• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఖనిజ సంపద

      సహజ వనరుల్లో అతి ముఖ్యమైనవి ఖనిజ వనరులు. ఇవి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడతాయి. పారిశ్రామిక వృద్ధి దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. కాబట్టి దేశాభివృద్ధిలో ఖనిజ సంపదకు ప్రముఖ స్థానం ఉంది. ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాల సమ్మేళనం వల్ల ఏర్పడిన పదార్థాలను 'ఖనిజాలు' అంటారు. 

   భారతదేశంలో ఖనిజాలను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు.
        1. లోహ ఖనిజాలు (Metallic Minerals)
        2. అలోహ ఖనిజాలు (Non-Metallic Minerals)
        3. ఇంధన ఖనిజాలు (Energy Minerals)


లోహ ఖనిజాలు: ఇనుమును ఆధారంగా చేసుకుని వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
        (i) ఫెర్రస్ లోహ ఖనిజాలు
        (ii) నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు.
* ఫెర్రస్ లోహ ఖనిజాల్లో అతి ముఖ్యమైనవి - ఇనుము, మాంగనీస్, క్రోమైట్, నికెల్ మొదలైనవి.
* నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాల్లో ముఖ్యమైనవి - బాక్సైట్, వెండి, రాగి, బంగారం, జింక్, సీసం మొదలైనవి.
ఇనుము (Iron): ఇనుము ధాతువులో లభ్యమయ్యే ఇనుము శాతాన్ని బట్టి ఇనుము ధాతువులను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
(i) మాగ్నటైట్ (Magnetite): ఇది మేలైనది. ఇందులో ఇనుము 72% ఉంటుంది. అయస్కాంత శక్తి కలిగి ఉండటంతో దీన్ని మాగ్నటైట్ అంటారు.
(ii) హెమటైట్ (Hematite): ఇందులో 70% ఇనుము ఉంటుంది. ఇది భారతదేశంలో ఎక్కువగా లభించే రకం. దీన్ని ఎర్రధాతువు (Oxide of Iron) అని కూడా అంటారు.
(iii) లిమొనైట్ (Limonite): ఇందులో 40% నుంచి 60% వరకు ఇనుము ఉంటుంది.
(iv) సిడరైట్ (Siderite): ఇందులో 40% కంటే తక్కువ ఇనుము ఉంటుంది.


విస్తరణ:
భారతదేశంలో ఇనుప ధాతువులు ప్రధానంగా విస్తరించి ఉన్న ప్రదేశాలు...
1) ఝార్ఖండ్ - ఒడిశా ప్రాంతం
    సింగ్‌భమ్ - ఝార్ఖండ్
    ఒడిశా - మయూర్‌బంజ్, కియోంజార్, సుందర్‌గర్
2) చత్తీస్‌గఢ్ - మహారాష్ట్ర
     (i) చత్తీస్‌గఢ్ - బస్తర్‌లోని బైలదిల్లా. ఇది దేశంలోనే అతి పెద్దది.
     (ii) దుర్గ్‌లోని దల్లిరాజారా.
           మహారాష్ట్ర - రత్నగిరి, చంద్రపూర్
3) కర్ణాటక: బళ్లారి, చిత్రదుర్గం, చిక్కమగళూరు, తుమకూరు
4) గోవా: మర్మగోవా
5) తమిళనాడు: తిరుచిరాపల్లి, సేలం
6) తెలంగాణ: ఖమ్మం.
7) ఆంధ్రప్రదేశ్: అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు.
* ఇనుము ఉత్పత్తిలో కర్ణాటక, నిల్వలో ఝార్ఖండ్ ప్రథమ స్థానంలో ఉన్నాయి.


మాంగనీస్: ఈ ఖనిజం స్టీలు తయారీలో చాలా ఉపయోగపడుతుంది. పెయింట్స్, బ్యాటరీలు, రసాయనాలు, బ్లీచింగ్ పౌడర్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
విస్తరణ:
ఒడిశా: మయూర్‌బంజ్, కియోంజార్, కలహండి, కోరాపుట్, సుందర్‌గర్ జిల్లాలు.
మహారాష్ట్ర: నాగ్‌పుర్, రత్నగిరి, బాంద్రా.
మధ్యప్రదేశ్: బాలాగాట్, ఛింద్‌వాడా (చింధ్వారా) జిల్లా
కర్ణాటక: బళ్లారి, షిమోగా, చిత్రదుర్గ్, తుమకూరు.
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, విశాఖపట్నం.


నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు
బాక్సైట్: దీని నుంచి అల్యూమినియంను తయారు చేస్తారు. అల్యూమినియం దృఢంగా, తేలికగా ఉంటుంది. అందుకే దీన్ని విమానాలు, ఇతర ఆటోమొబైల్స్ విడి భాగాల తయారీలో ఉపయోగిస్తారు. ప్యాకేజింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లోనూ విరివిగా వాడతారు.
* ఒడిశా రాష్ట్రంలోని కలహండి, కోరాపుట్‌లో అధిక నిల్వలు ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బాక్సైట్ నిల్వలు ఉన్నాయి.


బంగారం: దేశంలో బంగారు నిల్వలు తక్కువ. కర్ణాటకలో కోలార్ గోల్డ్ మైన్స్, రాయచూర్‌లో కేజీఎఫ్ హుట్టి గోల్డ్ మైన్స్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్: రామగిరి గోల్డ్‌మైన్స్ - అనంతపురం, జొన్నగిరి - కర్నూలు; పాలచూరు, బిస్వనాధం - చిత్తూరు.
* బంగారం ముఖ్యంగా క్వార్ట్‌జ్ శిలల్లో లభిస్తుంది. కొన్ని నదుల తీరాల్లో ఒండ్రుమట్టి, ఇసుకలోనూ బంగారం లభిస్తుంది. ఇలాంటి బంగారాన్ని ప్లేసర్ డిపాజిట్ (Placer deposits) అంటారు.
ముఖ్య నదులు: సువర్ణరేఖ - ఝార్ఖండ్; పున్నపూజ, చాలియార్‌పూజ - కేరళ.


రాగి: ఇనుము కంటే చాలా ముందుగానే మానవుడు రాగిని ఉపయోగించాడు. ఇది అత్యుత్తమ విద్యుత్ వాహకం. అందుకే దీన్ని ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. రక్షణ, ఆటోమొబైల్ పరిశ్రమల్లో కూడా వాడతారు. పూర్వం నాణేల తయారీలో, వంట పాత్రల కోసం అధికంగా వాడేవారు.
* రాగిని ఇతర ఖనిజాలతో కలపడం వల్ల అవి దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. అలాంటి ఖనిజాలను అల్లాయ్ (Alloy) అంటారు. రాగిని ఇనుముతో కలిపితే స్టెయిన్‌లెస్ స్టీల్ లభిస్తుంది. నికెల్‌తో మోరెల్ మెటల్ (Morel Metal), అల్యూమినియంతో డూరాల్యుమిన్ (Duralumin), జింక్‌తో ఇత్తడి, టిన్‌తో కలిపితే బ్రాంజ్ (Bronz) ఏర్పడతాయి.
విస్తరణ: మధ్యప్రదేశ్ - బాల్‌ఘాట్, బేతుల్ జిల్లా; రాజస్థాన్ - ఖేత్రి. ఇది ఝున్‌ఝును జిల్లాలో ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇది 80 కి.మీ. పొడవు, 5 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉంది. ఇంకా అజ్మీర్, అల్వార్ జిల్లాల్లో కూడా ఈ నిల్వలు ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భమ్, హజారీబాగ్, పాలమాన్ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని అగ్నిగుండాల (గుంటూరు జిల్లా) లో రాగి నిల్వలు ఉన్నాయి.


సీసం: సీసపు ధాతువును గెలీనా (Gelena) అంటారు.
లభించే ప్రాంతాలు: రాజస్థాన్ - ఉదయ్‌పూర్, దుంగార్పూర్, బన్స్‌వారా, అల్వార్; ఆంధ్రప్రదేశ్ - కర్నూలు, గుంటూరు, కడప; తెలంగాణ - నల్గొండ, ఖమ్మం; తమిళనాడు - ఉత్తర ఆర్కాట్.


జింక్: ఇది సహజంగా గెలీనా ధాతువుతో లభిస్తుంది. అధికంగా (99 శాతం) రాజస్థాన్‌లోని జవార్ (ఉదయ్‌పూర్) ప్రాంతంలో విస్తరించి ఉంది.


తగరం (టంగ్‌స్టన్): దీని ధాతువు Wolfram. 95% తగరం ఉక్కు కర్మాగారంలో ఉపయోగిస్తారు. ఇది దృఢత్వం చేకూరుస్తుంది. తగరంతో కలిపిన ఇనుమును ముఖ్యంగా మందుగుండు సామగ్రిలో, హెవీ గన్స్, armour plates, హార్డ్ కటింగ్ టూల్స్ తయారీలో ఉపయోస్తారు. ఇంకా ఎలక్ట్రిక్ బల్బుల ఫిలమెంట్, పెయింట్స్, సెరామిక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
లభించే ప్రదేశాలు: రాజస్థాన్ - రావత్ హిల్స్, ఝార్ఖండ్ - రాంచీ పీఠభూమి, పశ్చిమ్ బంగ - బంకురా జిల్లా.


అలోహ ఖనిజాలు
అభ్రకం (Mica): దీని ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 95 శాతం అభ్రకం మూడు రాష్ట్రాల నుంచి లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్: నెల్లూరు
ఝార్ఖండ్: హజారీబాగ్, గిరిది
రాజస్థాన్: జయపుర (జైపూర్) నుంచి ఉదయ్‌పూర్ వరకు ముఖ్యంగా అజ్‌మేర్ (అజ్మీర్) ప్రాంతంలో అభ్రకం నిల్వలు అధికం.


సున్నపురాయి (Lime Stone): మధ్యప్రదేశ్- జబల్‌పూర్, సాత్నా, బేతువల్, రేవా.
రాజస్థాన్ - ఝున్‌ఝును, అజ్‌మేర్, టోంక్, సవాయ్ మదోపూర్.
ఆంధ్రప్రదేశ్: కడప, కర్నూలు, గుంటూరు
తెలంగాణ - నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్.
* సున్నపురాయిని ముఖ్యంగా సిమెంట్ తయారీలో, రసాయనాల్లో, ఉక్కు - ఇనుము పరిశ్రమలో, పేపరు, ఎరువులు, రబ్బరు, గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
ఆస్‌బెస్టాస్ - రాతినార: దీన్ని ముఖ్యంగా ఫైర్ ప్రూఫింగ్, థర్మల్ ఇన్సులేషన్‌లో ఉపయోగిస్తారు. ఇవే కాక, పేపర్, బెల్ట్, Paint sheeting, పెంకులు, పైపులు, తాళ్ల (Rope) తయారీలో ఉపయోగిస్తారు.


అధికంగా లభించే రాష్ట్రాలు: రాజస్థాన్ - ఉదయ్‌పూర్, ఆల్వార్, అజ్‌మేర్, పాళీ; ఆంధ్రప్రదేశ్ - పులివెందుల (కడప).
జిప్సం (Gypsum): ముఖ్యంగా ఎరువుల పరిశ్రమలో ఉపయోగిస్తారు. క్షార నేలలను సారవంతంగా మార్చడంలో జిప్సం చాలా తోడ్పడుతుంది.
లభ్యత: 99 శాతం జిప్సంను రాజస్థాన్ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. జోథ్‌పూర్, నాగౌర్, బికనీర్, చురు, పాళీ.
వజ్రాలు: మధ్యప్రదేశ్‌లోని పన్నా, ఆంధ్రప్రదేశ్‌లోని వజ్రకరూరు (అనంతపురం జిల్లా)లో వజ్రాలు లభిస్తాయి. కొత్తగా రాయ్‌చూర్, కలబురగి (గుల్బర్గా) జిల్లాల్లోనూ వజ్రాలు ఉన్నట్లు కనుక్కున్నారు.


ఇంధన ఖనిజాలు (Energy Minerals)
 బొగ్గు:
దీన్ని నల్ల బంగారం అని కూడా అంటారు. దీనిలో లభ్యమయ్యే కార్బన్ శాతాన్ని బట్టి దీన్ని నాలుగు రకాలుగా విభజించారు.
1. ఆంత్రసైట్: ఇది అత్యుత్తమమైన బొగ్గు. దీనిలో కార్బన్ 90-95 శాతం వరకు ఉంటుంది.
2. బిట్యూమినస్: దీనిలో కార్బన్ 60-90 శాతం వరకు ఉంటుంది. 
3. లిగ్నైట్: దీనిలో కార్బన్ 40-60 శాతం వరకు ఉంటుంది.
4. పీట్: 40 శాతం కంటే తక్కువ కార్బన్ ఉన్న దాన్ని పీట్ అంటారు.
దేశంలో లభ్యమయ్యే బొగ్గును రెండు రకాలుగా చెప్పవచ్చు. i) గోండ్వానా - (Gondwana Coal Fields),
                                                                                     ii) టెర్షియరీ - (Teritary Coal Fields)
* గోండ్వానా: గోండ్వానా బొగ్గు అతి పురాతనమైంది (సుమారు 250 మిలియన్ల సంవత్సరాలు). ఇది అధికంగా నదీ లోయల్లో ఏర్పడుతుంది. ముఖ్యంగా దామోదర్, గోదావరి ప్రాంతాల్లో లభిస్తుంది.
* విస్తరణ: ఝార్ఖండ్: ఝరియా (అతిపెద్ద బొగ్గు గని)
       - గిరిధ్ (Giridh)
        - బొకారో (Bokaro)
* పశ్చిమ్ బంగ: రాణీగంజ్
* చత్తీస్‌గఢ్: కోర్బా (Korba)
* ఒడిశా: తాల్చేర్ (Talcher)
* రాయ్‌పూర్ - హిమగిరి (Sambalpur Dist)
* మధ్యప్రదేశ్: సింగ్రౌలి, పెంచ్‌లోయ (Pench Valley)
* ఆంధ్రప్రదేశ్: గోదావరి జిల్లాలు
* తెలంగాణ: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
* మహారాష్ట్ర: కాంఫ్టీ కోల్‌ఫీల్డ్ (నాగ్‌పుర్ జిల్లా)
                    - వార్థా (Wardha Valley)
                    - చంద్రాపూర్
* టెర్షియరీ: టెర్షియరీ బొగ్గు నవీనమైంది. ఇది సుమారు 10 మిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఇది ప్రధానంగా అసోం, మేఘాలయ, తమిళనాడుల్లో లభిస్తుంది.
* అసోం: మాకుం (Makum) (శివసాగర్ జిల్లా)
             - నజీర,

   - మికిర్ పర్వతాలు (Mikir Hills)
             - దిల్లీ - జయపోర్ (Dilli - Jeypore)
* మేఘాలయ: గారో - (Garo, Darrangiri region)
                     - ఖాసీ (Khasi, Cherrapunji)
                      - జైంతియా (Jaintia, Langrin)


చమురు (Oil)    
    చమురు నిక్షేపాలను వెలికి తీయడానికి ONGC (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) ను 1957 లో ఏర్పాటు చేశారు.
* ONGC అనుబంధ సంస్థ అయిన ONGC - Videsh ను విదేశాల్లో చమురు వెలికి తీయడానికి ఏర్పాటు చేశారు.
* ONGC కి మహారత్న హోదాను కల్పించారు.
* ONGC Videsh ప్రస్తుతం Caspian Sea లోనూ, రష్యాకు చెందిన Sakhalin Islands లోనూ పెట్టుబడులు పెట్టింది.
* దేశంలో చమురును వెలికి తీయడానికి రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు. అవి సముద్రం (Off Shore) నుంచి, భూ భాగం (On Shore) నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
భూ భాగం నుంచి వెలికితీసే నిక్షేపాలు:
* అసోం: i) భారతదేశంలోని మొట్టమొదటి చమురుబావి అసోం లోని దిగ్భయ్ (Digboi).

  ii) నహర్‌కటియ (Naharkatiya Oil Field)
             iii) మొరాన్ (Moran Oil Field)
             iv) రుద్రసాగర్ (Rudrasagar)
             v) శిబ్‌సాగర్ (Sibsagar)
             vi) బాదర్‌పూర్ (Badarpur)
             vii) లక్వ (Lakwa)
             viii) అంగూరి (Anguri)
గుజరాత్: i) అంకలేశ్వర్ (Ankleshwar)
                ii) లూనెజ్ (Lune)
                iii) కాలోల్ (Kalol)
                iv) ధోల్కా (Dholka)
* రాజస్థాన్: మంగళా (Mangala Oil Fields)
* ఆంధ్రప్రదేశ్: రవ్వ (Rawa field in K.G. Delta)


సముద్ర భాగం నుంచి వెలికితీసే నిక్షేపాలు:
* మహారాష్ట్ర: i) బాంబే హై (Bombay High): దీన్ని 1974 లో కనుక్కున్నారు. ఈ ప్రాంతం ముంబయి నుంచి 176 కి.మీ. దూరంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇక్కడ చమురును 1400 మీటర్ల లోతు నుంచి వెలికితీస్తున్నారు. దీని కోసం ఒక Platform ను ఏర్పాటు చేశారు. అదే సాగర్ సమ్రాట్.
ii) బేసేన్ (Bassein): ఈ ప్రాంతం ముంబయి హై కి దక్షిణ దిశలో ఉంది. ఇక్కడ చమురును సుమారు 1900 మీటర్ల లోతు నుంచి వెలికితీస్తున్నారు.
* గుజరాత్ - అలియబెట్ (Aliabet): ఈ క్షేత్రం అలియబెట్ ద్వీపంలో ఉంది. ఇది భావ్‌నగర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో Gulf of Khambhat లో ఉంది.
* ఆంధ్రప్రదేశ్: కృష్ణా - గోదావరి బేసిన్ (KG Basin)


సహజ వాయువు (Natural Gas)  
     సహజంగా చమురు లభించే చోటులోనే వాయువు లభ్యమవుతుంది. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో సుమారు 450 BCM (Billion Cubic Metres) మేర సహజ వాయువు ఉంది. ఈ మొత్తంలో 75 శాతం ఒక్క బాంబే హై, బేసిన్ ప్రాంతంలోనే ఉంది. ఈ సహజ వాయువును ప్రధానంగా (40%) రసాయనిక ఎరువులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.
* సహజ వాయువును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడానికి GAIL (Gas Authority of India Ltd. ను ఏర్పాటు చేశారు.
ఈ రవాణా పైప్‌లైన్ల ద్వారా చేస్తున్నారు.


దేశంలో అతి ముఖ్యమైన పైప్‌లైన్లు:
1. Hajira - Bijaipur - Jagdishpur Pipeline (HBJ Pipeline)
* ఈ పైప్‌లైన్ దేశంలోనే అతి పొడవైంది. దీని పొడవు 1750 కిలోమీటర్లు.
2. Bombay high - Ankaleshwar - Koyali Pipeline (210 kms).
3. Salaya - Koyali - Mathura Pipeline (1075 kms)
4. Mathura - Delhi - Ambala - Jalandhar Pipeline (513 kms)

* యురేనియం: ఈ ఖనిజం అటామిక్ మినరల్. దీని ద్వారా న్యూక్లియర్‌శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
దేశంలో మొదటగా దీని నిల్వలు ఝార్ఖండ్‌లో కనుక్కున్నారు.
* లభించే ప్రాంతాలు:
ఝార్ఖండ్: జాదూగూడ (Jadiuguda) - Bhatin - Narwa Pahar
* తెలంగాణ: పెద అడిసెర్లపల్లి (నల్గొండ జిల్లా)
* ఆంధ్రప్రదేశ్: శంకరంపేట (నెల్లూరు జిల్లా),  తుమ్మలపల్లి (కడప జిల్లా)
* రాజస్థాన్: రోహి ప్రాంతం
* మేఘాలయ: ఖాసీ (Khasi hills)
* మోనజైట్: ప్రపంచంలోనే మొనజైట్ (Monazite) నిల్వలు అధికంగా భారతదేశంలో ఉన్నాయి. Monazite నుంచి Thorium ను ఉత్పత్తి చేస్తారు. ఇవి అత్యధికంగా కేరళ సముద్రతీరంలో ఉన్నాయి.

 

భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు

కర్మాగారం రాష్ట్రం స్థాపించిన సంవత్సరం
దిగ్బయ్ - IOC అసోం 1901
ట్రాంబే - HPCL మహారాష్ట్ర 1954
ట్రాంబే - BPCL మహారాష్ట్ర 1955
విశాఖపట్నం - HPCL ఆంధ్రప్రదేశ్ 1957
నూన్‌మతి - IOC అసోం 1962
బరౌనీ - IOC బిహార్ 1964
కొయాలి - IOC గుజరాత్ 1965
కొచ్చి - CRL కేరళ 1966
చెన్నై - MRL తమిళనాడు 1969
హల్దియా - IOC పశ్చిమ్ బంగ 1975
Bongaigaon - BRPL అసోం 1979
మథుర - IOC ఉత్తర్ ప్రదేశ్ 1982
నుమాలిగఢ్ - IOC అసోం 1999
జామ్‌నగర్ - RP గుజరాత్ 1999
కర్నాల్ - IOC హరియాణా 1998
మంగళూరు - HPCL కర్ణాటక 1998
పనగుడి - IOC తమిళనాడు 1999

 

* IOCL - Indian Oil Corporation Ltd.
* HPCL - Hindustan Petroleum Corporation Ltd.
* BPCL - Bharat Petroleum Corporation Ltd.
* CRL - Cochi Refineries Ltd.
* MRL - Madras Refineries Ltd.
* RP - Reliance Petroleum
.

Posted Date : 11-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌