• facebook
  • whatsapp
  • telegram

సహజ ఉద్భిజ సంపద, జీవ వైవిధ్యం

వైవిధ్య వనాల తెలంగాణ

ఆహారం, ఆశ్రయం, జీవనోపాధితోపాటు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతో కీలకం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలోనూ ఇవి దోహదపడతాయి. అందుకే ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు, పథకాలతో అడవుల సంరక్షణకు చర్యలు చేపడుతుంటాయి. జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు తెలంగాణ వనాల్లోని వైవిధ్యాన్ని, వృక్షసంపద వివరాలను తెలుసుకోవాలి. 

 

  భూమి మొత్తం ఉపరితలంలో 30 శాతాన్ని సహజ వృక్ష సంపద, వన్య ప్రాణులు ఆక్రమించాయి. ఆహార భద్రత, ఆశ్రయం అందించడం; వాతావరణాన్ని స్థిరీకరించడం, స్థానిక జనాభాకు మద్దతు ఇవ్వడంలో సహజ ఉద్భిజ సంపద ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తెలంగాణలోని వైవిధ్య వనాల్లో(అడవుల్లో)నూ  విభిన్న వృక్ష, జంతు జాలాలు కనిపిస్తాయి.  రాష్ట్రానికి ఉత్తరాన గోదావరి నదీతీరంలో దట్టమైన టేకు అడవులు ఉన్నాయి.  

  భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశ దక్షిణ మధ్య ప్రాంతంలో ఉంది. రాష్ట్రానికి దక్షిణ - తూర్పు సరిహద్దులో ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన కర్ణాటక, వాయవ్య - ఉత్తరంలో మహారాష్ట్ర, ఈశాన్యంలో చత్తీస్‌గఢ్‌ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర అడవుల్లో మూడింట ఒక వంతు ములుగు, భద్రాద్రి, కొమురం భీం, జయశంకర్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.  తెలంగాణలో ప్రధానంగా మూడు రకాల అడవులు ఉన్నాయి. 

 

1) తేమతో కూడిన ఆకురాల్చే అడవులు:  రాష్ట్రంలో ఈ రకమైన అడవులు 125 - 200 సెం.మీ. వర్షం, 24 - 30ాది ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో  వృద్ధి చెందుతాయి. ఇవి 75 శాతం ఆర్ద్రతతో కూడుకొని ఉంటాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురం భీం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి. వీటిలో టేకు, అర్జున, వెదురు, యూకలిప్టస్‌ వృక్షాలు ఉంటాయి. 

 

2) పొడి ఆకురాల్చే అడవులు: రాష్ట్రంలో పొడితో కూడిన ఆకురాల్చే అడవులు 70 - 125 సెం.మీ. వర్షం, 23 - 30ాది ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిలో 50 - 60 శాతం ఆర్ద్రత ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, పెద్దపల్లి, జయశంకర్, నాగర్‌ కర్నూల్, వికారాబాద్‌ జిల్లాల్లో విరివిగా ఉంటాయి. వీటిలో దురిశన, ఇప్పచెట్లు, తునికి, తంగేడు, వేప, మర్రిచెట్లు ఉంటాయి. 

 

3) చిట్టి ముళ్లజాతి అడవులు: ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి అత్యల్ప వర్షం కురిసే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు ఉంటాయి. ఇవి ఎక్కువగా కృష్ణా నది పరీవాహక ప్రాంతాలైన రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో లభ్యమవుతాయి. ఈ అడవులు ముఖ్యంగా గొడుగు ఆకారంలో ముళ్లతో కూడుకొని ఉంటాయి. ప్రధానంగా బాబుల్, తుమ్మ, జమ్మి, సర్కారు చెట్లు ఉంటాయి.

 

అటవీ కలప ఉత్పత్తులు 

 

రాష్ట్రంలో యూకలిప్టస్‌ గుజ్జు, టేెకు ప్రధాన అటవీ ఉత్పత్తులు. బీడీ ఆకులు, వెదురు లాంటివి మైనర్‌ అటవీ ఉత్పత్తులు. 

 

తునికి ఆకు: దీన్ని బీడీల తయారీకి వినియోగిస్తారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో ఎక్కువగా లభిస్తుంది. 

 

రూసాగడ్డి: దీన్ని సుగంధ నూనె తయారు చేసే అత్తర్‌లో వినియోగిస్తారు. ఇది నిజామాబాద్‌ జిల్లాలో దొరుకుతుంది. 

 

వెదురు: గృహ నిర్మాణ పనిముట్లు, కాగిత పరిశ్రమల్లో వెదురును ఉపయోగిస్తారు. భద్రాద్రి, ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో లభిస్తుంది.

 

టేకు - గంధపుచెక్క: ఇవి అత్యంత విలువైన అటవీ ఉత్పత్తులు. వీటిని గృహోపకరణాలు, సుగంధ పరిమాళాల్లో ఉపయోగిస్తారు. ఇందులో చంద్రారేగు చెట్టు ప్రసిద్ధి చెందింది. ఇవి ఎక్కువగా భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో లభిస్తాయి.  

 

మహువా: దీన్ని విప్పపువ్వు అంటారు. ఈ చెట్టు పువ్వులను సారాయి తయారీలో; గొర్రెలు, మేకల దాణాగా వినియోగిస్తారు. ఇది ఎక్కువగా భద్రాద్రి, ఆదిలాబాద్, నిజామాబాద్, జిల్లాల్లో ఉంటుంది.  

 

మోదుగు: దీని పువ్వులను రంగులకు, ఆకులను విస్తరాకులుగా వాడతారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విరివిరిగా దొరుకుతాయి.

 

తంగేడు: ఇది తెలంగాణ రాష్ట్ర పుష్పం. దీని బెరడును తోళ్ల పదును, ఔషధాలకు వినియోగిస్తారు.

 

జమ్మిచెట్టు: ఇది తెలంగాణ రాష్ట్ర వృక్షం. దీన్ని పశువుల ఔషధాలుగా వాడతారు. దీని ఆకులను విజయానికి సంకేతంగా భావిస్తారు.

 

అటవీ వర్గీకరణ - నివేదిక 

  2021వ సంవత్సరానికి సంబంధించి 17వ ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ నివేదికను 2022 జనవరిలో కేంద్ర పర్యావరణ - అటవీ శాఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక వైశాల్యం 1,12,077 చ.కి.మీ. దీనిలో 27,678.866 చ.కి.మీ అటవీ వైశాల్యం కలిగి 24.69 శాతంతో దేశంలో తెలంగాణ 12వ స్థానాన్ని ఆక్రమించింది. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భౌగోళిక వైశాల్యంలో 33 శాతానికి తగ్గకుండా అటవీ విస్తీర్ణం ఉండాలి. జాతీయ తలసరి అటవీ వాటా 0.240 హెక్టార్లు ఉండగా తెలంగాణ రాష్ట్ర తలసరి సగటు అటవీ వాటా 0.082 హెక్టార్లు ఉంది. 

  రాష్ట్రంలో అడవులను 24 శాతం నుంచి 33 శాతానికి  పెంచే లక్ష్యంతో 2015 జులై 3న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 5 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 సంవత్సరం నాటికి 18,920 హెక్టార్లలో 46 ప్రత్యేక ప్రాంతాలు, 32 పట్టణ అటవీ పార్కుల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 

 

పరిపాలన ఆధారంగా అడవులు మూడు రకాలు

 

రిజర్వు అడవులు: ఈ అడవులు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. వీటిలోకి ప్రజలను అనుమతించరు. ఇవి రాష్ట్ర అటవీ వైశాల్యంలో 93.1 శాతంతో 25,793.613 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 

 

రక్షిత అడవులు: ఇవి ప్రభుత్వ నిర్వహణలో ఉన్నప్పటికీ ప్రజలు, గిరిజనులకు అనుమతి ఉంటుంది. వీరు ఈ అడవుల్లో కట్టెలు, ఆహార పదార్థాలను సేకరించవచ్చు. పశువులను మేపవచ్చు. ఇవి రాష్ట్ర అటవీ వైశాల్యంలో 5.7 శాతంతో 1589.647 చ.కి.మీ. విస్తరించి ఉన్నాయి.

 

వర్గీకరించని అడవులు: ప్రభుత్వ నియంత్రణతో పాటు వ్యక్తిగత, గిరిజనుల అధీనంలో ఉండే వాటిని వర్గీకరించని అడవులు అంటారు. ఇవి రాష్ట్ర అటవీ వైశాల్యంలో అత్యల్పంగా 1.06 శాతంతో 295.606 చ.కి.మీ. ఉన్నాయి.

 

రచయిత: కొత్త గోవర్ధన్‌ రెడ్డి

 

Posted Date : 04-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌