• facebook
  • whatsapp
  • telegram

బహుళార్థ సాధక ప్రాజెక్టులు

సత్వర ప్రగతి సాధనాలు!

  తాగునీరు, సాగునీరు అందిస్తాయి.అధిక వరదలను అడ్డుకుంటాయి.కరవు నుంచి కాపాడటంతోపాటు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ప్రాజెక్టుల వల్ల సమకూరుతున్నాయి.   అందుకే వాటిని ‘ఆధునిక దేవాలయాలు’ అని మన మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించారు. దేశ అభివృద్ధి పథాన్ని మలుపు తిప్పడంతోపాటు మరింత వేగం చేయడంలో ఈ ఆనకట్టలు ప్రధానపాత్ర పోషించాయి.  

 

  భారత్‌ వ్యవసాయం ప్రధాన దేశం. సాగుకు నీరు చాలా అవసరం. ఉప ఆయనమండలం ప్రాంతం కాబట్టి నీటి ఆవశ్యకత ఎక్కువ. మన వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. దాంతో కొన్నిసార్లు వర్షాలు ఎక్కువగా కురిసి వరదలు రావడం, మరికొన్నిసార్లు అతి తక్కువ వర్షాలతో కరవులు సంభవించడం ఇక్కడ సర్వసాధారణం. వర్షపాతం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. కానీ వ్యవసాయానికి మాత్రం నిరంతరం నీళ్లు కావాల్సిందే. కాబట్టి ప్రాజెక్టులు, కాలువల ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు.  ఆయకట్టు ఆధారంగా 10 వేల హెక్టార్ల కంటే ఎక్కువ భూమికి నీరు అందించే వాటిని భారీ నీటిపారుదల ప్రాజెక్టులనీ, 2 వేల నుంచి 10 వేల హెక్టార్లకు నీరు అందించేవి మధ్య తరహా ప్రాజెక్టులనీ, 2 వేల కంటే తక్కువ హెక్టార్ల భూమికి నీరు అందించే వాటిని చిన్నతరహా ప్రాజెక్టులని అంటారు.

  దేశాభివృద్ధిలో బహుళార్థక ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. మిలియన్ల హెక్టార్ల భూమికి సాగునీటిని అందించడంతోపాటు, విద్యుత్తు ఉత్పత్తి పెంచడానికి కూడా వాటిని రూపొందించారు. ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చడం వీటి ప్రత్యేకత. జలరవాణా, విహారయాత్ర, మత్స్యసంపద అభివృద్ధి, భూసార సంరక్షణ, కృత్రిమ వనాల పెంపకం లాంటి ఉపయోగాలు కూడా వీటి వల్ల కలుగుతాయి.

 

భాక్రానంగల్‌ ప్రాజెక్టు: సట్లేజ్‌ నదిపై నిర్మించారు. భాక్రా, నంగల్‌ అనే రెండు డ్యామ్‌లను కలిపి భాక్రానంగల్‌ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. దీని ద్వారా హరియాణా రాష్ట్రం ఎక్కువగా లబ్ధి పొందుతోంది. 1955లో శంకుస్థాపన చేయగా 1962లో పూర్తయింది. భాక్రా డ్యామ్‌ను పంజాబ్‌లోని రూప్‌సాగర్‌ (రోపార్‌) దగ్గర భాక్రా గార్జులో నిర్మించారు. ఇక్కడ ఏర్పడిన కృత్రిమ రిజర్వాయర్‌ను గోవింద సాగర్‌ అంటారు. నంగల్‌ డ్యామ్‌ పంజాబ్‌లోని నంగల్‌ దగ్గర నిర్మించారు. భారత్‌లో అత్యధిక గ్రావిటీ ఉన్న ఆనకట్ట భాక్రా డ్యామ్‌.

 

దామోదర్‌లోయ ప్రాజెక్టు: దీని నిర్మాణం 1948లో ప్రారంభమై 1957 నాటికి పూర్తయింది. అమెరికాలోని టెన్నెసి రివర్‌ వ్యాలీ అథారిటీ స్ఫూర్తితో ‘దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌’ అనే చట్టబద్ధ సంస్థను ఏర్పాటుచేసి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని దామోదర్, దాని ఉపనదులపై ఉంది. బరాకర్‌ నదిపైన తిలయ, మైదాన్‌ ఆనకట్టలు; కోనార్‌ నదిపైన కోనార్‌ ఆనకట్ట, దామోదర్‌ నదిపైన పంచట్‌ ఆనకట్టలను కట్టారు. వీటి ప్రధాన ఉద్దేశం వరద నియంత్రణ, నీటిపారుదల, విద్యుత్‌ ఉత్పత్తి. ఇది దేశంలో నిర్మించిన మొదటి బహుళార్థ సాధక ప్రాజెక్టు. దామోదర్‌ నది ప్రవాహ మార్గం వాలు ఎక్కువగా ఉండటం వల్ల అకస్మాత్తుగా, అధికంగా వరదలు వస్తాయి. అందుకే దీన్ని బెంగాల్‌ దుఃఖదాయిని అంటారు.

 

నర్మదా నదీలోయ ప్రాజెక్టు: మొదట నర్మదా నదీలోయ కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. ఆ తర్వాత నర్మదానది, దాని ఉపనదులపైన మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇందులో 30 భారీ, 135 మధ్య తరహా, ఇంకా కొన్ని చిన్నతరహా ప్రాజెక్టులున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇందిరాసాగర్‌ (నర్మదా సాగర్‌), మహేశ్వర్, ఓంకారేశ్వర్‌ ప్రాజెక్టులు; గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు ముఖ్యమైనవి.

 

సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌: గుజరాత్‌లోని కేవడియ దగ్గర నవగాం ప్రాంతంలో ఈ ఆనకట్టను నిర్మించారు. ఇది అమెరికాలోని గ్రాండ్‌ కౌలీ ఆనకట్ట తర్వాత అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ ఆనకట్ట. దీనికి 1961లో శంకుస్థాపన చేసి, 2017లో జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల గుజరాత్‌ రాష్ట్రం ఎక్కువగా లాభం పొందుతోంది. కాబట్టి దీన్ని లైఫ్‌ లైన్‌ ఆఫ్‌ గుజరాత్‌ అంటారు.

 

ఇందిరా సాగర్‌ డ్యామ్‌: దీన్ని మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా, పునాస వద్ద నర్మదా నదిపై నిర్మించారు. ‘నర్మదా సాగర్‌ డ్యామ్‌’ లేదా ‘పునాస్‌ డ్యామ్‌’ అని కూడా పిలుస్తారు. ఇందిరా సాగర్‌ దిగువన ఓంకారేశ్వర్, మహేశ్వర్‌ డ్యామ్‌లున్నాయి.

 

బియాస్‌ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టును బియాస్, సట్లేజ్‌ లింక్‌ సమీపంలో పంజాబ్‌లోని దౌలదర్‌ దగ్గర పోంగ్‌ వద్ద నిర్మించారు. దీన్ని మహరాణా ప్రతాప్‌ సాగర్‌ అంటారు. ఇది పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. రాజస్థాన్‌కు నీరు అందించే ఇందిరాగాంధీ కాలువను హరికే బ్యారేజ్‌ నుంచి తవ్వారు.

 

హిరాకుడ్‌ ప్రాజెక్టు: దీన్ని ఒడిశాలోని సంబల్‌పూర్‌ నగరానికి 15 కి.మీ. ఎగువన మహానదిపై నిర్మించారు. ఇది ప్రపంచంలోనే పొడవైన ప్రాజెక్టు (4801 మీ.). మహానది, ఇబ్‌ నది కలిసే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీన్ని 1948లో మొదలుపెట్టగా 1957లో పూర్తయింది.

 

చంబల్‌ లోయ ప్రాజెక్టు: ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల ఉమ్మడి ప్రాజెక్టు. దీంట్లో గాంధీసాగర్‌ డ్యామ్‌ (మధ్యప్రదేశ్‌), రాణా ప్రతాప్‌సాగర్‌ డ్యామ్‌ (రాజస్థాన్‌), జవహర్‌ సాగర్‌ (రాజస్థాన్‌), కోటా బ్యారేజ్‌ (రాజస్థాన్‌) ఉన్నాయి.

 

కోసి ప్రాజెక్టు: దీన్ని బిహార్‌లో వరదల నియంత్రణ కోసం నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు భాగాలున్నాయి. 

1) నేపాల్‌లోని సన్‌సారి జిల్లా భీమ్‌నగర్‌ దగ్గర బ్యారేజీ నిర్మాణం. 

2) వరద నివారణకు ఏటిగట్లు ఏర్పాటుచేయడం.

3) నేపాల్‌లో చత్ర కాలువ, బిహార్‌ రాష్ట్రంలో తూర్పు కోసి, పశ్చిమ కోసి కాలువలు నిర్మించడం. 

 

గండక్‌ ప్రాజెక్టు: ఇది బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని బిహార్‌లో వాల్మీకి నగరం దగ్గర గండక్‌ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నేపాల్‌ కూడా లబ్ధి పొందుతోంది.

 

పెరియార్‌ నదీలోయ ప్రాజెక్టు: దీన్ని కేరళలోని ఎర్నాకులం జిల్లా, ఆల్వే దగ్గర పెరియార్‌ నదిపై నిర్మించారు. 

  ఇవేకాకుండా ఉకాయ్‌ ప్రాజెక్టును తపతి నదిపై సూరత్‌ సమీపంలో ఉకాయ్‌ గ్రామం దగ్గర నిర్మించారు. పరక్కా ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్‌లో గంగా నదిపైన కట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మిర్జాపూర్‌ జిల్లాలో రిహండ్‌ ప్రాజెక్టును రిహండ్‌ నదిపై నిర్మించారు. దీనివల్ల దేశంలో అతిపెద్ద మానవ నిర్మిత రిజర్వాయర్‌ ఏర్పడింది. దీన్నే గోవింద వల్లభ పంత్‌సాగర్‌ రిజర్వాయర్‌ అంటారు.

 

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు:  దీన్ని కృష్ణానదిపై నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం దగ్గర నిర్మించారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద, ఎత్తయిన రాతి ఆనకట్ట. దీనికి 1955, డిసెంబరు 10న శంకుస్థాపన చేయగా 1967, ఆగస్టు 4న పూర్తయింది. దీని కుడికాలువకు జవహర్‌లాల్‌ కాలువ, ఎడమ కాలువకు లాల్‌బహదూర్‌ కాలువ అని పేర్లు పెట్టారు. పూర్తిగా భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం దీని ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, విద్యుదుత్పత్తి.

 

శ్రీశైలం ప్రాజెక్టు: దీన్ని కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద కృష్ణానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం జలవిద్యుత్తు ఉత్పత్తి. దీనికి కుడి కాలువ (ఎస్‌ఆర్‌బీసీ), ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ఉన్నాయి.

 

తుంగభద్ర ప్రాజెక్టు: ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని తుంగభద్ర నదిపై మల్లాపురం వద్ద నిర్మించారు. ఈ ప్రాజెక్టు 1956లో పూర్తయింది. దీని ప్రధాన ఉద్దేశం నీటిపారుదల. దీనిపై జలవిద్యుత్తు కేంద్రాలు కూడా ఉన్నాయి. దీన్ని పంపాసాగర్‌ అని కూడా పిలుస్తారు. 

 

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు: పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటారు. దీన్ని నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు. రామగుండం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి నీటిని అందిస్తుంది. దీనికి మొదటి దశలో కాకతీయ కాలువ, లక్ష్మీకాలువ, సరస్వతి కాలువ నిర్మించగా, తదనంతరం, ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువ నిర్మాణం జరిగింది.

 

కాళేశ్వరం ప్రాజెక్టు: దీన్ని గోదావరి నదిపై పూర్వ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేసి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ దగ్గర నిర్మించారు. ఇది అతిపెద్ద ఎత్తిపోతల పథకం (లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు). దీన్ని 2016లో మొదలుపెట్టి 2019లో పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు 7 లింకులు, 28 ప్యాకేజీలు, 500 కిలోమీటర్ల దూరం, 1800 కిలోమీటర్ల పొడవైన కాలువలతో 13 జిల్లాలకు నీటిని అందిస్తోంది.

 

పోలవరం ప్రాజెక్టు:  గత పశ్చిమ గోదావరి (ప్రస్తుతం ఏలూరు జిల్లా) జిల్లా పోలవరం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని పాత పేరు శ్రీరామపాద సాగర్‌. ప్రస్తుతం పేరు ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు. దీని ప్రధాన ఉద్దేశం గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు అందించడం. విశాఖపట్నం, అనకాపల్లికి తాగునీరు, విశాఖ ఉక్కు కర్మాగారానికి నీటిని అందించడం. దీన్ని 1941లో రూపకల్పన చేయగా 2004లో ప్రారంభమైంది. ఇంకా నిర్మాణం జరుగుతోంది. 

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌