• facebook
  • whatsapp
  • telegram

ఖనిజ వనరులు

తెలంగాణ.. ఖనిజాల ఖజానా!

  ఏ ప్రాంత పారిశ్రామికాభివృద్ధిలోనైనా ఖనిజ సంపద కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక ప్రగతికి అవసరమైన విదేశీ మారకద్రవ్యాన్నీ ఆర్జిస్తుంది. రాష్ట్ర పురోగమనంలో భాగంగా మారిన బొగ్గు, బంగారం, యురేనియంలాంటి సుమారు 30 రకాల ఖనిజాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఖనిజం ఎక్కడ దొరుకుతుంది, వాటిని ఎందుకు ఉపయోగిస్తారనే అంశాలను అభ్యర్థులు పరీక్ష కోణంలో తెలుసుకోవాలి.

 

  భూ అంతర్భాగంలో లభించే కొన్ని రసాయనాల సమ్మేళనంతో కూడిన లోహాలనే ఖనిజాలు అంటారు. ఇలా కొన్ని ఖనిజాల సమూహంతో ఏర్పడే వాటినే శిలలు అంటారు. ఖనిజాల కాఠిన్యత/గట్టిదనాన్ని మోహ లేదా మోర్స్‌ స్కేలు ద్వారా కొలుస్తారు. శిలలను అధ్యయనం చేయడాన్ని పెట్రాలజీ అంటారు. వెలికితీత ఆధారంగా ఖనిజాలను కర్బన, మూల కర్బన అనే రెండు రకాలుగా వర్గీకరిస్తారు. 

 

కర్బన ఖనిజాలు: మేసోజాయిక్‌ యుగంలో జంతు, వృక్షాల అవక్షేపణ జరిగి కొన్ని ఏళ్ల తర్వాత కర్బనం ద్వారా గట్టిపడి కర్బన ఖనిజాలుగా మారతాయి. 

ఉదా: బొగ్గు, చమురు, సహజవాయువు 

 

మూల కర్బన ఖనిజాలు: అంతర్భాగంలో కొన్ని రసాయనాల ద్వారా ఏర్పడే లోహ, అలోహ పదార్థాల సమూహాన్ని మూల కర్బన ఖనిజాలు అంటారు. 

ఉదా: ఇనుము, మాంగనీస్, బంగారం, రాగి 

 

  అంతర్జాతీయ మినరలాజికల్‌ అసోషియేషన్‌ (ఐఎమ్‌ఏ) - 2021 నివేదిక ప్రకారం ప్రపంచంలో 5,780 రకాల ఖనిజాలు ఉన్నాయి. భారత్‌లో 95 రకాల ఖనిజాలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 48, తెలంగాణలో సుమారు 30 వరకు  ఉన్నాయి. తెలంగాణలోని ఖనిజ సంపదలో విలువ పరంగా బొగ్గు మొదటి స్థానంలో ఉంది. రంగుల గ్రానైట్‌ రెండో స్థానం, రోడ్డు మెటల్‌ మూడో స్థానంలో ఉన్నాయి. ఖనిజాల ఉత్పత్తి విలువలో తెలంగాణ దేశంలో అయిదో స్థానంలో, ఖనిజాలు ఉత్పత్తి చేసే గనుల సంఖ్యలో 11వ స్థానంలో ఉంది.

 

పంపిణీ తీరు

 

బొగ్గు: ఇంధన వనరుల్లో అతిముఖ్యమైన శక్తి వనరు బొగ్గు. ఇందులో పీట్, లిగ్నైట్, బిట్యూమినస్, ఆంథ్రసైట్‌ లాంటి రకాలు ఉంటాయి. ఆంథ్రసైట్‌ అనేది నల్లటి రంగులో ఉండి అధిక వేడిని ఇచ్చే ఉన్నతశ్రేణి బొగ్గు. రాష్ట్రంలో ప్రాణహిత, గోదావరి నదీలోయ పరీవాహక ప్రాంతంలోని గోండ్వానా శిలల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఆసిఫాబాద్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం, గోదావరిఖని, భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వరావుపేట ప్రాంతాలు బొగ్గు గనులకు ప్రసిద్ధి. 1774లో వారెన్‌ హేస్టింగ్‌ ఆధ్వర్యంలో బొగ్గు గనుల తవ్వకం ప్రారంభమైంది. తెలంగాణలో ఇల్లందు సమీపంలోని సింగరేణి వద్ద మొదటి గనిని తవ్వారు. 1920 డిసెంబరు 23న సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌)ను కొత్తగూడెం కేంద్రంగా స్థాపించారు. ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌ సంస్థ 29 భూగర్భ గనులు, 19 ఓపెన్‌కాస్ట్‌ గనులను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం 22.48 బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలతో 7.45 శాతం కలిగి దేశంలో 6వ స్థానంలో ఉంది.

 

మాంగనీస్‌: దీన్ని ఫెర్రోమాంగనీస్‌ అంటారు. మాంగనీస్‌ను ఇనుము గట్టిదనం, నల్ల ఎనామిల్, పొటాషియం పర్మాంగనేట్‌లోవినియోగిస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌గంగ నది లోపల సన్నని పొరల్లో తక్కువ మోతాదులో మాంగనీస్‌ నిక్షేపాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనాథ్, తాంసే; నిజామాబాద్‌ జిల్లాలోని రతంపేట, కందలిలో దొరుకుతుంది.

 

ఇనుము: దీన్ని స్టీల్‌ ప్లాంట్లు, ఆయుధాల తయారీ, స్పాంజ్‌ ఐరన్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీలో వినియోగిస్తారు. ఇనుములో మాగ్నటైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్‌ అనే రకాలు ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ముదిగొండ, నేలకొండపల్లి, చెరువుపురం; ఆదిలాబాద్‌ జిల్లా చిట్యాల, కల్లడ, దుస్తురబాద్‌; హన్మకొండ జిల్లా ధర్మసాగర్, వరంగల్‌ జిల్లా గూడూరు ప్రాంతాలు ఇనుము నిక్షేపాలకు ప్రసిద్ధి.

 

బంగారం: దీన్ని నోబుల్‌ ఖనిజం అంటారు. రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు ఒండ్రు మట్టిలో దొరికే ప్లేసర్‌ గోల్డ్‌కు భద్రాద్రి జిల్లా కిన్నెరసాని నది పరీవాహక ప్రాంతం, ఖమ్మం జిల్లా గోదావరి నది పరీవాహక ప్రాంతం, ములుగు జిల్లా మంగంపేట ప్రసిద్ధి. క్వార్ట్జ్‌ శిలలో దొరికే బంగారానికి గద్వాల షిస్ట్‌ బెల్ట్, ఆత్మకూరు ప్రసిద్ధి చెందాయి.

 

రాగి: ఇది మిశ్రమ ధాతువు. దీన్ని ఎక్కువగా ఆభరణాలు, ఎలక్ట్రికల్‌ పరిశ్రమల్లో వినియోగిస్తారు. 1.5 - 1.7% గల చాల్కొపైరేట్‌ పరిమాణం గల నిక్షేపాలు భద్రాద్రి జిల్లా మైలారంలోని ధార్వార్‌లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

 

సున్నపురాయి: సిమెంట్‌ కర్మాగారాల అవసరాలను తీర్చడానికి సున్నపురాయి నిక్షేపాలను ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో లభిస్తుంది. ప్రత్యేకంగా ఇంటి ఫ్లోరింగ్‌ కోసం వినియోగించే గచ్చురాయికి (స్లాబ్‌ స్టోన్‌) వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ ప్రసిద్ధి.

 

క్రోమైట్‌: ఈ ఖనిజం ఎక్కువగా ప్లోట్‌ ధాతువుగా ఏర్పడుతుంది. దీన్ని ఖమ్మం జిల్లాలో పైరోగ్జినైట్, సెర్పెంటినైట్‌ లాంటి రాళ్లలో గుర్తించారు. ఖమ్మం జిల్లా భీమవరం, గౌరారం, ఏన్కూర్, ఇమాంనగర్‌ దీనికి ప్రసిద్ధి.

 

ఆస్బెస్టాస్‌: దీన్ని రాతినార అంటారు. థర్మల్‌ ఇన్సోలేషన్‌ కవరింగ్‌లు; పైపులు, రేకుల తయారీలో వినియోగిస్తారు. క్రాస్‌-ఫై బర్‌ క్రిసోటైల్‌ నుంచి ఆస్బెస్టాస్‌ను తయారుచేస్తారు. ఖమ్మం జిల్లా వేంపల్లి వద్ద పెద్ద మొత్తంలో ఈ ఖనిజం ఉంది.

 

గార్నెట్‌: దీన్ని కైనైట్‌-మైకాషిస్ట్‌ అనే ధాతువు నుంచి తీస్తారు. ఖమ్మం జిల్లా గరీభ్‌పేట, యల్లండ్లపాడు దీనికి ప్రసిద్ధి.

 

బెరైటీస్‌ (ముగ్గురాళ్లు): ఇది కొన్ని ఖనిజాల సమూహం. దీన్ని చమురు డ్రిల్లింగ్‌లో వినియోగిస్తారు. బెరైటీస్‌ నుంచి బెరీలియంను వెలికితీస్తారు. ఇది ఎక్కువగా ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో లభ్యమవుతుంది.

 

ఆమెథిస్ట్‌: ఇది ఎక్కువగా కరీంనగర్, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో దొరుకుతుంది.

 

కోరండం: ఇది ఖమ్మం జిల్లా తడకలపూడి సమీపంలోని గొబ్బుగురిటి వద్ద ఆల్ట్రా బేసిక్‌ రాళ్లలో ఏర్పడుతుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోనూ దొరుకుతుంది.

 

గ్రాఫైట్‌: ఇందులో 95% కర్బన పదార్థం ఉంటుంది. దీన్ని బ్యాటరీలు, పెన్సిళ్లలో వినియోగిస్తారు. ఖమ్మం జిల్లా ఈపలపాడు, సిగురుమామిడి మధ్య గ్రాఫైట్‌ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి.

 

క్వార్ట్జ్‌: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఘంసాబాద్, తిమ్మాపూర్‌ సమీపంలో గ్రానైట్‌లను కత్తిరించడం ద్వారా పెద్దమెత్తంలో క్వార్ట్జ్‌ లభిస్తుంది. ఖమ్మం జిల్లా తాడేపల్లితో పాటు షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో తెల్లటి క్వార్ట్జ్‌ పొరలను గుర్తించారు. మెదక్‌ జిల్లా ఆందోల్, పాలంపేట, నిజామాబాద్‌ జిల్లా చిమరాజుపేటలో కూడా ఈ నిల్వలు ఉన్నాయి.

 

డోలమైట్‌: 15 శాతానికి మించి ఉన్న మెగ్నీషియం గల సున్నపురాయి ఖనిజాన్ని డోలమైట్‌ అంటారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, మాదారంలో నాణ్యమైన డోలమైట్‌ గనులు ఉన్నాయి.

 

స్ఫటికం: నల్గొండ జిల్లా నిడమనూర్, దామరచెర్ల దీనికి ప్రసిద్ధి.

 

రేడియోధార్మిక ఖనిజాలు: నల్గొండ జిల్లా లంబాపూర్, చిట్రియాల్‌; నాగర్‌కర్నూలు, వనపర్తి ప్రాంతాల్లో యురేనియం, థోరియం, లాంథనైట్‌ ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. కిందివాటిలో ఏ ఖనిజాన్ని అంతర్జాతీయంగా పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని కల్గిస్తుందనే ఉద్దేశంతో నిషేధిస్తున్నారు?

1) గ్రానైట్‌     2) ఆస్బెస్టాస్‌     3) కియాటైట్‌      4) గెలీనా

 

2. కిందివాటిలో శ్రీరాంపూర్, బెల్లంపల్లి ప్రాంతాలు ఏ ఖనిజానికి ప్రసిద్ధి?

1) రాగి   2) బొగ్గు    3) ఇనుము    4) మాంగనీస్‌

 

3. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన గచ్చురాయి/సున్నపురాయికి ఏ ప్రాంతం ప్రసిద్ధి?

1) తాండూర్‌   2) నేలకొండపల్లి    3) సత్తుపల్లి    4) ఇల్లందు

 

4. బయ్యారం ప్రాంతం ఏ ఖనిజానికి ప్రసిద్ధి?

1) మాంగనీస్‌    2) ఇనుము    3) క్వార్ట్జ్‌      4) బెరైటీస్‌

 

5. ఖనిజాల గట్టిదనాన్ని ఏ స్కేలు ద్వారా తెలుసుకుంటారు?

1) క్యారట్‌ స్కేలు    2) మోర్స్‌ స్కేలు   3) టంచ్‌ మిషన్‌   4) ఏదీకాదు

 

సమాధానాలు: 1-2; 2-2; 3-1; 4-2; 5-2.

 

రచయిత: కొత్త గోవర్ధన్‌ రెడ్డి

Posted Date : 30-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌