ్యం ద్రాక్ష సారాయి (వైన్‌). ప్రపంచంలో ద్రాక్ష సారాయి ఉత్పత్తిలో ఫ్రాన్స్‌ ప్రథమ స్థానంలో ఉండగా, అల్జీరియా ఎగుమతుల్లో తొలి స్థానంలో ఉంది. ఈ ద్రాక్ష సారాయిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి

* స్పెయిన్‌ -  షెర్రీ  

* ఫ్రాన్స్‌ - షాంపైన్, బురుండీ

* ఇటలీ - చియాంటీ, మార్స్‌ లా

* పోర్చుగల్‌ - పోర్ట్‌ 

* ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్‌ అని పిలుస్తారు.

* కాలిఫోర్నియా నారింజ పండ్ల ఎగుమతికి ప్రసిద్ధి.


ఖనిజ సంపద

ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యే ముఖ్యమైన ఖనిజాలు

* పెట్రోలియం - కాలిఫోర్నియాలోని సిగ్నల్‌ హిల్‌ ప్రాంతం  

* యశదం, సీసం - ఆస్ట్రేలియాలోని బ్రోకెన్‌ హిల్‌ ప్రాంతం 

* పాదరసం, విగ్రహాల తయారీలో ఉపయోగించే ‘కరార’ పాలరాయి ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఇటలీ.

 

విహారయాత్ర ప్రదేశాలు

ఈ ప్రాంతంలోని ప్రజలు ప్రకృతిని, సముద్ర తీరాలను, సూర్యరశ్మిని అమ్ముకుంటారని ప్రసిద్ధి.

* కాలిఫోర్నియాను ‘ఉత్తర అమెరికా క్రీడా ప్రాంగణం’ అంటారు.

* యూరప్‌ క్రీడా ప్రాంగణంగా పిలిచే ప్రాంతాలు - ఫ్రాన్స్, ఇటలీ, డాల్మేసియా, క్రిమియా (ఉక్రెయిన్‌) తీర ప్రాంతాలు.

* మొనాకో కాసినోలకు ప్రసిద్ధి. కాసినోలు అంటే జూదానికి, వినోదాలకు నిలయమైన ప్రదేశాలు. ఇవి ప్రస్తుతమున్న పాశ్చాత్య క్లబ్‌లను పోలినవి.

 

ముఖ్యమైన అంశాలు

మధ్యధరా శీతోష్ణస్థితి ప్రత్యేక లక్షణం శీతాకాలంలో వర్షం కురవడం. వేసవి కాలంలో పొడిగా ఉండటం, దీనికి కారణం పవన మేఖలలు తమ స్థానాలను మార్చుకోవడమే. 

* మధ్యధరా ప్రాంతాలు శీతాకాలంలో వర్షాన్ని పొందడానికి కారణం సముద్రం మీద నుంచి వీచే పశ్చిమ పవనాల ప్రభావం.

* వాణిజ్యపరంగా అత్యంత ప్రాముఖ్యమున్న జుర్రా, కర్రా అనే చెట్లు పెరిగే దేశం ఆస్ట్రేలియా  

* ద్రాక్ష సారాయి ఉత్పత్తికి పేరుపొందిన దేశాలు ఫ్రాన్స్, అల్జీరియా

* చిలీలో పెద్ద పెద్ద ఎస్టేట్లను హోసియాండాలు అంటారు.

* ప్రపంచంలో అత్యంత పెద్ద జింక్‌ గనులు ఆస్ట్రేలియాలోని బ్రోకెన్‌ హిల్స్‌ ప్రాంతంలో ఉన్నాయి.

* అతిపెద్ద చమురు క్షేత్రం కాలిఫోర్నియాలోని సిగ్నల్‌ హిల్స్‌ ప్రాంతంలో ఉంది.

* అంగోరా జాతి మేకలకు ప్రఖ్యాతి గాంచిన ప్రాంతం తుర్కియే రాజధాని అంకారా. 

ర‌చ‌యిత‌: స‌క్క‌రి జ‌య‌క‌ర్‌

Posted Date : 26-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌