• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

సహజ వనరుల సంరక్షణ కవచాలు! 

 

మానవుడితో పాటు సమస్త జీవరాశి మనుగడకు పర్యావరణమే ఆధారం. అయితే పారిశ్రామికీకరణ, ఆధునిక అభివృద్ధి చర్యల ఫలితంగా పర్యావరణం క్షీణిస్తోంది. దాంతో ఆవరణ వ్యవస్థల్లో అనూహ్య మార్పులు సంభవించి అందరూ అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు, మనిషి గమనాన్ని ప్రకృతికి అనుకూలంగా సాగించేందుకు పర్యావరణ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇవి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటుతాయి, ప్రజలను చైతన్యపరుస్తాయి, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాయి. అవసరమైతే ఆ ప్రభుత్వాలతోనే పోరాడతాయి, పర్యావరణ విరుద్ధ కార్యకలాపాలను ప్రత్యక్ష కార్యాచరణతో అడ్డుకుంటాయి. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఉన్నత ఆశయాలతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


పర్యావరణ క్షీణత నేడు ప్రధాన అంతర్జాతీయ సమస్యగా మారింది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ వనరుల విధ్వంసం అన్ని దేశాలకు శాపంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్వమానవ సౌభ్రాత్రం కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కృషి చేస్తున్నాయి.


ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌(IUCN): ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన, అతిపెద్ద పర్యావరణ సంస్థ ఇది. సహజవనరుల సంరక్షణ, స్థిరత్వం కాపాడేందుకు పనిచేసే సంస్థ. యునెస్కో ఆధ్వర్యంలో ప్రభుత్వాలు, సంరక్షణ సంస్థలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 1948, అక్టోబరు 5న ఫ్రాన్స్‌లోని ఫౌంటెన్‌బ్లూయి ప్రాంతంలో దీనిని స్థాపించారు. ప్రస్తుతం దీని పేరు వరల్డ్‌ కన్జర్వేషన్‌ యూనియన్‌. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌ ప్రాంతంలో ఉంది. ఇది అంతరించిపోయే దశలో ఉన్న జంతువులు, మొక్కలు, శిలీంధ్రాలను రెడ్‌ డేటాబుక్‌లో ప్రచురిస్తుంటుంది.


కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పిసీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫనా అండ్‌ ఫ్లోరా (CITES) : దీనినే వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ అంటారు. 1963లో IUCN సమావేశంలో ఈ సంస్థ ఏర్పాటును నిర్ణయించారు. 1975, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో 184 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అంతరించే దశలో ఉన్న జంతువులు, మొక్కలను వాణిజ్యం నుంచి నిషేధించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది.


యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(UNEP): దీనిని 1972లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబీలో ఉంది. ఐక్యరాజ్యసమితి చేపట్టే పర్యావరణ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల అమలుకు సహాయం అందించేందుకు స్థాపించారు. ఈ సంస్థ వాతావరణం, సముద్ర పర్యావరణం లాంటి అంశాల్లో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, వివిధ జాతీయ ప్రభుత్వాలతో కలిసి పర్యావరణ విధానాలు అమలుచేయడం, పర్యావరణ సంబంధిత విజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.


ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (IPCC): దీనిని UNEP, వరల్డ్‌ మెటీరియాలాజికల్‌ ఆర్గనైజేషన్‌ కలిసి 1988లో స్థాపించాయి. ఈ సంస్థ ప్రధానంగా శీతోష్ణస్థితి మార్పు వల్ల కలిగే ఆర్థిక, సామాజిక ఇబ్బందుల గురించి సమాచారం అందిస్తుంది. ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ నిర్వహించే ధరిత్రీ సమావేశాలు, ప్రపంచ వాతావరణ సదస్సులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.


వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (WWF-N) : ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ సంస్థను 1961లో  IUCN స్థాపించింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌లో ఉంది. దీని గుర్తు జెయింట్‌ పాండా. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సంబంధిత అధ్యయనాలను చేపడుతుంది. అవసరమైతే నిపుణులను ఆయా దేశాలకు పంపి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. మన దేశంలోని పులుల సంరక్షణ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే విధంగా వర్క్‌షాపులు, ఎగ్జిబిషన్‌లు, రోడ్‌ షోలు నిర్వహిస్తుంది.  శక్తి ఆదా కోసం ఈ సంస్థ చేపట్టిన అతిపెద్ద ప్రపంచవ్యాప్త ఉద్యమం ఎర్త్‌ అవర్‌. ఇది సాధారణంగా మార్చి చివరి శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 మధ్య సమయంలో లైట్లు ఆపే కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా 200 జీవవైవిధ్య ప్రాంతాలను ఎంపిక చేసి సంరక్షిస్తోంది.


గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ(GEF): ఈ సంస్థను 1991లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య సంరక్షణకు, శీతోష్ణస్థితి మార్పుల నివారణకు, నీరు- నేల కాలుష్యాలను తగ్గించేందుకు చేపట్టే ఖర్చులకు గ్రాంట్లు ఇస్తుంది.


గ్రీన్‌పీస్‌: కెనడాకు చెందిన పర్యావరణ కార్యకర్తలు పర్యావరణం, శాంతి, సుస్థిరత అనే నినాదాలతో 1969-72 మధ్య కాలంలో బ్రిటిష్‌ కొలంబియాలోని వాంకోవర్‌లో ఈ సంస్థను స్థాపించారు. ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉంది. ఇదొక అంతర్జాతీయ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసక చర్యలను అడ్డుకుంటుంది. పర్యావరణాన్ని కలుషితం చేసే వివిధ సంస్థలు, దేశాల చర్యలను బయటపెట్టి నిరసనలు, సదస్సులు నిర్వహిస్తుంది. కొన్నిసార్లు బలప్రయోగం ద్వారా కూడా పర్యావరణ విధ్వంసక చర్యలను అడ్డుకుంటుంది.


బర్డ్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌: ప్రపంచవ్యాప్తంగా స్వతంత్రంగా పనిచేస్తున్న అనేక పక్షి సంరక్షణ సంస్థల కలయికతో ఏర్పడిన అతిపెద్ద సంస్థ ఇది. 1922లో గిల్‌బర్ట్‌ పియర్‌సన్, జీన్‌ డెలకోర్‌ స్థాపించారు. కార్యాలయం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జిలో ఉంది. ఈ సంస్థ జీవ వైవిధ్య ప్రాంతాలతో పాటు, పక్షుల ఆవాసాలు, ముఖ్యమైన పక్షులు, వాటి సంరక్షణ ప్రాంతాలను గుర్తిస్తుంది. ‘వరల్డ్‌ బర్డ్‌వాచ్‌’ అనే త్రైమాసిక మేగజీన్‌ను ప్రచురిస్తుంది.


వరల్డ్‌ నేచర్‌ ఆర్గనైజేషన్‌(WNO): ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన మరో సంస్థ ఇది. వివిధ దేశాల అంతర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం 2014 నుంచి ఉనికిలోని వచ్చింది. జెనీవాలో కార్యాలయం ఉంది. ఇందులో భారత్‌ సభ్యత్వం తీసుకోలేదు. శీతోష్ణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


భారతదేశంలో


వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(WPSI) : ఇది భారతదేశంలోనే అత్యంత సమర్థ వన్యప్రాణి సంరక్షణ సంస్థ. బెస్ట్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాపర్‌గా అవార్డు అందుకున్న మహిళ బిలిండావైట్‌ 1994లో న్యూఢిల్లీలో దీనిని స్థాపించారు. జంతువుల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి సమాచారం అందించడం, వేటను నివారించడం లాంటి లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తుంది.


బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ(BNHS): వన్యప్రాణి సంరక్షణ, పరిశోధన కోసం ముంబయి కేంద్రంగా 1883లో ఏర్పడిన పురాతన ప్రభుత్వేతర సంస్థ. ఆవరణ వ్యవస్థలు, వన్యజాతి జీవుల సంరక్షణకు కృషి చేయడమే కాకుండా వన్యప్రాణులకు సంబంధించి చట్టాలు రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం అందిస్తుంది. హార్న్‌బిల్‌ అనే జర్నల్‌ను ప్రచురిస్తుంది.

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (CSE): ఇది లాభాపేక్ష లేని స్వచ్ఛంద పర్యావరణ పరిశోధనా సంస్థ. అనిల్‌ అగర్వాల్‌ వ్యవస్థాపకులుగా 1980లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. సైన్స్, పర్యావరణ అంశాలతో కూడిన పక్షపత్రిక ‘డౌన్‌ టు ఎర్త్‌’ను ప్రచురిస్తుంది. ఈ సంస్థ మొదటిసారిగా కోకో కోలా సింథటిక్‌ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. 1954 ఆహార కల్తీచట్టం ప్రకారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ వారు వాటర్‌ బాటిల్స్‌కు సర్టిఫికెట్‌ మార్కును 2001 నుంచి తప్పనిసరి చేయడంలో ఈ సంస్థ కృషి ఉంది.


పెటా - ఇండియా: పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌(PETA)- జంతువుల హక్కుల రీత్యా ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష రహిత సంస్థ. యూఎస్‌ఏలోని వర్జీనియాలో 1980లో ఇంగ్రిడ్‌ న్యూకిర్క్, అలెక్సో పెచెకో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా జంతువులను పరిరక్షిస్తూ, పర్యావరణ- జీవ వైవిధ్య సంరక్షణ కోసం శాకాహారాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో కార్యకలాపాల కోసం 2000 సంవత్సరంలో ముంబయిలో ‘పెటా-ఇండియా’ను స్థాపించారు. ‘‘జంతువులు ఉన్నది మనుషులు తినడానికో, ప్రయోగాలు చేయడానికో, హింసించడానికో కాదు. అన్ని ప్రాణులూ సమానమే’’ అనే సందేశంతో ప్రజలు, ప్రభుత్వాలను చైతన్యపరుస్తోంది.


వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(WII): వన్యప్రాణుల నిర్వహణ, పరిశోధనలతోపాటు అటవీ అధికారుల శిక్షణ కోసం 1982లో దేహ్రాదూన్‌లో స్థాపించారు. వైల్డ్‌ లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ లాంటి పలు కోర్సులను అందిస్తోంది.


జాతీయ హరిత ట్రైబ్యునల్‌(NGT): పర్యావరణ చట్టాల ఉల్లంఘన కేసుల సత్వర పరిష్కారం కోసం 2010, అక్టోబరు 18న దిల్లీ కేంద్రంగా ప్రారంభించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు) 48-A కింద ఏర్పాటైంది. అడవుల రక్షణ, జీవవైవిధ్యం, కాలుష్యం లాంటి పర్యావరణ కేసులను సమర్థంగా పరిష్కరించడంతో పాటు ఆస్తులు, వ్యక్తి సంబంధ నష్టాలకు పరిహారం ఇప్పిస్తుంది. ఇలాంటి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసిన మొదటి దేశం న్యూజిలాండ్, రెండో దేశం ఆస్ట్రేలియా, భారత్‌ మూడోది.


దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న మరికొన్ని సంస్థలు: 


* ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ - దేహ్రాదూన్‌ 


* ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ - దేహ్రాదూన్‌ 


* వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా - దేహ్రాదూన్‌ 


* సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ - అహ్మదాబాద్‌ 


* జాతీయ జీవ వైవిద్య సంస్థ - చెన్నై 


* జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన సంస్థ - నాగ్‌పుర్‌ 


* వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో - న్యూదిల్లీ * క్రోకడైల్‌ బ్యాంక్‌ ట్రస్టు - చెన్నై 


* జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - కోల్‌కతా 


* బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - కోల్‌కతా

 

 


 

 

 

 

                                                                                                                                                                                                                                                                                                                                                                           రచయిత: జల్లు సద్గుణరావు

 

 

 

 

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌